Sunday 24 February 2019

వొక పుల్వామా తర్వాత ...

మహాత్మా గాంధీ, మహమ్మద్ అలీ జిన్నా వారి ఈగోలు పక్కనపెట్టి కాసేపు మాట్లాడుకొంటే అసలు దేశ విభజన జరిగేదే కాదు. 

పాకిస్తాన్ అనేది ప్రత్యేకంగా ఈ ప్రపంచపటంలో ఉండేది కాదు. కాశ్మీర్ సమస్య అసలు ఉత్పన్నమయ్యేదే కాదు.

ఒక హైద్రాబాద్‌లాగా, కాశ్మీర్ రాజ్యం కూడా భారత్‌లో భాగమయిపోయేది. ఆ భూతలస్వర్గం మరింతగా భాసించేది.

ఒక లాల్ బహదూర్ శాస్త్రిలాగానో, ఒక ఇందిరా గాంధీలాగానో మన దేశపు తొలి ప్రధాని నెహ్రూ కూడా కేవలం దేశంకోసమే నిర్ణయాలు తీసుకొని ఉంటే, ఒక రావణకాష్టంలా కాశ్మీర్ సమస్య ఈరోజుకి కూడా ఇలా రగులుతుండేది కాదు. 

కేవలం తన వ్యక్తిగత ప్రపంచ ఖ్యాతి వ్యామోహం కోసం, వాస్తవ పరిస్థితుల్లో ఏ మాత్రం సాధ్యం కాని తన "పంచశీల" అనే పనికిరాని ఐదు సూత్రాలతో, ఐక్యరాజ్యసమితిలో గొప్పలకోసం, అప్పటి ప్రధాని జవర్‌లాల్ నెహ్రూ తీసుకొన్న అనేక తప్పుడు నిర్ణయాల ఫలితమే ఇప్పటి కల్లోల కాశ్మీర్.

1 జనవరి 1948 నాడు, మనకు చేతకాదు అన్నట్టుగా ఐక్యరాజ్యసమితికి పెత్తనం ఇస్తూ ఎప్పుడైతే కాశ్మీర్ వివాదాన్ని నెహ్రూ ఐక్యరాజ్యసమితి ముందు పెట్టాడో, ఆ రోజునుంచీ, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదమూకలతో భూతలస్వర్గం కాశ్మీర్ ఈనాటికీ రగులుతూనే ఉంది.

1947 నుంచి, మొన్నటి ఫిబ్రవరి 14 పుల్వామా టెర్రరిస్ట్ ఎటాక్ దాకా, ఈ రావణకాష్టం ఇట్లా రగులుతూ ఉండటానికి మూలకారణం నెహ్రూనే అని ఒప్పుకోడానికి మనలో చాలామంది ఏమాత్రం ఇష్టపడకపోవచ్చు.

కానీ, చరిత్ర చెప్తున్న నిజం అదే.

ఆ తర్వాత సుమారు అర్థ శతాబ్దం పైగా ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ అధికార వ్యామోహం, అధికారంలో ఉండటం కోసం ఎప్పటికప్పుడు ఆ పార్టీ ప్రభుత్వాలు, ప్రధానులు తీసుకొన్న మరిన్ని తప్పుడు నిర్ణయాలు, రూపొందించిన పాలసీలు, చట్టాలు కాశ్మీర్‌ను ఎప్పటికప్పుడు ఒక అశాంతిమయమైన రాష్ట్రంగానే మిగిల్చాయి తప్ప ఒక పరిష్కారం దిశగా తీసుకెళ్లలేకపోయాయి.

అయితే, అప్పటి నుంచీ ఇప్పటి దాకా బలయ్యింది మాత్రం సుమారు 40 వేలమంది సైనికులు, వారి కుటుంబాలు.

మొన్నటి పుల్వామా టెర్రరిస్ట్ ఎటాక్ కూడా అలాంటిదే.

మరోవైపు చైనా విషయంలో కూడా మన ప్రభుత్వాల చేతకానితనం అత్యంత బాధాకరం. చైనాతో వాణిజ్య సంబంధాలు పూర్తిగా తెంచేసుకొని, ఆదేశం నుంచి దిగుమతులను పూర్తిగా ఆపేస్తే చాలు. ఆ దేశపు ఆర్థిక చిత్రం ఒక్కసారిగా ఛిద్రమైపోతుంది. ఆ ఒక్క పని మన ప్రభుత్వాలు చేయవు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే - చైనా విషయంలో మనమే డబ్బు అందిస్తూ, మన పక్కలో శత్రువును మనమే బలంగా పెంచుకుంటున్నాం. 

తమ దేశ భద్రత విషయంలో అణుమాత్రం కూడా రాజీపడని అమెరికా వంటి అగ్రదేశం పైన కూడా టెర్రరిస్టులు అత్యంత దారుణమైన స్థాయిలో దాడిచేయగలిగారు. తర్వాత అంతే కర్కశంగా ప్రపంచంలో ఎవ్వరూ ఊహించనివిధంగా ఆ దాడికి కారణమైన ఒసామా బిన్ లాడెన్‌ను ఇదే పాకిస్తాన్ నుంచి పట్టుకెళ్లి హతం చేసింది అమెరికా.

బిన్ లాడెన్‌ ఖననస్థలం కూడా ప్రపంచపటంలో లేకుండా ఎక్కడో ఎవ్వరికీ తెలియని సముద్ర గర్భంలో బూడిదలా కలిపేసింది.

