Thursday 10 April 2014

కమిట్‌మెంట్ ముఖ్యం.. కారణాలు కాదు!

ఈ మధ్య ఎవరినోట విన్నా ఒకటే మాట.. " ఈ ఎలెక్షన్లు అయిపోనీ.." అని. లేదంటే, "అసలు మార్కెట్లో డబ్బేదీ?" అని.

ఇంకా కొన్ని ఇలా ఉంటాయి:

> "ఇదిగో.. ఈ పండగ వెళ్లనీ!" (నెలకి కనీసం 4 పండగలొస్తాయి మనకి, చిన్నా చితకా..)
> "ఇనాళ శుక్రవారం!"/"ఇవాళ మంగళవారం!" (శుక్ర, మంగళవారాల్లో మనవాళ్లు భోజనం చేయరు.. ఇంకేం చేయరు!)
> "సీజన్ డల్‌గా ఉంది!" ( అసలు అన్‌సీజన్లో సీజన్లు పుట్టించగల సత్తా ఉన్నవాడే నిజమైన బిజినెస్‌మాన్! )
> "అసలు లిక్విడ్ క్యాష్ లేదు ఎక్కడా!" (నాకు తెల్సినంతవరకు, మనదేశంలో ఎక్కువగా ఉన్నది లిక్విడ్ క్యాషే!)

ఇలా చెప్పుకుంటూపోతే.. పనికిరాని కారణాలు బోలెడన్ని మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం.

వీటికి అంతు ఉండదు.

నిజంగా ఒక పని పూర్తిచెయ్యాలి అనుకుంటే - ఇవన్నీ కారణాలు కానే కావు. మనసులో ఉన్న అసలు కారణాల్ని చెప్పకుండా.. చాలామంది ఇలా దాటేస్తుంటారు. అనవసరంగా ఎదుటివారి సమయాన్ని దోచేస్తుంటారు. అనవసరంగా ఆశలు పెట్టించి చివరి క్షణంలో తప్పుకుంటారు. ఇదొక వ్యాధి. దీనికి తప్పక వైద్య పరిభాషలో ఏదో ఓ పేరు ఉండే ఉంటుంది.

ఈ వ్యాధిగ్రస్తులు చాలామంది .. ఇలా అబధ్ధాలు చెప్తూ, ఎదుటివాళ్లకి ఏదో డిప్లొమేటిక్‌గా "నో" చెప్తున్నాం అనుకుంటారు. నిజానికిది డిప్లొమసీ కాదు, మోసం. ముందు తమని తాము మోసం చేసుకోవడం. తర్వాత ఎదుటివాళ్లని మోసం చేయడం.

నా వ్యక్తిగత అనుభవంలో ఇలాంటి "డిప్లొమాట్స్"ని చూసీ చూసీ జుట్టు ఊడిపోయింది. ఈ వ్యాధి లక్షణాలున్న డైలాగ్ మొదటిసారి రాగానే.. రెండోసారి మళ్లీ వాళ్లు నాతో కనీసం ఫోన్లో కూడా మాట్లాడే అవకాశం నేనే ఇవ్వట్లేదు!

దేనికయినా "యస్", "నో" అని రెండే రెండు ఉంటాయి జవాబులు. ఇఫ్స్, బట్స్ ఉండవు. అలా ఉన్నచోట పని ఇంచ్ కూడా జరగదు. ఇదే మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన కొండ గుర్తు.

చివరాఖరికి చెప్పేదేంటంటే - ఓ పని చేయాలనుకున్నవాడు చేస్తాడు. అలా చేయాలనుకున్నవాడికి ఏదీ అడ్డు కాదు. ఎలక్షన్లదారి ఎలక్షన్లదే. మనదారి మనదే! 

No comments:

Post a Comment