Monday 8 November 2021

ఉచిత సలహాదారులకు వందనం!

ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టడం ఈజీ. కాని, లక్షలు కోట్లు ఖర్చుపెట్టి ఒక సినిమా తీయడం మాత్రం అంత ఈజీ కాదు. 

కట్ చేస్తే - 

ప్రపంచంలోని ఏ బిజినెస్‌లో కాని, ఏ ప్రొఫెషన్‌లో కాని దారినపోయే దానయ్యలు సలహాలనిచ్చే సాహసం చెయ్యరు. 

ఒక్క సినీఫీల్డు విషయంలో మాత్రమే... సోకాల్డ్ మేధావి నుంచి మిరపకాయ బజ్జీలేసుకునేవాడిదాకా అందరూ సలహాలిచ్చేవారే! 

ఇదేం అతిశయోక్తి కాదు. 100% నిజం. 

శుక్రవారం ఒక సినిమా రిలీజైతే చాలు. ఫేస్‌బుక్‌లో, వాట్సాప్ గ్రూపుల్లో కనీసం ఓ వందమంది రివ్యూలు పెడతారు. 2/5 అంటారు. 2.5/5 అంటారు. 3/5 అంటారు. వాళ్ళిష్టం.

ఫస్టాఫ్ ఓకే అంటారు. సెకండాఫ్ మీద డైరెక్టర్‌కు గ్రిప్ పోయిందంటారు. అయినాసరే, డైరెక్టర్‌కు మంచి ఫ్యూచరుందంటారు!

ప్రిక్లయిమాక్స్ అదిరిందంటారు. క్లయిమాక్స్ మాత్రం అలాక్కాదు, ఇంకోలా తీయాల్సింది అంటారు.

ఎడిటర్ నిద్రపోయాడంటారు. ఆర్ట్ డైరెక్టర్ పనిచేయలేదు అంటారు. 

మ్యూజిక్ డైరెక్టర్‌కు అసలు మ్యూజిక్ తెలీదంటారు. రెండు పాటలు సూపర్‌గా ఉన్నాయంటారు.

హీరోహీరోయిన్లను డీఓపీ బాగా చూపించాడంటారు. కానీ, లైటింగ్ బాలేదంటారు. 

హీరోయిన్ నుంచి డైరెక్టర్ తనకు కావల్సింది రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడంటారు. హీరో విషయంలో మాత్రంఫెయిలయ్యాడంటారు. 

డబ్బులుపెట్టి సినిమా చూసే ప్రతి ప్రేక్షకునికి సినిమా మీద తన అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉంటుంది. బాగుందనొచ్చు, యావరేజ్ అనొచ్చు. చెత్త సినిమా అనొచ్చు. తప్పులేదు. 

కాని, రివ్యూ అలాకాదు. దానికి కొన్ని బేసిక్స్ ఉంటాయి. కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఫేస్‌బుక్, వాట్సాప్ ఫ్రీనేకదా అని, ఏదో తోచిన సొల్లు రాసి, దానికి పాయింట్స్ ఇచ్చి, రివ్యూయర్‌లా ఫీలయిన ప్రతి ఒక్కరూ రివ్యూయర్స్ అయిపోరు. 

అంతే కాదు - పూరి పనైపోయిందంటారు. మణిరత్నం, ఆర్జీవీ ఇంక రిటైరయిపోవచ్చునంటారు.  ఎ ఆర్ రెహ్మాన్ ఏవైనా బిజినెస్‌లుంటే చూసుకోవచ్చు అంటారు. 

ఏ మళయాళంలోనో, తమిళంలోనో వచ్చిన ఏదో ఒక సినిమాను పట్టుకొని, అసలు తెలుగు సినిమా బాగుపడాలంటే ఏం చెయ్యాలో చెప్తారు. తెలుగులో అసలు మంచి సినిమాలే రానట్టు!

ఇన్ని ఉచిత సలహాలనిచ్చే ఈ మేధావులకు ఇదే తెలుగులో వచ్చిన ఎన్నెన్నో గొప్ప సినిమాలు గుర్తుండవు. ఇంకెన్నో అలాంటి  తెలుగు సినిమాలను వీరు ఆదరించలేదన్నది గుర్తుండదు. 

అసలు సినిమా అనేది కోట్లతో ముడిపడిన ఒక క్రియేటివ్ బిజినెస్ అన్న బేసిక్ థింగ్ వీరికి తెలియదు. బాలీవుడ్‌తో సహా, ఇప్పుడు దేశంలోని అన్ని భాషల ఇండస్ట్రీలన్నీ కూడా తెలుగు ఇండస్ట్రీవైపు చూస్తున్నాయన్న విషయం తెలియదు. ఒక్క తెలుగు హీరో మీద 2500 కోట్ల పెట్టుబడులతో 5 సినిమాలు లైన్లో ఉన్నాయన్న వాస్తవం తెలియదు. ఇంగ్లిష్, జపనీస్, కొరియన్ వంటి భాషలతో కలిపి - తెలుగు సినిమా ఇప్పుడు 8, 9 భాషల్లో ఏకకాలంలో  ప్రపంచమంతా రిలీజ్ అవుతుందన్న వాస్తవం వీరికి తెలియదు.  

వ్యక్తిగత అభిరుచులు వేరు. బిజినెస్ ట్రెండ్స్ వేరు. 

ఆఫ్ బీట్ సినిమా వేరు. మెయిన్‌స్ట్రీమ్ సినిమా వేరు. 

ఆర్ట్ సినిమా వేరు. కమర్షియల్ సినిమా వేరు. 

