Saturday 12 January 2019

రెండు తప్పుల సాగరసంగమం

తెలిసో తెలియకో ..  తొందరపాటుతోనో .. మరింకేదైనా ప్రభావంవల్లో ..  ప్రతి ఒక్కరూ వారి జీవితంలోని ఏదో ఒక దశలో, ఏదో ఒక తప్పు నిర్ణయం తీసుకొంటారు.

అది సహజం.

అంతవరకు తప్పు కాదు.

కానీ, ఆ నిర్ణయం తప్పు అని తెలిసిన తర్వాత కూడా దాన్ని సరిదిద్దుకొనే ప్రయత్నం వెంటనే చేయకపోవడం మాత్రం చాలా పెద్ద తప్పే అవుతుంది.

మొదటి తప్పు ఫలితంగా కొంత నష్టం జరగొచ్చు. కానీ, 'చేసిన తప్పును సరిదిద్దుకొనే ప్రయత్నం వెంటనే చేయకపోవడం' అనే రెండో తప్పు వల్ల మాత్రం చాలా అనర్థాలు జరుగుతాయి.

ఎన్నడూ కలలో కూడా ఊహించని పరిస్థితులను ఎన్నిటినో  ఎదుర్కోవాల్సివస్తుంది.

అలాంటి తప్పు నిర్ణయం నా జీవితంలో ఒక్కసారి కాదు, రెండుసార్లు తీసుకొన్నాను. అంతా తెలుస్తున్నా, ఆ తప్పుల్ని సరిదిద్దుకోలేకపోయాను.

అదే విధి విచిత్రం అంటారు చాలామంది.

మైండ్‌సెట్ అంటాను నేను.

చాలా ఏళ్ల తర్వాత .. ఇప్పుడు .. ఆ రెండిట్లో ఒక తప్పు నిర్ణయాన్ని సమూలంగా తుడిచేశాను.

ఆ ఆనందాన్ని మనసారా అనుభవిస్తున్నాను.

కానీ, ఇంకో తప్పు నిర్ణయాన్ని మాత్రం తుడిచేయలేకపోతున్నాను. అది .. నా జీవితంలో నేను తీసుకొన్న మొట్టమొదటి అతి పెద్ద తప్పు నిర్ణయం. అదే, నా జీవితంలో నేను చేసిన మొట్టమొదటి అతిపెద్ద తప్పు.

ఆ తప్పుని మొదట్లోనే సరిద్దుకోవాల్సింది. అప్పుడా పని చేసుంటే, ఆ తర్వాత నేను చేసిన రెండో తప్పు అసలు జరిగేదేకాదు. జరిగినా అది తప్పు అయ్యేదికాదు.

ఒకటి వ్యక్తిగతం, మరొకటి వృత్తిగతం.

కట్ చేస్తే - 

సుమారు పాతికేళ్లక్రితం ఒకటి, పదిహేనేళ్లక్రితం ఇంకొకటి ..

నేను చేసిన ఆ రెండు తప్పుల సాగరసంగమం ఖరీదు .. ఒక జీవితం.