Tuesday 2 April 2019

మన అంతరంగంతో మనం

వ్యక్తిగతంగా, నా దృష్టిలో ఏకాంతాన్ని మించిన సహచరి లేదు!

అలాగని నన్ను తప్పుగా అనుకోకండి.

నాకత్యంత ప్రియమైన నా ఫ్రెండ్స్ తో గడపడం నాకెంతో ఇష్టం. నా పిల్లలతో కలిసి ఆటలాడ్డం, వాళ్ల వయస్సుకి దిగిపోయి పోట్లాడ్డం నాకిష్టం.

ఫ్రెంచి ఆర్టిస్టులతో కలిసి పాండిచ్చేరి బీచుల్లో గంటలకొద్దీ నడుస్తూ స్పిరిచ్యువాలిటీ గురించి మాట్లాడ్డం నాకిష్టం. ఇలాంటి ఇష్టాలు కనీసం వంద ఉన్నాయి నాకు.

కానీ.. వీటన్నింటిని మించి నాకత్యంత ఇష్టమైంది నా ఏకాంతం. అందుకే అన్నాను, ఏకాంతాన్ని మించిన సహచరి లేదు నాకు అని. 

ఏకాంతాన్ని సృష్టించుకోడానికి ఎవరూ అన్నీ వొదులుకొని మునిపుంగవులు కానక్కర లేదు. ఇరవై నాలుగ్గంటల్లో ఇరవై గంటలూ ఈ ఏకాంతం కోసమే కెటాయించనక్కర్లేదు.

కేవలం ఒక్క అరగంట! వీలయితే ఇంకో పది నిమిషాలు ... 

మనతో మనం, మన అంతరంగంతో మనం, మన ఆలోచనలతో మనం, మన ఆత్మతో మనం, మన మనసుతో మనం ... ప్రశాంతంగా రోజుకి కనీసం ఒక్క అరగంట కెటయించుకోగలిగితే చాలు. ఆ ఆనందం వేరు. ఆ ఎనర్జీ వేరు.

ఏకాంతంలో ఉన్నప్పుడే మనల్ని మనం పలకరించుకోగలుగుతాం.సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. అందాన్ని ఆనందించగలుగుతాం.

ప్రపంచంలో ఏఅత్యుత్తమ కళ అయినా పుట్టేది ఇలాంటి ఏకాంతంలోంచేనంటే అతిశయోక్తి కాదు. ఏకాంతంలోనే ఏ సృజనాత్మకత అయినా వెల్లివిరిసేది.

సముద్రాన్ని చూస్తూ కూర్చున్నప్పుడు, బాల్కనీలో నిల్చుని బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తున్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు, పుస్తకం చదువుతున్నప్పుడు, ఏకాగ్రతతో ఏదయినా రాస్తున్నప్పుడు.. మనం అనుభవించేది ఏకాంతమే.

ఏ కళాకారుడయినా తనలోని క్రియేటివిటీని ఆవిష్కరించేది ముందు ఏకాంతంలోనే. అది ఆర్ట్ కావచ్చు. సైన్స్ కావచ్చు. కొత్త ఆలోచన ఏదైనా సరే ఏకాంతం నుంచే పుడుతుంది. అదొక రూపం సంతరించుకొని భౌతిక ప్రపంచానికి పరిచయమయ్యేది ఆ తర్వాతే!

ఏకాంతం లేకుండా ఏ సృజనాత్మకత  లేదు. ఏ కళ లేదు. దాన్ని మనం విస్మరిస్తున్నాం. నిజానికి, ఈ ఆధునిక జీవితంలో ఏకాంతాన్ని విస్మరించి మనం సాధిస్తున్నది కూడా ఏదీ లేదు. కోల్పోతున్నదే ఎక్కువ.

అంతేకాదు ...

మన నిత్యజీవితంలోని కొన్ని సమస్యలకు మామూలు పరిస్థితుల్లో దొరకని పరిష్కారం కూడా మనకు ఏకాంతంలోనే దొరుకుతుంది.

ఒక్కసారి ఆలోచించండి. మీకే తెలుస్తుంది. కానీ, అలా ఆలోచించాలన్నా మీకు ఏకాంతం కావాలి!

కట్ టూ సమ్ యాక్షన్ - 

ఓ పని చేయొచ్చు ...

మీ ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులన్నిటినీ 'ఆఫ్' చేసేసి, మీ ఇంట్లోనే మీకిష్టమయిన గదిలోనో, మీకిష్టమయిన ఏదో ఒక మూలనో కేవలం ఒక్క అరగంట ఒంటరిగా కూర్చుని చూడండి.

లేదంటే ఏ తెల్లవారుజామునో, సాయంత్రమో.. మొబైల్ జేబులో పెట్టుకోకుండా, ట్రాఫిక్ లేని చోట ఒక అరగంట మీరొక్కరే వాకింగ్ కు వెళ్లండి.

ఏకాంతం ఎంత అందంగా, ఆనందంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఆ తర్వాత మీరేం కోల్పోతున్నారో తెలుస్తుంది. అందుకోసం, ఇకనుంచయినా మీరేం చేయాలో మీకు తెలుస్తుంది.

అన్నట్టు ... ఈ బ్లాగ్ పోస్టు పుట్టింది కూడా 'ఏకాంతం' లోంచే!

1 comment: