Monday 30 April 2018

క్రియేటివిటీ వేరు, రాజకీయాలు వేరు!


"సబ్ కా సున్‌నా అప్నా కర్‌నా" అని ఒక సామెత. 

తెలిసీ, అనుభవం ఉండీ, ఈ సామెతను ఆమధ్య అసలు పట్టించుకోలేదు. 

అప్పుడు అందరు చెప్పిందే విన్నాను కానీ, నా మనసు చెప్పింది మాత్రం పక్కన పెట్టాను. 

ఇప్పుడు జ్ఞానోదయమైంది, పూర్తిగా.

కట్ టూ క్రియేటివిటీ - 

క్రియేటివిటీకి హద్దులు లేవు. ఉండకూడదు. ఇది నేను వంద శాతం నమ్ముతాను. పాటిస్తాను.

నా టీమ్‌ను ఒక మూడు భాగాలుగా చేస్తే - అందులో ఒక భాగం తెలంగాణవాళ్లుంటారు. మరొక భాగం ఆంధ్రప్రదేశ్‌వాళ్లుంటారు. ఇంకో భాగం మొత్తం మన దేశంలోని మిగిలిన ప్రాంతాలకు చెందినవాళ్లుంటారు.

మరీ ఇట్లా గీతగీసినట్టు కాకుండా, కొన్నిసార్లు ఈ రేషియో మారొచ్చు కూడా.

రఫ్‌గా దీన్నే ఇంకో కామన్ రేషియోలో కూడా చెప్పగలను: టీమ్‌లో సగం మంది తెలంగాణవాళ్లుంటే, మిగిలిన సగం మంది మన దేశంలో ఒక్కో ప్రాంతం నుంచి ఉంటారు.

అయితే - ఇదంతా నేనేదో ప్లాన్ ప్రకారం చేస్తున్నది కాదు. అలా ఎవ్వరూ చెయ్యలేరు. కాని, ఇప్పటికే మన ఫిల్మ్ ఇండస్ట్రీలో పాతుకుపోయిన చాలామందిలో మాత్రం అలాంటి ఫీలింగ్ ఉంది. వాళ్ళు చేయొచ్చు. 

బట్, ఆ ‘చాలా మంది’ గురించి నాకు అవసరం లేదు. అది వేరే విషయం.

'లైక్‌మైండెడ్ స్వభావం' ఒక్కటే నా టీమ్‌లో నేను చూసేదీ, నాకు కావల్సిందీ.

కట్ టూ రాజకీయాలు - 

మన తెలంగాణ రాష్ట్ర ఐ టీ మినిస్టర్ కె టి రామారావు (కేటీఆర్) ఫేస్‌బుక్ పేజ్ మీద ఒక సూపర్ కొటేషన్ ఇలా ఉంది:  

"When Politics Decide Your Future, Decide What Your Politics Should Be!" 

తెల్లారిలేస్తే మనకు ఫేస్‌బులో కనిపించే సవాలక్ష పనికిరాని కొటేషన్లలో ఇదొకటి కాదు. 

తప్పనిసరిగా అందరూ పట్టించుకోవల్సిన కొటేషన్. 

బాగా ఆలోచించాల్సిన కొటేషన్. 

ముఖ్యంగా, బాగా చదువుకున్నవాళ్లు మరింత బాగా అలోచించాల్సిన కొటేషన్ ఇది.  

ఎందుకంటే .. నేను ఎక్కడో చూసిన ఒక లెక్క ప్రకారం, రాజకీయాలపట్ల పూర్తి నిరాసక్తంగా ఉండే ఒకే ఒక్క పనికిమాలిన సెగ్మెంట్ ఈ బాగా చదువుకున్నవాళ్లే!

ఈ ఒక్క సెగ్మెంట్ నిరాసక్తతే ఈ రోజు మన దేశాన్ని ఎందుకూ పనికిరానివాళ్లు దశాబ్దాలుగా పాలించడానికి కారణమైంది. దేశం ఎన్నోరకాలుగా వెనకబడటానికి కారణమైంది.

