Thursday, 18 October 2018

కొన్నిటికి ఏ లాజిక్కులుండవ్!

"అన్ని కష్టాలు ఒక్కసారిగా కట్టగట్టుకొనే వస్తాయి."

జీవితంలో అన్ని ఆటుపోట్లను అనుభవించి, ఎదుర్కొని, ప్రస్తుతం ప్రశాంతంగా రిటైర్డ్ లైఫ్ అనుభవిస్తున్న ఒక డాక్టర్ అన్నారా మాట.

ఆయన మా ఆఫీస్ ప్రెమిసెస్ యజమాని.

"జీవితం ఎవ్వర్నీ వదలదు భయ్యా. ప్రతి ఒక్కర్నీ, ఏదో ఒక టైమ్ లో ఒక చూపు చూస్తుంది. మిస్సయ్యే ప్రసక్తే లేదు."

మంచి రైజింగ్ టైంలో ఉండగానే, పడకూడని కష్టాలు పడ్డ ఫిల్మ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మాటలివి.

ఇదంతా ఈ దసరా రోజు సాయంత్రం ఒంటరిగా కూర్చొని ఎందుకు రాస్తున్నానంటే, దానికో కారణం ఉంది. ప్రస్తుతానికి ఆ కారణాన్ని అలా పక్కన పెడదాం.

మనిషన్న తర్వాత, వాడి జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక కష్టం చిన్నదో పెద్దదో వస్తూనే ఉంటుంది. కానీ, జీవితంలోని ఒక అతి ముఖ్యమైన మజిలీలో, అన్ని రకాల కష్టాలూ, లేదా అగ్ని పరీక్షలు ఒకేసారి రావడం అనేది ఎంత స్థితప్రజ్ఞుడినైనా కొంతైనా జర్క్ తినేలా చేస్తుంది.

అలాంటి పరిస్థితిలో ఉన్నపుడే నిజమైన హితులు, సన్నిహితులు ఎవరన్నది పాలు, నీళ్ళలా తెలిసిపోతుంది.

జీవితంలో ఏది ముఖ్యమో తెలిసిపోతుంది. జీవితంలో మనం ఏం కోల్పోతున్నామో తెలిసిపోతుంది.

అప్పుడు గాని మన కళ్ళు పూర్తిగా తెర్చుకోవు. అప్పుడుగాని మన మెదడును పూర్తిగా ఉపయోగించుకోము.

అప్పుడే మనకు నిజంగా ఏం కావాలో తెల్సుకుంటాము. అప్పుడే మనం నిజంగా ఏం చేయాలో అది చేయటం ప్రారంభిస్తాము. అప్పుడే మన నిజజీవితంలో ఏ పరిస్థితి ఎదురైనా నిశ్చలంగా ఎదుర్కొంటాము.

రెట్టించిన కసితో, వందరెట్ల శక్తితో.

ఎవరి జీవితంలోనైనా సిసలైన టర్నింగ్ పాయిట్ అదే.

అప్పటినుంచి మాత్రమే, అంతకుముందటి ఏ లాజిక్కులకు చిక్కని ఎన్నో పనులు చేస్తుంటాము. నమ్మశక్యంకాని ఎన్నెన్నో ఫలితాలు చూస్తుంటాము.

అసలు జీవితం అప్పుడే ప్రారంభమవుతుంది ... 

Friday, 12 October 2018

31 జిల్లాలకు ఆ ముగ్గురు చాలు!

ఆ మధ్య, జి హెచ్ ఎం సి ఎన్నికలను కేటీఆర్‌కు అప్పగించారు. తనేంటో తడాఖా చూపించారు కేటీఆర్.

నారాయణ్ ఖేడ్ ఎన్నికను ట్రబుల్ షూటర్ హరీష్‌రావుకు అప్పగించారు. విజయ ఢంకా మోగించారు హరీష్‌రావు.

సింగరేణి యూనియన్ ఎన్నికలను కవితకు అప్పగించారు. వ్యూహాత్మకంగా అహోరాత్రులు కృషిచేసి అక్కడ అద్భుత విజయం సాధించి చూపెట్టారు కవిత.

కట్ చేస్తే - 

మొన్నటి మహాసభల నిర్వహణ విషయంలోనూ అంతే.