తమ దేశ పౌరుల భద్రత విషయంలో, టెర్రరిస్టుల విషయంలో అమెరికా తీసుకొనే చర్యలు చాలావరకు అనుసరణీయం.

కానీ ఈ విషయంలో మనమెక్కడున్నాం? ఎంత వెనుకుబడి ఉన్నాం?     

అటు పాకిస్తాన్‌తో అయినా, ఇటు చైనాతో అయినా - ద్వైపాక్షిక సంబంధాల చర్చల విషయంలో మనం ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. అవన్నీ ఎప్పుడూ అర ఇంచు ముందుకు కదలవు. మీడియాల్లో వార్తలు, ఫోటోలు, ఎయిర్‌పోర్టుల్లో కటౌట్‌లవరకే పరిమితం. ఖర్చుమాత్రం కోట్లల్లో చేస్తారు.

ఎంత పెద్ద స్థాయి సమస్యలకయినా కొంచెం ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో కూర్చొని మాట్లాడుకొంటే పరిష్కారం అనేది తప్పక దొరుకుతుంది. కాకపోతే, దానికి కావల్సింది కేవలం రాజకీయాలు తెలవడం ఒక్కటే కాదు. ఆయా సమస్యల మూలాలపట్ల సమగ్ర అవగాహన ఉండాలి. పరిష్కారం దిశగా గురి తప్పని ఒక  వ్యూహం ఉండాలి. వీటన్నిటికీ తోడు, వ్యక్తిగత స్నేహపూర్వక సంబంధాల స్థాయికి కూడా ఎదిగి, సమస్యలకు పరిష్కారం సాధించుకోగల నేర్పు కూడా కావాలి. ప్రస్తుతం మన దేశంలో ఈ స్థాయి, ఈ లక్షణాలన్నీ ఉన్న రాజకీయవేత్త కేసీఆర్ ఒక్కరే.

కేసీఆర్ లాంటి నాయకుడు దేశప్రధానిగా ఉండటం వల్ల దశాబ్దాలుగా నత్తనడక నడుస్తున్న ఎన్నో సమస్యలు అతివేగంగా పరిష్కరించబడతాయండంలో సందేహంలేదు.

ఈ దిశలో కేసీఆర్ చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ఫలించేలా భావ సారూప్యత ఉన్న పలు ప్రాంతీయ పార్టీలు ఒక్కటవ్వటం ఇప్పుడు చాలా అవసరం.   

తను బ్రతుకున్న దేశం శాంతియుతంగా ఉండాలనే ఏ ముస్లిం అయినా కోరుకుంటాడు. కేవలం వారి వోటు బ్యాంక్ కోసం లేనిపోని అభద్రతాభావాలతో అవసరమైనప్పుడు కూడా దేశం లోపలా, బయటా స్పందించాల్సిన విధంగా స్పందించకపోవడం కేవలం చేతకానితనం, దేశద్రోహం కూడా. 

మన రాజకీయపార్టీలు, ప్రభుత్వాలు అలాంటి ద్రోహాన్నే చేశాయి. ఇంకా చేస్తున్నాయి.

ఒక్క కాశ్మీర్ విషయంలోనే కాదు. దేశ సమగ్రతకు, భద్రతకు సంబంధించిన అనేక విషయాల్లో కూడా ఇదే చేతకాని సంప్రదాయాన్ని ఇంకా కొనసాగిస్తుండటం అత్యంత విచారకరం.

ఈమధ్యకాలంలో ఒక్క 1999 కార్గిల్ వార్ విజయం ఒక్కటే దీనికి మినహాయింపు. ఆ ఘనత మచ్చలేని దేశభక్తుడు, రాజకీయవేత్త, అప్పటి ప్రధాని వాజపేయీకే దక్కుతుంది. మన సైన్యానికి దక్కుతుంది.

బంపర్ మెజారిటీతో, ఏ ఇతరపార్టీల సహాయం అక్కరలేకుండానే ప్రభుత్వం ఏర్పాటుకోగలిగిన ఇప్పటి ప్రధాని నరేంద్ర మోదీ కూడా గత అయిదేళ్ల కాలంలో ఈ దిశలో ఏమీ చెయ్యలేకపోవడం అత్యంత ఆశ్చర్యకరం. కానీ, ఇప్పుడు అవకాశం మోదీ కళ్ళముందుంది. ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి. ఒకే దెబ్బకు రెండు పిట్టలు!

శాశ్వత శాంతి కోసం స్వల్పకాలిక విధ్వంసం కొన్నిసార్లు తప్పదు. ఆ ధ్వంసరచన ఇప్పటికే జరిగి ఉండాల్సింది ..

మన 40 మంది పుల్వామా వీర జవాన్ల ఖననానికి ముందే. 

2 comments:

  1. ఆ నెహ్రూ కుటుంబం లేకపోతే కేసీఆర్ ఎక్కడుండేవాడు ?

    ReplyDelete
    Replies
    1. మీరే చెప్పాలి. మీ బ్లాగ్‌లో వివరంగా రాయండి. మీ అభిప్రాయాల్ని అప్రిషియేట్ చేస్తాను తప్పకుండా.

      నేను ఈ బ్లాగులో రాసినదానికి మాత్రం గూగుల్లో బోలెదంత సమాచారం ఉంది. నేను ఫిక్షన్ రాయలేదని మనవి. :)

      Delete