Friday, 18 September 2020

ఒక జీవితంలో 2079 రోజులకున్న విలువెంత?

బ్లాగింగ్ అనేది నాకు ఊపిరి లాంటిది అని ఇంతకు ముందు చాలాసార్లు ఇదే బ్లాగ్‌లో రాసుకున్నాను. 

పర్సనల్ బ్లాగ్‌లో ఎక్కువగా వ్యక్తిగతాలుండకుండా ఇంకేముంటాయి? ఈ పోస్టూ అలాంటిదే... 

ఒక చీకటి అధ్యాయానికి ఈ బ్లాగ్‌తో తెర దించేస్తున్నాను. 

అయితే, జీవితంలోని అత్యంత బాధాకరమైన ఇలాంటి చీకటి అధ్యాయం తప్పక రికార్డ్ చేయబడాలి. అది ఎవరికోసమో కాదు. నా కోసం. ఇకమీదటైనా నన్ను నేను ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉంచుకోవడం కోసం. 

కట్ చేస్తే - 

26 ఫిబ్రవరి 2015 నుంచి, ఇవ్వాళ 18 సెప్టెంబర్ 2020 వరకు... మొత్తం 2079 రోజులు... 297 వారాలు - నా జీవితంలో నన్ను నేనే అసహ్యించుకొనే స్థాయిలో నేను సిగ్గుపడాల్సిన  ఒక చీకటి అధ్యాయం. 

జీవితంలో నేనెప్పుడూ ఇంత బాధపడలేదు. ఇంత అవమానపడలేదు. ఇన్ని కష్టాలు ఎదుర్కోలేదు.

కేవలం ఒక్క వ్యక్తి. 

ఆ వ్యక్తి వల్ల జరిగిన అత్యంత ఘోరమైన తప్పిదానికి ఇక్కడ లిస్ట్ చేయలేని అత్యంత దారుణమైన నష్టాలు జరిగాయి. 

ఆ రియలైజేషన్ లేదు.
కనీసమైన నైతిక బాధ్యత లేదు.
అసలు అలాంటి ఫీలింగ్ కూడా లేదు...  

ఈ వ్యక్తితో సహా, నేనెవ్వరికయినా నాకు చేతనైనదానికంటే ఉపకారమే చేశాను తప్ప, ఇప్పటివరకు నా జీవితంలో ఎవ్వరికీ ఎలాంటి హాని చేయలేదు. 

కనీస గౌరవం, కనీసమైన విలువనిచ్చే కమ్యూనికేషన్ కూడా పూర్తిగా మృగ్యమైన తర్వాత, నేనే ఒక మెసేజ్ పెట్టాను: "I am slowly making myself to fade out from your scene so that you can be free of my headache ..." అని. 

నా ఈ వాక్యాన్ని కోట్ చేస్తూ, ఆ వ్యక్తి నాకు పెట్టిన మెసేజ్ ఇది:
"These kind of words will pluck any one forever sir!" అని.

ఇదంతా ఇలాగే జరగాలన్న ఆలోచనో...
తను చేస్తున్న పనుల పట్ల, తను మాట్లాడుతున్న మాటల పట్ల అసలు ఎలాంటి స్పృహ లేనితనమో...
అసలు మతిస్థిమితం లేదో,
ముందు ఉండి ఆ తర్వాతే తప్పిందో,
మరింకేదో... 

నేను నెగెటివ్‌గా ఆలోచించటం లేదు. కాని, పైవాటిల్లో ఏదో ఒకటి కాకుండా, 2079 రోజులు ఒకే రకమైన మాటలు, ఒకే రకమైన పనితీరు, ఒకే రకమైన ఫలితమూ - ఈ ప్రపంచంలో ఎక్కడా ఇప్పటివరకు జరగలేదు. ఇకముందు కూడా జరగదు. 

జస్ట్ కొన్ని నెలల్లోనే, చిన్న పిల్లలు  పాయింటవుట్ చేసిన రియాలిటీని, లాజిక్‌ను... నేనూ, నా వయస్సు, నా అనుభవమూ గుర్తించలేనంత గుడ్డివాన్నిగా మారిపోయాను. 