కొంగరకలాన్ కేటీఆర్‌కు, హుస్నాబాద్ హరీష్‌రావుకు, నిజామాబాద్ కవితకు అప్పగించారు. ఒక్కొక్కరు తమదైన శైలిలో కృషిచేసి, ఆయా సభలను ప్రతి కోణంలోనూ సక్సెస్ చేసి చూపించారు.

దటీజ్ కేసీఆర్!

ఏ పని ఎవరికి అప్పగించాలో, ఎలా విజయం సాధించాలో కేసీఆర్‌గారికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు.

కట్ చేస్తే- 

ఇప్పుడు డిసెంబర్ 7న జరగబోతున్న ఎన్నికలు కేసీఆర్‌కు, టీఆరెస్‌కు, మొత్తం తెలంగాణకు అత్యంత ప్రతిష్టాకరమైనవి.

100 టార్గెట్.

రాష్ట్రంలో ఉన్న 31 జిల్లాలను ఈ ముగ్గురు వ్యూహాత్మక యోధులకు చెరొక 10 జిల్లాల చొప్పున అప్పగిస్తే చాలు. మిగిలే ఇంకో జిల్లాను కేటీఆర్‌కో, హరీష్‌రావుకో అదనంగా అప్పగిస్తే సరి. 

100 సీట్లు గ్యారంటీ.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ విషయం గురించి ఒక్క క్షణం ఆలోచిస్తే బాగుంటుందని నా హంబుల్ సజెషన్.  

Monday, 8 October 2018

టార్గెట్ 100

ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఏ రాజకీయపార్టీతో పోల్చుకున్నా, టీఆరెస్ బెటర్. ఏ రాజకీయ నాయకునితో పోల్చుకొన్నా, కేసీఆర్ ది బెస్ట్.

కేసీఆర్ స్థాపించిన టీఆరెస్ పార్టీ, ఉద్యమనాయకుడిగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణవాదులందరికీ ఒక వేదిక అయ్యింది. తెలంగాణ సాధించుకున్నాం.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా, కేసీఆర్, కేవలం 4 ఏళ్లలో, అంతకుముందు 58 ఏళ్లలో జరగని ఎన్నో అంశాల్ని, ఎంతో ప్రగతినీ సాధించి చూపెట్టారు.

ఇది నిరూపించడానికి ఎవ్వరూ ఏదో భజన చెయ్యనక్కర్లేదు. గూగుల్‌లో కొట్టండి చాలు. కనీసం ఓ 400 అద్భుతమైన పనులు, పథకాల లిస్ట్ మీకు దొరుకుతుంది.

వాటిల్లో కొన్ని పనుల్నిగానీ, పథకాల్ని గాని, ఇంతకు ముందు సమైక్యరాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులెవ్వరూ కనీసం కలలో కూడా ఊహించి ఉండరంటే అతిశయోక్తికాదు!

వీటిల్లో చాలా పనులను, పథకాలను, ఇతర రాష్ట్రాలతోపాటు కేంద్రం కూడా ఇప్పుడు ఫాలో అవుతోంది.

దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.

మనసుంటే మార్గం ఉంటుంది.

ఆ మనసు కేసీఆర్‌కుంది.

తెలంగాణ పట్ల, తెలంగాణ అభివృధ్ధి పట్ల, తెలంగాణ ప్రజల పట్ల, నిరంతరం ఒక అగ్నిగోళంలా మండుతూ, మధనపడుతూ ఉండే ఒక మహా మనీషి మన ముఖ్యమంత్రి కేసీఆర్.

అలాంటి మనీషి స్థాపించిన మన ఇంటి పార్టీని, మన ముఖ్యమంత్రిని మనం కాపాడుకోవాలి. గెలిపించుకోవాలి.

టీఆరెస్ 'టార్గెట్ 100' అంత ఈజీ కాదు. కానీ, అందరూ పూనుకొంటే అంత కష్టం కూడా కాదు.

జై తెలంగాణ!
జై కేసీఆర్!!        

Sunday, 30 September 2018

'వరంగల్ ఈస్ట్' టికెట్ ఎవరికిస్తే బాగుంటుందో మీకు తెలుసా?

( సరదాగా / Just Kidding)
***

నేను పుట్టింది, పెరిగింది "వరంగల్ ఈస్ట్" నడిబొడ్డులో! 

పక్కా లోకల్ ... 

