Saturday, 12 June 2021

"పగలే వెన్నెల" కాయించిన మన సినారె

'నన్ను
 దోచుకొందువటే' అంటూ ఆరంభించి, 'పగలే వెన్నెల' కాయించి, 'అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం' అని తేల్చేసిన జ్ఞానపీఠం మన 'సినారె' ఇక లేరు.

సరిగ్గా నాలుగేళ్ళ క్రితం, ఇదే రోజు, నేను పెట్టిన చిన్న ట్వీట్ అది.

సోషల్ మీడియా సంప్రదాయం ప్రకారం, దీన్ని కూడా యధావిధిగా కొందరు మహానుభావులు 'కాపీ పేస్ట్' చేశారు. అది వేరే విషయం. 

అయితే... డైనమిక్ మినిస్టర్ 'కె టి ఆర్' గారు నా ట్వీట్‌ను రీట్వీట్ చేయడం విశేషం.

కట్ చేస్తే - 

కవి, సినీ గేయరచయిత, విమర్శకుడు, విశ్వవిద్యాలయ అధ్యాపకుడు, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ఎన్ టి ఆర్ కు అత్యంత సన్నిహితుడు కూడా అయిన సినారె గారి గురించి .. ఆయన జీవితం, జీవనశైలి గురించి .. ఆయనే రాసిన 'కర్పూరవసంతరాయలు' లాంటి ఒక రసాత్మాక కావ్యమే రాయొచ్చు. 

సినారె గారి కవిత్వం, ఇతర పుస్తకాలు కొన్ని, కనీసం ఒక డజన్ దేశవిదేశీ భాషల్లోకి ఆనువదించబడి ప్రచురితమయ్యాయి. 
 
కేవలం చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ హాల్లోనే - ఆయన చేతులమీదుగా, నాకు తెలిసి, ఎలాంటి అతిశయోక్తి లేకుండా, కొన్ని వందల పుస్తకాలు ఆవిష్కరింపబడ్డాయి. వాటిలో నావి కూడా రెండు పుస్తకాలుండటం నా అదృష్టం. 

వారి చేతులమీదుగా శాలువా కప్పించుకొన్న అదృష్టం కూడా నాకు కలిగినందుకు గర్విస్తున్నాను. 

అంతే కాదు, ఒక సందర్భంలో, సినారె గారితో కూర్చొని రోజూ రెండు గంటల చొప్పున కొన్నిరోజులపాటు గడిపిన అద్భుత అనుభవం నేనిప్పటికీ మర్చిపోలేను. 
      
తెలుగు సాహితీలోకంలో తెలంగాణ నిలువెత్తు సంతకం సినారె గారికి, వారి వర్ధంతి సందర్భంగా, ముకుళిత హస్తాలతో ఇదే నా నివాళి. 

Friday, 11 June 2021

కెమికల్ ఇంజినీరింగ్‌లో కరోనా!

సుమారు ఒక నెల క్రితం అనుకుంటాను... ఒక ఇంగ్లిష్ కార్టూన్ చూశాను. ఆ కార్టూన్లో ఒక డాక్టర్, పేషెంట్ మధ్య సంభాషణ ఇలా ఉంటుంది:

పేషెంట్: డాక్టర్, ఈ కరోనా ఇంకెప్పుడు పోతుందంటారు?
డాక్టర్: సారీ, నేను జర్నలిస్టును కాదు. నాకు తెలియదు!

నిజంగా ఇప్పుడు అలాగే ఉంది మీడియాలో పరిస్థితి. 

సుమారు ఒక సంవత్సరం క్రితం ఒక ప్రముఖ స్వామీజీ కూడా "మే 5 వ తేదీ కల్లా కరోనా పూర్తిగా ఈ భూమ్మీదే లేకుండా మాయమైపోతుంది" అని జోస్యం చెప్పాడు. 

అప్పటి మే పోయింది, ఇంకో మే కూడా మొన్ననే పోయింది. కరోనా మాత్రం ఇంకా అలాగే ఉంది! 

ఇక సోషల్ మీడియాలో, వాట్సాపుల్లో చెప్పే అవసరం లేదు. కరోనా రాకుండా మనం ఏం తినాలో, ఏం త్రాగాలో, ఏం చెయ్యాలో, ఏం చెయ్యద్దో... వేలకొద్దీ సలహాలు, సూచనల లిస్టులూ, సందేశాలూ!  

కట్ చేస్తే - 

ఆమధ్య ఎంపిసిలో బయాలజీ అని, బయాలజీలో ఫిజిక్స్ అని పాలిటిక్స్‌లో ఒక మంచి సెటైర్ కొద్దిరోజులు మనందరినీ బాగా నవ్వించింది. 

ఈ కోవిడ్ లాక్‌డౌన్ నేపథ్యంలో - ఇప్పుడు అలాంటిదే ఇంకో కొత్త "సెటైర్ వేరియెంట్" తాజాగా ఎంట్రీ ఇచ్చింది.  