ఒక్కో భాషలో ఒక్కో సినిమా తీయడం వెనుక ఒక్కో నేపథ్యం ఉంటుంది. ఒక భాషలో వచ్చి సూపర్ హిట్ అయిన ఒకానొక సినిమా, ఇంకో భాషలో అలాగే తీస్తే అది అట్టర్ ఫ్లాప్ అయ్యే చాన్సెసే ఎక్కువగా ఉంటాయన్న రియాలిటీ తెలియదు. 

స్టార్‌డమ్‌కు బిజినెస్‌కు ఉన్న లింక్ వీరికి తెలియదు. 

ఇలాంటి బేసిక్స్ మర్చిపోయి - తెలుగు సినిమా ఇలా తీయాలి, అలా తీయాలి అని ఉచిత సలహాలిచ్చేవాళ్లంతా - ఒక పదిమంది కలిసి, వాళ్ళ డబ్బుతోనో, లేదంటే క్రౌడ్ ఫండింగ్‌తోనో... ఒక మాంచి... వారి ఊహల్లోని గొప్ప టెన్‌కమాండ్‌మెంట్సో, బెన్‌హర్ లాంటి సినిమానో తీయొచ్చు కదా?! 

అలా మీరొక సినిమా తీసి అందర్నీ మెప్పించండి. దాన్ని మేమంతా చూసి, "సినిమా ఆఫ్ ద సెంచరీ" అని మస్త్ రివ్యూ రాసి, 5 /5 ఇస్తాం.  

కానీయండి మరి... మీదే లేటు... 

Happy Diwali! 
^^^

This was written & podcast on Diwali day. Here's the link to my podcast: https://anchor.fm/manohar-chimmani3/episodes/26---UCHITA-SALAHADARULAKU-VANDANAM-e19oq96
 
Continued this topic in my next podcast: #JaiBheem, posting the same later today. 

4 comments:

  1. తప్పుగా ఆలోచిస్తున్నారు. కాఫీ బాగుదనో బాగాలేదనో అనాలీ అంటే ముందుగా మీకు మంచి కాఫీ తయారు చేయటం వచ్చి ఉండాలీ అంతేకాదు కాఫీ పండించటం గురించీ కాఫీపొడి తయారీ గురించీ పరిపూర్ణవిజ్ఞానం కూడా ఉండాలీ అంటారు మీరు. టికెట్ కొని సినీమా చూసేవాడికి దాని గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. సినిమా ఒక వ్యాపారం అన్నపుడు కొనుగోలుదారులు తమ.అభిప్రాయం చెప్పరా తోచినట్లు? అది ఒక కళ స్థాయి నుండి ఎప్పుడో పడిపోయింది కాబట్టి విమర్శకుల స్థాయి గురించి ఆరోపణలు అనవసరం.

    ReplyDelete
    Replies
    1. ఇంతకుముందు కూడా ఒకసారి మీరిదే చెప్పారు. నేను మీతో ఏకీభవించలేను.

      నా పాయింట్ మీకు అర్థం కావటం లేదు అని నేననుకొంటున్నాను. దీని తర్వాతి పోస్టు కూడా ఇదే టాపిక్‌కు కొద్దిగా పొడిగింపు. వీలయితే చదవండి.

      టికెట్ కొని, సినిమా చూసేవాడికి తాను చూసిన సినిమాను విమర్శించే హక్కు వంద శాతం ఉంటుంది. కాని, ఏడాదికో, రెండేళ్లకో ఒక సినిమా చూసే కొందరు సోకాల్డ్ మేధావులు, సోషల్ మీడియా రచయితలు అసలు ఏమీ తెలియకుండానే "తెలుగు సినిమాను ఎవ్వడు బాగుచెయ్యలేడు" తరహా స్టేట్‌మెంట్లు ఇవ్వటం మూర్ఖత్వం.

      ఒక్క జై భీమ్ సినిమా చూసి, అసలు తెలుగులో మంచి సినిమాలే రానట్టు మాట్లాడ్డం, రాయడం... మరింత దిగజారుడు కిందకి వస్తుందన్నది నా ఖచ్చితమైన అభిప్రాయం.

      చివరగా - ఒక సినిమా రివ్యూ రాసే విషయంలో, కనీస స్టాండర్డ్స్ గురించి తెలియకుండా రివ్యూలు రాసేవాళ్ళను రివ్యూయర్స్ అనలేం.

      ధన్యవాదాలు.

      Delete
  2. సినీమా ఒక వినిమయవస్తువుగా ఎప్పుడో మారిపోయింది కదండీ. సినిమా చూసినవాడు తన అభిప్రాయం చెప్పటాన్ని గురించి షరతులు పెట్టలేమండీ.

    ReplyDelete
    Replies
    1. "టికెట్ కొని, సినిమా చూసేవాడికి తాను చూసిన సినిమాను విమర్శించే హక్కు వంద శాతం ఉంటుంది."

      "డబ్బులుపెట్టి సినిమా చూసే ప్రతి ప్రేక్షకునికి సినిమా మీద తన అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉంటుంది. బాగుందనొచ్చు, యావరేజ్ అనొచ్చు. చెత్త సినిమా అనొచ్చు. తప్పులేదు. "
      ---

      పై రెండు వాక్యాలూ నా తాజా రెండు బ్లాగ్ పోస్టుల్లో నేనే రాశాను. మీరు అనవసరంగా నేను అనని దాన్ని నాకు ఆపాదిస్తున్నారు. దయచేసి మీ కామెంట్స్‌లో ఈ పొరపాటుని గ్రహించండి.

      నాకు అర్థమైందేమిటంటే, నేను రాసినదాంట్లో నా పాయింటు మీకర్థం కాలేదని.

      ధన్యవాదాలు.






      Delete