సో, కేటీఆర్ గారికి థాంక్స్ .. 

తెలిసిన కొటేషనే అయినా, దాన్ని అందంగా తన ఫేస్‌బుక్ పేజి మీద పెట్టి, నాలాంటి ఎందరో రాజకీయాల నిజమైన విలువ తెలుసుకొనేట్టు చేసినందుకు .. ఇప్పుడు నేనీ బ్లాగ్ రాయడానికి స్ఫూర్తినిచ్చినందుకు. 

కట్ టూ ‘భరత్ అనే నేను’ -  

కేవలం మూడురోజుల క్రితం మన ఐటి మినిస్టర్ కేటీఆర్ గారు కొరటాల శివ, మహేశ్ బాబు 'భరత్ అనే నేను' సినిమాకు సంబంధించిన ఒక ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

దాని గురించి కేటీఆర్ గారే స్వయంగా, ఆ ప్రోగ్రాం లింక్ ఇస్తూ, తన ఫేస్‌బుక్ పేజ్‌లో, ట్విట్టర్‌లో పోస్ట్ కూడా చేశారు.

దాన్ని నేను కూడా నా ఫేస్‌బుక్ పేజ్‌లో, ట్విట్టర్‌లో షేర్ చేశాను.  

'భరత్ అనే నేను' కోసం ఒక క్లాసిక్ స్థాయిలో చేసిన ఆ ప్రోగ్రాం పేరు 'విజన్ ఫర్ ఏ బెటర్ టుమారో'. 

రాజకీయాలు వేరు, క్రియేటివిటీ వేరు అన్నదాన్ని నిజం చేస్తూ, మంత్రి కేటీఆర్ ఆ ప్రోగ్రాంలో పాల్గొనటమే ఒక విశేషం. 

కాగా .. ఆ ప్రోగ్రాం మొత్తంలో కూడా కేటీఆర్ ప్రజెంటేషన్, ఆయన మాట్లాడిన మాటలే సూపర్ హైలైట్ అనేది చెప్పాల్సిన అవసరంలేని మరో గొప్ప విశేషం. 

దటీజ్ కేటీఆర్!

అయితే .. ఇలాంటి చొరవ, ఇలాంటి తోడ్పాటు మన తెలంగాణ దర్శకుల సినిమాలకు కూడా కేటీఆర్ తప్పక ఇస్తారనీ, అలా ఇవ్వాలనీ నేను ఆకాంక్షిస్తున్నాను.   

కట్ బ్యాక్ టూ అసలు పాయింట్  - 

ఆరు దశాబ్దాలుగా రగిలిన తెలంగాణ ప్రజల మనోవాంఛను నిజం చేసిన వ్యక్తి కేసీఆర్. 

గత 60 ఏళ్ళుగా ఎవ్వరూ సాధించలేనిదాన్ని సాధించి చూపిన ఒక ఉద్యమశక్తి కేసీఆర్. 

ఈ నేపథ్యంలో .. కేసీఆర్‌గారిమీద అభిమానంతో, ఒక చిన్న పుస్తకం రాద్దామనుకొన్నాను. ఒక మ్యూజిక్ వీడియో చేద్దామనుకొన్నాను. ఒక అంతర్జాతీయస్థాయి డాక్యుమెంటరీ చేద్దామనుకున్నాను.  

"సినీఫీల్డులో వున్నావు. ఎందుకు అనవసరంగా? .. వద్దు!" అని చెప్పిన కొందరి 'ఉచిత సలహా' విని, ఆ పనులు అప్పుడు వాయిదా వేసుకున్నాను. 

కానీ అది తప్పు.  

క్రియేటివిటీ వేరు, రాజకీయాలు వేరు. 

