Saturday 4 January 2020

"క్రౌడ్ ఫండింగ్" అంటే మీకు తెలుసా? - CF1

అమెరికాతో పాటు, కొన్ని ఇతర అభివృధ్ధిచెందిన దేశాల్లో  ఈమధ్య బాగా ప్రాచుర్యం పొందిన పదం - క్రౌడ్ ఫండింగ్.

ఎవరైనా ఏదయినా ప్రాజెక్ట్ ప్రారంభించడానికో, లేదంటే - ఆల్రెడీ ప్రారంభించిన ఒక ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికో అవసరమయిన డబ్బు లేనప్పుడు, చిన్నచిన్న మొత్తాల్లో ఎక్కువమంది నుంచి ఆ డబ్బు సేకరించడమే క్రౌడ్ ఫండింగ్.

ఉదాహరణకు,  సినిమా విషయమేతీసుకుందాం.

ఒక ఇండిపెండెంట్ సినిమా తీయడానికి ఓ కోటిరూపాయలు కావాలనుకుంటే - ఆ మొత్తాన్ని ఒక 100 మంది దగ్గర తలా ఒక లక్షరూపాయల చొప్పున సేకరించడం సులభం.

అలా కాకుండా - ఒక 10 మంది ఒక లక్ష చొప్పున, మరొక నలుగురు 2 లక్షల చొప్పున. ఇంకో నలుగురు 5 లక్షల చొప్పున, ఒక ఇద్దరు 10 లక్షల చొప్పున... ఇలా వివిధ డినామినేషన్లలో కూడా మొత్తం కోటి రూపాయలు సమకూరేవరకు సేకరించవచ్చు. 

సింపుల్‌గా చెప్పాలంటే - ఒక కోటి రూపాయల పెట్టుబడి కోసం ముగ్గురో, నలుగురో కలిస్తే అది "పార్ట్‌నర్‌షిప్" అవుతుంది. అదే కోటి రూపాయల కోసం ఒక 50 మందో, 100 మందో, అంతకంటే ఎక్కువ మందో కలిసిస్తే అది "క్రౌడ్ ఫండింగ్" అవుతుంది.   

అంతర్జాతీయంగా ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందిన ఈ ఫండ్ రైజింగ్ ప్రాసెస్ ని అమలు చేయటం కోసం కిక్ స్టార్టర్, ఇండీగోగో వంటి ఎన్నోవెబ్ సైట్లున్నాయి. వాటి కమిషన్, ఇతర సర్విస్ చార్జీలు, టాక్స్ వగైరా  అవి తీసుకుంటాయి.

ఒకసారి ఆ సైట్స్‌కు వెళితే ఎవరికయినా  విషయం పూర్తిగా అర్థమైపోతుంది.

CUT TO -

ఒకప్పుడు 'ఇండీ సినిమా' (ఇండిపెండెంట్ సినిమా) అంటే ఒక యజ్ఞంలా జరిగేది. డబ్బే ప్రధాన సమస్య కాబట్టి, సినిమా పూర్తిచేయడానికి సంవత్సరాలు కూడా పట్టేది. 

గెరిల్లా ఫిలిం మేకింగ్, రెనగేడ్ ఫిలిం మేకింగ్, నో బడ్జెట్ ఫిలిం మేకింగ్ లాంటి ధోరణులన్నింటికీ నేపథ్యం ఇదే. సరిపోయేంత డబ్బు లేకుండానే సినిమా పూర్తిచేయడం!

అయితే ఇప్పుడా సమస్య లేదు. రెండు కారణాలవల్ల:

ఒకటి - ఫిలిం మేకింగ్‌లో ఆధునికంగా వచ్చిన సాంకేతిక అభివృధ్ధి. రెండవది - క్రౌడ్ ఫండింగ్. 

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చాలా ఇండీ సినిమాలు ఈ క్రౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్స్ ద్వారా, లేదా ఆ వెబ్‌సైట్స్‌కి బయట, ప్రత్యేకంగా ఇలాంటి పధ్ధతినే పాటించటం ద్వారా కూడా అనుకున్నంత బడ్జెట్‌ను సులభంగా సేకరించుకోగలుగుతున్నాయి.

ఇదే పధ్ధతిని రెగ్యులర్ కమర్షియల్ సినిమాల నిర్మాణం కోసం కూడా ఈజీగా అనుసరించవచ్చు అని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను.

2013 లో వచ్చిన "లూసియా" అనే కన్నడ సినిమా, ఈ క్రౌడ్ ఫండింగ్ పధ్ధతిలో తయారైన తొలి కన్నడ సినిమా.  50 లక్షల మొత్తం బడ్జెట్‌ను క్రౌడ్ ఫండింగ్ పధ్ధతిలోనే సేకరించి నిర్మించిన ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఒక్కటే 95 లక్షలు సంపాదించిపెట్టింది. లూసియా మొత్తం కలెక్షన్లు 3 కోట్లు.     

ఆ తర్వాత నాకు తెలిసి, కనీసం ఇంకో అరడజన్ కన్నడ సినిమాలు ఇదే పధ్ధతిలో నిర్మించారు. 

హిందీలో కూడా ఈ పధ్ధతిలో చాలా సినిమాల నిర్మాణం జరిగింది.

తెలుగులో ఏం జరిగిందన్నది తర్వాతి బ్లాగ్‌పోస్టులో చెప్తాను.   
 
సినిమా నిర్మాణం పట్ల, సినిమా బిజినెస్ పట్ల అత్యంత ఆసక్తి ఉండీ, ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడాన్ని రిస్కుగా భావించి, తమ కోరికని అలా తొక్కిపెట్టి ఉంచేవారికి క్రౌడ్ ఫండింగ్ పధ్ధతి ఒక మంచి అవకాశం.

ఎందుకంటే - వారి ఊహకి అందని విధంగా, ఎంత చిన్న పెట్టుబడితోనయినా వారు ఫీల్డులోకి ప్రవేశించవచ్చు!
^^^

మీలో /మీకు తెలిసిన వారిలో , అతి తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో  సినీ ఫీల్డులోకి  ఎంటర్ అవ్వాలన్న ఆసక్తి ఉన్న మైక్రో ఇన్వెస్టర్లు ఎవరైనా ఉన్నట్లయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం నేరుగా నన్ను సంప్రదించాల్సిన ఈమెయిల్ ఇది: mchimmani@gmail.com