కోవిడ్‌తో ప్రత్యక్షంగా పోరాడుతున్న డాక్టర్లు, దాని మీద నిరంతరం పరిశోధనలు చేస్తున్న వైరాలజిస్టులు, మైక్రోబయాలజిస్టులు, సంబంధిత ఇతర సైంటిస్టులు ఏం మాట్లాడటం లేదు కాని - వీటన్నింటితో ఎలాంటి సంబంధంలేని కెమికల్ ఇంజినీర్లు, ఇంకొందరు నిత్యం 'వాగేడిక్ట్స్' మాత్రం కరోనా వైరస్ 101 వేరియెంట్స్ గురించి చెప్తున్నారు. అవన్నీ ఇండియా మీద దాడిచేస్తాయంటున్నారు. WHO కి, ICMR కి సలహాలిస్తున్నారు. చివరకు,  థర్డ్ వేవ్ వచ్చి 'ఇంటికొక్కరు చచ్చిపోతారు' అని ప్రజల్ని ప్యానిక్ చేస్తున్నారు!  

అసలు వీళ్లంతా ఏ అధారిటీతో ఇంత బాహాటంగా నోటికొచ్చినవి చెప్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు? 

ఇలాంటి చెత్తను వాగించడానికి టీవీ చానెల్స్, యూట్యూబ్ చానెల్స్ పోటీపడుతుండటం ఒక పెద్ద విషాదం. 

అధారిటీ లేని వ్యక్తులు ఇలాంటి నానా చెత్త వాగి, ప్రజల్ని ప్యానిక్‌కు గురిచేస్తుంటే వెంటనే యాక్షన్ తీసుకొనే చట్టాలు, యంత్రాంగం మన దేశంలో లేకపోవటం మరింత పెద్ద విషాదం. 

Wednesday, 9 June 2021

ది బిగ్ బిజినెస్!

“Meanwhile, back at reality!"
- Robert Asprin 

సినిమా బేస్ క్రియేటివిటీనే. కాని, దాని టార్గెట్ మాత్రం ఖచ్చితంగా వ్యాపారమే!  

ఇక్కడ నేను మాట్లాడుతున్నది కమర్షియల్ సినిమా గురించి... 

తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. చూస్తుండగానే 30 కోట్ల నుంచి 100 కోట్లకు, 300 కోట్ల నుంచి 1000 కోట్లను అందుకొనే దాకా వెళ్ళింది బిజెనెస్! 

కట్ చేస్తే -

గత 15 నెలలుగా కొనసాగుతున్న కరోనావైరస్ లాక్ డౌన్ దెబ్బకు సినిమా బిజినెస్ చిన్నబోయింది. చిన్నబోవడం కూడా కాదు, పూర్తిగా చిన్నదైపోయింది! 

ఈ నేపథ్యంలో - అంతకు ముందటి  OTT ప్లాట్‌ఫామ్సే ఇప్పుడొక చిన్న ట్విస్ట్‌తో  ATT లయిపోయాయి. ATT లంటే  Any Time Theater లన్నమాట! "Pay Per View" పధ్ధతిలో పాపులర్ అయిపోయిన ఈ ఏటీటీ ల్లో ఇప్పుడు చిన్నవీ పెద్దవీ అని లేకుండా, అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒక్క సినిమా 10 భాషల్లో కూడా రిలీజవుతోంది! 

వీటిలో ఎక్కువ సినిమాలు మైక్రో బడ్జెట్ సినిమాలు. వీటికి వందల కోట్ల బడ్జెట్, స్టార్స్ అక్కర్లేదు. చిన్న బడ్జెట్, కొత్త టాలెంట్ చాలు. తక్కువ సమయంలో ఎక్కువ లాభం!  

ఈ ఓటీటీలు, ఏటీటీల కోసం - అందరూ ఆర్జీవీ లానో, ఇంకొకరిలానో హాట్, క్రైమ్ కంటెంట్ ఉన్న సినిమాలనే తీయాలన్న రూలేంలేదు. మంచి క్లాసిక్ కథలకు కూడా కొద్దిగా రొమాంటిక్ టచ్ ఇచ్చి హాటెస్ట్‌గా  కూడా తీయొచ్చు. ఆడియన్స్‌ను అంతకంటే ఎక్కువగా ఆకట్టుకోవచ్చు. ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఇంకెన్నో జోనర్స్‌లో కూడా సినిమాలు తీయొచ్చు. 

క్రియేటివిటీకి, బిజినెస్‌కు ఆకాశమే హద్దు.

