Tuesday 4 February 2020

ఒక థెరపీ. ఒక యోగా. ఒక ఆనందం.

'బ్లాగింగ్' అనేది ఒక ఎడిక్షన్‌లా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడూ.

అలాగని దీనికోసం నేనెప్పుడూ గంటలు గంటలు నా సమయాన్ని వృధా చేయలేదు.

రాయాలనుకున్నది రాస్తాను. లేదంటే... బ్లాగ్ ఓపెన్ చేశాకనే, "ఏం రాయాలా" అనుకుంటూనే మొదలెట్టి, రాయడం ముగించేస్తాను నిమిషాల్లో.

ఇదిగో, ఇప్పుడలాగే మొదలెట్టాను...

నా బ్లాగింగ్ ఒక ఫ్లో.

ఈ ఫ్లోలో ఏ హిపోక్రసీ, ఏ ఇన్‌హిబిషన్స్ ఉండవు. నేను రాయాలనుకున్నది రాస్తాను. నచ్చినవాళ్లు చదువుతారు. నచ్చనివాళ్లు ఒకే ఒక్క క్లిక్‌తో ఇంకో బ్లాగ్‌లోకో, సైట్ లోకో వెళ్లిపోతారు. అంతే.

ఏదో రాసి ఎవర్నో ఉధ్ధరించాలన్నది కాదు ఇక్కడ విషయం. నన్ను నేను ఉధ్ధరించుకోవడం కోసం మాత్రం నాకు ఈ బ్లాగ్ నిజంగా తప్పనిసరి.

రాయడం అనేది నాకు సంబంధించినంతవరకు... ఒక థెరపీ. ఒక యోగా. ఒక ఆనందం. ఒక స్పిరిచువల్ ఎక్సర్‌సైజ్. ఒక పిచ్చి.

ఇదంతా చాలావరకు నా వ్యక్తిగతం.

అంతకుముందు రాజకీయాలు, అవీ ఇవీ ఈ బ్లాగ్‌లోనే రాశాను. ఇప్పుడు మాత్రం వాటిని కేవలం నా ట్విట్టర్‌కు పరిమితం చేశాను. 

దాన్నలా పక్కన పెడితే - వైజాగ్ కేంద్రంగా, త్వరలో నేను ప్రారంభించబోతున్న నా కొత్త సినిమా నేపథ్యంలో మాత్రం ప్రొఫెషనల్‌గా ఇప్పుడు ఈ బ్లాగ్ అవసరం నాకు చాలా ఉంది.

కాని... సినిమాలు సినిమాలే, బ్లాగింగ్ బ్లాగింగే.

నామట్టుకు నాకు, బ్లాగింగ్ ఒక మినీ లేబొరేటరీ. ఒక థెరపీ. ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్. ఒక యోగా. ఒక ధ్యానం. ఒక అంతశ్శోధన. ఒక అంతర్మథనం. ఒక అద్దం.

ఈ అద్దంలో నన్ను నేను చూసుకుంటున్నాను. నాలో ఉన్న నన్ను ని విశ్లేషించుకుంటున్నాను.