Thursday 25 October 2018

నిజం ఒప్పుకోడానికి ఈగోలు ఎందుకు?

అందమైన ఒక అమ్మాయిల బృందం ఆకాశంలో బతుకమ్మ ఆడుతోంది.

ఇది కవిత్వం కాదు.

ఊహ కాదు.

నిజం.

రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను చేతిలో పట్టుకొని, ఒక అరడజను మంది ఆడపడచులు నిజంగానే ఆకాశంలో బతుకమ్మ ఆడుతున్నారు.

ఆకాశంలోనే, చుట్టూ వున్నవాళ్లు, ఆ అద్భుతమైన దృశ్యాన్ని వారి మొబైల్ ఫోన్లల్లో చిత్రీకరిస్తున్నారు.

ఆ ఆకాశం మరేదో కాదు.

జెట్ ఎయిర్‌వేస్ విమానం!

మొన్న ఆదివారం, హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్న ఆ ఫ్లైట్‌లో, చేతిలో బతుకమ్మలతో ఆడి పాడి, ప్యాసెంజెర్లను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తిన ఆ అమ్మాయిలు కూడా మరెవరోకాదు.

జెట్ ఎయిర్‌వేస్ ఎయిర్ హోస్టెస్‌లు! 

కట్ టూ మన ఈగోలు - 

'కవిత పుట్టకముందునుంచే తెలంగాణలో బతుకమ్మ ఉన్నది. కేసీఆర్ టీఆరేస్ పార్టీ పెట్టకముందు కూడా బతుకమ్మ ఉన్నది. కొత్తగా కవిత చేసిందేం లేదు' .. అని నానా కామెంట్లు విన్నాను. చదివాను.

ఇప్పటికే కనుమరుగైపోయిన మన ఎన్నో పండుగలు, ఆచారాలు, సాంప్రదాయాల్లాగే మన తెలంగాణ బతుకమ్మ కూడా దాదాపు ఒక అంతిమ అంతర్ధాన దశకు చేరుకుంటున్న సమయంలోనే .. ఒకరి మనసులో ఒక మెరుపు మెరిసింది.

ఆ ఒక్కరు మన ఎం పి కవిత గారు.

ఆమె మనసులో మెరిసిన ఆ మెరుపు మన బతుకమ్మ.

మిగిలిందంతా చరిత్రే!

మన బతుకమ్మను ఎవరూ ఊహించని విధంగా, ఎవరూ ఊహించని స్థాయిలో, తెలంగాణ ఉద్యమానికి కూడా అత్యంత సమర్థవంతంగా కనెక్ట్ చేసింది మన కవిత. 

తెలంగాణ జాగృతి వేదికగా బతుకమ్మ పండుగను పూర్తిస్థాయిలో పునరుజ్జీవింపజేసింది మన కవిత.

ఒక్క తెలంగాణలోనే కాదు .. దేశమంతా, యావత్ ప్రపంచమంతా ఇప్పుడు 'బతుకమ్మ పండుగ జరుపుకోవడం' అనేది ఒక గర్వపడే అంశంగా, ఒక విడదీయలేని సాంప్రదాయిక బంధంగా, మన తెలంగాణ ఆడపడచుల హృదయాల్లో నిలపడంలో వందకి వందశాతం సక్సెస్ సాధించారు మన కవిత.

జెట్ ఎయిర్‌వేస్ ఫ్లైట్‌లో బతుకమ్మ ఆలోచన ఎవరిదోగాని, వారికి నా హాట్సాఫ్!

ఈ ఆలోచన ఎవరిదైనా కానివ్వండి. అది రావడానికి పరోక్షంగా ఇన్స్‌పిరేషన్ మాత్రం తప్పకుండా కవిత గారే.

నిజమే. కవిత గారు లేకపోయినా మన తెలంగాణవాళ్లు బతుకమ్మ ఆడుతుండేవాళ్లే. కానీ, మన జీవనశైలిని, మన కుటుంబ బంధాలను, మన సంప్రదాయాలను నిర్దాక్షిణ్యంగా విధ్వంసం చేస్తున్న ఈనాటి ప్రపంచీకరణ, ఆండ్రాయిడ్ ఫోన్ల జీవితం నేపథ్యంలో ... ఇంకొన్నాళ్లకయినా మన బతుకమ్మ క్రమంగా అంతరించిపోయేదే.

అందులో ఎలాంటి సందేహం లేదు.

అట్లా కాకుండా, మన బతుకమ్మను గిన్నిస్‌స్థాయిలో నిలబెట్టింది మన కవిత.

అసలు బతుకమ్మ ఆడటమే ఇప్పుడొక స్టేటస్ సింబల్‌గా చేసింది మన కవిత.

ఈతరం ఆధునిక టీనేజ్ కాలేజ్ అమ్మాయిలు కూడా, ఎంతో చక్కగా, తొమ్మిదిరోజులు ఆడే మన బతుకమ్మకుండే ఆ తొమ్మిది పేర్లను కూడా, అదే వరుసక్రమంలో చెప్తుండటం మొన్న నేను ఒక ఎఫ్ ఎం రేడియో లైవ్ ఇంటరాక్టివ్ ప్రోగ్రాంలో విని, నిజంగా సంభ్రమంతో షాకయ్యాను.

క్రెడిట్ రియల్లీ గోస్ టూ మన కవిత గారు!

కవితగారికి అసలు ఈ ఆలోచన రావడానికి, తను ఈ దిశలో ఇంతగా కృషి చేయడానికి నేపథ్యం - 
మన తెలంగాణ ఉద్యమం.

ఆ ఉద్యమాన్ని విజయపథంలో ముందుకు నడిపిన మన కేసీఆర్. 

ఈ నిజం ఒప్పుకోడానికి మాత్రం కొందరి ఈగోలు ఒప్పుకోవు.

తప్పులేదు. వారి ఎజెండాలు వారివి. వాళ్లలోకంలో వాళ్లనలా వదిలేద్దాం.

కట్ బ్యాక్ టూ మన బతుకమ్మ - 

ఈ పోస్ట్ రాయడానికి కారణమైన మన బతుకమ్మ, మన ఎం పి కవితగారికి వందనం. అభివందనం.

నా బాల్యంలో, నేను పుట్టిపెరిగిన వరంగల్‌లోని ఉర్సుగుట్ట దగ్గర, ప్రతియేటా నేను చూసి, ఆనందం అనుభవించిన ఆనాటి బతుకమ్మ పండుగ మధుర జ్ఞాపకాలు మళ్లీ నా కళ్లముందు కనిపించడానికి కారణమయ్యారు మీరు.   

ఎవరో కొందరిచ్చే కిరీటాలు మీకక్కర్లేదు. ఎవరి విమర్శలను మీరు పట్టించుకోనక్కరలేదు.

ఇంక వందేళ్లయినా ఎవ్వరూ మర్చిపోలేని స్థాయిలో, ఎవ్వరూ విస్మరించలేని స్థాయిలో మన బతుకమ్మను మీరు మళ్లీ బతికించారు.

అది చాలు.

మీరు నిజంగా ధన్యులు.  

No comments:

Post a Comment