Wednesday 8 March 2017

విమెన్స్ డే గురించి నాకెలా తెలిసింది?

"ఏయ్ మనోహర్, ఏంటి నన్ను విష్ చెయ్యవా? నన్నే కాదు .. క్లాస్‌లో ఉన్న అమాయిలందర్నీ విష్ చెయ్యాలి నువ్వీరోజు!"

నేను క్లాస్‌లోపలికి ఎంటరవుతూనే, మా రష్యన్ డిప్లొమా మేడమ్ కల్పన నన్ను పట్టుకొని ఇంగ్లిష్‌లో అన్నారు. 

సుమారు పాతికేళ్లక్రితం, నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్‌లో మూడేళ్ల రష్యన్ పార్ట్‌టైమ్ డిప్లొమా చదువుతున్నప్పటి సందర్భం అది.

నాకేం అర్థం కాలేదు.

మేడమ్‌ను ఒక్కదాన్నే విష్ చెయ్యడం అంటే తన బర్త్‌డే అనుకోవచ్చు. అమ్మాయిలందర్నీ ఎందుకు విష్ చెయ్యాలో ఎంత ఫాస్ట్‌గా ఆలోచించినా నాకు అస్సలు వెలగలేదు.

అప్పుడు ఇప్పట్లా కంప్యూటర్స్ లేవు. ఇంటర్‌నెట్ లేదు. సంవత్సరంలోని 365 రోజులకు 365 ఏవేవో 'డేస్' ఉన్నాయని సొదపెట్టే గూగుల్, ఫేస్‌బుక్కులు లేవు.

ఇంటర్నేషనల్ విమెన్స్ డే గురించి, దాని వెనకున్న రష్యన్ నేపథ్యం గురించీ ఆరోజు మేడమ్ చెప్పారు. తర్వాత, ఆ డిప్లొమా క్లాస్‌లో ఉన్న ఏకైక బాయ్ స్టుడెంట్‌నైన నాతో తను గ్రీటింగ్స్ చెప్పించుకున్నారు. క్లాస్‌లో ఉన్న ఇంకో డజన్ మంది అమ్మాయిలకు కూడా నాతో గ్రీటింగ్స్ చెప్పించారు.


కట్ టూ కల్పనా మేడమ్ - 

మా రష్యన్ ప్రొఫెసర్ మురుంకర్ అంటే నాకెంత గౌరవమో, కల్పనా మేడమ్ అన్నా నాకంతే గౌరవం, ఇష్టం.

నాకు నాలుగు ముక్కలు ఇంగ్లిష్ రావడానికి, రష్యన్ భాషలో నేను నా పెన్ ఫ్రెండ్స్‌కు వందలకొద్దీ ఉత్తరాలు రాయడానికీ, ఆ కాలంలో టెలిఫోన్ ఎక్స్‌చేంజ్‌కు వెళ్లి ల్యాండ్ ఫోన్ నుంచి ఫ్రీగా రష్యాకు ఫోన్ చేసి అక్కడున్న ఫ్రెండ్స్‌తో రష్యన్‌భాషలో మాట్లాడ్దానికీ, మూడేళ్ల రష్యన్ డిప్లొమాలో నేను యూనివర్సిటీ టాపర్ కావడానికీ, ఎన్నో కథానికలు గట్రా నేరుగా రష్యన్ నుంచి తెలుగులోకి నేను అనువాదం చెయ్యడానికీ, ఇండియా వచ్చిన రష్యన్ సైంటిస్టులకు, ఆర్టిస్టులకు ఇంటర్‌ప్రీటర్‌గా నేను పనిచెయ్యడానికీ, చివరికి అసలు డ్రైవింగ్ అంటేనే తెలియని నేను మొట్టమొదటిసారి ఒక టూవీలర్ ఎక్కి డ్రైవ్ చెయ్యడానికి కూడా ఒక తిరుగులేని కారణం .. ఒక ఊహించని ఇన్స్‌పిరేషన్ .. కల్పనా మేడమ్.

ఇప్పుడు తను ఎక్కడున్నారో నాకు తెలియదు. కనుక్కోవాలి. వీలైతే కలవాలి.

హాపీ విమెన్స్ డే మేడమ్! 

No comments:

Post a Comment