Friday 6 March 2020

పబ్లిక్ అయిపోయిన పర్సనల్ డైరీ!

ఒకప్పుడు అందరికీ పర్సనల్‌గా డైరీలు రాసుకొనే అలవాటుండేది.

వాటిని ఎవరైనా పొరపాటున ఓపెన్ చేస్తే ఏదో అయిపోయినట్టు రోజులకి రోజులు విలవిల్లాడిపోయేవాళ్లం.

సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడా సున్నితత్వం, ఆ ఫీలింగ్స్ మనలో తుడిచిపెట్టుకుపోయాయి.

పర్సనల్ అంటూ ఇప్పుడేమీ లేదు. అంతా పబ్లిక్కయిపోయింది. మొత్తం ఆన్‌లైన్లో పెట్టేస్తున్నారు.

తాము సోషల్‌మీడియాలో పెట్టినవి అందరూ చదవకపోతేనే ఇప్పుడు బాధపడిపోతున్నారు జనాలు! 

పుట్టినరోజులు, పెళ్లిరోజులు, జీవనసహచరితో/సహచరునితో క్లోజ్ ఫోటోలు, వారిమధ్య గొడవలు, సరసాలు, లవర్స్, వారి లాంగ్‌డ్రైవ్‌ల వివరాలు, విరహాలు, ఆఖరికి తల్లి మరణిస్తే స్మశానంలో ఖననం చేస్తున్న సమయంలో ఫోటోలు... ఇంతకుమించిన ఉదాహరణలు ఇంకేం కావాలి?

దారుణం ఏంటంటే, ఆమధ్య ఒకతను ఆత్మహత్య చేసుకొంటూ ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్తడం!

మనం ఎంత వద్దనుకున్నా, మనం రాస్తున్నప్పుడు అప్పటి మన మానసిక, వ్యక్తిగత, సాంఘిక స్థితి... ఏదోరకంగా... ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన రాతల్లో కనిపిస్తుంది.

ఎంతో కంట్రోల్ ఉంటే తప్ప దాన్ని అణచలేం.

కొన్ని పరిమితులకు లోబడి, అసలు అలా అణచాల్సిన అవసరం లేదు.

మనిషికి ఒక "ఔట్‌లెట్" కావాలి. అది ఏరూపంలో అయినాకావచ్చు. బాధో, సంతోషమో అలా బయటకెళ్లిపోవాలి. లేదంటే బ్రతకలేడు.

ఇప్పటి జీవనశైలిలో అంత వత్తిడి ఉంది.

ఇది చాలదన్నట్టు - ఇప్పుడు ఫేస్‌బుక్‌లోనే వాట్సాప్ బటన్‌ను కూడా తగిలించేస్తున్నాడు జకెర్‌బర్గ్!

ఇంక జనాల చేతుల్లో మొబైల్స్ అసలు ఖాళీగా ఉంటాయా?

కొసమెరుపు ఏంటంటే, ఇన్నిరకాలుగా జనాలను ఫేస్‌బుక్‌కు ఎడిక్ట్ చేస్తున్న మార్క్ జకెర్‌బర్గ్ చేతిలో అసలెప్పుడూ మొబైల్ ఉండదు!

దటీజ్ బిజినెస్... 

No comments:

Post a Comment