Tuesday 17 May 2022

Guy On The Sidewalk


ఇవ్వాళ పొద్దున్నే సుమారు ఒక 45 నిమిషాల పాటు నా విద్యార్థి ఒకరితో మాట్లాడాను. 

సంవత్సరానికి ఒకసారో, రెండుసార్లో... అప్పుడప్పుడూ మా ఇద్దరి మధ్య ఇలాంటి సంభాషణ జరుగుతుంటుంది. 

కట్ చేస్తే - 

ప్రేమలో కాని, ప్రొఫెషన్‌లో కాని... మన వెంటపడుతున్న అవకాశాల్ని, వ్యక్తులను వద్దనుకుంటాం. మనల్ని వద్దనుకున్న వ్యక్తుల కోసం, అవకాశాల కోసం అదేపనిగా ప్రయత్నిస్తుంటాం. 

ఇది పెద్ద గ్యాంబ్లింగ్... అని తెలివైనవారు కొందరికి అర్థమవుతుంటుంది. కాని, ఇలాంటి జూదంలో ఎక్కువశాతం ఇరుక్కుపోయేది కూడా ఈ తెలివైనవారే. 

అయితే ఆ తెలివి పనికొచ్చే తెలివా, పనికిరాని తెలివా అన్నది పూర్తిగా వేరే విషయం. దీనికి సమాజం కొలమానం వేరేగా ఉంటుంది. వ్యక్తిగత కొలమానం వేరేగా ఉంటుంది.   

ఒక గంట సేపు. ఎవ్వరూ డిస్టర్బ్ చేయని ఏకాంత స్థలం. కొంత ప్రశాంతత. కొంత నిస్పాక్షిక అంతర్విశ్లేషణ, అంతశ్శోధన చాలు. 

ఎప్పుడైనా సరే, ప్రపంచంలో ఎక్కడైనా సరే... హృదయం చెప్పింది ఫాలో అయినవారే అనుకున్నది సాధిస్తారు. అనుకున్న స్థాయికి ఎదుగుతారు.  

లాజిక్స్, మనసు... ఈ రెండూ ఒక్క ఒరలో ఇమడవు. 

అవ్వా బువ్వా రెండూ కావాలనుకొంటే కుదరదు. 

ఏదైనా... ఒక్కటే. 

One Thing. 

ప్రేమలో అయినా, ప్రొఫెషన్‌లో అయినా ప్లాన్ బి ఉండదు. 

ప్లాన్ బి ఉన్నచోట సర్దుబాటు ఉంటుంది. ఒక రొటీన్ ప్రవాహంలో జీవితంలో అలా వెళ్ళిపోతూవుంటాం.

అది తప్పు కాదు. 

అయితే అక్కడితో తృప్తిపడాలి. లేదంటే మనలని వెంటాడుతున్నదాన్ని వెంటాడాలి. సాధించాలి. 

ఇది చేస్తూ అది... అనే డిఫెన్సివ్ మెంటాలిటీవల్ల అన్నీ కోల్పోతాం.  

ఇంకేదో కావాలని ఆరాటపడుతూ, అలాంటి సంఘర్షణలోనే జీవితంలోని విలువైన సమయాన్ని వృధా చేసుకోవడం అనేది మాత్రం మనకి మనమే వేసుకొనే పెద్ద శిక్ష అవుతుంది. 

అర్నాల్డ్ ష్వార్జ్‌నిగ్గర్ ఇదే చెప్పాడు. విల్ స్మిత్ ఇదే చెప్పాడు. సిల్వెస్టర్ స్టాలోన్ ఇదే చెప్పాడు. ధీరూభాయి అంబాని ఇదే చెప్పాడు. వాళ్లకు ప్లాన్ బి లేదు. ఏదనుకున్నారో అదే చేశారు. సాధించారు. ఒకవేళ ఫెయిలయితే నాకు ఇంకో ఆధారం ఉంది అనుకోలేదు. అలా ఉంది అనుకున్న ఆధారాలను, ఇతర మానసిక, భౌతిక జంజాటాల్ని కూడా ముందే తగులబెట్టేశారు.        

కట్ చేస్తే - 

నా విద్యార్థి, వయస్సులో నాకంటే ఒక 12 ఏళ్ళు చిన్న...

నా ఆలోచనలు, యాక్షన్స్ అన్నిటికీ దాదాపు ఒక 90% వరకు నా ప్రతిబింబం.

ఒక రిప్లికా.

తన వెంటపడుతున్న ప్రేమను అక్కున చేర్చుకోవడమా... తను కావాలనుకొంటున్న ప్రేమను చేజ్ చేసి సాధించుకోవడమా అన్నది పూర్తిగా నా విద్యార్థి చేతుల్లోనే ఉన్నది. 

ఇక్కడ నేను చెప్తున్న ప్రేమ... నిజంగా ప్రేమే కావచ్చు. ఒక లక్ష్యం... ఒక ప్యాషన్... మన ముందున్న మన జీవితం... ఏదైనా కావచ్చు. 

గోడ మీద కూర్చోవటం కాదు. అటో ఇటో దూకేసెయ్యాలి. ఎటు దూకినా లక్ష్యం శిఖరాగ్రమే కావాలి. 

అవుటాఫ్ ద బాక్స్ కాదు... అసలు బాక్స్ అనేదే అక్కడ లేకుండా ఒక్క తన్ను తన్నాలి. 

అదే మైండ్‌సెట్. 

దీనికి వయస్సుకి సంబంధం లేదు అని ఇప్పటికే వేల మంది ప్రూవ్ చేశారు.   

అయితే ఇది చెప్పినంత ఈజీ కాదు. ఈ బ్లాగ్ రాసినంత ఈజీ అస్సలు కాదు. 

కాని, సాధ్యమే అని మన కళ్ళముందు వేల ఉదాహరణలున్నాయి. వాళ్లంతా కూడా మనలా మామూలు మనుషులే. మనకంటే వందరెట్ల కష్టాలు అనుభవిస్తూ కూడా ఎన్నెన్నో సాధించారు. 

ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటే ఎక్కారు... అందరికీ అసాధ్యమైన ఆ శిఖరాన్ని మళ్ళీ మళ్ళీ ఎక్కారు. 

బెస్ట్ సెల్లర్ రైటర్ కావాలనుకుంటే అయ్యారు... ప్రపంచ స్థాయిలో బిలియనేర్ రైటర్స్ అయ్యారు.

గూగుల్ లాంటి కంపెనీకి సీఈవో కావాలనుకుంటే అయ్యారు... ఆ స్థాయి కంపెనీల్నీ పెట్టారు.

బిజినెస్ చెయ్యాలనుకుంటే చేశారు... సీరియల్ ఎంట్రప్రెన్యూర్స్‌గా వేల కోట్లు సంపాదించారు. 

వీళ్లంతా మనలాంటి మనుషులే. ఎక్కడినుంచో ఊడిపడలేదు. ఎలాంటి అతీతశక్తులు లేవు. వీళ్లల్లో 95% మంది మనకంటే ఎక్కువస్థాయి కష్టాలను ఎదుర్కొన్నవారే. 

వాళ్లకి మనకు ఒక్కటే తేడా...  

వాళ్లకు ప్లాన్ బి లేదు.

No comments:

Post a Comment