Wednesday 16 December 2020

నువ్వు లేకుండా అప్పుడే రెండేళ్ళు!

బ్రతికుండటానికి కూడా చాలా శక్తి, చాలా విల్‌పవర్ కావాలని నువ్వు వెళ్ళిపోతూ మా అందరికి తెలియజెప్పాకే తెలిసింది. 

నేను కొంచెం చొరవతీసుకున్నా, నువ్వు "అన్నా, మా సమస్యను పరిష్కరించు" అని నాతో ఒక్క ముక్క గట్టిగా చెప్పినా ఇవ్వాళ నేనిది రాసుకొంటూ ఇలా బాధపడేవాణ్ణి కాదు. మానవసంబంధాల విలువ ఏంటో కూడా నువ్వు వెళ్ళిపోతూ చెప్పావు. 

సమాజంలో ప్రతి వ్యవస్థ కూడా కాలగమనంలో ఎంతో మారిపోతూవస్తోంది. నువ్వూ మారాల్సింది. సమస్యను ఏవైపునుంచయినా పరిష్కరించుకోవాల్సింది. సమస్యే మూలం కాని, సమస్యకు నువ్వు మూలం కాదు అన్న చిన్న ఆలోచన చెయ్యలేకపోయావు. నేను బాగుంటే నువ్వు బ్రతికుండేవాడివి. అన్నగా ఏం చేయలేకపోయాననే బాధ నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నన్ను ఏడిపిస్తుంది. నీ పదేళ్ళ కొడుకు కార్తీక్‌తో ఫోన్లో మాట్లాడినప్పుడల్లా కళ్ళుచెమ్మగిల్లుతాయి. వాడిని కలిసి హత్తుకున్నప్పుడు వదిలిపెట్టలేనంత దుఃఖం. 

నువ్వొక్కడివే స్నేహితుడిగా, తమ్ముడిగా, నీతోనే పెరిగిన శ్రీధర్‌కు ఇప్పుడు వరంగల్‌లో ఎవ్వరున్నారు మనసు విప్పి మాట్లాడుకోడానికి? వాడెంత నీకోసం తపనపడ్డాడు? వాడితోనైనా గట్టిగా చెప్పాల్సింది కదా - అన్నతో చెప్పి, నువ్వూ అన్నా కలిసి నా సమస్యను వెంటనే ఇప్పుడే పరిష్కరించండి అని.  

నీ చివరిరోజుల్లో నువ్వు నన్ను కలిసిన ప్రతిసారీ, నీ జీవితం ఎలాపోతోందో తెలుసుకోవడం ద్వారానైనా నేను చాలా తెలుసుకోవాల్సింది. ఇలాంటి ముగింపు నేనూహించలేదు. నేనెలా ఉన్నా సరే, అన్నగా నేను పూనుకోవాలన్న ఆలోచన ఆ మూడేళ్ళలో ఒక్కసారి నాకు వచ్చినా ఇవ్వాళ నాకింత బాధ వుండేదికాదు. 

ఇప్పుడు శ్రీధర్, నేనూ ఎప్పుడు కలిసినా, ఎప్పుడు ఫోన్లో మాట్లాడుకొన్నా నీ గురించే. చెట్టుకు, పుట్టకు ఒక్కొక్కరై మర్చిపోయిన మానవసంబంధాలగురించే. నీ జీవితాన్ని ఒక పాఠంగా మార్చి నువ్వు నిష్క్రమిస్తే తప్ప మాకు తెలియలేదు మానవసంబంధాల విలువేంటో.  

ఎందుకు వాసూ, ఇలా చేశావు? "అన్నా" అని ఎప్పుడూ నవ్వుతూ నాతో మాట్లాడిన నీ జ్ఞాపకాలూ, ఆవెంటనే వచ్చే కన్నీళ్ళే కదా ఇప్పుడు నాకు మిగిలింది?

మానవసంబంధాలు చాలా ముఖ్యం. మనసువిప్పి మాట్లాడుకోడానికి ఒక మనిషి ఉండటం చాలా ముఖ్యం. ఈ రెండూ ఉన్నప్పుడే మిగిలినవి ఏవైనా సరే బాగుంటాయి. 

నా చిన్న తమ్ముడు వాసు లేడు అన్న నిజాన్ని నేనింకా నమ్మడానికి ఒప్పుకోలేకపోతున్నా. కాని, నిజాన్ని ఎలా కాదనగలను? నీ ఫోన్ కాల్ ఏది? మొన్న వరంగల్ వచ్చినపుడు నువ్వు లేవే? 

మిస్ యూ వాసూ... 

2 comments:

  1. Heart touching sir
    =================buchi reddy gangula
    USA

    ReplyDelete
    Replies
    1. Thank you so much Buchi Reddy garu. An un-intented grave mistake from my side. And a harsh reality. I had to confess.

      Delete