అది... ఆ వ్యక్తికి నేనిచ్చిన గౌరవం, స్థానం.

ఆ వ్యక్తిమీద నాకున్న నమ్మకం. 

నా నమ్మకాన్ని గెలిపించాలని ఎంతో ప్రయత్నించాను. చివరికి తప్పంతా నాదే అన్నట్టుగా మాట అనిపించుకొని, నా తప్పువల్లనే "ప్లక్ అవుట్" చేయబడ్డాను. 

ఆ వ్యక్తికి జీవితంలో అంతా మంచే జరగాలని కోరుకొంటున్నాను.

నా జీవితంలో ఇది ఇలా జరగాల్సింది. చివరకు జరిగింది. 

ఏదైతేనేం... ఒక చీకటి అధ్యాయం ముగిసింది. కనీసం ఇలాగైనా ముగిసింది. 

కట్ చేస్తే - 

రాన్ మల్‌హోత్రా అనే ఒక ఇండియన్-ఆస్ట్రేలియన్ మెంటార్ ప్రకారం... ఒక మనిషి సగటున ఒక 60 ఏళ్లు బ్రతుకుతాడనుకొంటే... ఆ సమయాన్ని లెక్కేసుకుంటే, అది... జస్ట్ 3128 వారాలు! 

ఈ 3128 వారాల్లో ఇప్పటి మీ వయస్సుని వారాల్లోకి మార్చి తీసివేయండి. తీసివేయగా వచ్చిన ఆ చిన్న అంకె మీరింకా ఎన్ని వారాలపాటు బ్రతుకుతారో చెప్తుంది. 

నాకున్న అంత చిన్న అంకెలో 297 వారాల సమయం అత్యంత దారుణంగా ఎలా నష్టపోయాను? 

ఒకవేళ నేనింక ఒక 4 ఏళ్లే బ్రతుకుతాననుకొంటే, అసలు నాకున్న సమయమెంత?... జస్ట్ 208 వారాలు! 

ఇప్పుడున్న కరోనానో, ఇంకేదో కొత్త వైరస్ వచ్చో, ఇంకేదైనా యాక్సిడెంట్ జరిగో... జస్ట్ ఒక ఏడాదిలోనే జరగరానిది జరిగితే... ఇంక నాకు మిగిలింది కేవలం 52 వారాలేగా?! 

మీకు ఇంకెన్ని బాధ్యతలున్నాయి? ఎంత టైముంది? జస్ట్ వారాల్లో లెక్కేసుకోండి - అంటాడు రాన్ మల్హోత్రా. 

మీ జీవితంలో మిగిలిన ఆ కొన్ని వారాల్లో... ప్రతి రోజుకీ, ప్రతి గంటకూ, ప్రతి నిమిషానికీ, ప్రతి సెకనుకీ ఎంతో విలువుంది. ఆ విలువను ఇప్పటికైనా గుర్తించండి. మీరేం చెయ్యాలో మీకే తెలుస్తుంది - అంటాడు రాన్ మల్హోత్రా. 

అలాంటిది... నేను నా జీవితంలో 297 వారాలు అత్యంత దారుణంగా వృధాచేసుకున్నాను. నాకెంతో ప్రియమైన మనుషుల్నీ, సంబంధాల్నీ, స్నేహాల్నీ, డబ్బునీ ... చాలా హేయమైన పధ్ధతిలో నష్టపోయాను. 

ఇంకొక్కరోజు కూడా నా జీవితంలో జరిగిన ఈ నష్టాన్ని గురించి అసలేమాత్రం చింతించకుండా ఉండటం కోసం, అసలు గుర్తు తెచ్చుకోకుండా ఉండటం కోసం మాత్రమే ఈ రికార్డు... ఈ బ్లాగింగ్. 

ఈ మొత్తం నెగెటివిటీని ఇలా, ఇక్కడితో, ఈ బ్లాగ్ రూపంలో పూర్తిగా వదిలివేస్తున్నాను. 

Strictly no more regrets. 

And now... every day and every minute counts in my life. I'm gonna rock like anything... 

1 comment: