Saturday 16 March 2013

యురేకా సకమిక!


"లైఫ్‌లో ఇక సినిమాల జోలికి వెల్లొద్దు" అని ఒక దశలో అనుకున్నవాణ్ణి. ఇప్పుడు మళ్లీ "యురేకా సకమిక" అనక తప్పటంలేదు! సో, ఏప్రిల్ 21 నుంచి మళ్లీ 'యాక్షన్' ప్రారంభం..

సినీ ఫీల్డు నా ప్రధాన వ్యాపకం కాదు. వ్యసనం కూడా కాదు. కానీ, దాదాపు ఒక పదేళ్లుగా ఈ రంగంలో పైపైనయినా నాక్కొంత పరిచయం ఉంది. జస్ట్ రెండు మూడేళ్ల క్రితం నాటి చిత్రపరిశ్రమ వేరు. ఇప్పటి పరిశ్రమ వేరు. ఫిలిం మేకింగ్ లో వచ్చిన ఆధునిక టెక్నాలజీ మొత్తం ఇండస్ట్రీ రూపురేఖల్నే మార్చివేసింది. ఈ మార్పే, ఒక రకంగా మళ్లీ నేను మెగాఫోన్ పట్టడానికి కారణమయింది.

గతంలో ఒక సినిమా తీయాలంటే దానికో ఆఫీసు; రోజుకో వందమంది రావటం పోవటం; అందరికీ కాఫీలు, టీలు; కొందరికయినా టిఫిన్లు; కనీసం ఓ డజనుమందికయినా టైమ్‌కు భోజనాలు ... అంతా ఒక సత్రం వ్యవహారంలా నడిచేది కథంతా. ఆఫీసు మైంటెనెన్సు ఖర్చులో దాదాపు 90 శాతం వృధా ఖర్చు అంటే అతిశయోక్తి కాదు.

ఇప్పుడా అవసరం లేదు. పేరుకు ఒక చిన్న ఆఫీసు ఉంటే చాలు. (అది కూడా లేకుండా సినిమా తీయవచ్చు. అది వేరే విషయం!) టీమ్‌ను సెలెక్టు చేసుకోవటం నుంచి, ఎవరి పనులను వారికి అప్పగించి.. ఆయా పనులను పూర్తి చేయించుకోవటం వరకు.. అంతా ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. ల్యాండ్ ఫోన్స్ అవసరం అస్సలు లేదు. అసలవి ఎక్కడా కనిపించట్లేదు కూడా! మొబైల్ ఫోన్లలోనే అంతా కట్ షాట్స్ తరహాలో జరిగిపోతోంది. కాల్స్‌ని ఇష్టపడని వారంతా కేవలం ఎస్ ఎం ఎస్ లతోనే దాదాపు అన్ని పనుల్నీ కానిచ్చేస్తున్నారు.

టీం మొత్తం ఒక్క దగ్గర కలిసేది ఇక షూటింగ్ అప్పుడే. అది పూర్తయ్యిందంటే మళ్లీ మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కి కూడా సత్రం వ్యవహారం అక్కర్లేదు. ఎవరిపని వాళ్లు ఒక డిసిప్లిన్‌తో చేసుకుంటూ వెళ్లటమే! ఇక్కడ ప్రధానం - సినిమా అనుకున్నది అనుకున్నట్టు పూర్తిచేయగలగటం. భోజనాలు వచ్చాయా లేదా, బొమ్మిడాయిలు తిన్నామా లేదా అన్నది కాదు ముఖ్యం.

"యురేకా సకమిక" ప్రి-ప్రొడక్షన్ పనంతా కూడా దాదాపు ఇదే పధ్ధతిలోనే పూర్తికాబోతోంది... ఎలాంటి ఆటంకాల్లేకుండా!

అదీ ఇదీ అన్న తేడా లేకుండా, ఎడా పెడా కమిషన్లూ తింటూ, నిర్మాతని నిర్దాక్షిణ్యంగా దోచేసే 24 క్రాఫ్టుల్లో ఒక క్రాఫ్టుకు సంబంధించిన మనుషుల ఉనికే ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకమయిపోయింది. "యూనియన్ రూల్స్ తో సంబంధం లేకుండా మీ సినిమా మీరు ఎలాగయినా తీసుకోవచ్చు!" అని TFCC భరోసా ఇవ్వటం ఒక గొప్ప పరిణామం.

దాదాపు 'నో బడ్జెట్' తో ఒక పూర్తి స్థాయి సినిమా తీయటం, తీసి రిలీజ్ చేయటం సాధ్యమేనని నిరూపించే క్రమంలో తీస్తున్న చిత్రం "యురేకా సకమిక". ఒక మైక్రో బడ్జెట్ చిత్రం. చెప్పాలంటే, ఒక కమర్షియల్ ఆర్ట్ సినిమా. కాన్సెప్ట్ స్టేజ్ నుంచి, సినిమా పూర్తి చేసి రిలీజ్ చేసేవరకు... అన్ని ముఖ్యమయిన విషయాలను పొందుపరుస్తూ ఒక పుస్తకం కూడా రాసి పబ్లిష్ చేయాలన్నది నా ఆలోచన.  "ది మేకింగ్ ఆఫ్ యురేకా సకమిక" అన్నమాట! ఇప్పుడు మీరు చదువుతున్న ఈ బ్లాగ్ పోస్ట్ బహుశా ఆ పుస్తకంలో ఒక పేజీ కావచ్చు...

No comments:

Post a Comment