Friday 12 June 2020

ఓటీటీలో నెలకో సినిమా ఎలా సాధ్యం?

థియేటర్స్ ఒక్కటి తప్ప, దాదాపు ఫిల్మ్ ఇండస్ట్రీలో మొత్తం పనులు మళ్లీ ప్రారంభమైనట్టే లెక్క. ఇంకో రెండ్రోజుల్లో ప్రారంభమయ్యే షూటింగ్స్‌తో ఇండస్ట్రీలో "న్యూ నార్మల్" సంపూర్ణమవుతుంది.

థియేటర్స్ తెరవటం ఇప్పట్లో సాధ్యం కాదు.

అయితే సినిమాల రిలీజ్‌కు ఇది ఏమాత్రం ఆటంకం కాదు అని ఓటీటీలో వరుసగా రిలీజవుతున్న సినిమాలు, వాటి బిజినెస్సే చెబుతోంది.

మరోవైపు, లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తెయ్యడానికి ఇంకో 2 నెలలు పట్టొచ్చని వినిపిస్తోంది. పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల గ్రాఫ్‌ను చూసి కొంతమంది "గవర్నమెంట్ మళ్లీ లాక్‌డౌన్ పెడుతుంది" అని కూడా అంటున్నారు.

మళ్లీ పూర్తిగా లాక్‌డౌన్ పెట్టడం అనేది బహుశా ఉట్టుట్టి పుకారే అవుతుంది తప్ప రియాలిటీలో అసాధ్యం.

ఏది ఎలా ఉన్నా... "డెయిలీ బేటా" కు పనిచేసే లక్షలాది కార్మికులు, ఆర్టిస్టులు, టెక్నీషియన్ల కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ పనులు ఒక్కొక్కటిగా ప్రారంభించడానికి ప్రభుత్వాలు అనుమతినివ్వక తప్పలేదు.

ప్రభుత్వాలకు కూడా ఇప్పుడు ఆదాయం చాలా అవసరం. వచ్చే ఏ ఒక్క ఆదాయాన్ని కూడా అవి వదులుకొనే పరిస్థితిలోలేవు.

కట్ చేస్తే -

చిన్న బడ్జెట్ సినిమాలకు ఇప్పుడు నిజంగా ఇదొక గోల్డెన్ అపార్చునిటీ.

ఓటీటీలో రిలీజ్ చేసే సినిమాలకు సెన్సార్ కూడా అవసరం లేదని నిన్న ఒక ఇంటర్వ్యూలో విన్నాను. అదే నిజమైతే ఓటీటీలో రిలీజ్ చేయాలనుకొనే సినిమాలకు ఓ 2 నెలల టైమ్ కలిసొస్తుంది!

తగిన ఆర్థిక వనరులు, స్పీడ్‌గా సినిమా తీయగల ప్యాషన్, సత్తా ఉంటే నిజంగా నెలకో సినిమా తీసి రిలీజ్ చేయవచ్చు. కోట్లు కొల్లగొట్టుకోవచ్చు.

మొన్ననే ఆర్జీవీ Climax రిలీజ్ చేశాడు. కొద్దిరోజుల్లో ఆర్జీవీదే Corona Virus రిలీజ్ అవుతోంది. తర్వాత అతనిదే ఇంకో సినిమా Naked. ఆ తర్వాత, The Man Killed Gandhi...

ఒక్క ఆర్జీవీనే కాదు, ఇదే స్పీడ్‌లో ఇప్పుడు ఇంకెందరో డైరెక్టర్లు కూడా ఇదే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను మాత్రమే దృష్టిలో పెట్టుకొని చాలా సినిమాలు ప్రారంభిస్తారు. రిలీజ్ చేస్తారు.

వచ్చే ఒకటి రెండు నెలల్లోనే RGV World లాగా ఇంకో నాలుగయిదు వీడియో స్ట్రీమింగ్ యాప్స్ మార్కెట్లోకి వచ్చినా ఆశ్చర్యంలేదు. రావాలి కూడా. 

ఇవ్వాళే అమితాబ్ 'గులాబో సితాబో' సినిమా  కూడా ఓటీటీలోనే రిలీజైన వాస్తవాన్ని మనం గమనించాలి.

ఈ టెక్నాలాజికల్ అడ్వాన్స్‌మెంట్ మీద నమ్మకంలేని పాతచింతకాయ పచ్చడి ప్రేమికులను పక్కన పెట్టి... ఒక ముగ్గురో, నలుగురో సినిమా ప్యాషనున్న లైక్‌మైండెడ్ మిత్రులు కలిస్తే చాలు.

Small Films, Big Money!