Wednesday 11 May 2022

'రైటర్ మల్లాది' పాడ్‌కాస్ట్


నా హైస్కూలు రోజుల నుంచి నేను ఎక్కువగా చదివిన రచయితల్లో మల్లాది వెంకటకృష్ణమూర్తి కూడా ఉన్నారు. 

చతురలో వచ్చిన "కొత్త శత్రువు", ఒకసారి బస్‌లో చెన్నై వెళ్తూ చదివిన "అందమైన జీవితం" నవలలు నాకు బాగా గుర్తున్నాయి ఈరోజుకి కూడా. 

మా చిన్నబ్బాయికి మేము పెట్టుకున్న పేరు ప్రియతమ్. (రేపు వాడి పుట్టినరోజు).   

తర్వాత, "ఎక్కడో చాలా దగ్గరగా విన్నట్టుంది ఈ పేరు" అని నాకు చాలాసార్లు అనిపించేది. ఆలోచించగా ఆలోచించగా ఒక చోట గుర్తుకొచ్చిందీ పేరు. 

మల్లాది నవల "అందమైన జీవితం"లో కథానాయకుని పేరు ప్రియతమ్. 

మల్లాది ఆ పాత్రను అంత బాగా చిత్రించగలిగారు కాబట్టే నాకూ, నాలాంటి ఇంకెంతోమంది పాఠకులకు ఆ పేరు బాగా గుర్తుండిపోయిందనుకుంటాను. 

బహుశా ఈ నవల్లోనే అనుకుంటాను... మల్లాది ఒకచోట ఒక పాత్రతో పలికించిన వాక్యం నాకింకా గుర్తుంది, "నువ్వు అభిమానించే రచయితను కలుసుకోకు" అని.  

ఇది అనుభవపూర్వకంగా నిజమని తర్వాత బాగా అర్థమైంది నాకు.

తెలుగులో ఒక బెస్ట్ సెల్లర్ రచయితను (మల్లాది సమకాలికుడే) ఆకాశవాణి కర్నూలు ఎఫ్ ఎం లో నేనూ, మా ఎనౌన్సర్ మిత్రుడు శాస్త్రి ఇంటర్వ్యూ చేశాము. రికార్డింగ్ రూమ్‌లో ఇంటర్వూకి ముందు ఆయన మాట్లాడిన మాటలు, భాష నాకస్సలు నచ్చలేదు. ఇంటర్వూ పూర్తయ్యేటప్పటికి, అప్పటివరకూ ఒక రచయితగా అతనిమీదున్న ఇష్టం మొత్తానికి తుడిచిపెట్టుకుపోయింది. 

కాని... 

ఇలాంటి అనుభవం అందరు రచయితల దగ్గర ఉండదని కూడా నేనే మళ్ళీ నాకిష్టమైన ఇంకో రచయితను కలుసుకున్నప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఆ రచయిత, ప్రముఖ సినీ రచయిత.

దీని గురించి ఇంకోసారి, ఇంకో బ్లాగ్‌పోస్ట్‌లో తప్పక రాస్తాను. 

కట్ చేస్తే - 

మొన్నొకరోజు అనుకోకుండా శ్రీ అట్లూరి ఫేస్‌బుక్ టైమ్‌లైన్ మీద ఒక లింక్ చూశాను. 

అది - ఒక పాడ్‌కాస్ట్ లింక్. "జీవితంలో ప్రతివ్యక్తికీ ఒక వివాహేతర సంబంధం అవసరం" అన్నది ఆ పాడ్‌కాస్ట్ టాపిక్.

పాడ్‌కాస్టర్ ఎవరో కాదు, మల్లాది వెంకటకృష్ణమూర్తి! 

ఆ పాడ్‌కాస్ట్ విన్న తర్వాత, యూట్యూబ్ సజెషన్స్‌తో ఇంకొన్ని చోట్ల కూడా మల్లాది వాయిస్‌తో ఉన్న ప్రోగ్రామ్స్ కనిపించాయి. కొన్ని విన్నాను. చాలా బాగున్నాయి, వారి రచనల్లాగే. 

చలం గారి లాగే, ఇంకా చాలామంది వివిధ ఇతరరంగాల్లోని వారిలాగే... జీవితమంతా "అన్‌లిమిటెడ్‌"గా జీవించి, చివరి మజిలీలో మాత్రం స్పిరిచువాలిటీని ఆశ్రయించారు మల్లాది గారు.

ఇది నాకు ఇప్పటికీ అర్థం అయ్యీ కాని పజిల్. ఎందుకలా అని... 

ఆ విషయం అలా పక్కనపెడితే -  

నా మిత్రుడు గుడిపాటితో అంతకు ముందు రెండు మూడు సార్లు అన్నాను... "ఒకసారి మల్లాది గారిని కలుద్దాం, నీకు తెలుసు కదా" అని. ఆయన వెళ్దాం వెళ్దాం అంటూ ఒక దశాబ్దం దాటించేశాడు. 

మల్లాది గారిని నేను ఎప్పుడు కలుస్తానో తెలియదు కాని, తప్పక కలుస్తాను. "నీకిష్టమైన రచయితను కలుసుకోకు" అని వారు తన నవల్లో చెప్పిన ఆ మాట వారికి అస్సలు వర్తించదు అని నా గట్టి నమ్మకం. 

రైటర్ మల్లాది పాడ్‌కాస్ట్ ద్వారా అది నాకు చాలా స్పష్టంగా అర్థమైంది.  

No comments:

Post a Comment