Friday 21 February 2020

మనం బ్రతికేది ఎన్నిరోజులో ఒకసారి లెక్కేసుకుందామా?

మన పెద్దలు చాలా తెలివయినవాళ్లు. ఒకవైపు "నిదానమే ప్రదానం" అన్నారు. మరోవైపు, "ఆలస్యమ్ అమృతమ్ విషమ్" అని కూడా అన్నారు!

అవసరాన్నిబట్టి, సందర్భాన్నిబట్టి... ఈ రెంటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. ఆ నిర్ణయం మాత్రం మనదే.

ఆ నిర్ణయాన్ని కూడా తీసుకోవాల్సిన సమయంలో తీసుకొన్నవాడే విజేత. అది ఏ విషయంలోనయినా కావొచ్చు. సరైన నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకోవడం అనేది మాత్రం చాలా ముఖ్యం.

ఇందాకే చదివిన ఇంకో పాయింటు నన్ను అమితంగా కలచివేస్తోంది...

సగటున ఒక మనిషి జీవించేది 24,869 రోజులట!

అంటే సుమారు 68 ఏళ్లన్నమాట! తక్కువేం కాదు...

ఈ లెక్కన నేను బ్రతకడానికి ఇంకా చాలా వేల రోజులున్నాయి.

కాని, ఏంటి గ్యారంటీ?

ఏ ట్రాఫిక్ లేని సమయంలోనో రోడ్డు దాటుతోంటే, ఏ "పల్సర్"వాడో ఎక్కడ్నుంచో వచ్చి గుద్దేసి చంపేయొచ్చు. ఏ క్యాన్సరో ఎటాక్ అయి ఠపీమని పోవచ్చు. మనం ఎక్కిన ఏ బెంగుళూరు బస్సో తగలబడిపోవచ్చు.

గ్యారెంటీ ఏదీ లేదు.

దేనికీ లేదు.

అలాగని, ఇది నా నెగెటివ్ థింకింగ్ కాదు.

రియాలిటీ.

అయినా సరే... ఆ అంకెలు, ఆ లెక్కలే కళ్లముందు కనిపిస్తున్నాయి నాకు.

ఈ ఊహించని ప్రమాదాలు, రిస్కుల మధ్య ఇంకో పదేళ్లు బ్రతుకుతాము అనుకొంటే... అది జస్ట్ ఇంకో 3650 రోజులే!

లేదు, "అయిదేళ్లకంటే కష్టం" అనుకొంటే... అది జస్ట్ ఇంకో 1825 రోజులే!!

అంటే... ఇంక కౌంట్‌డౌన్ స్టార్ట్ అయినట్టేగా?!

మనం ఏదో అనుకుంటాం. ఏదో భ్రమలో బ్రతుకుతూ ఉంటాం. "ఇంకా టైమ్ చాలా ఉంది" అనుకుంటాం.

ఏదైనా కష్టం వస్తే భగవంతునిమీద భారం వేస్తాం. సుఖాల్లో ఉన్నప్పుడు అసలావైపే చూడం.

కాని... చూస్తుండగానే సంవత్సరాలు, దశాబ్దాలు ఇట్టే గడిచిపోతుంటాయి.

అసలు ఈ కోణంలో ఆలోచించడమే కష్టం...

అయితే ఇది భయం మాత్రం కాదు.

ఒకవేళ భయం అనుకున్నా, ఆ భయం నా చావు గురించి కాదు. చచ్చేలోపు నేను పూర్తి చేయాల్సిన బాధ్యతలను, పనులను ఎక్కడ అసంపూర్ణంగా వదిలిపెడతానో అన్న ఆందోళన.

ఒకవేళ దీన్ని భయం అనుకుంటే, ఈ భయం ఎవరికైనా సరే చాలా అవసరం.

నా విషయంలో అయితే... నిజంగా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి...

నా జీవితంలో మొట్టమొదటిసారిగా, పూర్తిచేయాల్సిన నా బాధ్యతల గురించి ఇప్పుడు నేను బాగా ఆలోచిస్తున్నాను.

ఈ విషయంలో ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకోడానికి ఇంతకంటే గొప్ప అవకాశం ఇంకెప్పుడొస్తుంది నాకు?

ఇప్పుడు కూడా నేను తొందరపడకపోతే, నిజంగా ఆలస్యమ్ అమృతమ్ విషమే!