Tuesday 23 October 2012

కింగ్ ఆఫ్ రొమాన్స్


గత సెప్టెంబర్ 27 నాడు యశ్ చోప్రా చివరిసారిగా మీడియా ముందుకి వచ్చారు. అది చోప్రా పుట్టిన రోజు. అదే తన చివరి మీడియా మీట్ అవుతుందని బహుశా చోప్రా కూడా ఊహించి ఉండరుత్వరలో రాబోతున్న తన చిత్రం "జబ్ తక్ హై జాన్" (JTHJ) గురించి మాట్లాడుతూ - అదే తన చివరి చిత్రం గా చెప్పారు.  JTHJ రిలీజ్ తర్వాత కొన్నాళ్లు కాశ్మీర్ వెళ్లి విశ్రాంతి తీసుకుంటానని కూడా చెప్పారు. కొత్త తరం దర్శకులు, ఇతర టెక్నీషియన్లు, నటీనటులకు సహాయపడుతూ తన శేష జీవితం గడుపుతానని తన మనసులో మాట చెప్పారు

టీవీలో ప్రోగ్రాం చూశాకే - నేనూ, మా పెద్దబ్బాయి ప్రణయ్ జవహర్ నవోదయ విద్యాలయ సిల్వర్ జుబ్లీ ఫంక్షన్ కోసం గుంటూరు బయల్దేరాము. బహుశా అంతకు ఒక నెల రోజుల ముందు అనుకుంటాను .. సి ఎన్ ఎన్ లో షారుఖ్ ఖాన్ యష్ చోప్రాను ఇంటర్వ్యూ చేసిన అద్భుతమైన ప్రోగ్రాం (రిపీట్) ఒకటి చూశాను.  

యష్ చోప్రా తన చివరి చిత్రం JTHJ పూర్తి చేశారు. చిత్రం కోసం మళ్లీ ఆర్ రెహమాన్, గుల్జార్ లను చాలా కాలం తర్వాత ఒక్క దగ్గరికి చేర్చారు. కాని, నవంబర్ 13 దాని విడుదలను చూడకుండానే కన్ను మూశారు.

రాబోయే నవంబర్ 20 నుంచి గోవాలో ప్రారంభం కానున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) లో యష్ చోప్రాకు ప్రత్యేకంగా సన్మానం చేయటానికి నిర్ణయించారు. ఇప్పుడు అదే IFFI లో యష్ చోప్రాకు ప్రత్యేకంగా సంతాపం ప్రకటించాల్సి రావటం అత్యంత బాధాకరం

దాగ్, కభీ కభీ, సిల్ సిలా, లమ్హే, డర్, చాందినీ, దిల్ తో పాగల్ హై వంటి ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన యష్ చోప్రాను "కింగ్ ఆఫ్ రొమాన్స్" ట్యాగ్ వరించటంలో ఆశ్చర్యం లేదు. అయితే - యష్ చోప్రా 'రొమాన్స్’ లోకి దిగక ముందు మతసహనం మీద "ధర్మపుత్ర" అనే చిత్రం నిర్మించి తన సత్తా చాటుకున్నారు. అదే విధంగా - బీహార్ బొగ్గు గనుల్లో సంభవించిన ఒక యదార్ధ గాథ నుంచి ఇన్స్పిరేషన్ పొంది ఆయన తీసిన "కాలా పత్తర్" గురించి గానీ, ఆయన నిర్మించిన ఏకైక ప్రయోగాత్మక థ్రిల్లర్ "ఇత్తెఫాక్" గురించి గానీ చాలా మందికి తెలియకపోవచ్చు.

సుమారు 50 ఏళ్ల తన ఫిలిం కెరీర్లో దాదాపు 50 వరకు ఉత్తమ స్థాయి చిత్రాలను నిర్మించి, దర్శకత్వం వహించిన యష్ చోప్రా - నాటి బ్రిటిష్ ఇండియా లోని లాహోర్ లో 1932 లో జన్మించారు. 80 ఏళ్ల వయసులో కూడా, ఎప్పుడూ ఎంతో యాక్టివ్ గా, చిరునవ్వుతో, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే రొమాంటిచ్ చిత్రాల రారాజు ఎవరూ ఊహించని విధంగా డెంగ్యూ ఫీవర్ తో బాధపడి మరణించడం అత్యంత బాధాకరం.

May Yash ji’s soul rest in peace ..


No comments:

Post a Comment