Friday 29 April 2022

20-20 ఫిలిం మేకింగ్ !!


అయిదురోజుల ఆటయినా సరే, గతంలో టెస్ట్ క్రికెట్ అంటే అదో క్రేజ్. తర్వాత కొంతకాలం వన్ డే లు రాజ్యమేలాయి. ఉన్నట్టుండి 20-20 ఎంటరయ్యింది. అసలు ఆటే మారిపోయింది!

ఒక్క క్రికెట్ లోనే కాదు. ఈ వేగం దాదాపు ప్రతి ఫీల్డు లోనూ వచ్చింది. మనిషి జీవితంలోనూ వచ్చింది.

అలా వచ్చేలా చేసింది ఇప్పటి మన ఆధునిక జీవనశైలి. 

అసలు ఇప్పుడు ఎవరయినా ల్యాండ్ ఫోన్ వాడుతున్నారా? మొబైల్స్ కూడా దాదాపు అందరూ టచ్ స్క్రీన్ లనే ఇష్టపడుతున్నారు. ఎందుకు? 

టైం లేదు... వేగం... తెలియనిది ఇంకేదో కొత్తది కావాలన్న తపన.

కట్ టూ 20-20 సినిమా - 

ఒకప్పుడు సినిమా తీయడం అంటే అదొక మహా యజ్ఞం. షూటింగ్ చూడటం ఓ గొప్ప విషయం. సినిమా యాక్టర్లు, డైరెక్టర్లు కనిపించినా అదో సంచలనం.

ఇప్పుడదంతా గతం. 

సంవత్సరానికి ఒకటో రెండో వచ్చే వందల కోట్ల భారీ బడ్జెట్ ప్యానిండియా సినిమాలను వదిలేయండి. అవార్డుల కోసం తీసే ఆర్ట్ సినిమాల రూపశిల్పులనూ వదిలేయండి. ఈ సినిమాల సంఖ్య చాల తక్కువ. అది ఇంకో పెద్ద టాపిక్. ఇంకోసారి చర్చిద్దాం. 

మళ్ళీ మన 20-20 పాయింట్ కు వద్దాం...

ఫిలిం మేకింగ్ టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. ఫిలిం మేకింగ్ శైలి, పద్ధతులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు సినిమాలు వేరు. ఇంతకుముందు సినిమాలు వేరు. 

Content is the king. Money is the ultimate goal. 

ప్రతినెలా, ప్రతి వారం ఏదో ఓ కొత్త సంచలనం ప్రపంచంలో ఏదో ఓ మూల ఆవిష్కరింపబడుతున్నది మనం చూస్తున్నాం. 

స్క్రిప్ట్, డబ్బు రెడీ గా ఉంటే చాలు. కేవలం 45 నుంచి 90 రోజుల్లో ఒక మార్కెటేబుల్ సినిమాని పూర్తిచేసి, రిలీజ్ చేయగల సౌకర్యాలు వచ్చాయి. అలా చేస్తున్నారు కూడా. జస్ట్... ఒక సినిమా టైటిల్, పోస్టర్, టీజర్‌తోనే ప్రమోషన్, మార్కెటింగ్, బిజినెస్... అన్నీ చేసేస్తున్నారు.  

Ideas are the currency of the 21st century. 

కొన్ని లక్షలు చాలు. ఇప్పుడు ఎవరైనా సరే, చిన్న బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ సినిమా చేయొచ్చు. మనం క్రియేట్ చేసే మార్కెట్‌ను బట్టి థియేటర్స్‌లో, ఓటీటీల్లో రిలీజ్ చేయొచ్చు.  

సినిమా అనేది ఇప్పుడు ఒక క్రియేటివ్ బిజినెస్ మాత్రమే కాదు. పక్కా కార్పొరేట్ బిజినెస్. ఇంతకు ముందులాగా "హెవీ గాంబ్లింగ్" కాదు. ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు ఎక్కడికీ పోవు. 

ఫిలిం ఆర్ట్ పైన, మార్కెట్ పైన, బిజినెస్ పైన కనీస అవగాహన ముఖ్యం. ఎప్పటికప్పుడు మార్కెట్ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూవుండటం, కొత్త గ్యాప్స్ ఫిలప్ చేసుకుంటూవెళ్ళటం ముఖ్యం. 

ఇంకా చెప్పాలంటే - ఇప్పుడు హిట్టా, ఫట్టా అన్నది కూడా కాదు ముఖ్యం. ఆట ముఖ్యం. ఆటలో ఉండటం ముఖ్యం. ఆటలో మజా ముఖ్యం. సినిమాల్లో డబ్బు రకరకాల రూపాల్లో అదే మనల్ని ఫాలో అవుతుంది. ఎవరికీ నష్టం ఉండదు. 

ఇదే ఇప్పటి ట్వంటీ ట్వంటీ ఫిలింమేకింగ్! 

Friday 22 April 2022

57 రోజుల యుద్ధం తర్వాత...


ఫేస్‌బుక్‌తో కొన్ని బాధలున్నాయి, కొన్ని సంతోషాలున్నాయి. మనం మర్చిపోవాలనుకుంటున్నవి గుర్తుచేస్తుంది. మన సంతోషాన్ని రెట్టింపు చేసేవాటిని కూడా గుర్తుచేస్తుంది. ఈ రెండవ కారణం వల్లనే నేనింకా ఫేస్‌బుక్‌కు అంతో ఇంతో అతుక్కుపోయి ఉన్నాను. 

కట్ చేస్తే - 

ఇవ్వాళ కాత్యా పుట్టినరోజు... 

ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా పొద్దున్నే కాత్యాకు గ్రీటింగ్స్ చెప్పాను. అదొక ఫార్మాలిటీ. కాని, ఇప్పుడు కాత్యాకు సంబంధించిన రియాలిటీ వేరే. అదే ఈ బ్లాగ్‌లో మీతో షేర్ చేసుకుంటున్నాను.    

కాత్యా యూక్రేన్ పౌరురాలు. బాగా చదువుకొంది. మంచి అందకత్తె, అంతకు మించిన అద్భుతమైన కమ్యూనికేటర్. 

కాత్యా ఐవజోవా తన పూర్తిపేరు. అంతర్జాతీయస్థాయి మోడల్, డాన్సర్, ఆర్టిస్టు. నా ఫ్రెండ్ కూడా. మొన్నటి నా ఫీచర్ ఫిలిం ప్రాజెక్ట్‌లో నాతో కలిసి పనిచేసింది.    

యూక్రేన్, రష్యాల్లో ఉన్న ఇంకొందరు నా ఫ్రెండ్స్‌తో పాటు కాత్యా పరిస్థితి కూడా ఏంటో నాకు పూర్తిగా తెలుసు. యుద్ధం కాబట్టి, దాదాపు రెగ్యులర్‌గా తనతో మాటాడుతున్నాను.

యుద్ధం ప్రారంభరోజుల్లో ఖార్కీవ్‌లో, తన ఇంట్లో ఉన్న బంకర్లో తన కుటుంబంతో పాటు గడిపింది. కాత్యా అక్క కూతురు నెలల పాప విక్తోర్యా కూడా గాలి సరిగ్గా ఆడని అదే బంకర్‌లో చాలా రోజులుంది. 

తర్వాత - అంత భీకరంగా ఖార్కీవ్‌లో బాంబింగ్ జరుగుతుండగానే తన అక్కను, ఆమె పిల్లల్ని కార్లో తీసుకెళ్ళి సుమారు 1100 కిలోమీటర దూరంలో ఉన్న పోలండ్ చేర్చింది... వాళ్లక్కడ సేఫ్‌గా ఉంటారని. 