సినిమా నిర్మాణంలో ఆధునికంగా వచ్చిన డిజిటల్ టెక్నాలజీ వల్ల ఇప్పుడు బడ్జెట్‌లు చాలా తగ్గాయి. చిన్న స్థాయిలో, కొత్తవాళ్లతో సినిమాలు చేయాలనుకొనేవాళ్లకు బిజినెస్ పాయింటాఫ్ వ్యూలో ఇదొక మంచి ప్రాఫిటబుల్ అండ్ పాజిటివ్ మలుపు. 

మంచి రిస్క్ ఫ్రీ బిజినెస్ మోడల్ కూడా! 

దాదాపు 15 నెలల కోవిడ్ లాక్‌డౌన్ నిజంగా చుక్కలు చూపించింది. ఇప్పుడదంతా కవర్ చేయాలి. ఎంతో హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ తప్పదు.  ఆల్రెడీ ముంబైలో 50% ఆక్యుపెన్సీతో థియేటర్స్ తెరిచారు. ఇక అన్నిచోట్లా నెమ్మదిగా థియేటర్స్ తెరుస్తారు. అన్ని "వుడ్స్"లో షూటింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటున్నాయి. 

ఈ నేపథ్యంలో... కేవలం ఓటీటీ, ఏటీటీల్లో రిలీజ్ కోసమే ఫీచర్ ఫిలిమ్స్ ప్లాన్ చేశాను. నా టీమ్‌తో కలిసి ప్రీప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించాను. చాలా ఎక్జయిటింగ్‌గా ఉంది.  


కట్ చేస్తే - 

ఈ బిగ్ బిజినెస్‌లో ఒక్క డబ్బే కాదు, ఊహించని రేంజ్ వ్యక్తులతో సంబంధాలూ, ఓవర్‌నైట్‌లో ఫేమ్... అన్నీ ఇక్కడే సాధ్యం.

దటీజ్ సినిమా!
దటీజ్ న్యూ బిగ్ బిజినెస్!! 

Friday, 4 June 2021

నువ్వు సినిమాల్లోకి రావాలని డిసైడ్ అయినప్పుడే...

Maniratnam @ 65
"నువ్వు సినిమాల్లోకి రావాలని డిసైడ్ అయినప్పుడే బాధ, అవమానం అనే మాటలు విడిచి పెట్టాలి. ఎందుకంటే, ఇక్కడ నీకు అవి అడుగడుగున ఎదురవుతాయి."
- మణిరత్నం 


మొన్న మణిరత్నం బర్త్‌డే నాడు ఒక ఆర్టికిల్ చూస్తున్నపుడు అతను చెప్పిన ఈ మాట కనిపించింది. 

ఇంటా బయటా ఎన్నో అనుభవించకపోతే, మణిరత్నం ఇంత గొప్ప వాస్తవం చెప్పేవాడు కాదు అని నాకనిపించింది. 

అంతదాకా ఎందుకు... మణిరత్నం డైరెక్టర్‌గా నిలదొక్కుకుంటున్న రోజుల్లో సుహాసిని డేట్స్ అడిగితే ఇవ్వలేదు. మణిరత్నం అప్పుడు అంత పెద్ద డైరెక్టర్ కాదు. సుహాసిని మాత్రం అప్పటికే ఫుల్ స్వింగ్‌లో ఉన్న హీరోయిన్!  

1987లో అనుకుంటాను... మణిరత్నం 'నాయకుడు' సినిమాతో డైరెక్టర్‌గా ఇండియాలోనే టాప్ రేంజ్‌కి ఎదిగిపోయాడు. 1988లో సుహసిని  అతన్ని పెళ్ళిచేసుకుంది. 

దటీజ్ సినిమా. :-)   

కట్ చేస్తే - 

ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ, కొత్త కొత్త కథాంశాలతో మణిరత్నం ఇంకా సినిమాలు తీస్తున్నాడు. ప్రేక్షకులను అతని సినిమాల కోసం ఎదురుచూసేలా చేస్తున్నాడు. "ఇంకా మణిరత్నం సినిమాలెందుకు తీస్తున్నాడు?" అని విశ్లేషకులు రాస్తున్నది పట్టించుకోకుండా - మొన్న మొన్నే "ఓకే బంగారం" సినిమా తీసి, అడ్వాన్స్‌డ్ ట్రెండీ సబ్జెక్టులను కూడా తనెంత బాగా తీయగలడో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. 

సుధ కొంగర, గౌతమ్ మీనన్, సుహాసిని, రాజీవ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకులుగా మొన్నీమధ్యే "పుతం పుదు కాలై" పేరుతో ఒక 5 అద్భుత కథల యాంథాలజీ సినిమాను నిర్మాతగా తీశాడు!  

తన మద్రాస్ టాకీస్ బ్యానర్‌లో ఇంకెన్నో కొత్త సినిమాల పనుల్లో ఇప్పటికీ బిజీగా ఉన్న లివింగ్ లెజెండ్ మణిరత్నం విషయంలో 'Age is just number' అన్నది వంద శాతం నిజం.