ఉస్మానియాలో 2 పీజీలు చేశాను. 2 గోల్డ్ మెడల్స్ సాధించాను. 3 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చేశాను.

తిక్కలేచినప్పుడు, ఒక్కొక్కటిగా  ఆ జాబ్స్‌ను  రెజైన్ చేసిన రికార్డు కూడా ఉంది. 

అలాగని నేనేం రిచ్ కాదు. 

హైద్రాబాద్ వచ్చి పాతికేళ్లయినా ఇక్కడ నాకు జానెడు జాగా లేదు. సొంతిల్లు లేదు. అది వేరే విషయం. 

ఇప్పుడు ఫ్రీలాన్సర్‌గా లోకల్ నుంచి, మల్టీ నేషనల్ స్థాయి వరకు యాడ్స్ చేస్తున్నాను. ఒక్క 'అమెజాన్ డాట్ కామ్‌'కే ఫ్రీలాన్సర్‌గా ఓ అరడజన్ పనులు చేస్తున్నాను. రైటర్‌గా, ఘోస్ట్ రైటర్‌గా, సోషల్ మీడియా ప్రమోషన్ స్ట్రాటజిస్ట్‌గా .. ఇంకో డజన్ క్రియేటివ్ జాబ్స్ చేస్తున్నాను.  

రైటర్‌గా నంది అవార్డు తీసుకున్నాను. 

సినిమాల్లో 'స్పెషల్ అప్పియరెన్స్' ఇచ్చినట్టు, అప్పుడప్పుడూ డైరెక్టర్‌గా సినిమాలు కూడా డైరెక్ట్ చేస్తుంటాను. 

ఇప్పుడు "నమస్తే హైదరాబాద్", ఇంకో రెండు సినిమాలు చేస్తున్నాను.

బట్, సినిమాలు నా ప్రధాన వ్యాపకం ఎప్పుడూ కాదు.

జస్ట్ ఫర్ ఫన్.

జస్ట్ ఫర్ బిజినెస్. 

అంతే. 


ఈ ఫీల్డుని ఏ క్షణమైనా వదిలేస్తాను. 

దీన్ని మించిన ప్యాషనేట్ పనులు నేను చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో.

అవి ముఖ్యం నాకు. 


చెప్పాలంటే, అవే ముఖ్యం.     

కట్ టూ నా తెలంగాణ - 

నేను పుట్టిన తెలంగాణ అంటే నాకు ప్రాణం. 

ఆ తెలంగాణ సాధించిన కేసీఆర్‌కు నేనొక హార్డ్‌కోర్ ఫ్యాన్‌ను.

ఉద్యమసమయం నుంచి, ఇప్పటిదాకా .. తెలంగాణపైన, కేసీఆర్ పైన ఎన్నో ఆర్టికిల్స్ రాశాను. బ్లాగ్ పోస్టులు రాశాను. వీటన్నిటి సంకలనంతో ఒక పుస్తకం కూడా త్వరలో పబ్లిష్ చేసే ఉద్దేశ్యంలో ఉన్నాను. 

అయితే, ఎప్పుడా పని చేస్తానో ఇప్పుడే చెప్పలేను.   

ఏపీతో సహా, దేశంలోని ఎన్నో ఇతర ప్రాంతాలంటే కూడా నాకెంతో ఇష్టం. 

నా స్నేహితుల్లో అత్యధికభాగం మంది ఆంధ్ర నుంచే ఉన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాలనుంచి కూడా ఉన్నారు. 

అంతెందుకు .. నా భార్య పుట్టిపెరిగింది హైద్రాబాదే అయినా, ఆమె పేరెంట్స్ కడపవాళ్లు! 

సో, రాజకీయాలు వేరు. స్నేహాలు, బంధుత్వాలు వేరు.

కట్ చేస్తే - 

ఏ లెక్కప్రకారం చూసినా మనోహర్ చిమ్మని 'రైట్ క్యాండిడేట్' అని .. పలు పార్టీలు నాకు టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు నిపుణుల సమాచారం. 

ఏ పార్టీ నుంచి పోటీచేసినా మనోహర్ చిమ్మని గెలుస్తాడని 'టుడే ఇండియా' విశ్లేషణ! 

మన ఇంటిపార్టీ టీఆరెస్‌లో ఆల్రెడీ ఈ 'వరంగల్ ఈస్ట్' సీటు గురించి నానా లొల్లి నడుస్తోంది. కాబట్టి, నాకు టీఆరెస్ నుంచి ఛాన్స్ లేదు.