తర్వాత మళ్ళీ తనొక్కతే పోలండ్ నుంచి తన కారులో తిరిగి ఖార్కీవ్ చేరుకొంది. అది మార్చి 19. 



ఆ తర్వాత వారం రోజుల్లో ఖార్కీవ్ మొత్తం నేలమట్టమైంది. వాళ్ల ఇల్లు, బంకర్‌తో సహా. 

ఆ సమయంలో కాత్యా హాస్పిటల్లోనే ఉంటూ హాస్పిటల్ డ్యూటీ చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులు యూక్రేన్ ఆర్మీ కోసం వాలంటరీగా పనిచేసింది. ఇంకా ఆర్మీకి చెందిన వివిధ పనుల్లో యాక్టివ్‌గా పనిచేస్తోంది. 

ఒక్కోరోజు ఒక్కో చోట. ఒక్కోరోజు ఒక్కో పని. అంతా ఆర్మీలోనే.               

"ఎన్ని రోజులు ఇట్లా...?" అని మొదటి నాలుగైది రోజులప్పుడు అడిగినప్పుడు కాత్యా ఒక్కటే మాట చెప్పింది. "ఇది వార్. అంత త్వరగా ముగియదు" అని. 

కాత్యా చెప్పినట్టే జరుగుతోంది. 

తాజాగా మే 15 కు అంతా సెట్ అయిపోవచ్చు అని ఒక రూమర్. కాని, అది నిజంగా రూమరే అని కాత్యా చెప్పింది. 


ఒక్క నిమిషం ఇది చదవటం ఆపి ఆలోచించండి... 

కాత్యా లాగా వేలాదిమంది స్త్రీల పరిస్థితి అక్కడ అలాగే ఉంది. ప్రపంచంలోని మరికొన్ని దేశాల్లో ఇప్పటికీ అంతే.   

ఈ పరిస్థితితో పోల్చినప్పుడు మనదేశం ఎంత సురక్షితంగా ఉంది? కాని, కావాలని రాజకీయ స్వార్థం కోసం కొంతమంది క్రియేట్ చేస్తున్న గొడవలు మనల్ని, మనదేశాన్ని ఏ వైపు తీసుకెళ్తాయో ఒక్క క్షణం అలా ఊహించండి.     

కట్ చేస్తే - 

పుతిన్ యూక్రేన్ మీద యుద్ధం ప్రారంభించి 57 రోజులు గడిచినా తాను అనుకున్నది ఇంకా సాధించలేకపోయాడు. 

లేటెస్టుగా 24 గంటల క్రితం మరియుపోల్ ఒక్కటి మాత్రం ఆక్రమించుకోగలిగాడు. ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల్లో రష్యా తన స్ట్రాటెజీ మార్చి యుద్ధాన్ని మరింత భీకరం చేయబోతోందని అటు రష్యానుంచి, ఇటు యూక్రేన్ నుంచీ చెప్తున్నారు. 

రష్యాకు దాని లక్ష్యం దానికుంది. కొంచెం ఆలస్యమైనా సాధిస్తుంది. కాని, ఇవతలివైపు యూక్రేన్ సైన్యం ఎంతో శక్తివంతమైనదైనా ఎక్కువకాలం ప్రతిఘటించలేదు. యూక్రేన్‌కు సహాయంగా ఏ ఒక్క దేశం కూడా తోడు రాదు. అమెరికాతో సహా. 

యూక్రేన్ ప్రెసిడెంట్ జెలెన్స్‌కీని బాగా ఎక్కించి, రెచ్చగొట్టి, ఎన్నెన్నో హామీలిచ్చి ముందుకుతోసిన అమెరికా గాని, ప్రముఖమైన ఇంకో నాలుగైదు దేశాలు గాని ఇప్పుడు యుద్ధానికి సిద్ధంగా లేవు. ఉండవు కూడా. 

కాని - ఈ యుద్ధం ఇంకొన్నాళ్ళు సాగాలన్నది మాత్రం వారి లక్ష్యం. 

ఆ లక్ష్యం వారి సాధించారు. 

ఎందుకంటే - ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒక మూలన ఒక యుద్ధం జరుగుతుండాలి. అలా జరిగేలా చేస్తుండాలి. అప్పుడే వారికి ఆదాయం. ఆ అరడజన్ దేశాల్లోని ఆయుధ కర్మాగారాల్లో పని జోరుగా సాగుతుంది. ఆదాయం కూడా బాగా వస్తుంది. 

ప్రపంచ రాజకీయాల్లో ఇదొక పెద్ద ఈక్వేషన్.    

ఇవ్వాళ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఇండియా రాక వెనకాల కూడా లక్ష్యాలు ఇంచుమించు ఇలాంటివే అంటే ఎవరైనా నమ్ముతారా? 

రూమరే కావచ్చు... కాని, అది నిజం కావాలనీ, ఈ 'మే 15' కు రష్యా-యూక్రేన్ దేశాల మధ్య ఈ యుద్ధం ఆగిపోవాలనీ ఆశిస్తున్నాను.     

Happy Birthday, Dear Katya! 

С днем рождения...

Thursday 21 April 2022

షో బిజినెస్‌లో షో ఎంతవరకు?


1991 లోనే 'గాడ్ ఫాదర్' డైరెక్టర్ ఫ్రాన్సిస్ ఫోర్డ్ కోప్పలా ఒక మాటన్నాడు... 

"ఇప్పుడు మనం ఇన్ని కెమెరాలు, ఇంత లైటింగ్, ఇంత ఎక్విప్ంట్‌తో , ఇంతమంది స్టార్స్‌తో, ఇంత పెద్ద టీమ్‌తో ఎంతో ప్లాన్ చేసుకొని ఇలా సినిమాలు తీస్తున్నాం. కాని, ఒకరోజు వస్తుంది... ఒక చిన్న అమ్మాయి, ఇంట్లో మూలనపడి ఉన్న వాళ్ల డాడీ తాలూకు చిన్న వీడియో కెమెరాతో చాలా ఈజీగా ఒక అద్భుతమైన సినిమా తీసినా ఆశ్చర్యం లేదు!" 

ఆరోజు వచ్చేసింది. 

ఒక 3 లక్షలు పెడితే జేబులో పట్టే కెమెరాలు రెండు వస్తాయి. కోట్లరూపాయలు ఖరీదు చేసే భారీ కెమెరాలతో వచ్చే రెజొల్యూషన్, క్వాలిటీ వగైరా ఈ కెమెరాల్లో కూడా వస్తుంది. 

కాని, ఫిలిం ఇండస్ట్రీలో ఉండే హిపోక్రసీకి ఏదైనా భారీగానే కనిపించాలి. షో బిజినెస్ అన్నమాట! 

అంతవరకైతే ఓకే.

కాని, మధ్యలో ఉండే కొందరు పనిలేని వ్యక్తులు ఇలాంటి కొన్ని ఫార్మాలిటీస్ క్రియేట్ అవ్వటానికి కారణమవుతారు.

ఫలానా ఫలానా కెమెరాలతో తీస్తేనే ఓటీటీ వాళ్ళు తీసుకుంటారు అని... శాటిలైట్ రైట్స్ అమ్మాలన్నా, థియేటర్ రిలీజ్‌కి సినిమా ప్రమోట్ చెయ్యాలన్నా సో అండ్ సో కెమెరాలే వాడాలని రూల్స్ క్రియేట్ చేస్తారు. లాజిక్ లేని ఆ రూల్సే నడుస్తుంటాయి. 

లాజిక్స్ ఎవరైనా మాట్లాడాలంటే భయం... ఎవరు పుల్లేస్తే ఎక్కడ సినిమా ఆగిపోతుందో అని!  

కట్ చేస్తే - 

ఐఫోన్‌తో మొత్తం ఫీచర్ ఫిలిం షూట్ చేసి, అందులోనే ఎడిట్ చేసి, సినిమాల్ని రిలీజ్ చేస్తున్న రోజులివి.

షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ రిలీజులు కాదు నేను చెప్తున్నది... 

ఇలా తీసిన మైక్రో బడ్జెట్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్‌లో పోటీపడుతున్నాయి. అవార్డులు సాధిస్తున్నాయి. 

వందల కోట్లు కొల్లగొడుతున్న కె జి ఎఫ్-2 సినిమా ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి 17 ఏళ్ళప్పుడే ఆ సినిమా ఎడిటర్‌గా చేరాడు. ఇప్పుడతనికి 20 నడుస్తున్నాయి. 

ఒకవైపు ఈ స్థాయిలో మార్పులు ఇండస్ట్రీలో చూస్తున్నాం. మరోవైపు కెమెరాలు, ఎక్విప్‌మెంట్ విషయంలో పనికిరాని హిపోక్రసీ కూడా చూస్తున్నాం. 

అయితే - ఇండిపెండెంట్ సినిమాలు, చిన్న బడ్జెట్ సినిమాల దగ్గరికి వచ్చేటప్పటికే ఇలాంటి ఎక్కడలేని రూల్స్ పుట్టుకొస్తాయన్నది మాత్రం ఎవ్వరూ కాదనలేని నిజం.  

సినిమాల ఓపెనింగ్స్‌లోనో, వాటి ప్రి-రిలీజ్ ఫంక్షన్స్‌లోనో, చానల్స్ ఇంటర్వ్యూల్లోనో హిపోక్రసీ అంటే ఓకే. "షో బిజినెస్ కదా... అలాగే మాట్లాడతారు" అని అందరికీ అలవాటైపోయింది.

కాని, మేకింగ్ దగ్గర కూడా ఈ షో అవసరమా?      

Tuesday 19 April 2022

INVEST in FILMS


థాంక్స్ టు కరోనా... థియేటర్ రిలీజ్ బిజినెస్ కాకుండా, ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు అదనంగా మరికొన్ని భారీ ఆదాయమార్గాలు కొత్తగా లిస్ట్‌లో చేరాయి:

ఓటీటీలు... వెబ్ సీరీస్‌లు. 

ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్‌కు, ప్రొడ్యూసర్స్‌కు వీటి ద్వారా వస్తున్న అదాయం కూడా కోట్లల్లోనే ఉంది. 

కట్ చేస్తే - 

ఇంతకు ముందు సినిమాలు వేరు. ఇప్పుడు సినిమాలు వేరు. 

Content is the king. Money is the ultimate goal. 

కోటి రూపాయల లోపు బడ్జెట్లో తీసే చిన్న సినిమాలు కావచ్చు. 100 నుంచి 400 కోట్లల్లో తీసే ప్యానిండియా సినిమాలు కావచ్చు. మార్కెట్‌ను కాస్త పట్టించుకొని సినిమాలు తీస్తే చాలు. ఎలాంటి నష్టం ఉండదు.  

ఇంతకు ముందులా సినిమా అంటే గ్యాంబ్లింగ్ కాదు. ఒక మంచి కార్పొరేట్ బిజినెస్. బిగ్ బిజినెస్. 

పెద్ద స్టార్స్‌తో తీసే భారీ బడ్జెట్ సినిమాల గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. ఆయా హీరొలు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ లాబీల్లో అవి అలా కంటిన్యూ అవుతుంటాయి. ఆ స్పేస్‌లోకి కొత్తవాళ్ళు వెళ్ళాలంటే చాలా లెక్కలుంటాయి. సో, అదిప్పుడు మనకు సంబంధం లేని విషయం. 

కొత్త టాలెంట్‌తో తక్కువ బడ్జెట్‌లో తీసే చిన్న బడ్జెట్ సినిమాలకు ఇప్పుడు చాలా మంచి టైమ్. 

డ్యామ్ ష్యూర్ అనుకునే రియల్ ఎస్టేట్‌లో కూడా ఊహించలేనంత స్థాయిలో ఈ చిన్న బడ్జెట్ సినిమాలు లాభాల్ని అందిస్తున్నాయి. అది కూడా... కొన్ని నెలల్లోనే.   

ప్రస్తుతం ఈ చిన్న బడ్జెట్ సెగ్మెంట్‌లోనే వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తూ, వాటి ప్రి-ప్రొడక్షన్ వర్క్‌లో మేనిప్పుడు బిజీగా ఉన్నాము.  

గుడ్ న్యూస్ ఏంటంటే... మేలో మా కొత్త కార్పొరేట్ ఆఫీస్ ప్రారంభం అవుతోంది. 

మాతో కొలాబొరేట్ అవ్వాలనుకొనే ఔత్సాహిక ఇన్వెస్టర్స్, ఫండర్స్ ఈ నంబర్‌కు వాట్సాప్ చేయొచ్చు. మేమే కాల్ చేస్తాం: +91 9989578125  

PS: ఇన్వెస్టర్స్‌ను, ఫండర్స్‌ను కనెక్ట్ చేసి, వెంటనే డీల్ క్లోజ్ చేయగల సమర్థులైన మీడియేటర్స్‌ కూడా మమ్మల్ని కాంటాక్ట్ చెయ్యొచ్చు. ఇదే నంబర్: +91 9989578125  

Sunday 17 April 2022

ఎవరు ఎక్కడి నుంచైనా సినిమాల్లో పనిచేయొచ్చు 2.0


"ఊరంతా ఓ దిక్కు అయితే, ఉలిపిరికట్టెది ఓ దిక్కు అన్నట్టు... మనమందరం ఇటు సరూర్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, వనస్థలిపురం సైడుంటే, వీడొక్కడు మాత్రం అటెటో ఆ మూలకు పోయిండు!" 

ఓ పదేళ్ళ క్రితం అనుకుంటాను... మా "బిగ్ ఫైవ్" మిత్రుల సిట్టింగ్‌లో ఒక మిత్రుడు నన్ను ఉద్దేశించి ఈ మాటన్నాడు. 

అప్పుడు నేను న్యూబోయిన్‌పల్లిలోని 'డైమండ్ పాయింట్‌'లో ఉంటున్నాను.  

అప్పటి అవసరం, సౌకర్యం ఆ సమయంలో నన్నక్కడ దిగిపోయేట్టు చేసింది. ఒకసారి ఒక చోటు అలవాటైపోయాక, సౌకర్యంగా ఉన్నాక, ఇంక అక్కడ్నుంచి కదలాలనిపించదు. ఏం కదిలినా, ఆ చుట్టుపక్కలే కదుల్తాం తప్ప ఇంకో ఏరియాకు వెళ్ళాలనిపించదు.    

ఎక్కడెక్కడినుంచో హైద్రాబాద్ వచ్చి స్థిరపడే వాళ్లందరి విషయంలో జరిగేది ఇదే. 

కట్ చేస్తే -   

సినిమా టీమ్ అంతా ఎక్కడ కలిస్తే అదే ఆఫీస్ అని చెప్తూ ఆ మధ్య నేనొక బ్లాగ్ పోస్టు రాశాను. 

కేఫే మిలాంజ్. బియాండ్ కాఫీ.  
ఇరానీ హోటల్. కాఫీడే. 
కేబీఆర్ పార్క్. నెక్లెస్ రోడ్డు. 
ఐమాక్స్ లాబీలు. ట్యాంక్ బండ్. 
యాత్రి నివాస్. సినీ ప్లానెట్... 

ఈ డిజిటల్ & సోషల్ మీడియా యుగంలో... ఇండిపెండెంట్ సినిమాలకు, మైక్రో బడ్జెట్ సినిమాలకు ఇప్పుడు ఇవే నిజమైన ఆఫీసులు అంటే అతిశయోక్తి కాదు. 

ఒకప్పట్లా నాలుగ్గోడల మధ్యనే కూర్చొని పనిచేసే రోజులు పోయాయి. క్రియేటివిటీకి రొటీన్ అంటే అస్సలు నచ్చదు. 

అదలా పక్కనపెడితే - సినిమా ప్రొడక్షన్‌కు సంబంధించిన పనంతా ఒక్క ఫిలిమ్‌నగర్‌లోనే జరగాలన్న రూల్ కూడా ఇప్పుడు బ్రేక్ అయిపోయింది. అలాగే, సినిమావాళ్లంతా కూడా జూబ్లీ హిల్స్, శ్రీనగర్ కాలనీ, మణికొండ చుట్టుపక్కలే ఉండాల్సిన అవసరం కూడా నిజానికి లేదు. 

ఎవరు ఎటువెళ్ళినా, ఎక్కడ ఉంటున్నా... ముందు అవసరం, తర్వాత సౌకర్యం అనే ఈ రెండు అంశాలు మాత్రమే ఈ విషయంలో ఎవరి నిర్ణయానికైనా కారణమవుతాయి. 

హాలీవుడ్ సినిమాల్లో పనిచేసేవాళ్ళంతా హాలీవుడ్‌లోనే ఉండరు. బాలీవుడ్‌లో పనిచేసేవారంతా ఒక్క ముంబైలోనే ఉండరు. అలాగే, మన తెలుగు సినిమాల్లో పనిచేసేవాళ్ళంతా కూడా ఒక్క హైద్రాబాద్‌లోనే ఉండరు. ఒక్క ఫిలిమ్‌నగర్‌లోనో, మణికొండలోనో ఉండరు.   

ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ సరిగ్గా చేసుకోగలిగితే చాలు, ఎవరు ఎక్కడి నుంచైనా సినిమాలు తీయొచ్చు. సినిమాల్లో పనిచేయొచ్చు. 

ఈ విషయంలో... తన తొలి సినిమానుంచి మొన్నటి లవ్‌స్టోరీ వరకు, తాను మొదటినుంచీ నివాసముంటున్న సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్‌నే అడ్డాగా చేసుకొని విజయవంతంగా సినిమాలు చేస్తున్న శేఖర్ కమ్ములను మించిన ఉదాహరణ అవసరమని నేననుకోను. 

ఫిలిం నెగెటివ్ నుంచి డిజిటల్‌కు మారిపోయాక, ఫిలిమేకింగ్‌లో పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఇప్పుడు ల్యాబ్స్ కూడా అవసరం లేదు. మంచి ల్యాప్‌టాప్స్ రెండు చాలు. 

ఇక... ఫిలిం చాంబర్లో, ఎఫ్‌డిసిలో, సెన్సార్ ఆఫీసులో, యూనియన్ ఆఫీసుల్లో ఉండే కొద్దిపాటి పేపర్ వర్క్ కోసం - ఒక సినిమా మొత్తానికి పట్టే సమయం కేవలం కొన్ని నిమిషాలే! ఆ కొన్ని నిమిషాల కోసం, ఆ చుట్టుపక్కలే ఉండాల్సిన అవసరమైతే అస్సలు లేదు. 

రెగ్యులర్‌గా సినిమాలు చెయ్యాలని నిర్ణయించుకున్నతర్వాత -  ఆ మధ్య నేను కూడా శ్రీనగర్ కాలనీకి మారిపోవాలనుకున్నాను. కాని, ఇప్పుడా ఆలోచన పూర్తిగా మానుకున్నాను. 

ఫిలిమ్‌నగర్‌కి సుమారు 24 కిలోమీటర్ల దూరంలో నేనెక్కడైతే ఉన్నానో, నాకిక్కడ చాలా సౌకర్యంగానే ఉంది. నా ఇతర ప్రొఫెషనల్ & క్రియేటివ్ యాక్టివిటీస్‌కి కూడా ఇదే నాకు బెస్ట్ ప్లేస్. 

కలవాలనుకున్నప్పుడు - ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరినైనా, ఎలాగైనా కలుసుకోవచ్చు. వాస్తవానికి అదసలు సమస్యే కాదు. 

ఏం చేస్తున్నామనేది ముఖ్యం. ఏం సాధిస్తున్నామనేది ముఖ్యం. 

కట్ చేస్తే - 

ఒక రెండు మూడు వారాల్లో పూర్తిస్థాయిలో మా ఫిలిం ప్రొడక్షన్ హౌజ్, బుక్ పబ్లిషింగ్, మరికొన్ని భారీ ప్రొఫెషనల్ యాక్టివిటీస్‌తో మా ఆఫీస్ ప్రారంభం కాబోతోంది. 

Thanks to 2022, now it's gonna be a very special year in every aspect...

Tuesday 12 April 2022

ఒక కమిట్‌మెంట్... 100,900 ట్వీట్స్!


మీరు ట్విట్టర్‌లో ఉన్నారా? 
ఎప్పటి నుంచి ఉన్నారు? 
రోజుకి ఎన్ని ట్వీట్స్ చేస్తుంటారు మామూలుగా? 
ఇప్పటికి మొత్తం ఒక 10 వేల ట్వీట్స్ పెట్టారా?   

ప్రపంచవ్యాప్తంగా ఒక రెండున్నర కోట్ల మంది భారతీయులు ట్విట్టర్ ఉపయోగిస్తున్నారు. 

వీరిలో ట్విట్టర్ అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. 2009 నుంచి ఆయన పోస్ట్ చేసిన ట్వీట్స్ సంఖ్య కేవలం 11,400 మాత్రమే. 

సెలబ్రిటీల్లో, 2010 నుంచి ట్వీట్ చేస్తున్న 'బిగ్ బి' అమితాబ్ బచ్చన్ మాత్రం ఇప్పటివరకు రికార్డ్ స్థాయిలో 68,700 ట్వీట్స్ పోస్ట్ చేశారు. కాని, ఈ అంకె చేరుకోడానికి అమితాబ్ బచ్చన్‌కు 12 ఏళ్ళు పట్టిందన్న విషయం మనం గమనించాలి. 

2009 నుంచి, తన సోషల్ మీడియా కోసం ప్రత్యేకంగా స్పెషలిస్టులైన సిబ్బందిని పెట్టుకొని మరీ ట్వీట్ చేస్తున్న మన ప్రధానమంత్రి నరేంద్రమోది ఇప్పటివరకు పోస్ట్ చేసిన ట్వీట్స్ సంఖ్య కేవలం 32,400 మాత్రమే.  

ప్రపంచస్థాయి కుబేరుల్లో ఒకడైన ఈలన్ మస్క్ కూడా ఎప్పుడు చూసినా ట్విట్టర్లోనే ఉంటాడు. 2009 నుంచి ఇతను పోస్ట్ చేసిన ట్వీట్స్ సంఖ్య 17,300 మాత్రమే.   

