Sunday 18 August 2013

శాటిలైట్ రైట్స్ ఎందుకు అదృశ్యమైపోయాయి?

మా చిన్నతనంలో సినిమాల రిలీజ్ కోసం డిస్ట్రిబ్యూషన్ అని ఒక మంచి ఆరోగ్యకరమైన వ్యవస్థ ఉందేది (ట!). సినిమా తీసే నిర్మాతలకూ, ఈ డిస్ట్రిబ్యూటర్లకు మధ్య మంచి మానవీయ సంబంధాలు ఉండేవని కూడా చాలా విన్నాను. ఒక నిర్మాత సినిమా ప్రారంభించాడంటే - ఆయనకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు ఆ సినిమా పూర్తయ్యేవరకూ హార్ధికంగా, ఆర్ధికంగా నిర్మాతకు ఎంతో అండగా ఉండేవారట.

ఇప్పుడలాంటి అనుబంధాలేం లేవు. అంతా హెవీ గ్యాంబ్లింగ్!

ఇలాంటి గ్యాంబ్లింగ్ నేపథ్యంలో కొత్తవాళ్లతో తీసిన నిర్మాతలకు అసలు సినిమాని కొని రిలీజ్ చేసే డిస్ట్రిబ్యూటర్లుంటారన్న ప్రసక్తే లేదు! అయితే ఆ నిర్మాతే రిలీజ్ చేసుకోవాలి. లేదంటే వేరే ఎవరినైనా నమ్మి తన సినిమాని వాళ్ల చేతుల్లో పెట్టాలి. ఆ తర్వాత, మీద తడిగుడ్డ వేసుకొని ఎదురుచూస్తుండాలి.. ఏమయినా డబ్బులు వస్తాయేమోనని! అదంతా జరగని పని అని తర్వాత తెలుస్తుంది. అది వేరే విషయం.

టీవీ చానెల్స్ పుణ్యమా అని, ఆకాశంలోంచి ఊడిపడ్డట్టుగా కొత్తగా "శాటిలైట్ రైట్స్" అనేది ఒకటి వచ్చింది. కొత్తవాళ్లతో సినిమాలు తీసేవాళ్లకు ఇదొక ఊహించని ఖచ్చితమైన ఆదాయ మార్గం. ఎంతో కొంత డబ్బు అనేది వచ్చితీరుతుందన్నమాట!

శాటిలైట్ రైట్స్ అంటే మరేంటో కాదు. సినిమా రిలీజ్ అయ్యాక, ఆ సినిమాని టీవీ చానెల్స్ ప్రసారం చేస్తాయి. అలా చేసినప్పుడు వాళ్లకి బోలెడన్ని యాడ్స్, స్పాన్సర్స్ రూపంలో చాలా డబ్బు వస్తుంది. ఇలా ఆ సినిమాను టెలికాస్ట్ చేసిన ప్రతిసారీ వస్తుంది.  

ఇలా వచ్చే డబ్బు కోసం, ప్లస్, చానెల్స్ మధ్య ఉండే పోటీ తట్టుకోవడం కోసం చానెల్స్ కి సినిమాలు కావాలి. అందుకని చానెల్స్ సినిమాలని కొంటాయి. అదే శాటిలైట్ రైట్స్.

సినిమా సక్సెస్ అయినా, ఫెయిలయినా శాటిలైట్ రైట్స్ కి సంబంధం లేదు. ఆ సినిమా మార్కెట్ విలువను బట్టి ఒక రేట్ కి సినిమాను కొంటారు. ఆ డబ్బు సినిమా రిలీజ్ లోపే రెండు మూడు ఇన్స్‌టాల్‌మెంట్స్‌లో వచ్చేస్తుంది! ఇంకేం కావాలి?

అయితే, మనవాళ్ల తెలివి చిన్నది కాదుకదా? ఒక వరంలా వచ్చిన దీన్ని ఎంత దారుణంగా మిస్‌యూజ్ చేయవచ్చో అంతా చేశారు.

కేవలం ఇలా వచ్చే డబ్బు కోసమే సినిమాలని 2,3 రోజుల్లో చుట్ట చుట్టేస్తూ కొంతమంది కోట్లు సంపాదించారు. ఆ మాత్రం ఓపిక కూడా లేని మరికొంతమంది ఇంకో విచిత్రం చేశారు. సినిమా ఓపెన్ చేయటం, శాటిలైట్ రైట్స్ అగ్రీమెంట్ చేసుకోవటం, అడ్వాన్స్ తీసుకోవడం, తర్వాత దుకాణం మూసేయడం!

ఇదిగో, ఇలాంటి పరిణమాలవల్ల  - నిజమైన ప్యాషన్‌తో, కొత్తవాళ్లతో చిన్న సినిమాలని తీసే ఔత్సాహికులకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఇప్పుడు అసలు కొత్తవాళ్లతో తీసే సినిమాలకు శాటిలైట్ రైట్స్ ఇవ్వడానికి ఏ చానెల్ కూడా ముందుకు రావటం లేదు. సినిమా అంతా పూర్తయ్యి, అది రిలీజ్ అయ్యాకే శాటిలైట్ రైట్స్!

అయినా ఓకే. ఎందుకంటే, ఈ ఒక్క శాటిలైట్ రైట్స్ అనేదే సినిమా తీశాక ఖచ్చితంగా వచ్చే మొదటి ఆదాయం!

మిగిలినవన్నీ స్పెక్యులేషన్ తప్ప మరొకటి కాదు. ఎందుకంటే, ఇక్కడ సినిమా రంగంలో రూల్స్ అనేవి ఉండవు. ఏదో ఒక సినిమాకి వచ్చిన బిజినెస్‌ను చూసి మన సినిమాకూ అలాగే వస్తుంది అనుకోవటం కుదరదు. ఇంకా చెప్పాలంటే కొన్ని చిన్న సినిమాలు హిట్టయినా డబ్బులు రాని సందర్భాలుంటాయి.

ఇక్కడ నిర్మాత చేతికి వచ్చిందే డబ్బు. మిగిలిన మాటలన్నీ ఉట్టి ట్రాష్.

ఒక మైక్రో బడ్జెట్ సినిమా ప్లాన్ చేసేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. బడ్జెట్ మార్కెట్ పరిధిని దాటకుండా చూసుకోవాలి. ఆ పరిధి దాటిన బడ్జెట్‌కు తిరిగి వస్తుందన్న గ్యారంటీ ఎవరూ ఇవ్వలేరు.

కట్ టూ శాటిలైట్ రైట్స్ సత్తా -

ఆ మధ్య హిట్తయి ట్రెండ్ సెట్ చేసిన ఒక చిన్న యూత్ సినిమా రిలీజ్ కు ముందు థర్డ్ పార్టీకి అమ్మిన శాటిలైట్ రైట్స్ 30 లక్షల లోపే. ఆ సినిమా రిలీజ్ తర్వాత, అదే థర్డ్ పార్టీకి, చానల్ నుంచి అదే సినిమాకు వచ్చిన అసలు శాటిలైట్ రైట్స్ 2 కోట్లు! అదీ సినిమా ..     

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. సినిమా నిర్మాణ పరమపద సోపానపటంలో నిచ్చెనల కంటే పాములే ఎక్కువ ఉంటాయి!శాటిలైట్ రైట్స్ నిర్మాతకు ఆశను,ప్రాణవాయువును అందిస్తాయి!ఏది ఏమైనా కొత్తవాళ్ల సినిమాలు విరివిగా రావాలి,విజయ దుందుభులు మోగించాలి!నేను ఆశావాదిని!

    ReplyDelete