Friday 9 October 2020

సమయం ఎప్పుడూ సమస్య కాదు!

రేపు నేను ప్రారంభించాలి అని అనుకున్న నా ఆన్‌లైన్ తెలుగు ఫీచర్స్ మ్యాగజైన్‌ను ఈ 16కు గాని, 25 నాడుగాని ప్రారంభిస్తాను. వాయిదావెయ్యక తప్పలేదు. 

అనుకున్నవిధంగా చెయ్యటం ముఖ్యం. ఏ ప్రయోజనాన్ని ఆశించి ఇంత పెద్ద పని పెట్టుకొన్నానో, అది తప్పక జరిగేలా నా ప్రయత్నం ఉండటం ముఖ్యం. 

25 దసరా అవుతోంది. 90 శాతం అదే కావచ్చు. ఈలోపు కూల్‌గా మిగిలిన ముఖ్యమైన పనులు కూడా చేసుకొనే వీలుంటుంది. 

ఈరోజునుంచీ నా పనివేళల్లో సగం సమయం మ్యాగజైన్ కోసం, మిగిలిన సగం నా సినిమాలు, ఇతర పనులకోసం వెచ్చించాలని నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నాను. 

ఆన్‌లైన్ మ్యాగజైన్లో నా బ్లాగ్ లింక్ కూడా ఇచ్చేశాను కాబట్టి, బ్లాగింగ్ కూడా కొనసాగుతుంది. 

పనిచేసేవాడికి 24 గంటలు చాలా ఎక్కువ. సమయం ఎప్పుడూ సమస్య కాదు. సరైన నిర్ణయాలు, మనం అసోసియేట్ అయ్యే వ్యక్తులు మాత్రమే సమస్య. ఈ ఒక్క విషయంలోనే నేను సిగ్గుపడాల్సిన విధంగా విఫలమయింది, ఎన్నో ఏళ్ల సమయం పోగొట్టుకొంది. సో, జాగ్రత్త తప్పనిసరి. 

కట్ చేస్తే -      

మనిషన్న తర్వాత, వాడి జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక కష్టం చిన్నదో పెద్దదో వస్తూనే ఉంటుంది. అది ఆర్థికమే కానక్కర్లేదు, ఇంకేదైనా కూడా కావచ్చు. కానీ, జీవితంలోని ఒక అతి ముఖ్యమైన మజిలీలో, అన్ని రకాల కష్టాలూ, లేదా అగ్ని పరీక్షలు ఒకేసారి రావడం అనేది ఎంత స్థితప్రజ్ఞుడినైనా కొంతైనా జర్క్ తినేలా చేస్తుంది.

అలాంటి పరిస్థితిలో ఉన్నపుడే నిజమైన హితులు, నామ్‌కేవాస్తే స్నేహితులు ఎవరన్నది పాలు, నీళ్ళలా తెలిసిపోతుంది. జీవితంలో ఏది ముఖ్యమో తెలిసిపోతుంది. జీవితంలో మనం ఏం కోల్పోతున్నామో తెలిసిపోతుంది. అప్పుడు గాని మన కళ్ళు పూర్తిగా తెర్చుకోవు. అప్పుడుగాని మన మెదడును పూర్తిగా ఉపయోగించుకోము. 

అప్పుడే మనకు నిజంగా ఏం కావాలో తెల్సుకుంటాము. అప్పుడే మనం నిజంగా ఏం చేయాలో అది చేయటం ప్రారంభిస్తాము. అప్పుడే మన నిజజీవితంలో ఏ పరిస్థితి ఎదురైనా నిశ్చలంగా ఎదుర్కొంటాము. రెట్టించిన కసితో, వందరెట్ల శక్తితో.

ఎవరి జీవితంలోనైనా సిసలైన టర్నింగ్ పాయిట్ అదే.

అప్పటినుంచి మాత్రమే, అంతకుముందటి ఏ లాజిక్కులకు చిక్కని ఎన్నో పనులు చేస్తుంటాము. నమ్మశక్యంకాని ఎన్నెన్నో ఫలితాలు చూస్తుంటాము.

అసలు జీవితం అప్పుడే ప్రారంభమవుతుంది... 

No comments:

Post a Comment