Thursday 28 February 2013

రోజుకి 30 గంటలు!


"ఈ ఫేస్‌బుక్ యుగంలో రోజుకి 24 గంటలు ఎక్కడ సరిపోతుంది? ఇంపాజిబుల్!"

నిన్న సాయంత్రం యాత్రి నివాస్‌లో కాఫీ తాగుతూ కూర్చున్నపుడు నా ప్రొఫెషనల్ మిత్రుడి నోటి వెంట ఈ మాట విన్నాను. తనకి కనీసం ఒక 30 గంటలయినా కావాలిట!

ఇప్పుడు మనలో చాలా మందికి రోజుకి 24 గంటలు నిజంగానే సరిపోవటం లేదు. అతిశయోక్తి అనిపించినా నిజం మాత్రం ఇదే.

ఈ నిజంలోనే ఇంకో పచ్చి నిజం ఏంటంటే - ఒక రోజులోని 24 గంటల్లో కనీసం ఓ 6 గంటలు న్యూస్‌పేపర్ చదవటానికి, టీవీలో వచ్చే ప్రతి చెత్తా చూడ్డానికి, మొబైల్ ఫోన్లో మాట్లాడ్డానికి, ఎస్ ఎం ఎస్ లు చేసుకోడానికి, ఫేస్‌బుక్‌లో కొటేషన్లు పెట్టడానికే  సరిపోతోంది. ఇంక మిగిలిన 18 గంటల్లో - 8 గంటలు ఉద్యోగం/వృత్తి కోసం, కాగా, కనీసం ఓ 2 గంటలు ట్రాఫిక్‌లో ఇంటికీ, ఆఫీసుకీ ప్రయాణం. ఇక మిగిలింది మరో 8 గంటలు. ఈ 8 గంటల్లోనే స్నాన పానాదులు, తిండి, నిద్ర లకు సరిపుచ్చుకోవాలి!

ఇంత బిజీ షెడ్యూల్లో మన కోసం, మన వాళ్ల కోసం - ఏకాంతంగా, ఎలాంటి డిస్టర్బెన్సులు లేకుండా, కనీసం ఒక్కటంటే ఒక్క గంట కెటాయించలేకపోతున్నాం. మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నాం. కుటుంబ సంబంధాలు పూర్తిగా దెబ్బతింటున్నాయంటే అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. మానవ సంబంధాల్లో కొత్తగా ఏర్పడిన ఈ "వాక్యూం" సమాజంలో ఎన్నో విపరీత ధోరణులకు కారణమౌతోంది.

యాత్రి నివాస్‌లో నా ప్రొఫెషనల్ ఫ్రెండ్ అడిగింది రోజుకి కేవలం 30 గంటలే. కానీ, పైన నేను చెప్పిన లెక్కంతా చూస్తే కనీసం 36 గంటలు అడిగేవాడేమో! నిజానికి మనం చేస్తున్న పనుల్లో ప్రాధాన్యతలను గుర్తించగలిగితే చాలు. మనకు ఉన్న 24 గంటల్లో కొన్ని గంటల్ని మిగుల్చుకోవచ్చు. జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే, ఒక కొత్త జీవితం సృష్టించుకోవచ్చు.

ఒకసారి కోల్పోతే తిరిగి తెచ్చుకోలేని ఆస్తి "సమయం" మాత్రమే. దాన్ని ఎంత సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నది కేవలం మన చేతుల్లోనే ఉంది.    

No comments:

Post a Comment