Monday 24 January 2022

The Book in My Hand

ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొంటున్నప్పుడు నాకో అలవాటుండేది. 

నేను ఉన్న 'ఏ' హాస్టల్ నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళినా చేతిలో ఏదో ఒక బుక్ పట్టుకొనివెళ్లేవాణ్ణి. 

మా ఐకానిక్ ఓయూ ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళినా, యూనివర్సిటీ క్యాంటీన్‌కు వెళ్ళినా, మెస్‌కు వెళ్ళినా, గ్రౌండ్‌లో క్రికెట్ చూడ్డానికి వెళ్ళినా, మా ఫేవరేట్ 'చెట్ల కింది క్యాంటీన్' దగ్గర మా 'బిగ్ ఫైవ్', ఇతర ఫ్రెండ్స్‌తో గంటలకొద్దీ చాయ్‌లు, సిగరెట్స్ త్రాగుతూ కథలూ, కవిత్వం, భావుకత్వం వంటి టాపిక్స్ మీద గప్పాలు కొట్టుకొంటూ కూర్చునే స్పాట్‌కు వెళ్ళినా, నా రష్యన్ డిప్లొమా గాళ్‌ఫ్రెండ్స్‌తో కలిసి మెయిన్ లైబ్రరీ చుట్టుపక్కల తిరగడానికెళ్ళినా, ల్యాండ్‌స్కేప్ గార్డెన్‌కెళ్ళినా, టాగోర్ ఆడిటోరియంకెళ్ళినా, ఆఖరికి... ప్రతి శుక్రవారం సంగీత్ థియేటర్లో ఇంగ్లిష్ పిక్చర్‌కెళ్ళినా సరే... నా చేతిలో ఏదో ఒక బుక్ ఉండేది. 

ఇలాంటి అలవాటు నా ఫ్రెండ్స్‌లో ఎక్కువగా మా గుడిపాటికి, రాందాస్‌కు ఉండేది. నేనైనా కొన్నిసార్లు బుక్ మిస్ అయ్యేవాణ్ణి కాని, వీళ్ళిద్దరి చేతిలో బుక్ లేకుండా క్యాంపస్‌లో ఎప్పుడూ చూళ్లేదు నేను. 

ఎక్కువగా నా చేతిలో ఉండే ఆ బుక్  ఫిక్షనే అయ్యుండేది. 

బుక్స్ చేతిలోపట్టుకొని తిరగడమే తప్ప, వాటిని ఎక్కడా ఓపెన్ చేసి చదివే అంత సమయం ఉండేది కాదు! 😊

అంతమాత్రానికి ఎందుకలా బుక్ చేతిలో పట్టుకొని తిరిగావు అని అడక్కండి... నా దగ్గర సమాధానం లేదు. ఇలాంటి అలవాటున్న ఎవరిదగ్గరా సమాధానం బహుశా ఉండకపోవచ్చు.   

అప్పట్లో క్యాంపస్ హాస్టళ్లలో ఉన్న స్టుడెంట్స్‌కు ఓయూ డైరీ చేతిలో పట్టుకొని తిరగటం కూడా ఒక పిచ్చి ప్యాషన్.

డబ్బులు ఉన్నా లేకపోయినా... ఓయూ ప్రెస్‌లో ఆ డైరీలు అమ్మే సమయానికి ఎలాగో డబ్బు రెడీ చేసుకునేవాళ్ళం. రెండు మూడు డైరీలు ఎక్స్‌ట్రా కొని ఎవరికైనా గిఫ్ట్ కూడా ఇచ్చేవాళ్లం.    

నా దృష్టిలో ఓయూ డైరీని మాక్జిమమ్ లెవెల్లో ఉపయోగించింది మా రాందాస్, గుడిపాటిలే అంటే ఎలాంటి అతిశయోక్తిలేదు. బుక్స్‌తోపాటు, ఓయూ డైరీ చేతిలో లేకుండా వాళ్ళిద్దరినీ నేనెప్పుడూ చూళ్లేదు. మేము ఎప్పుడు కలిసినా, మళ్ళీ మేం డిస్పర్స్ అయ్యేలోపు కనీసం ఒక్కసారైనా వీళ్ళిద్దరూ ఏదో ఒకటి డైరీలో రాస్తూ కనిపించేవాళ్ళు. 

క్యాంపస్‌లో నా రెండో పీజీలో ఉండగానే నేను ఉద్యోగంలో చేరిపోయాను. అక్కడితో నా ఈ అలవాటుకి శుభం కార్డు పడింది... ది ఎండ్. 

కట్ చేస్తే -  

నిన్న సాయంత్రం సినీ ప్లానెట్ కెఫెటేరియాలో 'వి యస్' అని ఒక రైటర్ మిత్రున్ని కలిశాను. అతని తాజా పుస్తకం నాకు కాంప్లిమెంటరీ కాపీ ఇచ్చాడు. 

మా మీటింగ్ అయిపోయింది. 

నాకిచ్చిన ఆ కాంప్లిమెంటరీ బుక్ చేతిలో పట్టుకొని సినీప్లానెట్ నుంచి బయటపడి, అక్కడి నుంచి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న మా ఇంటికి నడవసాగాను. 

అలా నేను చేతిలో ఒక బుక్ పట్టుకొని నడిచి ఎన్నేళ్లయిందో నాకసలు గుర్తులేదు.   

నాకు తెలీకుండానే ఒక ట్రాన్స్‌లోకెళ్ళిపోయాను... 

పక్కనే ఉన్న హైవేమీద దూసుకెళ్తున్న వెహికిల్స్, సర్విస్ రోడ్‌లో నా పక్కనే నడుస్తున్న మనుషులు, ట్రాఫిక్, అప్పటిదాకా నా బుర్రలో తిరుగుతున్న ఏవేవో టెన్షన్స్... ఇదంతా నాకేమీ తెలియడం లేదు. 

సుమారు మూడు దశాబ్దాల క్రితం నాటి నా ఓయూ జ్ఞాపకాలు, స్లైడ్ ప్రొజెక్టర్‌లోంచి ఎదురుగా తెల్లటి స్క్రీన్ మీద పడుతున్న విజువల్స్‌లా... ఒక్కో జ్ఞాపకం... చకచకా నా మనస్సులో మూవ్ అవుతూపోయాయి.  

మా బిగ్ ఫైవ్ మిత్రబృందం, మా ఎమ్మే తెలుగు మిత్రులు, మా లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్ క్లాస్‌మేట్స్, మా రష్యన్ డిప్లొమా ఫ్రెండ్స్, మా ప్రొఫెసర్స్, మా ఆర్ట్స్ కాలేజీ, మా క్లాస్ రూమ్స్, మా మెయిన్ లైబ్రరీ, మా సెమినార్ లైబ్రరీ, మా సినిమాలు, మా షికార్లు, మా విహారయాత్రలు, మా ఆకలి రాత్రులు, మేం చదివిన పుస్తకాలు, మేం రాసిన రాతలు, మేం కన్న కలలు, మేం మర్చిపోలేని మా మధుర స్మృతులు... అన్నీ... నా మనో యవనిక పైన ఒక్కొక్కటిగా షాట్ బై షాట్ కనిపిస్తూపోయాయి. 

సుమారు మూడు దశాబ్దాల తర్వాత, మళ్ళీ, నిన్న సాయంత్రం నేను నా చేతిలో పట్టుకొని నడిచిన ఆ బుక్‌కి థాంక్స్ ఎలా చెప్పగలను?  

No comments:

Post a Comment