Monday 8 June 2020

సినిమాలో చాన్స్ దొరకడం అంత ఈజీ కాదు!

సినిమాల్లో అవకాశం కోసం రోజూ వందలాదిమంది ఫిల్మ్ నగర్ చుట్టుపక్కల ఉండే ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటారు.

ఇలా ప్రయత్నించే ప్రతి ఒక్కరూ తమలో ఎంతో టాలెంట్ ఉంది కానీ, ఆ ఒక్క చాన్సే దొరకట్లేదు అనుకొంటుంటారు. వీరిలో చాలామందికి దశాబ్దం గడిచినా ఏ అవకాశమూ దొరక్కపోవచ్చు.

ఈ నిజం సినిమా అవకాశాలకోసం తిరిగినవాళ్లకు మాత్రమే బాగా తెలుస్తుంది.

ఒకే ఒక్క ఎక్సెప్షన్ ఏంటంటే... వాళ్లకున్న కాంటాక్ట్స్‌ను బట్టి కొందరికి వెంటనే ఈ అవకాశం దొరకొచ్చు. కాని, ఇలాంటి అవకాశాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అది వేరే విషయం.

కట్ చేస్తే -

నాకు తెలిసిన ఒక డైరెక్టర్ ఈ మధ్య తనకు తెలిసిన ఒక కొత్త లిరిక్ రైటర్‌కు పిలిచి అవకాశమిచ్చాడు. అలాగే ఒక కొత్త కథా రచయితకు కూడా.

వాళ్లిద్దరికీ ఫిల్మ్‌నగర్‌లో అవకాశాలకోసం ఏళ్లకి ఏళ్లు తిరిగిన అనుభవం బాగా ఉంది.

వారిద్దరి మీద అభిమానంతో పిలిచి అవకాశం ఇచ్చిన ఈ డైరెక్టర్ నిజంగా అంతకుముందు సినిమాలు తీసినవాడే, రిలీజ్ చేసినవాడే. ఏదో బ్లఫ్ మాస్టర్ కాదు.

అయితే ఆ డైరెక్టర్ వారికిచ్చిన రైటింగ్ అసైన్‌మెంట్‌ను వాళ్లిద్దరూ చాలా ఈజీగా తీసుకొన్నారు. 'ఈ కరోనా ఎప్పుడు పోవాలి, ఆయనెప్పుడు సినిమా తీయాలి' అనుకొన్నారేమో!?

"మనం అభిమానంతో పిలిచి అవకాశం ఇస్తాం. దాన్ని మన బలహీనత అనుకొంటేనే కష్టం!" అన్నాడు నా డైరెక్టర్ మిత్రుడు.

అతను అన్నదాంట్లో నాకు తప్పేం కనిపించలేదు.

"ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కొన్ని బేసిక్స్ తప్పక పాటించాలి" అని సీనియర్స్ పదే పదే చెప్తుంటే విననప్పుడు ఇలాగే ఉంటుంది మరి...