నేను 2009 లోనే ట్విట్టర్ ఎకౌంట్ ఓపెన్ చేశాను కాని, పెద్దగా ఉపయోగించలేదు. ఫేస్‌బుక్ మీద బోర్ కొట్టినతర్వాత, ఈ మధ్యే ట్విట్టర్లో  కూడా రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తున్నాను. నా ట్వీట్స్ సంఖ్య కూడా ఇంకా 20K దాటలేదు.        

కట్ చేస్తే -  

మొన్నొకరోజు నా ట్విట్టర్ ఫీడ్‌లో కనిపించిన ఒక మిత్రుని ట్వీట్ చూసి అటువైపు వెళ్లాను. అనుకోకుండా నా దృష్టి అతని ప్రొఫైల్ మీదున్న ట్వీట్స్ అంకె మీద పడింది.     

షాక్...

100,900 ట్వీట్లు! 

రెఫ్రెష్ చేసి చూశాను. సేమ్... 100.9K ట్వీట్స్.  

నా స్టడీ ప్రకారం - ప్రపంచస్థాయిలో, ఇప్పటివరకు లక్ష ట్వీట్స్‌కు లైక్స్ కొట్టినవాళ్ళు ఉన్నారు గాని,  లక్ష ట్వీట్స్‌ పోస్ట్ చేసిన ట్విట్టర్ ప్రియులు కేవలం వేళ్లమీద లెక్కించే అంత మంది మాత్రమే ఉన్నారు. 

ఇండియా నుంచి గాని, ప్రవాస భారతీయుల్లో గాని ఈ "లక్ష ట్వీట్స్" మైలురాయిని హిట్ చేసినవాళ్ళు మాత్రం... ఇప్పటివరకు ఒక్కరు కూడా లేరు!  

ఈ అద్భుత రికార్డ్ సాధించిన మిత్రుడు మరెవరో కాదు... భువనగిరి నవీన్. 


నవీన్ గురించి నేను ఇంతకుముందు నా బ్లాగ్‌లో రాశాను... 

నవీన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. 2020 ఫిబ్రవరి వరకు, లండన్ టెక్ మహేంద్రలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేశాడు. ఇప్పుడు అదే లండన్‌లో సొంతంగా "బీవీఆర్ టెక్" పేరుతో కంపెనీ స్థాపించి, ఇండిపెండెంట్ కన్‌సల్టెన్సీ చేస్తున్నాడు. 

భార్య ప్రవల్లిక లండన్‌లోనే డెంటల్ కేర్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తోంది. వాళ్ళిద్దరికీ ఒక పాప – వైష్ణవి, ఒక బాబు – జైశ్రీరామ్. 

సూర్యాపేటకు దగ్గర్లో ఉన్న అడివెంల గ్రామంలో, వాళ్ల అమ్మమ్మ గారింట్లో పుట్టాడు నవీన్. ఖమ్మం జిల్లా పాల్వంచలో డీఏవీ, నవభారత్ స్కూళ్లలో చదువుకున్నాడు. పాల్వంచలోనే యాడమ్స్ ఇంజినీరింగ్ కాలేజిలో బీటెక్ చేశాడు.  


కేసీఆర్ అభిమాని. 

ఇంటికి దూరంగా, సుమారు 7700 కిలోమీటర్ల దూరంలో యూకేలో ఎంత బిజీగా ఉంటున్నా కూడా – ఇక్కడి నేలమీద మమకారం ఎక్కువ నవీన్‌కు. తనకిష్టమైన ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం, టీఆరెస్ పార్టీకోసం నిరంతరం సోషల్‌మీడియాలో పిచ్చి యాక్టివ్‌గా పనిచేస్తుంటాడు నవీన్. 

ఇప్పుడు లండన్‌లో తను చేస్తున్న ఐటి రిలేటెడ్ కన్సల్టెన్సీతో పాటు, NRI-TRS-UK లండన్ ఇంచార్జిగా కూడా పనిచేస్తున్నాడు నవీన్. దీంతోపాటు, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యూకే (TAUK) ఈవెంట్స్ సెక్రెటరీగా కూడా, అసోసియేషన్ కార్యకలాపాల్లో యాక్టివ్‌గా పాల్గొంటాడు నవీన్.

ఒక స్థాయిలో స్థిరపడ్డ తర్వాత నవీన్‌కు రాజకీయాల్లోకి రావాలని ఉంది కానీ, ప్రత్యక్ష రాజకీయాలు మాత్రం కాదు.


ఒక ఎంట్రప్రెన్యూర్‌గా, భర్తగా, తండ్రిగా, కొడుకుగా తన బాధ్యతలు సంపూర్ణంగా నిర్వహిస్తూనే - సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్‌గా ఉండటం అంత సులభమైన పని కాదు. 

2018 నుంచి, కేవలం నాలుగేళ్ళలో ట్విట్టర్‌లో 100,900 ట్వీట్స్‌తో రికార్డ్ సృష్టించడం అంటే నిజంగా ఒక అద్భుతమే. 

ఈ ట్వీట్స్ అన్నీ ఏవో సినిమా టిడ్‌బిట్సో, పనికిరాని సొంత కవిత్వమో కాదు...

అచ్చంగా తెలంగాణ కోసం, కేసీఆర్ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం... ఎప్పటికప్పుడు వివిధరకాల న్యూస్ సోర్సుల నుంచి తాను చదివి, చూసి తెలుసుకున్న సమాచారం అదంతా.  

ఒక నిబద్ధతతో చేసే యజ్ఞం లాంటి ఈ పనిని, తన సంపూర్ణ ఇష్టంతో, వాలంటరీగా చేస్తున్నాడు... నవీన్. 

"2018 ఎలక్షన్స్ నిజంగా ఒక మర్చిపోలేని అనుభవం. అప్పుడు, తెలంగాణాలోని అన్ని నియోజకవర్గాల కోసం ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా లెక్కలేనన్ని పోస్టులు పెట్టాను. కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆరెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలు మొదలైనవాటి గురించి ప్రజలందరికి ఎఫెక్టివ్‌గా తెలిసేలా... చిన్న బ్రేక్ కూడా తీసుకోకుండా... ప్రతిరోజూ సోషల్ మీడియా పవర్‌ను ఎంతవరకు ఉపయోగించుకోవచ్చో అదంతా చేశాను. దీన్ని శ్రమ అని ఎప్పుడూ నేను అనుకోలేదు" అని, నేనడిగిన ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పాడు నవీన్.  


నేనీ బ్లాగ్ రాయడానికి కారణం నవీన్ పోస్ట్ చేసిన 100,900 ట్వీట్స్ అంకె ఒక్కటే కాదు...

తను పుట్టిన గడ్డ తెలంగాణ కోసం... తనకిష్టమైన నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం. ఆయన స్ఠాపించిన పార్టీ తెరాస కోసం... తన చేతనైనంతలో ఏదైనా చేస్తూ ఉండాలని నవీన్‌లో నాకు కనిపించిన తపన.   

ఎంతో గొప్ప కమిట్‌మెంట్ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు.  

ఆ కమిట్‌మెంట్ నవీన్‌లో ఉంది. 

ట్విట్టర్‌లో లక్ష ట్వీట్స్ రికార్డ్ మైలురాయి దాటి, రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తున్న మన భువనగిరి నవీన్‌కు ఈ సందర్భంగా నా హార్దిక అభినందనలు.  

అసిస్టెంట్ స్క్రిప్ట్ రైటర్స్‌కు అవకాశం!