ఇంకా చెప్పాలంటే - మొన్నటిదాకా శత్రువులుగా పిచ్చి పిచ్చిగా తిట్టుకున్నవాళ్లే ఇప్పుడు మళ్ళీ మిత్రులుగా కలిసిపోయారు. 

పార్టీలు మారుతున్నారు. పార్టీలకెళ్తున్నారు. పార్టీలు చేసుకుంటున్నారు. 

ఇందులో తప్పేం లేదు. తప్పదు.

రాజకీయ చదరంగం. 

జీవనవైరుధ్యం. 

సో, దేనికి ఏదీ అడ్డంకాదు. అడ్డురాదు. 

దేని దారి దానిదే.

చేయాలనుకున్నది ఒక మంచిపని అయినప్పుడు చేసుకుంటూపోవడమే.  

త్వరలో నేను ప్రారంభించబోయే నా కొత్త సినిమా ఓపెనింగ్ సందర్భంగానో, దానికి ముందో, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద నేను కొత్తగా అనుకున్న ఒక పుస్తకం ప్రచురించి ఆవిష్కరించాలనుకొంటున్నాను.

మన ఐటి మంత్రి కేటీఆర్ కొటేషన్ ఒక్కటే కాకుండా - ఈ నా నిర్ణయానికి పరోక్షంగా కేటలిస్టులుగా పనిచేసినవాళ్లు మరో ఇద్దరు ఆత్మీయులున్నారు.

ఒకరు నా ఫేవరేట్ స్టూడెంట్. మరొకరు నా టీమ్‌లోని చీఫ్ టెక్నీషియన్స్‌లో ఒకరు. 

విచిత్రమేంటంటే .. వీళ్లిద్దరిదీ గుంటూరు! 

Wednesday 25 April 2018

రమ్యంగా కుటీరాన రంగవల్లు లల్లిందీ ..

"నిదురించే తోటలోకి
పాట ఒకటి వచ్చిందీ

కన్నుల్లో నీరు తుడిచి
కమ్మటి కల ఇచ్చింది

రమ్యంగా కుటీరాన
రంగవల్లు లల్లిందీ
దీనురాలి గూటిలోన
దీపంగా వెలిగిందీ

శూన్యమైన వేణువులో
ఒక స్వరం కలిపి నిలిపిందీ
ఆకు రాలు అడవికి
ఒక ఆమని దయ చేసిందీ

విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినపడీ అంతలో పోయాయి
కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా
నది దోచుకు పోతున్న నావను ఆపండి
రేవు బావురుమంటోందని నావకు చెప్పండి
నావకు చెప్పండి ..."

కట్ టూ గుంటూరు శేషేంద్ర శర్మ -

కవిసేన మానిఫెస్టో రాసిన గుంటూరు శేషేంద్ర శర్మగారే బాపు గారి 'ముత్యాల ముగ్గు'లో ఇంత అద్భుతమైన పాట రాశారు.

ఈ పాటలోని ప్రతివాక్యం ఒక కొత్త ప్రయోగమే. ఒక కొత్త భావమే. 

సుశీల తీయటి గొంతు, మహదేవన్ అద్భుత సంగీతంలో .. ఈ పాటలో వయొలిన్, వీణ, ఫ్లూట్ ఒకదాన్ని మించి ఒకటి 'ఓహ్' అనిపిస్తాయి. 

ఎప్పుడూ పీకలదాకా ఉండే వ్యక్తిగత, వృత్తిగత వత్తిళ్ల రొటీన్ నగరజీవితం మధ్యలో కూడా, మొన్న రాత్రి నుంచి ఈ పాటను కనీసం ఒక అరడజను సార్లు విన్నాను.

నిన్న రాత్రి ఒక పార్టీ మధ్యలో మా మ్యూజిక్ డైరెక్టర్‌తో ఈ పాట గురించి ఒక అరగంట సేపు అలా ట్రాన్స్‌లోకెళ్లి చర్చించాను.   

