Monday 30 April 2018

క్రియేటివిటీ వేరు, రాజకీయాలు వేరు!


"సబ్ కా సున్‌నా అప్నా కర్‌నా" అని ఒక సామెత. 

తెలిసీ, అనుభవం ఉండీ, ఈ సామెతను ఆమధ్య అసలు పట్టించుకోలేదు. 

అప్పుడు అందరు చెప్పిందే విన్నాను కానీ, నా మనసు చెప్పింది మాత్రం పక్కన పెట్టాను. 

ఇప్పుడు జ్ఞానోదయమైంది, పూర్తిగా.

కట్ టూ క్రియేటివిటీ - 

క్రియేటివిటీకి హద్దులు లేవు. ఉండకూడదు. ఇది నేను వంద శాతం నమ్ముతాను. పాటిస్తాను.

నా టీమ్‌ను ఒక మూడు భాగాలుగా చేస్తే - అందులో ఒక భాగం తెలంగాణవాళ్లుంటారు. మరొక భాగం ఆంధ్రప్రదేశ్‌వాళ్లుంటారు. ఇంకో భాగం మొత్తం మన దేశంలోని మిగిలిన ప్రాంతాలకు చెందినవాళ్లుంటారు.

మరీ ఇట్లా గీతగీసినట్టు కాకుండా, కొన్నిసార్లు ఈ రేషియో మారొచ్చు కూడా.

రఫ్‌గా దీన్నే ఇంకో కామన్ రేషియోలో కూడా చెప్పగలను: టీమ్‌లో సగం మంది తెలంగాణవాళ్లుంటే, మిగిలిన సగం మంది మన దేశంలో ఒక్కో ప్రాంతం నుంచి ఉంటారు.

అయితే - ఇదంతా నేనేదో ప్లాన్ ప్రకారం చేస్తున్నది కాదు. అలా ఎవ్వరూ చెయ్యలేరు. కాని, ఇప్పటికే మన ఫిల్మ్ ఇండస్ట్రీలో పాతుకుపోయిన చాలామందిలో మాత్రం అలాంటి ఫీలింగ్ ఉంది. వాళ్ళు చేయొచ్చు. 

బట్, ఆ ‘చాలా మంది’ గురించి నాకు అవసరం లేదు. అది వేరే విషయం.

'లైక్‌మైండెడ్ స్వభావం' ఒక్కటే నా టీమ్‌లో నేను చూసేదీ, నాకు కావల్సిందీ.

కట్ టూ రాజకీయాలు - 

మన తెలంగాణ రాష్ట్ర ఐ టీ మినిస్టర్ కె టి రామారావు (కేటీఆర్) ఫేస్‌బుక్ పేజ్ మీద ఒక సూపర్ కొటేషన్ ఇలా ఉంది:  

"When Politics Decide Your Future, Decide What Your Politics Should Be!" 

తెల్లారిలేస్తే మనకు ఫేస్‌బులో కనిపించే సవాలక్ష పనికిరాని కొటేషన్లలో ఇదొకటి కాదు. 

తప్పనిసరిగా అందరూ పట్టించుకోవల్సిన కొటేషన్. 

బాగా ఆలోచించాల్సిన కొటేషన్. 

ముఖ్యంగా, బాగా చదువుకున్నవాళ్లు మరింత బాగా అలోచించాల్సిన కొటేషన్ ఇది.  

ఎందుకంటే .. నేను ఎక్కడో చూసిన ఒక లెక్క ప్రకారం, రాజకీయాలపట్ల పూర్తి నిరాసక్తంగా ఉండే ఒకే ఒక్క పనికిమాలిన సెగ్మెంట్ ఈ బాగా చదువుకున్నవాళ్లే!

ఈ ఒక్క సెగ్మెంట్ నిరాసక్తతే ఈ రోజు మన దేశాన్ని ఎందుకూ పనికిరానివాళ్లు దశాబ్దాలుగా పాలించడానికి కారణమైంది. దేశం ఎన్నోరకాలుగా వెనకబడటానికి కారణమైంది.

సో, కేటీఆర్ గారికి థాంక్స్ .. 

తెలిసిన కొటేషనే అయినా, దాన్ని అందంగా తన ఫేస్‌బుక్ పేజి మీద పెట్టి, నాలాంటి ఎందరో రాజకీయాల నిజమైన విలువ తెలుసుకొనేట్టు చేసినందుకు .. ఇప్పుడు నేనీ బ్లాగ్ రాయడానికి స్ఫూర్తినిచ్చినందుకు. 

