Wednesday 21 August 2013

డిజిటల్ సినిమా భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?

సినిమా తీయడానికి ఫిలిం నెగెటివ్ వాడటం అనేది క్రమంగా కనుమరుగైపోతోంది. అవక తప్పదు. ఫిలిం నెగెటివ్ అనేది ఇప్పుడొక 'గతం'.

"ఓహో! సినిమాను అలా ఫిలిం నెగెటివ్‌తో కూడా తీసేవాళ్లా?!" అని తర్వాతి తరాలవాళ్లు వాళ్ల చరిత్ర పుస్తకాల్లో చదువుకోవాల్సిందే.

ఇప్పుడంతా డిజిటల్ యుగం. టెక్నికల్‌గా అయితే, సినిమా నిర్మాణం కోసం ఇదివరకులా కోట్లాది రూపాయలు అవసరం లేదు. కొన్ని లక్షల్లోనే మంచి కంటెంట్‌తో, క్వాలిటీతో సినిమా తీయవచ్చు.

కేవలం ఆయా హీరో హీరోయిన్లు, ఇతర సహ నటీనటులు, టెక్నీషియన్లకు మార్కెట్లో ఉన్న డిమాండును బట్టి - వారికిచ్చే పారితోషికాలు, ఇతర హంగులు, ఆర్భాటాలు, ఫారిన్ షూటింగులవంటివే బడ్జెట్‌ను పెంచుతాయి.

ఒక 50 లక్షల్లో - కొత్త ఆర్టిస్టులతో, వినూత్నమైన కంటెంట్‌తో,  మంచి రిచ్ లుక్ ఇచ్చే ఒక హిందీ సినిమాను కూడా సులభంగా నిర్మించవచ్చు. అలా హిందీలో నిర్మిస్తున్నారుకూడా. ఇంక తెలుగు విషయం చెప్పాల్సిందేముంది? ఈ బడ్జెట్ ఇంకొంతయినా ఈజీగా తగ్గుతుంది.

ఈ నేపథ్యంలో కొత్త నిర్మాతలు, దర్శకులు చాలామంది పుట్టుకొస్తారు. ఎన్నో సినిమాలు తయారవుతూ ఉంటాయి. అయితే, సమస్యంతా రెండు విషయాల దగ్గరే ఉంటుంది. ఒకటి సినిమా క్వాలిటీ, రెండోది రిలీజ్.

సహజంగానే క్వాలిటీలేని సినిమాలు ఎప్పట్లాగే థియేటర్లలో రిలీజ్ కావు. కథ, కథనం (కంటెంట్) విషయంలో ఒక స్టాండర్డుని మెయింటెయిన్ చేసిన చిత్రాల విషయంలో రిలీజ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

యూటీవీ, ఇరోస్ వంటి కార్పొరేట్ సంస్థలు ఈ సినిమాలను మంచి ఆఫర్‌తో "అవుట్‌రైట్" పధ్ధతిన కొనేసుకొని రిలీజ్ చేస్తాయి. తమ సినిమాలు ఆడినా ఆడకపోయినా - ఈ పధ్ధతిలో బిజినెస్ చేసిన ఆయా చిత్రాల నిర్మాతలకు ఎలాంటి నష్టం ఉండదు.  

ఇక కార్పోరేట్లు రిలీజ్ చేసిన చిత్రాల్లో హిట్టయిన చిత్రాల దర్శక నిర్మాతలకు ఎలాగూ మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. దాన్నిబట్టే ఆయా దర్శకుల పారితోషికాలు, నిర్మాతల "అవుట్‌రైట్ సేల్స్" స్థాయి కూడా సహజంగానే పెరుగుతుంటుంది.

క్రమంగా కార్పొరేట్ సంస్థలు ఆయా దర్శక నిర్మాతలతో "టై-అప్" అవుతారు. వారికి కావల్సిన పెట్టుబడిని కూడా ఆయా కార్పొరేట్ సంస్థలే ఇచ్చి, తమకు కావల్సినన్ని సినిమాలను తయారుచేయించుకుంటూ ఉంటాయి. అంటే సినిమాల నిర్మాణం, వ్యాపారం అనే వ్యవస్థ చూస్తూండగానే పూర్తిగా కార్పొరేట్‌మయమైపోతుంది.

కట్ టూ సినిమాల రిలీజ్ రేంజ్ -

ప్రతి హిట్ సినిమా, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కనీసం 30 భాషల్లోకి డబ్ చేయబడిగాని, ఆయా భాషల సబ్‌టైటిల్స్‌తో గానీ రిలీజ్ చేయబడుతుంది. క్రమ క్రమంగా సినిమాలను మల్టిప్లెక్సుల్లోంచి, నేరుగా ఇంట్లోకే రిలీజ్ చేయడం అనేది సర్వసాధారణమైపోతుంది.

చాలా సినిమాలను అసలు థియేటర్లలో రిలీజ్ చేయకుండా, ఇంటర్నెట్ ద్వారా నేరుగా ఇంట్లోకే రిలీజ్ చేస్తారంటే ఆశ్చర్యంగా ఉంటుంది వినడానికి. కానీ, నిజం. ఈ ట్రెండు హాలీవుడ్‌లో ఇప్పటికే ప్రారంభమైపోయింది.

థియేటర్లో వందలాదిమంది ఆడియెన్స్ మధ్యలో కూర్చుని కాకుండా - తన సినిమాని ప్రశాంతంగా, ఒంటరిగా, లేదంటే తనకు అతి దగ్గరి వారితోగాని మాత్రమే కూర్చుని  చూడాలనుకున్నాడొక డైరెక్టర్. ఆ సబ్జెక్ట్ ఫీల్ అలాంటిది. అందుకని, థియేటర్లను కాదని, కేవలం అమెజాన్ "వీడియో ఆన్ డిమాండ్", యాపిల్ "ఐట్యూన్స్" ద్వారానే తన చిత్రాన్ని రిలీజ్ చేశాడా దర్శకుడు.  ఆ అద్భుత చిత్రం గురించి మరోసారి - ఇదే బ్లాగ్‌లో ..   

No comments:

Post a Comment