Sunday 12 January 2014

2014 నిన్ను పూర్తిగా మార్చివేస్తుంది!

అవును. ఈ మాట ఎవరో జ్యోతిష్కుడు చెప్పిందికాదు. నాకు నేను చెప్పుకుంటున్నదే. దాన్నే ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఈ బ్లాగ్ ద్వారా..

నేను జ్యోతిష్యం, చేతబడులు వంటి మూఢనమ్మకాల్ని నమ్మను. దేవుడి పటం ముందు నిల్చుని, దండం పెట్టుకుని, ఏదయినా కోరుకుంటే అవి నిజమౌతాయి అన్న మాటను అసలు నమ్మను.

"నాకు ఈ పని అయిపోయేలా చేయి దేవుడా, నేన్నీకు ఇది చేస్తాను.. అది చేస్తాను!" అని మొక్కుకోవడం నా దృష్టిలో ఒక "క్విడ్ ప్రో కో " లాంటిదన్నమాట! అలాగని, నేను నాస్తికుణ్ణి కాదు.

నిజానికి.. ఇటీవలి మూడు నాలుగేళ్ల క్రితం వరకూ నేను పరమ నాస్తికుణ్ణే.

మనచుట్టూ ఉన్న, మనం జీవిస్తున్న, మనం చూస్తున్న, మనం అనుభవిస్తున్న ఈ అద్భుత సృష్టికి ఏదో "మూలం" అంటూ ఒకటి ఉందని మాత్రం మొదట్నుంచీ నేను నమ్ముతాను.  కానీ, ఆ నమ్మకానికి, ఆ మూలానికి, ఆ శక్తికి.. మనం ఇన్ని మతాలతో, ఇన్ని పేర్లతో మాస్కులు వేసి.. నానా కంగాళీ చేయడం మాత్రం నేను అస్సలు నమ్మేవాణ్ణి కాదు. అప్పటి నా నాస్తికత్వం వెనకున్న సింపుల్ లాజిక్ అదీ.

అయితే - "ఇదంతా వ్యక్తిగతం" అన్న ఆలోచనను మాత్రం నేను ఎప్పుడూ మర్చిపోలేదు. నా ఎదుటి వ్యక్తుల వ్యక్తిగత నమ్మకాలు ఏవయినా, వాటిని నేను ఎప్పుడూ గౌరవించేవాణ్ణి.

"మతం అనేది మానవ సృష్టి" అనేది నా అభిప్రాయం. ఇప్పటికీ.

వ్యక్తిగతంగా, సామాజికంగా ఎవర్నీ ఇబ్బంది పెట్టనంతవరకు ఈ మతాలు బోధించే ఏ నమ్మకాన్నయినా నేను గౌరవిస్తాను. అలాగే గౌరవిస్తూ వచ్చాను. ఒక నాస్తికుడిగా కూడా!  
   

కట్ టూ "దేవుడితో నేను" - 

ఇటీవలి మూడు నాలుగేళ్లకాలంలో నా జీవితంలో జరిగిన ఊహకందని, ఊహించలేని కొన్ని సంఘటనలు నా ఆలోచనల్ని, నా జీవనశైలిని, జీవితంపట్ల నా దృక్పథాన్ని.. సంపూర్ణంగా మార్చివేశాయి.

జీవితంలో ఏది ముఖ్యమో, ఏది నిజమో తెల్సుకునేలా చేశాయి.

ఇప్పుడు నేను ఒక సంపూర్ణ ఆస్తికుణ్ణి.

ఒక్కొక్కరూ ఒక్కో రూపంలో దేవుడ్ని నమ్ముతున్నట్టు.. నాకూ ఒక దేవుడున్నాడు. ఆయనే నన్ను కాపాడుతున్నాడు. కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు.

నేను నా దేవున్ని ఏ కోరికలూ కోరటం లేదు. ఆయనకు తెలుసు.. నా జీవితం ఏమిటో, నా జీవితంలో ఇంకా ఏం జరగాలో.

ముందే చెప్పినట్టు - ఈ "క్విడ్ ప్రో కో" లకు నేను చాలా దూరం. జీవితంలో ఎత్తుపల్లాలు, సుఖదుఖాలు శాశ్వతం కాదు. నేను నేనుగా బ్రతకడమే శాశ్వతం. నిజం.

మిగిలినదంతా ఉట్టి భ్రమ.. మాయ. మన అహాన్ని సంతృప్తి పర్చుకోవడం కోసం మనం వేసుకుంటున్న మాస్కులు.

అయితే నేను మాత్రం నా దేవుడికి చాలా చేయాలనుకుంటున్నాను. అది పూర్తిగా నా సంతృప్తి కోసం.

ఇలా నేను చేయాలనుకుంటున్నవాటిల్లో కనీసం కొన్నింటినయినా పూర్తిచేయగలననే ఈ బ్లాగ్ రాస్తున్న ఈ క్షణంలో కూడా నేననుకుంటున్నాను. ఆయన నాతో చేయించుకుంటాడన్న నమ్మకం కూడా ఈ క్షణం నాకుంది.

నా నమ్మకాన్ని నేను చూస్తున్న రూపం, నా నమ్మకానికి నేను పెట్టుకున్న పేరు మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనే అనుకుంటున్నాను.

భగవాన్ శ్రీ షిర్డీ సాయిబాబా. 

No comments:

Post a Comment