> ఇది ఉద్యోగం కాదు.  
> మీరు ఫిలిం ఇండస్ట్రీలో కథారచయితగా పరిచయం కావడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న కొత్త రచయితలై ఉండాలి. 
> యువ రచయితలకు ప్రాధాన్యం ఉంటుంది. 
> ఫిలిం స్క్రిప్ట్ రైటింగ్‌కు సంబంధించిన అన్ని స్కిల్స్ విధిగా మీకు తెలిసి ఉండాలి. 
> స్క్రిప్టుని తెలుగులో, స్క్రిప్ట్ ఫార్మాట్‌లో రాయటం తెలిసి ఉండాలి. 
> ఫైనల్‌డ్రాఫ్ట్, సెల్టెక్స్ వంటి సాఫ్ట్‌వేర్స్‌లో టైప్ చెయ్యటం తెలిసి ఉంటే ఇంకా మంచిది.
> ఎప్పటికప్పుడు నేనిచ్చే స్క్రిప్ట్ రైటింగ్ అసైన్‌మెంట్స్ పూర్తిచేయాల్సి ఉంటుంది. 
> ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే పనిచేయాల్సి ఉంటుంది. 
> ఎవరైనా రచయిత దగ్గరగాని, డైరెక్టర్ దగ్గరగాని ముందు అసిస్టెంట్‌గా చేరి, తద్వారా ఇండస్ట్రీలోకి పూర్తిస్థాయి స్క్రిప్ట్ రైటర్‌గా వెళ్ళాలనుకొనే కొత్త రైటర్స్‌కు ఇది మంచి అవకాశం. 

పైవన్నీ మీకు సరిపోతాయనుకుంటే - మీ సోషల్ మీడియా లింక్స్, వాట్సాప్ నంబర్‌తో కూడిన మీ వివరాలు వెంటనే మాకు పంపించండి: 

Whatsapp: +91 9989578125 (Strictly No Calls Plz)
email: mchimmani10x@gmail.com  

- MANUTIME MOVIE MISSION
- P C CREATIONS    

Saturday 9 April 2022

అజ్ఞానం రాజ్యమేలుతున్న చోట...


2009 నుంచి తిరువనంతపురం ఎం పి గా వరుసగా ఎన్నికవుతున్న శశిథరూర్‌ను నేను ఒక ఎం పి గా కంటే ఒక విద్యాధికుడైన రచయితగానే ఎక్కువగా ఇష్టపడతాను. థరూర్ ఇంగ్లిష్‌లో మాట్లాడితే తప్పనిసరిగా కొన్ని కొత్తపదాలను వింటాం. అర్థాల కోసం డిక్షనరీలు వెతుక్కుంటాం. ఆయన ఏ పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడనే విషయం ఇక్కడ అప్రస్థుతం. 

అలాంటి శశిథరూర్ ఇవ్వాళే ఒక ట్వీట్ పెట్టారు. అది నవంబర్ 2013 నాటి ఒక వీడియో. 

అందులో మాట్లాడుతున్నది ఇప్పటి మన దేశ ప్రధాని నరేంద్రమోది. ఆ వీడియోకు థరూర్ ఇంగ్లిష్‌లో పెట్టిన ఆరు పదాల కాప్షన్‌కు అర్థం ఏంటంటే "నేను ఇంతకంటే బాగా చెప్పలేను" అని! 

శశిథరూర్ లాంటివాడే చెప్పలేనంత బాగా ఏం చెప్పారు మోది అని 2013 నాటి ఆ 76 సెకన్ల వీడియోను ఆసక్తిగా చూశాను. 

"ధరలు ఈ రకంగా పెరుగుతుంటే పేదవాడు అసలు ఏం తింటాడు? ఇవ్వాళ ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చారు. కాని, అధికధరలు అన్న పదంలోని "అ" అనే అక్షరం పలకడానికి కూడా సిద్ధంగా లేరు ఆయన. "చస్తే చావు, నీ రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది" అన్నంత అహంకారపూరితంగా ఉన్నారాయన.పేదవాడి ఇంట్లో పొయ్యి వెలగటం లేదు. పిల్లలు తినడానికి తిండిలేక రాత్రులంతా ఏడుస్తూ, చివరికి తల్లి కన్నీళ్లు త్రాగి నిద్రపోతున్నారు. దేశ నాయకులకు అసలు పేదవాడి గురించి పట్టింపే లేదు. మీరు ఈ నాలుగో తేదీ వోటు వెయ్యడానికి వెళ్లేటప్పుడు కాస్త మీ ఇంట్లో ఉన్న ఆ గ్యాస్ సిలిండర్‌కు దండంపెట్టుకొని వెళ్లండి. దాని ధర ఆరకంగా పెంచి దాన్ని మీ నుంచి వేరు చేశారు." 

ఆ వీడియో బిట్‌లో మోది ఉపన్యాసం సారాంశం అది! 

ఆ తర్వాత కొన్ని నెలలకే 2014లో నరేంద్రమోది మన దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. ఎనిమిది సంవత్సరాలు గడిచింది. లక్షలకోట్ల అప్పులు పెరిగాయి. బంగ్లాదేశ్ కంటే కూడా మన జిడిపి తగ్గింది. అంతర్జాతీయంగా చాలా సందర్భాల్లో మనదేశ ప్రధాని నవ్వులపాలయ్యారు. ఫలితంగా మనదేశాన్ని కూడా అలాగే చూస్తున్నారు. అభివృద్ధికి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఇండెక్స్‌లు కిందకే దిగాయి తప్ప పైకి ఎగిసిన రంగం దాదాపు ఒక్కటి కూడా లేదు. ధరలు పెరగటం అనేది ఒక రొటీన్ వ్యవహారం అయిపోయింది. 

2013 నాటి ఆ వీడియోలో మోది మాట్లాడిన ఆ మాటలు ఇప్పుడు ఆయనకు, ఆయన ప్రభుత్వానికి, మొత్తంగా వారి పనితీరుకు చక్కగా సరిపోతాయి.  

బహుశా అందుకే శశిథరూర్ తన ట్వీట్‌లో అలా "ఇంతకంటే బాగా నేను చెప్పలేను" అన్నారు.

కట్ చేస్తే - 

మొన్న మార్చి చివరి వారంలో మోది మంత్రివర్గంలోని క్యాబినెట్ స్థాయి మినిస్టర్ పీయూష్ గోయల్ "మీ పంట మేము కొనం. బియ్యం విరిగిపోయి నూకలు ఎక్కువైతాయనుకుంటే, మీ రాష్ట్రప్రజలకు నూకలు తినటం అలవాటు చెయ్యండి" అని మన రాష్ట్ర ఎంపిలకు, మంత్రులకు కనీస గౌరవం ఇవ్వకుండా అనటం ఏదైతే ఉందో, అది తన వీడియోలో మోది చెప్పిన అహంకారానికి అసలైన నిర్వచనం. ఒక కేంద్రమంత్రిగా మాట్లాడకూడని పద్ధతి. అత్యంత బాధ్యతారాహిత్యం కూడా.

"ప్యాడి ప్రొక్యూర్‌మెంట్" అంటే ధాన్యం సేకరించటమే. ధాన్యంలో మాకిష్టమైనవే కొంటాం, ఇష్టం లేనివి కొనం అనటం ఎంతవరకు కరెక్టు? ఇదేం వ్యక్తిగత వ్యవహారం కాదుకదా? రాష్ట్రాలు కేంద్రానికి శత్రువులేం కాదు కదా? 

