Friday 8 November 2013

ఒక బిర్యానీ పొట్లం, ఒక మందు బాటిల్, ఒక 500 నోటు!

ఇవాళ సాయంత్రం టీవీలో సీనియర్ హీరోయిన్ జయసుధ ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్‌వ్యూలో తను చెప్పాలనుకున్న చాలా విషయాల్ని ఆమె చెప్పలేకపోయింది. చెప్పిన ఆ కొన్ని విషయాల్ని కూడా ఎంతో బ్యాలెన్స్‌డ్‌గా చెప్పడానికి చాలా ఇబ్బంది పడింది. ఎంతో చెప్పాలనుకున్నా, చెప్పలేకపోతున్న ఆమె ఇబ్బంది చూస్తుంటే నాకే చాలా ఇబ్బందిగా అనిపించింది.

అదొక రాజకీయ ఇంటర్‌వ్యూ. ఒక పొలిటీషియన్‌గా ఆమె నుంచి కొన్ని పచ్చి నిజాలు రాబట్టిన ఇంటర్వ్యూ అది.

ఒక "శివరంజని", ఒక "మేఘసందేశం" చాలు ఆమెను తెలుగు ప్రేక్షకులు గుర్తుపెట్టుకోడానికి. సహజనటిగా ఎంతో మంచి పేరు తెచ్చుకుని, సుమారు 40 ఏళ్లుగా సినీ ఫీల్డులో చాలా డిగ్నిఫైడ్‌గా ఉందా నటి. తన పేరు చెడగొట్టుకొనే ఎలాంటి వివాదాలు దాదాపు ఆమెకు తెలియవు.

కొన్నేళ్లక్రితం తన వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక అనుభవాలవల్ల, ఆసక్తివల్ల ఎలాంటి సంకోచం లేకుండా మతం కూడా మారిందామె. ఆ విషయాన్ని కూడా ఎన్నోసార్లు, ఎన్నో ఇంటర్వ్యూల్లో చాలా డిగ్నిఫైడ్‌గా చెప్పుకోగలిగిందామె. అది ఎవరికీ అభ్యంతరం ఉండకూడని విషయం.

నిజానికి మతం అనేది మానవసృష్టి. నా దృష్టిలో అది పూర్తిగా వ్యక్తిగతం.

వ్యక్తిగతమైన ఈ విషయాన్ని కూడా చాలా మంది పిచ్చి రాజకీయం చేస్తారు. అలాంటి రాజకీయం, కామెంట్లు జయసుధ మీద చేయలేకపోయారెవ్వరూ. అదీ జయసుధ సంపాదించుకున్న పేరు.

అలాంటి జయసుధ.. బై మిస్టేక్.. రాజకీయాల్లోకి ఎంటరయింది. కాదు, వైయెస్సార్ రప్పించాడు. "ఏదో ప్రజలకు సేవ చేయొచ్చు కదా" అని అమాయకంగా అనుకుని ఉంటుంది జయసుధ. ఆమె చేసిన పెద్ద తప్పు అదే, బహుశా.

"ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోనే ఉండాల్సిన అవసరం లేదు" అని ఇవాళ తనే చెప్పింది. జయసుధ చెప్పింది వంద శాతం నిజం.

భాష, ప్రవర్తన, కనీస మర్యాద, చాలా సందర్భాల్లో కనీస మానవత్వం .. ఇవన్నీ ఏవీ  తెలియని, తెలుసుకోవడం అవసరం లేని.. 'బాగా డబ్బు, బలగం ఉన్న వ్యక్తుల  మెజారిటీ'నే నేటి రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థ  అని చాలా ఇబ్బంది పడుతూ చెప్పింది జయసుధ.

"ఒక బిర్యానీ పొట్లం, ఒక మందు బాటిల్, ఒక 500 నోటు.. ఇదే నేటి రాజకీయం! ఈ కల్చర్ పోవాలి రాజకీయాల్లో".. అందామె ఎంతో బాధగా. ఇంతకంటే సింపుల్‌గా, స్పష్టంగా ఇంకా ఏం చెప్పాలి?

వ్యక్తిగత ఎజెండాలు, ప్రతిదాన్లోనూ పర్సనల్ ఐడెంటిటీ కోసం కుట్రలు, ఎంత ఖర్చు పెట్టాం.. ఎంత లూటీ చేద్దాం.. ఇదే ప్రస్తుతం మనదేశంలో ఉన్న రాజకీయం.

ఈ రాజకీయం ఇప్పటిది కాదు. స్వతంత్రం వచ్చిన ఆరంభంలోనే ఈ కల్చర్‌కు పునాదులు పడ్దాయి. ఆ పునాదులమీదే 66 ఏళ్లుగా ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి.

సహజ నటి జయసుధ ఊహించిన రాజకీయాలు ఇవికావు, బహుశా. చివరికి, ఈ దేశంలోని రాజకీయాలు చూస్తుంటే "అసలు దేశమే వదిలి వెళ్లిపోవాలనిపిస్తోంది" అంది జయసుధ.

వద్దని జయసుధని ఆపగలమా? ఆపడానికి మనదగ్గర ఏ లాజిక్స్ ఉన్నాయి? ఇవాళ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన చేదు నిజాల్ని అబద్దం అని ఎలా చెప్పగలం? అన్నీ నిజాలే ..      

No comments:

Post a Comment