Saturday 15 February 2020

నేను బాగా ఇష్టపడే అందం

ఓ ఆరునెలల క్రితం అనుకుంటాను, ఈ బ్లాగ్‌లోనే, ఇదే టాపిక్ మీద ఒక పోస్ట్ రాశాను...

వైజాగ్, సముద్రం...

అవి నన్ను ఇంకా హాంట్ చేస్తున్నాయి. అందుకే మళ్లీ రాయాలనిపించింది. రాస్తున్నాను.

ఈ మధ్య నా ప్రొఫెషనల్ పనులమీద వైజాగ్ ఎక్కువసార్లు వెళ్తున్నాను.

వైజాగ్ నాకు చాలా బాగా, ప్రశాంతంగా, అందంగా కనిపిస్తోంది. ఏవిటా అందం అంటే తడుముకోకుండా కనీసం ఒక డజన్ అంశాల్ని చెప్పగలను.

వాటిల్లో నేను బాగా ఇష్టపడే అందం - సముద్రం.

సముద్రం మీద వ్యామోహంతో ఇంతకుముందు నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు .. ఎక్కువగా గోవా, పాండిచ్చేరిలకు వెళ్లేవాణ్ణి. ఈ రెండూ నాకు ఇప్పటికీ చాలా ఇష్టమైన ప్రదేశాలు. దేని ప్రత్యేకత దానిదే.

అయితే .. గోవా, పాండిచ్చేరిల కంటే ఇప్పుడు వైజాగే నాకు మరింత బాగా అనిపిస్తోంది.

బీచ్ రోడ్దు నుంచి భీమిలీ దాకా .. అలా సముద్రాన్ని చూసుకొంటూ కార్లో వెళ్తూ, నచ్చినచోట దిగి కాసేపు ఆగుతూ, రోజులకి రోజులే గడిపేయొచ్చు.

నాకెప్పుడు అవకాశం దొరికినా నేనిదే పని చేస్తాను.

ఈపని చేయడం కోసం, నా పనుల్లో ఎంతవరకు వీలైతే అంతవరకు ఇక్కడే వైజాగ్‌లో చేసుకోగలిగే అవకాశాల్ని సృష్టించుకొంటాను. ఈ బ్లాగ్ రాయడానికి కొన్ని నిమిషాల ముందువరకూ కూడా నేను చేసిందదే.

ఒక వారం రోజుల ఘోస్ట్ రైటింగ్ వర్క్ వుంది. ఈసారి ఆ పనిని వైజాగ్‌లో పూర్తిచేయడానికి ప్లాన్ చేస్తున్నాను.

తర్వాత నా సినిమాకోసం కూడా స్క్రిప్ట్ రైటింగ్ పూర్తిచేయాల్సివుంది. ఈ పని కూడా వైజాగ్‌లోనే ప్లాన్ చేస్తున్నాను.

సముద్రం అంటే నాకంత ఇష్టం.

సముద్రాన్ని నేనంతగా ప్రేమిస్తాను.

సముద్రం ఉన్నందుకు వైజాగ్‌ని మరింతగా ప్రేమిస్తాను.

అంతా ఒక స్పిరిచువల్ కనెక్షన్...