Sunday 13 January 2019

జీవితం ఎవ్వరినీ వదలదు!

అవును ..

జీవితం ఎవ్వరినీ వదలదు.

ఊహించనివిధంగా ఏదో ఒక దశలో ఒక చూపు చూస్తుంది.

అప్పుడు తెలుస్తుంది, అసలు జీవితం ఏమిటో.

మొన్నటి నవంబర్ 25 సాయంత్రం నుంచి, ఈ రాత్రివరకు నా జీవితంలో ఊహించని సంఘటనలు ఎన్నో ..

నాకత్యంత ప్రియమైన నా చిన్నతమ్ముడి ఆకస్మిక మరణం అందులో ఒకటి.

మనిషి వ్యక్తిగత జీవితానికి సంబంధించి, మన దేశంలో ఇంకా వికృతాట్ఠాసం చేస్తున్న నాకు నచ్చని వొకానొక సామాజిక వ్యవస్థ .. ఆ సో కాల్డ్ వ్యవస్థ ఉన్న మన ఈ సమాజం పట్ల మన మైండ్‌సెట్ .. నా తమ్ముడిని, వాడి వ్యక్తిగత జీవితాన్ని ఎంతో మానసిక వ్యధకు గురిచేశాయి.

వాడు నాకు మళ్లీ కనిపించనంత దూరం చేశాయి.

డిసెంబర్ 27, 2016 .. సరిగ్గా 2 సంవత్సరాలక్రితం, మా అమ్మ మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది.

జీవితం చాలా చిన్నది అని చెప్తూ, మొన్న డిసెంబర్ 16 నాడు, నా చిన్నతమ్ముడు శ్రీనివాస్ కూడా, చాలా చిన్నవయసులో మమ్మల్ని విడిచి వెళ్ళిపోయాడు.

కట్ చేస్తే - 

ఎంతోమంది గురించి నా బ్లాగ్ లో, ట్విట్టర్లో, ఫేస్‌బుక్‌లో ఎంతో రాశాను, పోస్ట్ చేశాను.

కానీ, నాకెంతో ప్రియమైన నా చిన్నతమ్ముడి గురించి మాత్రం ఏం రాయలేకపోతున్నాను.

వాసూ, నిన్ను కాపాడుకోలేకపోయాను .. కానీ, నువ్విలా చేసివుండాల్సిందికాదు, బతికున్నంతకాలం నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నేను బాధపడేలా .. వలవల ఏడ్చేలా .. 

4 comments:

  1. మనోహర్ గారూ, మీతమ్ముడు గారి జీవితం విషాదాంతం కావటం విచారకరం. ఎన్నో ప్రశ్నలూ ఎంతో విషాదాన్ని మిగిల్చిమరీ తప్పుకుంటున్నామని జీవితాన్నితిరస్కరించి వెళ్ళిపోతున్నవేళ క్షణికావేశంలో గుర్తించలేరు. అటువంటి వారి స్మృతుల్లో ఆనందాన్ని వెదుక్కోవటం మంచిదండి. జీవితం సుదీర్ఘప్రయాణం - ఎందరో మనతో ప్రయాణం చేస్తారు మనకు ఆత్మీయతలను పంచుతారు. కాని మనతో ఆట్టేమంది మొదటినుండి తుదిదాకా కలిసి ప్రయాణించరు కదండీ. అందుకని ఈకలయికలూ విడిపోవటాలూ సహజం అని సర్దిచెప్పుకుంటే మనస్సుకు సుఖమూ శాంతీ కలుగుతాయి.

    ReplyDelete
  2. థాంక్యూ సో మచ్ అండి శ్యామలీయం గారూ! మీ విలువైన కామెంట్‌కి, నా గురించి ఆలోచించిన మీ మంచి మనస్సుకి ధన్యవాదాలు. పెద్దవారు .. మీరు చెప్పిన విధంగా ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. తప్పక ప్రయత్నించండి. ఉదాహరణకు నా చిన్ననాటి ప్రియస్నేహితురాలు నా పిన్ని. నాకన్న ఒకసంవత్సరం మాత్రమే పెద్దదైన ఆమె చిన్నవయస్సులోనే హఠాన్మరణం చెందింది నిద్రలోనే. అంతకు ముందు కొద్ది నెలలక్రిందటే ఆమె మాయింటి వచ్చింది, 'ఒక సారి తనదగ్గరకు రమ్మని చాలా మాట్లాడాలనీ అంది' కాని దురదృష్టం యేమిటంటే అటువంటి అవకాశం రాకుండానే వెళ్ళిపోయింది. అమె స్స్మృతి నాకు నిత్యనూతనమే. అమెతలపుకు వస్తే చాల సంతోషమూ, దూరమైనదన్న బాధా రెండూ కలుగుతాయి. ఎండావానా ఒక్కసారే వచ్చినట్లన్నమాట. ఆత్మీయురాలిని తలచుకోవటంలో ఉన్న సంతోషం ముందు ఆమె భౌతికంగా మనమథ్యన లేదన్న స్పృహవలని బాధ స్వల్పమే అనిపిస్తుంది. జీవితంలో ఎప్పుడూ సంతోషాన్నే చూడటానికి యత్నించాలండీ లేకుంటే కష్టం. క్రమంగా మీకు మనో నిబ్బరం కలుగుతుందని ఆశిస్తున్నాను.

      Delete
  3. మరొక్కసారి మీ సమయానికి .. మీ కన్‌సర్న్‌కీ ధన్యవాదాలు, శ్యామలీయం గారూ!

    ReplyDelete