Monday 27 January 2014

ఎవరి "పిచ్" వారికి ఆనందం!

మొన్న నా ఫ్రెండ్ ఒకరు తన ఫేస్‌బుక్ టైమ్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఓ వాక్యం పై టైటిల్‌కి ఇన్స్‌పిరేషన్!

ఫేస్‌బుక్‌లో తను ఏదో పోస్ట్ చేస్తే.. "మగాళ్లు దానివైపు అసలు చూడకపోయినా ఓకే. కనీసం ఆడాళ్లయినా దాన్ని లైక్ చేసి, షేర్ చేయాల్సింది. వాళ్లూ చేయలేదు" అంటూ బోల్డంత ఇదయిపోయారామె!

మన సొంత పిచ్చితో మనం పోస్ట్ చేసిన ప్రతిదాన్నీ మనం అనుకున్నవాళ్లంతా లైక్ చేస్తారన్న గ్యారంటీ ఏమీలేదు. సో, చివరాఖరికి నా ఉద్దేశ్యం ఏంటంటే - ఈ విషయంలో నా ఫ్రెండు అంతలా ఇదయిపోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. 

బై ది వే, ఆ ఫ్రెండ్‌తో నా "షాట్-బై-షాట్" ఇంటర్వ్యూ ఫిబ్రవరిలో ఇదే బ్లాగ్‌లో పోస్ట్ చేస్తున్నాను. ఇందులో ఎలాంటి "పిచ్" లేదు. జస్ట్.. నా పిచ్చి మాత్రమే!


కట్ టూ నా సోషల్ నెట్‌వర్కింగ్-కమ్-ఆన్‌లైన్ యాక్టివిటీ - 

ఇప్పుడు, ఈ క్షణం.. మీరు చదువుతున్న ఈ బ్లాగ్ నా పిచ్. నా పిచ్చి కూడా. దీనిమీద ఆటాడుకోవడం అన్నది నా వ్యక్తిగత ఆనందం. నాకున్న ఎన్నో వ్యక్తిగత టెన్షన్ల నుంచి ఇదో చిన్న రిలీఫ్.

ఈ బ్లాగ్ ఒక్కటే కాదు. ఇంకా.. ఫేస్‌బుక్, ట్విట్టర్, కొన్ని ఫోరంస్‌రూపంలో కూడా నాకు రకరకాల పిచ్‌లున్నాయి. వీటిల్లో ఒక్కో పిచ్ నాకు ఒక్కో రకంగా సహకరిస్తుంది.

నా ఫేస్‌బుక్‌లో, ఫేస్‌బుక్ పేజ్‌లో ఏదేదో స్టఫ్, ఏదేదో నాన్‌సెన్స్ నేను పోస్ట్ చేస్తుంటాను. అదంతా నా పిచ్చి, నా ఆనందం. నేను పోస్ట్ చేసినవాటిలో ప్రతి ఒక్కటీ ప్రతి ఒక్కరికీ నచ్చాలన్న రూలేమీ లేదు.

కాకపోతే.. ఆ పోస్టులను చూసిన ఆయా నిర్ణీత సమయాల్లో, వారి అప్పటి మానసిక స్థితిని, వారున్న పరిస్థితిని బట్టి.. ఒక్కొక్కరికి ఒక్కో పోస్ట్ నచ్చవచ్చు. ఒక్కొక్కరు ఒక్కో పోస్టులో తమని తాము ఐడెంటిఫై చేసుకోవచ్చు.

నా ప్రధాన ఉద్దేశ్యం కూడా అదే.

మొన్నీ మధ్య నేను పోస్ట్ చేసిన ఒక "నోట్" పైన, నా పూర్వ విధ్యార్థి అయిన ఒకమ్మాయి అమెరికా నుంచి ఒక కామెంట్ పెట్టింది. చాలా హానెస్ట్ కామెంట్. నేను నిజంగా చాలా సంతోషంగా ఫీలయ్యాను.

నేను పోస్ట్ చేసిన ఆ నోట్ తనకు సంబంధించిన ఒకానొక విషయంలో ఒక నిర్ణయం తీసుకోడానికి ఉపయోగపడిందట!

ఇంతకన్నా ఆనందం ఇంకేం కావాలి?

ఇంకో విధంగా చెప్పాలంటే - నా ఈ సోషల్ నెట్‌వర్కింగ్, నా బ్లాగ్, నా ఆన్‌లైన్ ప్రజెన్స్, నేను చేసే ఈ "స్క్రిబ్‌లింగ్, స్టఫ్, నాన్‌సెన్స్" .. ఇదంతా నాకోసం నేను క్రియేట్ చేసుకొన్న పిచ్‌లు. ఈ పిచ్‌ల మీద నా ఇష్టమున్నట్టు నేను ఆడుకుంటాను. నేనే ఇండియా, నేనే పాకిస్తాన్!

నన్ను నేను క్లీన్ బోల్డ్ చేసుకుంటాను. నేనే సిక్సర్ కొడతాను. సింగిల్ తీస్తాను. సెంచరీలు చేస్తాను. డకవుట్ అవుతాను.

నా పిచ్. నా పిచ్చి. నా ఇష్టం.

ఇదంతా నా జీవితం. నేను కోరుకొంటున్న జీవితం. నేను నేర్చుకుంటున్న జీవిత సత్యం.

నా వ్యక్తిగత జీవితంలోని ఈ మజిలీలో నన్ను ఎంటర్‌టైన్ చేస్తున్న ఒక క్రియేటివ్ ప్లాట్‌ఫామ్. ఒక థెరపీ. ఒక అధ్యయనం.

అంతిమంగా ఇదంతా ఇప్పుడు నాకు అవసరమైన ఒక ఆనందం.

No comments:

Post a Comment