పంజాబ్‌లో పూర్తిగా ధాన్యం కొంటున్న కేంద్రం, అవసరమైతే ప్రత్యామ్నాయాలు కూడా చూపుతూ ఆ రాష్ట్రానికి అండగా నిలుస్తున్నది. తెలంగాణలో మాత్రం ధాన్యంలో కొన్నిరకాలను మాత్రమే తీసుకుంటామని భీష్మించుకు కూర్చుంటూ, పరోక్షంగా తెలంగాణపై కక్ష సాధింపుకు పాల్పడుతోంది. 

ఒకవేళ నిజంగానే ఇది కొత్తగా ఏర్పడిన సమస్య అనుకున్నా, ఆ సమస్య గురించి అధ్యయనం చేసి సత్వరమే పరిష్కరించాల్సిన బాధ్యత ఆ మంత్రిత్వశాఖ, దాని యంత్రాంగానిదే. ఈమాత్రం చేయలేకుండా తప్పించుకొనే పరిస్థితుల్లో విదేశాలకు నేరుగా ఎగుమతులు చేసుకొనే స్వేచ్చను కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వగలగాలి.  

ఇలాంటి వ్యవహారశైలితో కేంద్రం ఈ దేశానికి వెన్నెముక అయిన రైతుకు ఏం సందేశం ఇవ్వదల్చుకుందో కనీసం వారికయినా ఒక అవగాహన ఉన్నట్టు లేదు. అదే ఉన్నట్టయితే, మొన్నటి రైతు వ్యతిరేక చట్టాలు వచ్చేవే కావు, వందలాదిమంది రైతుల ప్రాణాలతో ఢిల్లీ వీధుల్లో ఆడుకునేవారే కాదు. తర్వాత, అవసరరీత్యా అదే రైతులకు క్షమాపణలు చెప్తూ ఆ చట్టాలను వెనక్కి తీసుకొనేవారే కాదు.    

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మొన్న ఒక సందర్భంలో ఇటీవలే విడుదలై బాగా వసూళ్ళు చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రస్తావన తెచ్చారు. వెయ్యి కోట్ల కలెక్షన్స్‌తో ట్రిపుల్ఆర్ సినిమా ముందుకు దూసుకెళ్తోందనీ, అలాంటి సినిమాలు దేశాభివృద్ధిలో కూడా పాత్ర పోషిస్తాయని అన్నారు. హర్షణీయమే. కాని, ఆరుగాలం కష్టపడి, ఈ దేశ రైతులు సాధిస్తున్న అధిక దిగుబడులు కూడా ఈ దేశాభివృద్ధిలో ప్రధానపాత్ర పోషిస్తాయన్న నిజాన్ని కూడా వారు గుర్తిస్తే బాగుండేది. కాని, మంత్రి పీయూష్ గోయల్ దృష్టిలో ఈదేశపు రైతు కష్టానికి కనీస స్థానం లేకపోవటం దురదృష్టకరం.   

కట్ చేస్తే - 

రాజకీయాలు వేరు... ప్రజల సంక్షేమం, దేశాభివృద్ధి వేరు. ప్రజల దైనందిన జీవితంతో ఏమాత్రం సంబంధం లేని సున్నితమైన విషయాలపైన దృష్టిపెట్టి రెచ్చగొట్టడం ద్వారా అధికారంలో కొనసాగే ప్రణాళికలు వేసుకోవడం అనేది రాజనీతిలో కూడా బహుశా అత్యంత అధమస్థాయి ఆలోచన. 

రెండుసార్లు భారీ మెజారిటీతో అధికారాన్ని బంగారుపల్లెంలో పెట్టి ప్రజలు అందించినప్పుడు దాన్ని ఎంతో అద్భుతంగా సద్వినియోగం చేసుకోవచ్చు. ఎనిమిదేళ్ల సమయంలో ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. ఇంకా అభివృద్ద్ధిచెందుతున్న దేశంగానే ఉన్న మన దేశాన్ని ధనిక దేశాల లిస్టులో చేర్చవచ్చు. కాని, దురదృష్టవశాత్తు కేంద్రంలో అలా జరగటం లేదు. వారి ఆశయాలు వేరు, ఆకాంక్షలు వేరు అన్నది అతి స్పష్టంగా సామాన్యప్రజలకు కూడా అర్థమవుతోంది. దీనికి వ్యతిరేకంగా ఒక భారీ మార్పుకి పడాల్సిన మొదటి అడుగుకోసం ఈ దేశ ప్రజలు ఇప్పుడు ఎదురుచూస్తున్నారు. 

అలాంటి భారీ మార్పులు అతితక్కువకాలంలో కూడా జరగడం సాధ్యమే అని చెప్పడానికి ఈ దేశంలోను, ఈ రాష్ట్రంలోనూ ఇప్పటికే కొన్ని ఉదాహరణలున్నాయి. ఈ దేశంలో ఇప్పుడున్న పొలిటీషియన్స్‌లో అత్యుత్తమస్థాయి పొలిటీషియన్, వ్యూహకర్త, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇది తెలియని అంశం కాదు. 

- మనోహర్ చిమ్మని
("నమస్తే తెలంగాణ" దినపత్రికలో ఈరోజు నా వ్యాసం)

Monday 4 April 2022

ఇండస్ట్రీలో ఇప్పుడీ రెండో స్కూల్‌కు డిమాండ్ ఎక్కువ!

ఓ గుప్పెడు టాప్‌స్టార్స్, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు... వారి కుటుంబాలు, వారసులు. ఇదొక స్కూలు. ఈ స్ఖూల్లో ఎవరికి వాళ్లకే ఫిక్స్‌డ్‌గా లాబీలుంటాయి. ఆ లాబీలు దాటుకొని ఓ కొత్త డైరెక్టర్ ఈ స్కూళ్లోకి ప్రవేశించడం చాలా అరుదు. ఈ స్కూల్‌తో సంబంధం లేకుండా బయట ఏదయినా పెద్ద హిట్ ఇచ్చినప్పుడే ఇక్కడ కొత్తవాళ్లకు ఎంట్రీ సాధ్యమౌతుంది. 

ఇది పక్కా ట్రెడిషనల్ స్కూల్.    

రెండో స్కూల్ పూర్తిగా ఇండిపెండెంట్ స్కూల్. ఎవరినో దృష్టిలో పెట్టుకొని కాకుండా, అనుకున్నట్టుగా సినిమా తీస్తూ వీళ్లకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటారు. సాధారణంగా వీరి సినిమాల బడ్జెట్లు చాలా తక్కువగా ఉంటాయి. 

ఇది పూర్తిగా ఒక అన్‌ట్రెడిషనల్ స్కూల్. 

'అనుకున్నట్టుగా సినిమా తీయడం' అనేది వీరు సాధించడానికి కొంచెం సమయం పడుతుంది. దీని వెనుక అనేక కారణాలుంటాయి. అరుదుగా కొంతమందికి, మొదటి సినిమాతోనే ఇలా పూర్తిస్థాయి క్రియేటివ్ ఫ్రీడమ్‌తో సినిమా తీసే అవకాశం కుదరొచ్చు. 

వీళ్ళు సాధించే విజయాలు, వీళ్లు క్రియేట్ చేసుకున్న బ్రాండ్‌ని బట్టి వీళ్లకు అప్పుడప్పుడూ ట్రెడిషనల్ స్కూల్లోని హీరోలు, నిర్మాతలతో కూడా సినిమాలు తీసే అవకాశముంటుంది.