కట్ టూ ‘భరత్ అనే నేను’ -  

కేవలం మూడురోజుల క్రితం మన ఐటి మినిస్టర్ కేటీఆర్ గారు కొరటాల శివ, మహేశ్ బాబు 'భరత్ అనే నేను' సినిమాకు సంబంధించిన ఒక ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

దాని గురించి కేటీఆర్ గారే స్వయంగా, ఆ ప్రోగ్రాం లింక్ ఇస్తూ, తన ఫేస్‌బుక్ పేజ్‌లో, ట్విట్టర్‌లో పోస్ట్ కూడా చేశారు.

దాన్ని నేను కూడా నా ఫేస్‌బుక్ పేజ్‌లో, ట్విట్టర్‌లో షేర్ చేశాను.  

'భరత్ అనే నేను' కోసం ఒక క్లాసిక్ స్థాయిలో చేసిన ఆ ప్రోగ్రాం పేరు 'విజన్ ఫర్ ఏ బెటర్ టుమారో'. 

రాజకీయాలు వేరు, క్రియేటివిటీ వేరు అన్నదాన్ని నిజం చేస్తూ, మంత్రి కేటీఆర్ ఆ ప్రోగ్రాంలో పాల్గొనటమే ఒక విశేషం. 

కాగా .. ఆ ప్రోగ్రాం మొత్తంలో కూడా కేటీఆర్ ప్రజెంటేషన్, ఆయన మాట్లాడిన మాటలే సూపర్ హైలైట్ అనేది చెప్పాల్సిన అవసరంలేని మరో గొప్ప విశేషం. 

దటీజ్ కేటీఆర్!

అయితే .. ఇలాంటి చొరవ, ఇలాంటి తోడ్పాటు మన తెలంగాణ దర్శకుల సినిమాలకు కూడా కేటీఆర్ తప్పక ఇస్తారనీ, అలా ఇవ్వాలనీ నేను ఆకాంక్షిస్తున్నాను.   

కట్ బ్యాక్ టూ అసలు పాయింట్  - 

ఆరు దశాబ్దాలుగా రగిలిన తెలంగాణ ప్రజల మనోవాంఛను నిజం చేసిన వ్యక్తి కేసీఆర్. 

గత 60 ఏళ్ళుగా ఎవ్వరూ సాధించలేనిదాన్ని సాధించి చూపిన ఒక ఉద్యమశక్తి కేసీఆర్. 

ఈ నేపథ్యంలో .. కేసీఆర్‌గారిమీద అభిమానంతో, ఒక చిన్న పుస్తకం రాద్దామనుకొన్నాను. ఒక మ్యూజిక్ వీడియో చేద్దామనుకొన్నాను. ఒక అంతర్జాతీయస్థాయి డాక్యుమెంటరీ చేద్దామనుకున్నాను.  

"సినీఫీల్డులో వున్నావు. ఎందుకు అనవసరంగా? .. వద్దు!" అని చెప్పిన కొందరి 'ఉచిత సలహా' విని, ఆ పనులు అప్పుడు వాయిదా వేసుకున్నాను. 

కానీ అది తప్పు.  

క్రియేటివిటీ వేరు, రాజకీయాలు వేరు. 

ఇంకా చెప్పాలంటే - మొన్నటిదాకా శత్రువులుగా పిచ్చి పిచ్చిగా తిట్టుకున్నవాళ్లే ఇప్పుడు మళ్ళీ మిత్రులుగా కలిసిపోయారు. 

పార్టీలు మారుతున్నారు. పార్టీలకెళ్తున్నారు. పార్టీలు చేసుకుంటున్నారు. 

ఇందులో తప్పేం లేదు. తప్పదు.

రాజకీయ చదరంగం. 

జీవనవైరుధ్యం. 

సో, దేనికి ఏదీ అడ్డంకాదు. అడ్డురాదు. 

దేని దారి దానిదే.

చేయాలనుకున్నది ఒక మంచిపని అయినప్పుడు చేసుకుంటూపోవడమే.  

త్వరలో నేను ప్రారంభించబోయే నా కొత్త సినిమా ఓపెనింగ్ సందర్భంగానో, దానికి ముందో, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద నేను కొత్తగా అనుకున్న ఒక పుస్తకం ప్రచురించి ఆవిష్కరించాలనుకొంటున్నాను.

మన ఐటి మంత్రి కేటీఆర్ కొటేషన్ ఒక్కటే కాకుండా - ఈ నా నిర్ణయానికి పరోక్షంగా కేటలిస్టులుగా పనిచేసినవాళ్లు మరో ఇద్దరు ఆత్మీయులున్నారు.

ఒకరు నా ఫేవరేట్ స్టూడెంట్. మరొకరు నా టీమ్‌లోని చీఫ్ టెక్నీషియన్స్‌లో ఒకరు. 

విచిత్రమేంటంటే .. వీళ్లిద్దరిదీ గుంటూరు! 

1 comment: