Monday 3 June 2013

మనుషులు ఇలా కూడా ఉంటారు - 2

ఇలాంటి పోస్టులు బ్లాగ్‌లో రాసినప్పుడల్లా నా బిగ్ 5 మిత్రుల్లో ఒకరు "ఇది జీవితం మాస్టారూ.. ఇవన్నీ మామూలే!" అంటారు. అసలు ఇలాంటి నెగెటివిటీకి ఎంత దూరం ఉందామన్నా, అది ఏదో ఒక పనికిరాని చెత్త రూపంలో నాకు దర్శనమిస్తూనే ఉంది. నా మిత్రుడన్నట్టు, దిస్ ఈజ్ లైఫ్!

ఈ మధ్యే ఒక సినిమా ప్రపోజల్ విషయంలో సహనిర్మాతలుగా ఫీల్డులోకి ఎంటర్ కావాలన్న ఆసక్తితో ఓ ఇద్దరు మహాశయులు పరిచయమయ్యారు. ఆ ఇద్దరూ స్వయంగా అన్నాదమ్ములే. ఇక్కడ "మహాశయులు" అన్న పదం వాడుతున్నాను అంటే.. దాన్నిబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. వాళ్లు చాలా గొప్పవాళ్లు అని వాళ్ల వ్యక్తిగత భావన. కాకపోతే, వాళ్ల ఆ గొప్పతనం రంగు పాజిటివ్‌దా, నెగెటివ్‌దా అన్నది ఈ బ్లాగ్ చదివాక మీరే నిర్ణయించాలి.

 ఈ ఇద్దరు మహాశయుల్లో మొదటి వ్యక్తి సరిగ్గా మొన్న ఉగాది నాడు మొదటిసారిగా ఫోన్ చేశాడు. కో ప్రొడ్యూసర్ విషయంలో నా రిక్వైర్‌మెంట్ చాలా చిన్నది. కేవలం కొన్ని లక్షలు మాత్రమే. కొత్తగా పరిచయం చేసుకున్న మన వాడు మాత్రం ఓ తెగ రెచ్చ్చిపోయాడు. వాళ్ల జిల్లాలో వారికున్న పేరు ప్రఖ్యాతుల గురించి చెప్పాడు. ఒక్క ఫోన్ కాల్‌తో లక్షలు కాదు.. కోట్లు తెచ్చిపెట్టేవాళ్లు, ఇచ్చేవాళ్లు తనకు లెక్కలేనంతమంది ఉన్నట్టు చెప్పాడు!

ఇవన్నీ పక్కా కోతలు అని నాకు తెలుసు. నిజంగా ఆ రేంజ్‌లో ఉన్నవాడయితే నాకెందుకు ఫోన్ చేస్తాడన్నది కామన్‌సెన్స్!

కట్ చేస్తే -

తామిద్దరూ చేస్తున్న రెండు బిజినెస్‌ల గురించి మహా గొప్పగా, ఇంకా చెప్పాలంటే, నోటికి అప్పుడు ఏదొస్తే అది చెప్పాడు. అవి నిజంగా అంత టర్నోవర్ ఉన్న బిజినెస్‌లు కావని చిన్న పిల్లాడు కూడా చెప్తాడు.

మరొక విషయం ఏంటంటే.. ఎవరయినా బిజినెస్ విషయాలు మాట్లాడ్డానికి తమకున్న బిజినెస్ ప్లేస్‌కి తీసుకెళ్తారు. కానీ, వీళ్లు నన్ను ఇంటికి తీసుకెళ్లారు. అలా వీళ్లు నన్ను ఎప్పుడయితే ఇంటికి తీసుకెళ్లారో అప్పుడే నాకు అర్థమైపోయింది. అంతా ఉట్టి డొల్ల అని.

ఇక ఈ ఇద్దరు మహాశయుల్లో రెండో వ్యక్తి గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. అంతా సోది, సుత్తి తప్ప అసలు విషయం డైరెక్టుగా మాట్లాడే సత్తా లేదు ఈయనకి. అసలు డబ్బే చేతిలో లేనప్పుడు విషయం ఎలా మాట్లాడగలడు?

