Friday 10 April 2020

ఏంటా రెండు తప్పులు?

సినిమాఫీల్డులో మీకు అవకాశం దొరికి, దాన్ని మీరు సద్వినియోగం చేసుకొని, నిలదొక్కుకొని, కాస్త ఊపిరిపీల్చుకొనేదాకా... మీరు ఆర్టిస్టు అయినా, టెక్నీషియన్ అయినా మీకు డబ్బులు రావు.

కొద్దిమంది ఎంతో కొంత ఇస్తారు. ఆ కొంత అసలు లెక్కలోకిరాదు.

90 శాతం పైగా కొత్తవారి విషయంలో ఇది నిజం.

ఎందుకివ్వరు నేది అదో పెద్ద కథ. దానిగురించి తర్వాత మాట్లాడుకుందాం.

కొత్తగా పరిచయంచేసే హీరోయిన్స్, ఇతర సపోర్టింగ్ ఫిమేల్ ఆర్టిస్టులకు మాత్రం పారితోషికం ఉంటుంది.

మన హీరోయిన్స్‌లో దాదాపు అందరూ ముంబై నుంచే వస్తారు. అక్కడ సెలెక్టు అవగానే, కొంత అడ్వాన్స్ ఇచ్చి, అగ్రిమెంట్ వేయకుండా ఏ హీరోయిన్ కూడా ముంబైలో ఫ్లైట్ ఎక్కి ఇక్కడికి షూటింగ్‌కి రాదు.

సో, హీరోయిన్స్‌కు పేమెంట్ ఉంటుంది... వారు కొత్తవారైనా కూడా.

ఫిమేల్ సపోర్టింగ్ ఆర్టిస్టులకు కూడా కొత్త పాతతో సంబంధం లేకుండా పారితోషికం ఉంటుంది. వాళ్లకు పేమెంట్ విషయంలో ఎలాంటి సమస్య ఉండదు. చెప్పిన రెమ్యూనరేషన్ ఇచ్చేస్తారు.

ఎటొచ్చీ... హీరో నుంచి, చిన్న సపోర్టింగ్ క్యారెక్టర్ వరకు, కొత్తవారైన అబ్బాయిలకు  మాత్రం చాలా అరుదుగా పేమెంట్ ఉంటుంది. కొన్ని ప్రొడక్షన్ కంపెనీలు మాత్రం మనీ పే చేస్తాయి. కాని, అలాంటి ప్రొడక్షన్ కంపెనీల సంఖ్య చాలా తక్కువ.

ఈ నేపథ్యంలో - కొత్తవారికి అవకాశం ఎప్పుడు రావాలి? అది ఎప్పుడు క్లిక్ అవ్వాలి?

అలా ఒక క్యారెక్టర్ క్లిక్ అయ్యాక, ఆ గుర్తింపుతో మళ్లీ ఇంకో సినిమాలో అవకాశం వచ్చినపుడు మాత్రమే కాస్త పనికొచ్చే రెమ్యూనరేషన్ వస్తుంది.

ఒక కొత్త ఆర్టిస్టు ఈ దశకు రావడానికి 6 నెలలు పట్టొచ్చు... సంవత్సరం పట్టొచ్చు. ఇంకెంతకాలమయినా పట్టొచ్చు. ఇది ఆయా కొత్త ఆర్టిస్టుల టాలెంట్ కన్నా కూడా, ఇండస్ట్రీలో వారికుండే పరిచయాలు, పరిచయాలు చేసుకొని చొరవగా ముందుకు దూసుకెళ్లడం వంటివాటిమీద ఆధారపడి ఉంటుంది.

ఇదంతా ఒక పెద్ద జర్నీ...

ఈ జర్నీ సాగినంతకాలం సిటీలో ఉండటానికి, ఫుడ్డుకు, తిరగడానికి డబ్బులు ఎక్కన్నించివస్తాయి?

ఈ వైపు ఎలాంటి ఇబ్బంది లేనప్పుడే, ఆవైపు అవకాశాలకోసం తిరగడానికి ఫ్రీడం ఉంటుంది.

సో, సినిమాల్లో మీకు డబ్బు వచ్చేదాకా, మీకు తప్పనిసరిగా ఏదున్నా లేకపోయినా, మీరేం చేసినా చేయకపోయినా వచ్చే ఒక ఆదాయం అవసరం. ఇది ఎలా ఏర్పాటు చేసుకుంటారన్నది మీ ఇష్టం.

