Wednesday 21 May 2014

"చక్రం" బాబుకు మళ్లీ వచ్చిన అవకాశం!

అప్పట్లో చంద్రబాబుకీ, చక్రం తిప్పడానికీ చాలా అవినాభావ సంబంధం ఉండేది. కొంతకాలం ఆ రేంజ్‌లో ఢిల్లీలో ఆటలాడుకున్నాడు చంద్రబాబు.

మొన్న తెలంగాణ బిల్లు పాస్ కాకుండా కూడా.. ఆ చెదలుపట్టిన చక్రాన్ని అడ్డదిడ్డంగా తిప్పుతూ, ఢిల్లీలో యమ కష్టపడ్డాడు. నేషనల్ మీడియాతో చీవాట్లు కూడా తిన్నాడు.

చెదలుపట్టిన ఆ చక్రం విషయం అలా వదిలేస్తే - 

చంద్రబాబు అనగానే నాకు అనేకమైన విశేష సంఘటనలు గుర్తుకొస్తాయి. వాట్లో మచ్చుకి కొన్ని:

> బాలయోగి లోక్‌సభ స్పీకర్ కావడం కోసం చివరి క్షణాల్లో.. దాదాపు ఓ థ్రిల్లర్ సినిమా క్లయిమాక్స్‌లా, అత్యంత ఉత్కంఠభరితంగా బాబు తిప్పిన చక్రం.
> బాబు "విజన్ 2020".
> బిల్ గేట్స్, బిల్ క్లింటన్ రేంజ్‌వాళ్లను హైదరాబాద్ రప్పించడం.
> సాఫ్ట్‌వేర్ రంగానికి బాగా ప్రాముఖ్యం ఇవ్వడం.

(నేనూ బాబు చేతులమీదుగానే తెలుగు లలిత కళాతోరణంలో నంది అవార్డ్ తీసుకున్నాను. అది నా పర్సనల్ విషయం అనుకోండి.)

ఇలా ఇంకా కొన్నున్నాయి. అన్నీ ఠక్కున గుర్తుకొచ్చేవే. కాకపోతే, ఇది “9 మినట్ బ్లాగింగ్” కాబట్టి.. యమ స్పీడ్‌గా రాసి, తొందరగా క్లోజ్ చేయాలి.

అయితే, వీటిని అంటిపెట్టుకొనే చాలా మైనస్‌లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు:

> వ్యవసాయాన్ని, రైతులను పెద్దగా కేర్ చేయకపోవడం.
> ప్రభుత్వోద్యోగులను ఫుట్‌బాల్ ఆట ఆడుకోవడం.
> కొన్ని పనికిరాని లాబీలకు, కోటరీ భజనకు లొంగిపోయి.. పెడ్ద బ్లండర్ స్టెప్ వేసి ఊహించనివిధంగా గద్దె దిగటం.
> ఫలితంగా - పదేళ్లు కుర్చీని కోల్పోవడం.

కట్ టూ 2014 - 

అధికారంలో ఉన్నపుడు ఏ రైతుల జీవితాల్నయితే కేర్ చేయలేదో – ఇప్పుడు అదే రైతుకు “రుణ మాఫీ” ఇస్తూ విజయాన్ని దక్కించుకున్నాడు బాబు. ఆయన పశ్చాత్తాపానికి ఫలితం దక్కింది.

దీనికితోడు – మిగిలిన విషయాల్లో బాబు ట్రాక్ రికార్డుని సీమాంధ్ర ప్రజలు నిజంగా మనస్పూర్తిగా గౌరవించి గుర్తించారు. మళ్లీ బంగారు పల్లెంలో అధికారాన్ని అందించారు.

కట్ టూ అవసరంలేని “అతి” - 

> రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల్ని బాబు మళ్లీ కలుపుతాడట!
> అక్కడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇక్కడి తెలంగాణను కూడా అభివృధ్ధి చేస్తాట్ట!
> అక్కడ ఆయన చేసే అభివృధ్ధి పనులను చూసి ఇక్కడ తెలంగాణవాళ్లు నేర్చుకోవాలట!

ఎంత అర్థం లేని మాటలు! ఎంత అవివేకం!!

బాబు తాను ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ముఖ్యమంత్రి అన్న విషయం మర్చిపోయాడనుకుంటాను. ఇలాంటివన్నీ విజయం ఇచ్చిన “కిక్” వల్ల తలకెక్కిన ఈగో రూపంలో ఇదిగో ఇలా బయటపడతాయి. ఇక్కడే - తనని చూసి ఇన్స్‌పయిర్ అయిన మోడీని చూసి, తను ఏం మాట్లాడకూడదో నేర్చుకోవాల్సిన అవసరం బాబుకు చాలా ఉంది.

కట్ టూ “రాబోయే మార్పు” - 

ఇప్పుడు ప్రజల్లో చాలా అవేర్‌నెస్ వచ్చింది. ఏదో అర్థం లేకుండా, అల్లాటప్పాగా, ఎడాలిసెంట్‌గా “ఓదార్పు” అంటూ, “అయిదు సంతకాలు” అంటే పడిపోయే రోజులు పోయాయి.

ఇకమీదట ప్రజలు రాజకీయనాయకుల పనితీరు చూస్తారు. ఫలితాలు చూస్తారు. ఆది కూడా ఏదో ఆషామాషీగా కాదు.

సగటు పౌరుని జీవితాన్ని వీరు చేసే పనులు పాజిటివ్ కోణంలో ఎంతో ప్రభావితం చేయగలగాలి. ఎంతో ఉపయోగపడాలి. అలా లేనప్పుడు బాబయినా, ఇంకెవరయినా నిర్మొహమాటంగా ప్రజలు తిప్పికొడతారు. ఆదీ అసలు ప్రజాస్వామ్యం.

దీని విలువని ఇప్పటికయినా మన పొలిటీషియన్లు గ్రహించారనే అనుకుంటున్నాను. ఇకమీదట - ఎంతో బాగా ప్రభుత్వాన్ని నడిపి, మరెంతో గొప్పగా ఫలితాల్ని చూపించాలన్న తహతహ ప్రతి సి ఎం లోనూ, మంత్రిలోనూ, రాజకీయనాయకునిలోనూ ఉంటాయని నేననుకుంటున్నాను. కనీసం కొంత రేంజ్ వరకయినా!

ఏ పార్టీ అన్నది కాదు విషయం. ఏం మంచి చేశారు అన్నదే ముఖ్యం.

No comments:

Post a Comment