Saturday 3 August 2013

అసలు సినిమాలెందుకు ఆగిపోతాయి?

నా చిన్నప్పటినుంచీ వింటున్నాను - బోలెడన్ని సినిమాలు రిలీజ్ కాకుండా ప్రసాద్ ల్యాబ్‌లో కుప్పలుగా పేరుకుపోయి ఉన్నాయని. అది అబధ్ధమేం కాదు. 100% నిజం.

అయితే, ఒక్క ప్రసాద్ ల్యాబే కాదుగా? ఇంకా ఎన్నో స్టూడియోలు, ల్యాబ్‌లూ ఉన్నాయి. వాటిల్లో కూడా, నిజంగానే రిలీజ్ కాని చాలా సినిమాలు అలా పడిపోయుంటాయి.

ప్రతి సంవత్సరం ప్రారంభమయ్యే ఎన్నో సినిమాల్లో - కొన్ని సినిమాలు పూర్తికాకపోవటం, పూర్తయినా రిలీజ్ కాకపోవటం అనేది ఒక అత్యంత సర్వసాధారణమైన విషయం.

ఈ పరిస్థితి ఒక్క తెలుగు సినిమాలకే పరిమితం కాదు. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అంతటా ఉన్నదే. ఇక ముందు కూడా ఈ మాటను మనం వింటూనే ఉంటాం, ఒక ఎవర్ గ్రీన్ స్టేట్‌మెంట్‌లా.

అన్నేసి లక్షలు, కోట్లు కుమ్మరించి కూడా అసలెందుకీ పరిస్థితి? ఎందుకు సినిమాలు ఆగిపోతాయి?

ఈ పరిస్థితికి సాధారణంగా 90 శాతం కారణం ఒక్కటే అయి ఉంటుంది. అది - సినిమా నిర్మాణం పట్ల, సినిమా వ్యాపారం పట్ల ఒక కనీస అవగాహన లేకపోవడం.

సాధారణంగా ఇలా ఆగిపోయే సినిమాల్లో 99% సినిమాలు కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు తీసినవే అయి ఉంటాయి. ముందూ వెనకా ఆలోచించకుండా, కొత్త ఉత్సాహంతో రంగంలోకి దూకేస్తారు. తర్వాత ఫీల్డులోని వాస్తవాలు, బిజినెస్‌లోని వాస్తవాలు ఒక్కొక్కటిగా తెలుస్తుంటే గిల గిల కొట్టుకుంటారు. కానీ అప్పటికే పరిస్థితి వారి చేయి దాటిపోయి ఉంటుంది.

మనం ఎలాంటి కథతో సినిమా తీస్తున్నాం, దాని టార్గెట్ ఆడియెన్స్ ఎవరు, ఎవరితో తీస్తున్నాం, వారికి ఫీల్డులో ఉన్న మార్కెట్ ఏంటి, మనం ఆ మార్కెట్‌కు లోబడే ఖర్చు పెడుతున్నామా, మార్కెట్ పరిమితి దాటి రిస్కు తీసుకుంటున్నామా.. ఇవన్నీ అలోచిస్తే ఒక్క సినిమా కూడా ఆగదు. అది ఫ్లాప్ అవుతుందా, హిట్ అవుతుందా అన్నది తర్వాతి ప్రశ్న.

కానీ, సినిమా బిజినెస్ పట్ల కనీస అవగాహన తెచ్చుకొని సినిమా తీస్తే మాత్రం సినిమాలు మధ్యలో ఆగిపోయే పరిస్థితి ఉండదు.

> సినిమాలు ఆగిపోవడం ఎక్కువగా ముందు అనుకున్న బడ్జెట్ దాటిపోవటం వల్ల జరుగుతుంది. సగం సినిమా షూటింగ్ తర్వాత డబ్బులు అయిపోతే ఇంక చెయ్యడానికి ఏముంటుంది? శుభం కార్డు స్టూడియోలోనే పడుతుంది. ఇంక ఆ సినిమా బయటికి రాదు.

> కొన్ని సినిమాలు పూర్తవుతాయి. కానీ, వాటిని కొని రిలీజ్  చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ రారు. స్వంతంగా రిలీజ్ చేసుకొనే శక్తి నిర్మాతకి ఉండదు. అంతే. ఇంక ఆ సినిమా రిలీజ్ అవదు.

సినిమా బిజినెస్ అన్ని వ్యాపారాల్లా కాదు. ముందే ఒక ఖచ్చితమైన్ ప్లాన్‌తో, ఒక అవగాహనతో - అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తే ఎలాంటి సమస్యలు రావు. అలా కాకుండా ఓవర్‌కాన్‌ఫిడెన్స్‌తో గుడ్డిగా వెళితే మాత్రం అంతిమ ఫలితం ఇలాగే ఉంటుంది.

పైన మనం చర్చించిన కారణం కాకుండా, కొన్ని ఊహించని కారణాలవల్ల కూడా అరుదుగా కొన్ని సినిమాలు ఆగిపోతాయి. వాటిల్లో నాకు తెలిసిన ఒక ఆసక్తికరమైన ఉదాహరణతో మరొక బ్లాగ్ పోస్ట్‌లో కలుద్దాం.

కట్ టూ మై కేస్ -

నేను తీసిన రెండు చిత్రాలూ అనుకున్న బడ్జెట్లో పూర్తిచేశాను. రిలీజ్ కూడా చేశాను. బిజినెస్ బాగానే వచ్చింది. శాటిలైట్ రైట్స్ కూడా బాగానే పలికింది. శివాజీ హీరోగా ఇటీవలే పూర్తిచేసిన నా మూడో చిత్రానికి కూడా మంచి శాటిలైట్ రైట్స్ వచ్చాయి. త్వరలో రిలీజ్ కూడా కాబోతోంది.

సరిగ్గా చేసుకుంటే ఈ షో బిజినెస్‌ని మించిన బిజినెస్ లేదు.  డబ్బూ, డబ్బుతోపాటు ఓవర్‌నైట్‌లో మనం ఊహించనంత ఫేమ్ కూడా ఈ ఒక్క బిజినెస్‌లోనే సాధ్యం. అందుకే ఈ ఫీల్డంటే అందరికీ అంత ఆసక్తి. అంత ఎట్రాక్షన్.

ఒక్క హిట్ గానీ ఇచ్చామా.. ఇంక అంతే. అప్పటివరకూ మీరు పడ్డ అన్ని కష్టాలూ హుష్ కాకి అయిపోతాయి. ఇంక మీరు ఏది అనుకుంటే అదే!   

1 comment:

  1. అసలు సినిమాలు ఎందుకు ఆగిపోతాయి?తైలం అయిపోతే మధ్యలో పడవ అమాంతం మునిగిపోతుంది!దర్శకుడు బిక్కమొహం వేస్తాడు!నిర్మాత గుడ్లు తేలేస్తాడు!నాయికానాయకులు వేసుకున్న రంగు వెలసిపోతుంది!సినిమాటోగ్రాఫర్ కెమెరా ఒరిగిపోతుంది!సంగీతదర్శకుడి రాగాలు రోగాలతో కొట్టుమిట్టాడతాయి!అప్పటిదాకా అందరూ కలసి సమష్టిగా చేసిన కృషి బూడిదలో పోసిన పన్నీరవుతుంది!సాంకేతనిపుణుల నిపుణతలు వెలవెలబోతాయి!సినిమా గుండెఆగిపోతుంది!ధనం ఉంటే చెత్త సినిమా కూడా విడుదల అవుతుంది!డబ్బు లేకపోతే మంచి సినిమా కూడా ఆగిపోతుంది!

    ReplyDelete