Thursday 18 October 2018

కొన్నిటికి ఏ లాజిక్కులుండవ్!

"అన్ని కష్టాలు ఒక్కసారిగా కట్టగట్టుకొనే వస్తాయి."

జీవితంలో అన్ని ఆటుపోట్లను అనుభవించి, ఎదుర్కొని, ప్రస్తుతం ప్రశాంతంగా రిటైర్డ్ లైఫ్ అనుభవిస్తున్న ఒక డాక్టర్ అన్నారా మాట.

ఆయన మా ఆఫీస్ ప్రెమిసెస్ యజమాని.

"జీవితం ఎవ్వర్నీ వదలదు భయ్యా. ప్రతి ఒక్కర్నీ, ఏదో ఒక టైమ్ లో ఒక చూపు చూస్తుంది. మిస్సయ్యే ప్రసక్తే లేదు."

మంచి రైజింగ్ టైంలో ఉండగానే, పడకూడని కష్టాలు పడ్డ ఫిల్మ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మాటలివి.

ఇదంతా ఈ దసరా రోజు సాయంత్రం ఒంటరిగా కూర్చొని ఎందుకు రాస్తున్నానంటే, దానికో కారణం ఉంది. ప్రస్తుతానికి ఆ కారణాన్ని అలా పక్కన పెడదాం.

మనిషన్న తర్వాత, వాడి జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక కష్టం చిన్నదో పెద్దదో వస్తూనే ఉంటుంది. కానీ, జీవితంలోని ఒక అతి ముఖ్యమైన మజిలీలో, అన్ని రకాల కష్టాలూ, లేదా అగ్ని పరీక్షలు ఒకేసారి రావడం అనేది ఎంత స్థితప్రజ్ఞుడినైనా కొంతైనా జర్క్ తినేలా చేస్తుంది.

అలాంటి పరిస్థితిలో ఉన్నపుడే నిజమైన హితులు, సన్నిహితులు ఎవరన్నది పాలు, నీళ్ళలా తెలిసిపోతుంది.

జీవితంలో ఏది ముఖ్యమో తెలిసిపోతుంది. జీవితంలో మనం ఏం కోల్పోతున్నామో తెలిసిపోతుంది.

అప్పుడు గాని మన కళ్ళు పూర్తిగా తెర్చుకోవు. అప్పుడుగాని మన మెదడును పూర్తిగా ఉపయోగించుకోము.

అప్పుడే మనకు నిజంగా ఏం కావాలో తెల్సుకుంటాము. అప్పుడే మనం నిజంగా ఏం చేయాలో అది చేయటం ప్రారంభిస్తాము. అప్పుడే మన నిజజీవితంలో ఏ పరిస్థితి ఎదురైనా నిశ్చలంగా ఎదుర్కొంటాము.

రెట్టించిన కసితో, వందరెట్ల శక్తితో.

ఎవరి జీవితంలోనైనా సిసలైన టర్నింగ్ పాయిట్ అదే.

అప్పటినుంచి మాత్రమే, అంతకుముందటి ఏ లాజిక్కులకు చిక్కని ఎన్నో పనులు చేస్తుంటాము. నమ్మశక్యంకాని ఎన్నెన్నో ఫలితాలు చూస్తుంటాము.

అసలు జీవితం అప్పుడే ప్రారంభమవుతుంది ... 

No comments:

Post a Comment