Saturday 6 February 2021

సాదిక్... నేనూ... మా జామై ఉస్మానియా చాయ్ అడ్డా!

ఓయూలో మా సీనియర్, నా హాస్టల్‌మేట్ సాదిక్ భాయ్ అంటే నాకు చాలా ఇష్టం. 

కట్ చేస్తే -

సాదిక్ చెప్పింది చేస్తాడు. ఏదైనా తను చెప్పింది చెయ్యలేకపోతే, అవ్వకపోతే ఆ విషయం వెంటనే  నేరుగా, నిర్మొహమాటంగా చెప్పేస్తాడు... "మనూ, ఆ పని ఇంక కాదు" అని. 

అతనిలో ఇది నాకు చాలా ఇష్టం. 

సుమారు ఓ ఆరేళ్లక్రితం అనుకుంటాను. నాకో మాటిచ్చాడు సాదిక్ భాయ్. అప్పుడు నా సినిమా పనుల హడావుడి, బిజీల్లో ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. దాదాపు మర్చిపోయాను. 

వన్ ఫైన్ ఈవెనింగ్ తన మాట నిలబెట్టుకున్నాడు పెద్దన్న! అది కూడా - చాలా డీసెంట్‌గా, డిగ్నిఫైడ్‌గా, ఎంతో హుందాగా... నేను షాక్‌తో ఉబ్బి తబ్బిబ్బయిపోయి సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోటంతగా!

పైన రాసినదాంట్లో ఎలాంటి అతిశయోక్తిలేదని మిత్రులందరికి సవినయ మనవి. నేను సాదిక్ భాయ్‌ని ఇంచ్ కూడా పొగడ్డం లేదు. 

కట్ చేస్తే - 

ఒకసారి రామ్‌నగర్‌లో ఒక "తోపుడు బండి" చూపించాడు సాదిక్. 

"ఏందన్నా ఇది?" అనడిగా. 

ఆ తోపుడు బండితో తాను మర్నాటి నుంచి ఏమేం చేయాలనుకుంటున్నది చెప్పాడు. తన ఆలోచన నాకు నచ్చింది. చరిత్రలో నిల్చిపోయే ఒక బ్రాండ్ క్రియేట్ చెయ్యగల సత్తా ఆ ఆలోచనకుంది. అదే చెప్పాను. కంగ్రాట్స్ చెప్పి బయటపడ్డాను. 

సాదిక్‌ను నేనెప్పుడూ లైట్ తీసుకోలేదు. కాని, ఈ తోపుడు బండి విషయంలో మాత్రం - దాని వెనకున్న ఎంతో శ్రమ దృష్ట్యా - కొంచెం లైట్ తీసుకున్నాను. 

సాదిక్ చేసి చూపించాడు. 

లోకల్ స్క్రైబ్స్ నుంచి, బీబీసీ దాకా సాదిక్ తోపుడు బండి ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్ ఐటమ్ అయింది.  

ఈమధ్య - లాక్‌డౌన్ టైమ్‌లో ఊళ్ళల్లో పిల్లలకు పుస్తకాలు, యాండ్రాయిడ్ ఫోన్లు, చలికి వణుకుతున్న పిల్లలకు, పెద్దలకు బ్లాంకెట్లు, ఆకలితో ఉన్నవారికి నిత్యావసర వస్తువులు... చాలానే చేశాడు. 

అదీ - వ్యక్తిగతంగా తనకు రిస్క్ ఉంటుందని తెలిసీ!


ఇదిగో - ఇప్పుడు మళ్ళీ అక్కడెక్కడో అడవిలో ఒక పర్ణశాల వేశాడు మా సాదిక్ భాయ్. 

తెల్లారితే అక్కడ అదో సంచలనం. పండగ. 400 మందికి భోజనాలూ, ఊహించని ఇంకేవో సంభ్రమాశ్చర్యాలూ... 

అయితే - తోపుడు బండి నుంచి, పర్ణశాల దాకా - సాదిక్ ఇదంతా చేస్తున్నది ఏదో సెన్సేషన్ కోసమో, పేరు కోసమో కాదు. తన సంతృప్తి కోసం. 

కట్ చేస్తే -  

అనుకోకుండా ఒక సింగిల్ సిట్టింగ్‌లో, ఒక ఫ్లోలో రాస్తున్నా కాబట్టి - ఇదంతా ఒక నాన్ లినియర్ స్క్రీన్‌ప్లేలా ఉంటుంది. క్షమించాలి. 

కాని, ఇది ఇలా రాయటం అవసరం అనిపించి రాస్తున్నాను. రెండు కారణాలున్నాయి: ఒకటి - నా బ్లాగింగ్ ప్యాషన్. రెండు - సాదిక్‌లోని ఇంకో గొప్ప గుణం గురించి మిత్రులకు చెప్తూ, నాకు నేను ఒక పాఠం నేర్చుకోవాలన్న "సెల్ఫ్ మోటివేషన్" కోసం! 

సాదిక్ తను ఏం చెయ్యాలనుకుంటే అది చేసేస్తాడు. తను ఎలా బ్రతకాలనుకుంటే అలా బ్రతుకుతాడు. ఇంక దీంట్లో ఎలాంటి రెండో మాటకు తావు లేదు. 

ఒక అయిదేళ్ళక్రితం - మా జామై ఉస్మానియా చాయ్ అడ్డా దగ్గర - వన్ ఫైన్ మార్నింగ్, మేమిద్దరం కూర్చొని మాట్లాడుకొంటున్నప్పుడు - మా ఇద్దరికి మాత్రమే తెలిసిన ఒకరి గురించి, సమయం విలువ గురించీ - నాతో చెప్పిన ఒక మాట చెప్పి ఇది ముగిస్తాను... 

"మనూ! నేను ఆ వ్యక్తి మీద నా పూర్తి నమ్మకం పెట్టి, నా పూర్తి సపోర్ట్ ఇచ్చాను. అంతా వృధా అని అర్థమయింది. నా జీవితంలో ఒక్క సంవత్సరం అంటే దానికి ఎంతో వాల్యూ ఉంది. చాలా నష్టపోయాను. అదే ఒక్క సంవత్సరం నా మీద నేను ఫోకస్ చేసుకుంటే - ఏం చేయగలనో చూపిస్తాను" అన్నాడు. 

సంవత్సరం తిరక్కముందే ఎన్నో చేసి చూపించాడు! 

దటీజ్ సాదిక్...

తను అనుకున్నది చేస్తాడు. అనుకున్నట్టుగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తాడు. 

అందుకే మా సాదిక్ భాయ్ అంటే నాకిష్టం. అడవిలో ఈ పర్ణశాల సెటప్‌తో ఇప్పుడతనికి ఫ్యాన్‌ని కూడా అయ్యాను.  

2 comments:

  1. సాదిక్ భాయ్ గొప్ప మానవతామూర్తి.

    ReplyDelete
  2. మాటలవీరుల కన్నా చేతల మనుషులు మిన్న!

    ReplyDelete