చాలా ఏళ్ల తర్వాత ఇంత మంచి పాట నేను గుర్తుకు తెచ్చుకోడానికి కారణమైన ఒక బ్లాగ్ కామెంటర్‌కు థాంక్స్ చెప్పకుండా ఎలా ఉండగలను? 

Monday 16 April 2018

అనామక నీహారికలు

పేరు నీహారిక.

ఫోటో లేదు.

పేరును బట్టి స్థ్రీ అనుకుంటాము. కానీ, అక్కడ తన గురించి 'About Me'లో ఏమీ చెప్పలేదు కాబట్టి అది కూడా ఖచ్చితంగా ఊహించలేము.

ఆడ, మగ కూడా కాకపోవచ్చుగా?!

కట్ టూ అసలు కథ - 

కేసీఆర్ గారి జాతీయస్థాయి రాజకీయ రంగప్రవేశం గురించి కొన్నిరోజుల క్రితం నా బ్లాగ్‌లో ఒక పోస్టు రాశాను. ఆ పోస్టు టాపిక్‌తో ఏ రకంగానూ సంబంధంలేని ఒక అర్థంలేని కామెంట్ పెట్టారొకరు.

ఆ మేధావి పేరు నీహారిక.


నిజానికి  ఆ పోస్టు మీద ఎవరైనా కామెంట్ చేయొచ్చు. నిర్మాణాత్మకంగా విమర్శించవచ్చు. ఆ హక్కు అందరికీ ఉంటుంది.

కాకపోతే, ఒక కామెంట్ చేసేముందు తనెవరో బయటికి చెప్పుకోగల సంస్కారం, ధైర్యం ఉండాలి. ఆ రెండూ లేనప్పుడు అమ్మాయి పేరు పెట్టుకొని మరీ ఇలాంటి పనికిమాలిన పనులు చేయొద్దు.

ఆడో మగో .. ఉన్నదో లేదో తెలియదు కానీ, సదరు నీహారిక ఈ పోస్టు చూస్తుందని మాత్రం అనుకొంటున్నాను.

అంతేకాదు. ఈసారి తన పూర్తి ఐడెంటిటీతో, మరింత గొప్ప విమర్శలతో నా బ్లాగ్‌పోస్టులపై తప్పక కామెంట్ చేస్తుందని నమ్ముతున్నాను కూడా.

బెస్ట్ విషెస్ టూ నీహారిక! :) 

Sunday 15 April 2018

సోషల్ మీడియాను మించిన ప్రమోషన్ ఉందా?

మొన్న జరిగిన "నమస్తే హైదరాబాద్" సినిమా మోషన్ లోగో లాంచ్ ఈవెంట్ నాలో కొన్ని కొత్త ఆలోచనలకు కారణమైంది.

మరోవిధంగా చెప్పాలంటే, అంతకుముందునుంచే నాలో ఉన్న కొన్ని ఆలోచనలకు ఈ ఈవెంట్ గట్టి బలం చేకూర్చింది.

కట్ టూ సినిమా ప్రమోషన్ -

 
నేను టీవీ చూడక, న్యూస్‌పేపర్ చదవక దాదాపు అర్థ దశాబ్దం దాటింది. దీనివల్ల ఇప్పటివరకు నేనేదీ నష్టపోలేదని నాకు ఖచ్చితంగా తెలుసు.

నిజంగా అంత అవసరమైన న్యూస్ గాని, ఇంకేదైనా ముఖ్యమైన సమాచారం గానీ ఉంటే, అది ఏదోవిధంగా సరైన సమయానికి నాకు వెంటనే చేరుతోంది.

క్రెడిట్ గోస్ టూ సోషల్ మీడియా!

నాకున్న పరిమిత నాలెడ్జి ప్రకారం ఇప్పుడెవ్వరూ టీవీ, న్యూస్‌పేపర్‌లను పెద్దగా పట్టించుకోవడం లేదు. అంత టైమ్ ఎవ్వరికీ ఉండటంలేదు.