నన్నూ, నా సినిమా ప్రాజెక్టును ఎరగా చూపి, ఏమేమో చేయడానికి ఈ ఇద్దరు మహాశయులు ప్లాన్లయితే వేశారు. అతి చిల్లరగా, నాకు రకరకాల ఎరలు వేయడానికి కూడా ప్రయత్నించారు. నేనెక్కడా రియాక్టవలేదు.

నేను ఎప్పుడు వాళ్లతో మాట్లాడినా, నాకు వాళ్లతో ఏ విషయం గురించి అవసరమో ఆ ఒక్కటే మాట్లాడాను. అదీ చాలా స్పష్టంగా మాట్లాడాను. మరే విషయం నేనసలు పట్టించుకోలేదు.

కట్ టూ నిజస్వరూపం -  

ఎప్పటికప్పుడు "మహాశయుడు నెంబర్ 1" ని నేను చాలా గట్టిగా అడిగేవాణ్ణి. "ఒకవేళ మీ వల్ల కాకపోతే ఇప్పుడే చెప్పండి. నేను ప్యారలల్‌గా వేరే ప్రయత్నాలు కూడా చేసుకుంటాను. లేదంటే, చివరికి మీరు చేతులెత్తేస్తే, మళ్లీ నేను మొదట్నుంచీ ప్రయత్నాలు చేసుకోవాల్సి ఉంటుంది" అని.

దానికి నెంబర్ 1 గాని, నెంబర్ 2 గాని, "మొత్తం డబ్బు మా దగ్గర ఉంది. అసలు డబ్బు గురించి మీరు ఆలోచించే అవసరమే లేదు. ఒక రోజు అటూ ఇటూ అంతే!" అనేవాళ్లు.

అయితే, ఆ "ఒక్క రోజు అటూ ఇటూ" కాస్త 50 రోజులు ఆడింది. విషయం శూన్యం.  

వాళ్లకు ఆ శక్తి లేదు. అంత సీన్ కూడా లేదు. అత్యంత అధమ స్థాయిలో డ్రామా ఆడిన ఆ మహాశయులిద్దరూ చివరికి నా ఫోన్ ఎత్తలేకపోయారు. నా మెసేజ్‌లకి రిప్లై కూడా ఇవ్వలేకపోయారు!

ఇలా - ఒక క్రియేటివ్ పర్సన్ కెరీర్‌తో ఆడుకోవటం ద్వారా వాళ్లు సాధించిందేమిటో నాకర్థం కాలేదు. వాళ్లల్లో ఉన్న శాడిజాన్ని బయటపెట్టుకోవటం తప్ప!

నాకు తెలుసు. బయటనుంచి డబ్బు ఫ్రీగా సేకరించడానికి వాళ్లు నానా ప్రయత్నాలు చేశారు. ఏ ఒక్కటీ కాలేదు. ఏం చేస్తారు పాపం? నాకు కొత్తగా స్టోరీలు చెప్పడానికి కూడా ఏమీ మిగల్లేదు. ఇంక నా ఫోన్ ఎలా ఎత్తగలరు? నా మెసేజ్‌లకి రెప్లై ఎలా ఇవ్వగలరు?

ఇట్లాంటి వాళ్లకోసం నా విలువైన సమయం కోల్పోడానికీ, వాళ్లను అంతగా భరించడానికీ కారణం ఒక్కటే. వాళ్లల్లో సినిమా పట్ల, సినిమా ఫీల్డు పట్ల ఉన్న ఆసక్తి, వ్యామోహం. కానీ, నేనిచ్చిన స్నేహ హస్తాన్ని, సపోర్టుని వాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. పరోక్షంగా నేనెంతో సమయం, డబ్బు నష్టపోడానికి కారణమయ్యారు. ఈ నిజాన్ని వాళ్లు గుర్తిస్తే చాలు.

ఫీల్డులోకి ఎంటర్ కాకముందే ఇంత గొప్ప డ్రామా ఆడిన ఈ మహాశయులిద్దరికీ నా బెస్ట్ విషెస్ చెప్పటం తప్ప నేనేం చేయగలను? 

No comments:

Post a Comment