జాబ్ కావొచ్చు, ఇంటినుంచి రావొచ్చు. ఒక ఫ్రెండ్ ఎవరైనా సహాయం చేస్తుండవచ్చు... వాటెవర్... ఇది మాత్రం ఖచ్చితంగా అవసరం.

ఈ ఏర్పాటు లేకుండా ఇండస్ట్రీకి రావడం అనేది మొదటి తప్పు.

అన్నీ ఉంటేనే అవకాశాలు దొరకడం కష్టం. ఇక తిండీతిప్పలుకు ఇబ్బందిపడుతూ అవకాశాలెలా వెతుక్కుంటారు?

దురదృష్టవశాత్తూ... ఇండస్ట్రీకి వచ్చేవారిలో 90 శాతం మంది ఈ తప్పు చేస్తారు.

కట్ చేస్తే -     

ఆర్టిస్టుగా అయినా, టెక్నీషియన్‌గా అయినా ఇండస్ట్రీలో అవకాశంకోసం వచ్చేవారిలో... 10th ఫెయిల్ నుంచి, ఉన్న ఉద్యోగాలను వదులుకొని వచ్చేవాళ్లదాకా ఉంటారు.

సరే ఏ వయస్సులో అయినా ఎంటర్ అవొచ్చు. తప్పేం లేదు...

కానీ, ఒక 'టైమ్ లిమిట్' అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు... చివరికి అయిదేళ్ళు కూడా కావొచ్చు.

కానీ, ఆ డెడ్‌లైన్ అనేది తప్పనిసరిగా పెట్టుకోవాలి.

ఆ డెడ్‌లైన్‌లోపు అవకాశం సంపాదించుకొని, నిలదొక్కుకొని, ఓకే అనుకుంటే ఉండాలి. లేదంటే... తర్వాత బ్యాక్ టూ పెవిలియన్ వెళ్ళాక ఏం చేయాలన్నది కూడా ముందే డిసైడ్ చేసుకొని ఉండాలి.

బ్యాడ్‌లక్ ఏంటంటే... ఇండస్ట్రీకి వచ్చేవారిలో 90 శాతం మంది ఈ తప్పుకూడా చేస్తారు.

ఇది రెండో తప్పు...

అన్నీ కలిసొచ్చి, లేదా కలిసొచ్చేలా చేసుకొని... ఇండస్ట్రీలో అవకాశం అందిపుచ్చుకొని, తర్వాత నిలదొక్కుకొని... అంతా బాగుంటే ఎలాంటి సమస్య ఉండదు. అలా జరగనప్పుడు మాత్రమే జీవితం అల్లకల్లోలం అవుతుంది.

ఇది ఎవరికయినా అనుభవం మీద మాత్రమే తెలుస్తుంది.

ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్లు, హీరోలు, ఇతర ఆర్టిస్టులు ఎవరైనా కొత్తగా అవకాశం కోసం వచ్చినప్పుడు చెప్పే మొదటిమాట జనరల్‌గా ఇలా ఉంటుంది: "ఎందుకు బాబూ...హాయిగా చదువుకొని... ఉద్యోగం చేసుకోక!" ... అని.

ఆ కష్టాలన్నీ వాళ్లకు తెలుసు కాబట్టి ఇలా చెప్తారు. అంతే తప్ప, అవకాశం ఇవ్వద్దనో, రావద్దనో కాదు.

ఇది ఎవ్వరూ అర్థం చేసుకోరు. అర్థమయ్యేలా తెలిసేటప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

సో, పైన చెప్పిన రెండు అంశాల విషయంలో కరెక్ట్ ప్లానింగ్‌తో వస్తే... మీకు టెన్షన్స్ ఉండవు. మీ మొత్తం ఫోకస్ 'చాన్స్' మీదే ఉంటుంది. ప్రయత్నాలు బాగా చేస్తారు. అవకాశాలు కూడా మీకు ఈజీగా దొరుకుతాయి.

ఆ దొరికిన అవకాశాన్ని మరిన్ని చాన్స్‌లు రావడానికి బాగా ఉపయోగించుకొన్నామా లేదా? తర్వాతేంటి...

అదంతా తర్వాత...