Monday 21 April 2014

సంపు.. సంపు.. బాగా సంపు!

రౌడీ, లెజెండ్ వంటి భారీ సినిమాల పోటీని కూడా తట్టుకొని, హౌజ్‌ఫుల్ కలెక్షన్లతో, వాంటెడ్‌లీ తీసిన ఒక "అర్థం పర్థం లేని సినిమా".. కేవలం మొదటి మూడు రోజుల్లోనే 6.75 కోట్లు కలెక్ట్ చేయగలిగిందంటే ఇదొక కొత్త రికార్డ్.

ఈ రికార్డ్ పూర్తిగా సంపూదే అని చెప్పక తప్పదు.

6.75 కోట్ల తొలి 3 రోజుల కలెక్షన్ బ్రేక్ ఇలా ఉంది: సినిమా విడుదలయినరోజు శుక్రవారం 2 కోట్లు, శనివారం 2.25 కోట్లు, ఆదివారం 2.5 కోట్లు! అ తర్వాతకూడా హౌజ్‌ఫుల్ కలెక్షన్లతో తన సినిమాని ఇటు ఇండియాలోనూ, అటు ఎబ్రాడ్‌లోనూ బాగా నడిపించుకుంటున్న "బర్నింగ్ స్టార్" సంపు!

కట్ టూ మన సంపూ ఫ్లాష్ బ్యాక్ - 

ఒక కొత్త దర్శకుడు తన అందుబాటులో ఉన్న హీరోలందరికీ, నిర్మాతలందరికీ కథలు చెప్పీ చెప్పీ విసిగిపోయాడు. ఇంక లాభం లేదనుకున్నాడు. కంప్లీట్ "అప్ సైడ్ డౌన్" థియరీలో, అర్థం పర్థం లేని ఒక కథని తయారుచేసుకున్నాడు. దానికి కావలసిన హీరో ఇప్పుడున్న రొటీన్ హీరోల్లా అస్సలు ఉండకూడదు!!

అలాంటి హీరో కోసం వెతికీ వెతికీ కూడా విసిగిపోయాడు డైరెక్టర్.

చిన్నా చితకా జూనియర్ ఆర్టిస్టు వేషాలు వేస్తూ తిరుగుతున్న మన సంపు .. ఓ రోజు ప్రసాద్ ల్యాబ్‌లో, ఉన్నట్టుండి మన డైరెక్టర్ కంటపడ్డాడు. అంతే.

"నువ్వే నా సినిమా హీరో!" అన్నాడు.

ఇంక తర్వాతదంతా చరిత్రే!

ఆ దర్శకుని దగ్గర నిర్మాత లేడు. ఉన్నా ఆ కథని ఒప్పుకోడు, సంపూని హీరోగా చచ్చినా ఒప్పుకోడు. అయినా తను అనుకున్న విజన్ మీద తనకు చాలా నమ్మకం. ఆ నమ్మకంతోనే "యూట్యూబ్"లో చిన్న టీజర్ వదిలి తొలి సంచలనం సృష్టించాడు. అది తర్వాత మరెన్నో లెక్కలేని సంచలనాలకు దారితీసింది.

డబ్బులూ వచ్చాయి. ఇండస్ట్రీ నుంచి కూడా బోల్డంత సపోర్ట్ తోడయింది. ఎవ్వరూ ఊహించని అతి తక్కువ బడ్జెట్‌లో సినిమాని పూర్తిచేశాడు. ఊహించని రేంజ్‌లో సినిమా బిజినెస్ అయింది. రిలీజయింది.

అదే హృదయ కాలేయం.

ఇప్పుడు సంపూకు ప్రపంచవ్యప్తంగా అభిమానులున్నారు. అభిమాన సంఘాలున్నాయి. ఇదే దర్శకుని రెండో చిత్రంలో, ఇదే సంపూ ఈ సారి "డబుల్ యాక్షన్"తో సంపబోతున్నాడు!

కట్ టూ ది క్రియేటర్ ఆఫ్ సంపూ - 

నిజానికి సంపూర్ణేష్ బాబు అసలు పేరు అది కాదు. ఏదో చెప్పడం ఆయనకిష్టం లేదు. మనకవసరం లేదు. సంపూ కేరెక్టర్‌ని సృష్టించి, హిట్ చేసి, ఇండస్ట్రీలో మరో కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసిన ఈ కొత్త దర్శకుని పేరు మాత్రం సాయి రాజేష్. ఆయనపెట్టుకున్న స్క్రీన్ నేమ్ - స్టీవెన్ శంకర్.

స్టీవెన్ స్పీల్‌బర్గ్‌లోని మొదటి ముక్కని, భారతీయుడు శంకర్‌లోని శంకర్‌ని కలగలిపి "స్టీవెన్ శంకర్"గా తన పేరుని మార్చుకున్న ఈ కొత్త దర్శకున్ని అభినందించకుండా ఎలా ఉండగలం?

స్టీవెన్ శంకర్, ఇంక సంపుకో.. నీ ఇష్టం.. 

No comments:

Post a Comment