కట్ చేస్తే - 

హీరోలకోసం ప్రత్యేకంగా రాసుకొన్న బౌండెడ్ స్క్రిప్టులు చంకలో పెట్టుకొని, ఎలాంటి గ్యారంటీలేని ఈ ట్రెడిషనల్ స్కూళ్ల చుట్టూ ఏళ్లతరబడి తిరగడం చాలామంది ఇండిపెండెంట్ డైరెక్టర్స్‌కు కుదరని పని. 

కారణాలు స్పష్టం. 

వీరికి సినిమానే జీవితం కాదు. దాన్ని మించిన జీవితం బయట ఎంతో ఉంటుంది. 

సినిమాలపట్ల అమితమైన ప్యాషన్ ఉన్న కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, నిర్మాతలను వీరే క్రియేట్ చేసుకుంటారు. వారి కోసం అన్వేషణ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అలా అన్నీ కుదిరినప్పుడే సినిమాలు తీస్తారు. 

తక్కువ బడ్జెట్‌లో, అతి తక్కువ షూటింగ్ డేస్‌లో సినిమా తీసి క్లిక్ కావడమే వీరికిష్టం. చెప్పాలంటే - కొంచెం అన్‌ట్రెడిషనల్, కొంచెం అగ్రెసివ్ కూడా.

ఇంతకు ముందులా కాకుండా వీరికి అవకాశాలు, విజయావకాశాలు ఇప్పుడు చాలా రకాలుగా పెరిగాయి. బిజినెస్ కూడా పెరిగింది. ఎవరు ఎలా క్యాష్ చేసుకుంటారన్నది వారి వారి అనుభవం, అవగాహన మీద ఆధారపడిఉంటుంది.  

ఈ చిన్న బడ్జెట్ సెగ్మెంట్‌లోనే, లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్స్ ఒకరిద్దరి సపోర్ట్‌తో, వరుసగా సినిమాలు చేసే కొన్ని భారీ ప్రొడక్షన్ హౌజ్‌లు కూడా ప్రారంభం కావచ్చు. అవుతున్నాయి. 

ప్రస్తుతం నా పనులు ఆ దిశలోనే చాలా వేగంగా కదులుతున్నాయి. 

Doing the unrealistic is easier 
than doing the realistic!

Friday 1 April 2022

ఒళ్ళు కొవ్వెక్కితే చెత్త సినిమాలు తీస్తారా?


ఫేస్‌బుక్‌లో ఇందాకే ఒక పోస్టు చూశాను... 

ఆ పోస్టు రాసిన వ్యక్తికి ఒక 60+ వయస్సు ఉండొచ్చు. ఇక్కడ వయస్సు ఎందుకు చెప్తున్నానంటే... కొందరికి వయసుతోనైనా కొంచెం కామన్ సెన్స్ వస్తుందని ఒక నమ్మకం. కాని, ఈ వ్యక్తికి అది ఇంకా అందని ద్రాక్షే అయ్యిందని చాలా సార్లు తనకు తానే ప్రూవ్ చేసుకున్నాడు. 

కట్ చేస్తే - 

ఆ వ్యక్తి ఇప్పుడే రాధే శ్యామ్ సినిమా చూశాట్ట. పరమ చెత్తగా ఉందట. 

ఫ్లాప్ అయింది కదా... అంతవరకు ఓకే.

ప్రేక్షకునికి సినిమా చెత్తగా ఉంది అని చెప్పే హక్కుంది. కాని...

> ప్రొడ్యూసర్లు డబ్బు ఎక్కువై, ఒళ్ళు కొవ్వెక్కి ఆ సినిమా తీశారట. 
> ప్రభాస్ పరమ దారుణంగా ఉన్నాడట. 
> హీరోహీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ కుదురుతుందో లేదో చూడకుండానే సెలక్టు చేశారట. 
> పరమ చెత్త స్టోరీట అది.
> దర్శకుడు పరమ అసమర్థుడు & అసలతనిలో క్రియేటివిటీ లేదట. 

ఎట్సెట్రా ఎట్సెట్రా... అని అతను రాసింది చదవలేకపోయాను. 

అసలు అంత ద్వేషం ఎందుకు? 

ఇతనొక మామూలు సగటు ప్రేక్షకుడో, లేకపోతే ఒక సగటు సోషల్ మీడియా మేధావో అయితే ఓకే. ఎవ్వరూ పట్టించుకోరు. వారి బుర్ర అంతంత మాత్రమే అని పక్కకెళ్ళిపోతారు. 

కాని - ఇతను నవల్స్, కథలు చాలానే రాశాడు. కొన్ని సినిమాలకు కూడా కథలిచ్చాడు. ఈయన ఇలా రాయకూడదన్నది నా పాయింట్. 

ఒక ప్రేక్షకుడిగా సినిమా ఫ్లాప్, పరమ చెత్త అని తిట్టే హక్కు ఉండొచ్చు. కాని, ఇంత లోతుగా, ఒక్కో అంశాన్ని పట్టుకొని తన స్థాయిలో విశ్లేషిస్తూ రివ్యూ ఇవ్వగలిగిన ఈ మేధావి ఎందుకని ఫీల్డులో టాప్ రచయిత స్థాయికి ఎదగలేకపోయాడో మరి ఆయనకే తెలియాలి! 

రాధాకృష్ణ నా ఫ్రెండు కాదు. ప్రభాస్, యూవీ క్రియేషన్స్ నా చుట్టాలు కాదు. వాళ్లని నేను వెనకేసుకొని రావటం లేదు. 

వారికి అనుభవం లేదా? కోట్లు ఖర్చుపెడుతూ జడ్జ్‌మెంట్ చేసుకోలేరా? 

రాజ్‌కపూర్ లాంటి అద్భుత దర్శకుడి మాగ్నమ్ ఓపస్ "మేరా నామ్ జోకర్" అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అలాగని ఆయన ఒళ్ళు కొవ్వెక్కి ఆ సినిమాకోసం అంత ఖర్చుపెట్టి అప్పులపాలయ్యాడా? 

అసలు సినిమాఫీల్డులో హిట్స్, ఫ్లాప్స్ రేషియో 10% కంటే తక్కువ అన్న నిజం ఆయనకు తెలుసా?  

కొన్ని కొన్నిసార్లు అంచనాలు ఘోరంగా తప్పుతుంటాయి. ఒక సినిమా రచయితగా ఈ మాత్రం ఆలోచించాలి. 

అది లేకనే బహుశా రచయితగా సోషల్ మీడియాకు పరిమితమైపోయాడతను. ఎంతసేపూ ఒక రాజకీయనాయకున్ని నానా తిట్లు తిట్టడం, ఇంకో రాజకీయనాయకున్ని యమగా పొగుడుతూ ఉండటం తప్ప ఇప్పుడాయనకు వేరే పనిలేనట్టుంది. 

ఇదే రచయిత, ఒకసారి... సమాజంలో జరుగుతున్న రేపులకు కారణం ఆడాళ్లే అని చాలా నికృష్టమైన పోస్టు ఒకటి పెట్టాడు. అందరూ బండబూతులు తిట్టడంతో ఆ పోస్టు తీసేశాడు. ఆ పోస్టు చూడగానే ముందు నేను చేసిన పని... అతన్ని "అన్‌ఫ్రెండ్" చెయ్యటం.  

అయినా అప్పుడప్పుడు ఇలాంటి చెత్త నా కళ్లముందుకు వస్తుంది. ఈసారి పూర్తిగా కనిపించకుండా చేసుకున్నాను.  

ఆయన నమ్మిన భగవంతుడు ఆయనకు కొంత సద్బుద్ధిని కూడా అందించు గాక...