అంతా అరచేతిలో ఉన్న మొబైల్‌లోనే.

ఆ మొబైల్‌లో ఉన్న సోషల్ మీడియా ప్రపంచంలోనే.

ఇప్పుడు సినిమా ప్రమోషన్ కూడా అంతే.

ఎప్పటినుంచో ఉన్న ఒక పనికిరాని రొటీన్ సంప్రదాయం ప్రకారం .. ఇన్వెస్టర్‌లకు కాన్‌ఫిడెన్స్ ఇవ్వడం కోసం, టీవీ చానెల్స్‌కు సినిమా న్యూస్ కంటెంట్ ఇవ్వటం కోసం తప్పిస్తే .. ఈ రొటీన్ సినిమా ఈవెంట్స్, ఓపెనింగ్స్, ప్రెస్‌మీట్స్, ఎట్సెట్రాలు అసలెందుకూ పనికిరావన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.

ఖర్చు కూడా ఎక్కువే. 

ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఫిలిం మ్యాగజైన్స్ ఎట్సెట్రా ఇచ్చే ప్రచారం కంటే ఎన్నోరెట్లు ఎక్కువ ప్రమోషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రమే సాధ్యం.

హాలీవుడ్ నుంచి, టాలీవుడ్ వరకు .. ఈ మధ్య హిట్టయిన ఏ సినిమానయినా తీసుకోండి. వాటి ప్రమోషన్‌లో ప్రధాన పాత్ర సోషల్ మీడియాదే!

ఖర్చు చాలా తక్కువ.

చివరగా చెప్పొచ్చేదేంటంటే .. సినిమా ప్రమోషన్‌లో భాగంగా కొన్ని తప్పవు అనిపిస్తుంది.

అది మన మైండ్‌సెట్.

కానీ, అదే సినిమా ప్రమోషన్ విషయంలో సోషల్ మీడియాను విస్మరించడం మాత్రం ఖచ్చితంగా అతి పెద్ద తప్పవుతుంది. 

Sunday 1 April 2018

కేసీఆర్ ప్రధానమంత్రి అయితే... 2

కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారో లేదో ఎప్పట్లాగే ఆ కథ తర్వాత మాట్లాడుకుందాం. 

దీనికంటే ముందు, ఒకటి రెండు అతి ముఖ్యమైన విషయాలను మనం గుర్తు చేసుకుందాం.

అలోచిద్దాం.

ఆ తర్వాతే, జాతీయస్థాయి రాజకీయాల్లో కేసీఆర్ గారి రంగప్రవేశం గురించి చర్చిద్దాం.

మనకు బ్రిటిష్‌వాళ్లనుంచి స్వతంత్రం వచ్చి 70 ఏళ్లయింది. ఈ 70 ఏళ్లలో సింహభాగం ఒక్క కాంగ్రెస్ పార్టీనే మన దేశాన్ని పాలించింది. 

నెహ్రూ నుంచి మొదలైంది కథ. 


నెహ్రూ సొంత ప్రయోజనాలు, ఐక్యరాజ్యసమితి స్థాయిలో పేరు కోసం పిచ్చి, పంచశీల వంటి పనికిరాని సొల్లుతో భారత్ అటు చైనాకు కొంత, ఇటు పాకిస్తాన్‌కు కొంత భూభాగం వదులుకొని, చేతులు ముడుచుకు కూర్చోవాల్సి వచ్చింది.

ఈ రెండు దేశాలతో అప్పటినుంచి
 ఆ రావణకాష్టం ఇంకా రగులుతూనే ఉంది.

70 ఏళ్లు దాటినా.  


ఐరన్ లేడీ గా ప్రసిధ్ధిగాంచిన ఇందిరా గాంధీ బ్యాంకులను జాతీయం చేయడం వంటి కొన్ని అత్యంత గొప్ప నిర్ణయాలు తీసుకున్నా, అత్యధిక కాలం 
 దేశాన్ని పాలించినా .. ఎమర్జెన్సీ విధించడం వంటి అతి ఘోరమైన తప్పిదాలు కూడా ఆమె హయాంలో జరిగాయి. 


తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకోసం ఆమె పరోక్ష ప్రోద్భలంతో ఎదిగిన భింద్రన్‌వాలే వల్లనే చివరకు ఆమె దారుణ హత్యకు గురైంది.


ఇదే తరహాలో .. పైపై మెరుగులు, పేరు కోసం తీసుకొన్న అత్యంత తప్పుడు అంతర్జాతీయ పాలసీ నిర్ణయాలవల్ల రాజీవ్ గాంధీ కూడా ఎల్‌టిటిఇ చేతుల్లో ఘోరంగా హతమయ్యారు.

ఇంకో కోణంలో, వాళ్లు అసలు ఏ పార్టీ అన్నది కాదు ఇక్కడ పాయింటు. 


మన దేశ ప్రధానులు ఎంత ఘోరమైన హత్యలకు గురయ్యారు .. అందుకు దారితీసిన రాజకీయ కారణాలేంటి అన్నదే ప్రశ్న.  

1947 నుంచి ఈ రోజువరకు కూడా - కాంగ్రెస్ సృష్టించి, పెంచిపోషిస్తున్న సూడో సెక్యులరిజం కారణంగానే దేశం నానా కంగాళీ అయింది. అర్థంలేని అపోహలు, అభద్రతాభావాలు ప్రజలమధ్య పెరిగిపోయాయి. 


ఈ స్థితే దేశంలో ఇంకా కొనసాగుతోంది.

ఈ స్థితే దేశంలోని అన్నిరంగాల్లో ఒక పెద్ద అభివృధ్ధి నిరోధకమై కూర్చుంది. 


రెండో ప్రపంచయుధ్ధంలో సర్వం కోల్పోయిన దేశాలు, మూడు దశాబ్దాలక్రితం కరువు కాటకాలతో విలవిల్లాడిన దేశాలు, మన దేశంలో ఉన్న అన్నిరకాల వనరులతో పొలిస్తే ఏ విధంగానూ సరితూగని అతి చిన్న చిన్న దేశాలు ఎన్నో మనం చూస్తుండగానే ఈ 70 ఏళ్లలో ప్రపంచ ఆర్థికరంగాన్ని శాసించే స్థాయికి ఎదిగాయి. అభివృధ్ధి చెందిన దేశాలయ్యాయి. ధనిక దేశాలయ్యాయి.  

అత్యధిక జనాభా, అన్నిరకాల వనరులు, అత్యుత్తమ మేధోసంపత్తి ఉన్న మన దేశం మాత్రం 70 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఒక "అభివృధ్ధి చెందుతున్న దేశం" గానే ఉండటం నిజంగా సిగ్గుచేటు. 


దేశానికి స్వతంత్రం వచ్చిననాటి నుంచి అత్యధిక కాలం ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకుల స్వార్థ ప్రయోజనాలు, తాత్కాలిక ప్రయోజనాలకోసం వాళ్లు తీసుకొన్న అత్యంత తప్పుడు నిర్ణయాలు, సృష్టించిన పనికిరాని పాలసీలు .. ఇవే మన దేశం ఇప్పటికీ ఇంకా ఒక అభివృధ్ధిచెందుతున్న దేశంగానే మిగిలిపోవడానికి కారణాలు. 

మినహాయింపు ఒక్కటే ...

అది మన తెలంగాణ బిడ్డ, తెలుగువాడు .. పి వి నరసింహారావు. 


దేశం ఆర్థికస్థితిగతుల్ని మార్చడానికి దేశ ప్రధానిగా అప్పుడు పి వి తీసుకొన్న విప్లవాత్మక నిర్ణయాలవల్లనే కనీసం దేశం ఇప్పుడీ స్థితిలో ఉంది. 


