Tuesday 25 June 2013

అన్నింటికంటే పెద్ద లక్ష్యం!

లైఫ్ అనేది చాలా సింపుల్. మనమే దాన్ని కాంప్లెక్స్ చేసుకుంటున్నాం ..

జీవితంలో అన్ని నిర్ణయాలూ మనం ఆలోచించి తీసుకోలేం. మనం ఉన్న పరిస్థితులు, మన మానసిక స్థితి, మనం ఎదుర్కొంటున్న వత్తిళ్లు.. ఇవన్నీ మనం తీసుకొనే నిర్ణయాల మీద ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తాయి.

నేపథ్యం ఏమైనప్పటికీ, మనం తీసుకొన్న కొన్ని అనాలోచిత నిర్ణయాల ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు. దీన్నే కొంచెం పాజిటివ్‌గా చెప్పాలంటే, ఆ నిర్ణయాల ఫలితాల్ని, పరిణామాల్ని విధిగా మనం ఎదుర్కొని తీరాలి. ఆ క్రమంలోనే మన జీవితాన్ని వీలయినత సింప్లిఫై చేసుకోవాలి.

ప్రతిరోజునీ మనకిష్టమైన పధ్ధతిలో జీవిస్తూ, మనకిష్టమైన పని చేస్తూ, ఆ పనిలోనే ఆనందాన్ని అనుభవించగలగాలి. ఎలాంటి "మాస్క్"లు లేని మనకిష్టమైన జీవన శైలిని ఎంజాయ్ చేయగలగాలి. అయితే, ఇది ఈ బ్లాగ్‌లో ఏదో నాలుగు మాటల్లో రాసినంత సులభం కాదు.  

మన ఆధునిక జీవనశైలి పూర్తిగా "మాస్క్"లమయమైపోయింది. ఎవరినో సంతృప్తి పర్చడానికి ఏదేదో చేస్తున్నాం. ఎవరో ఏదో అనుకుంటారని మనకు ఇష్టంలేని నిర్ణయాలు తీసుకుంటున్నాం. నిజంగా, నిజం మాట్లాడలేని అత్యంత దయనీయమైన పరిస్థితిలో జీవిస్తున్నాం. ఈ నిజాన్ని బయటికి ఒప్పుకోలేని ఈగోతో సహవాసం చేస్తున్నాం.

ఆ పరిస్థితికి ఎన్నో కారణాలున్నాయి. వాటిలో ఒక అతి ముఖ్యమైన కారణం - భయం. సమాజంలో నేను "ఇలా ఉండాలి" అని ఎవరితోనో పోల్చుకోవటం.. అలా నేనూ ఉండకపోతే అందరూ ఏమనుకుంటారన్న భయం. ఆత్మన్యూనతా భావం. ఈ భయంతోనే - అందంగా, ఆనందంగా గడపాల్సిన ఈ  చిన్ని జీవితానికి ఎన్నో బలవంతపు లక్ష్యాలు పెట్టుకుంటున్నాం. వాటిని నిజం చేసుకోడానికి జీవితాన్ని ఎన్నోరకాలుగా ఉరుకులు పెట్టిస్తున్నాం.  అనుక్షణం మనశ్శాంతి కోసం తపిస్తున్నాం. 

మన ఆధునిక జీవనశైలిలో, మనం ఏదయినా సాధించాము.. లేదా సాధిస్తున్నాము అనుకుంటే - అది ఇదే!  

సో, నామటుకు నాకు 'ఇంక చాలు' అనిపిస్తోంది. నా లెస్ ఫిలాసఫీ ప్రకారం 'లెస్ ఈజ్ మోర్!' .. ఇంకా చెప్పాలంటే - అసలు గోల్స్ లేకపోవడమే ఒక పెద్ద గోల్!

ఎలాంటి మానసిక వత్తిడి ఉండదు. ప్రతి క్షణాన్నీ మన ఇష్ట ప్రకారం ఎంజాయ్ చేస్తుంటాము. అప్పుడు, అలాంటి స్థితిలో, నిజంగా మనకేం కావాలో అవి మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. సులభంగా వస్తాయి. మనతోనే ఉంటాయి.  

No comments:

Post a Comment