అలాంటి మన పి వి మరణించినప్పుడు ఢిల్లీలో అంత్యక్రియలు లేవు. కనీసం ఆయనకు ఢిల్లీలో సమాధిస్థలం కూడా లేదు. 


ఈ వివక్షను మన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ప్రశ్నించారో లేదో, ప్రశ్నించకపోతే ఎందుకని ప్రశ్నించలేదో, అసలంత దమ్ము వాళ్లకున్నదో లేదో నాకు తెలియదు. 

కట్ టూ కేసీఆర్ - 

"ఈ దేశంలో ఇక ఎప్పుడూ ఇంతే" అని అందరికీ ఒక రొటీన్‌గా అలవాటైపోయిన ఇలాంటి అత్యంత దయనీయ, స్వార్థపూరిత, స్థబ్ద రాజకీయాల్లో ఒక ఖచ్చితమైన గుణాత్మకమైన మార్పు ఇప్పుడు అవసరం. 


ఆ మార్పునే మన ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకురావాలనుకొంటున్నారు. 


ఆ మార్పు కోసమే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకొంటున్నారు. 


అయితే రాష్ట్రం వేరు, దేశం వేరు. 


అంత సులభం కాదు. 


అలాగని అసాధ్యం కూడా కాదు. 


ఆ దిశలో ముందొక అడుగు పడాలి.  


ఆ అడుగు మన కేసీఆర్ వేయడం నిజంగా హర్షణీయం.  

కట్ చేస్తే - 

అందరి దృష్టీ ఢిల్లీలో ఉన్న గద్దె మీదే తప్ప దేశం కోసం ఆలోచించేవాళ్ళు నిజంగా ఎంతమంది ఉన్నారు? ఏ పార్టీలో ఉన్నారు? 

స్పీచుల్లోనే తప్ప చేతల్లో ఎక్కడుంది అభివృద్ధి? 

అసలు దేశంలో ఎక్కడ ఏముంది? ఎక్కడ ఏ సమస్యలున్నాయి? ఎందుకున్నాయి? వాటికి పరిష్కారం ఏంటి?... అన్న ఈ ప్రాథమిక విషయాలపై ఎంతమంది రాజకీయ నాయకులకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది? 

ఉంటే ఎందుకు మాట్లాడరు? ఎందుకు చేయరు? 

ఎంతసేపూ ప్రజల నిత్యజీవితంతో, అభివృద్ధితో సంబంధం లేని పనికిరాని విషయాలేనా? లేని సమస్యల్ని సృష్టిస్తూ విద్వేషాలను పెంచుకుంటూపోవడమేనా?   

కేసీఆర్‌కు ఈ దేశ భౌగోళిక పరిస్థితులు తెలుసు. సహజవనరుల సంపద తెలుసు. సమస్యలౌ తెలుసు, వాటి మూలాలు తెలుసు. దశాబ్దాలు సాగదీయకుండా వాటినెలా పరిష్కరించవచ్చో తెలుసు. అమెరికా వంటి దేశాలు ప్రపంచాన్ని ఎందుకు శాసించగైగే స్థానంలో ఉన్నాయో తెలుసు. మన దేశం ఆ స్థాయికి ఎందుకు రాలేకపోయిందో తెలుసు. 

ఒక కొత్త రాష్ట్రాన్ని సాధించిన అనుభవం ఉంది. దాన్ని అత్యంత వేగంగా అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్తున్న రికార్డు ఉంది. 

ఇప్పుడు దేశంలో ఉన్న ఏ ఇతర రాజకీయనాయకునితో పోల్చినా... ప్రధానమంత్రి కావడానికి కేసీఆర్‌ను మించిన ఆలోచన, అవగాహన, స్పష్టత, సామర్థ్యం ఉన్న నాయకులు ప్రస్తుతం దేశంలో ఎవరూ లేరన్నది స్పష్టం.