సో, వేరే ఏదో ఒక పార్టీ తప్పదు. 

ఏ పార్టీ నుంచి గెలిచినా, తర్వాత ఎలాగూ మన రాజకీయాల్లోని 'ఎవర్‌గ్రీన్ అండ్ గుడ్-ఓల్డ్' ప్రాక్టీస్ ఒకటి ఉండనే ఉంది.

అదేంటో తర్వాత మరోసారి వివరంగా మాట్లాడుకుందాం.

సరే, ఇదంతా ఎలా ఉన్నా, మన కేసీఆర్ గారు చెప్పినట్టు 'రాజకీయాల్లో ఒక గుణాత్మక మార్పు' అనేది ఇప్పుడు చాలా అవసరం. అది తెలంగాణ నుంచే మొదలవ్వాలి.  


సో .. వరంగల్ తూర్పు సీటు కొసం, తెలంగాణ ప్రగతి కోసం, ఏ క్షణమైనా, ఏ గొంగలిపురుగునైనా నేను కూడా ముద్దుపెట్టుకుంటాను!  

జై కేసీఆర్!
జై తెలంగాణ!! 

Now the ball is in the court of all parties ... 😃

Thursday, 27 September 2018

సోషల్ మీడియా ప్రమోషనే ఎన్నికల్లో 'ట్రంప్ కార్డ్' కాబోతోందా?

ఖచ్చితంగా అవును!

ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఇప్పుడు అందరికీ తెలిసిన నిజం ఇది.

ముఖ్యంగా పొలిటీషియన్‌లకు, పాలిటిక్స్‌ను ఫాలో అవుతున్నవారికి మాత్రం చాలా బాగా తెలుసు.

కట్ టూ పాయింట్ - 

ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రమోషన్ ప్రాధాన్యం తెలిసి, ఆ అవసరం ఉన్నవారికోసం మాత్రమే ఈ పోస్ట్:

ఒక రైటర్ గా, ఫిల్మ్ డైరెక్టర్ గా, యాడ్ ఫిల్మ్ మేకర్ గా, సోషల్ మీడియా స్ట్రాటెజిస్ట్ గా .. ఒక పూర్తిస్థాయి టీమ్, నా పర్యవేక్షణలో పనిచేస్తుంటుంది.

నాతోపాటు, నా టీమ్‌లోని వాళ్లంతా  సోషల్ మీడియా ప్రమోషన్ లో నిష్ణాతులు.

ఏ పొలిటిల్ పార్టీ అన్న విషయంతో సంబంధంలేకుండా, రానున్న 2018/2019 ఎన్నికల్లో, పార్టీలు/అభ్యర్థులు/టికెట్ ఆశించే అభ్యర్థులకు నేను అత్యున్నతస్థాయి సోషల్ మీడియా ప్రమోషన్ అందిస్తాను.

ఇది నా వృత్తిలో ఒక భాగం. ఒక ప్రొఫెషనల్ సర్వీస్ ఆఫర్.

ఈ ఆఫర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని అన్ని పార్టీలు/అభ్యర్థులు/టికెట్ ఆశిస్తున్న అభ్యర్తులకు వర్తిస్తుంది.

ఇది 100% ప్రొఫెషనల్ సర్వీస్. నాకు నచ్చిన ఆఫర్స్, ప్యాకేజెస్ మాత్రమే నేను స్వీకరిస్తాను. మీరు ఆశించిన స్థాయిని మించిన  సర్వీస్ నా నుంచి, నా ఆధ్వర్యంలో పనిచేసే నా టీమ్ నుంచి  ఉంటుంది.

నిజంగా ఆసక్తి, అవసరం, స్థోమత ఉన్న పార్టీలు/అభ్యర్థులు/టికెట్ ఆశించే అభ్యర్థులు .. మీ ప్రపోజల్ నాకు 'ఈమెయిల్' చేయండి. వెంటనే స్పందిస్తాను: mchimmani@gmail.com 

థాంక్యూ.
బెస్ట్ విషెస్ ...

Friday, 21 September 2018

Addicted to KCR

ఈరోజు నుంచీ, త్వరలో రానున్న 2018/2019 ఎలక్షన్స్ అయిపోయేవరకూ, నా ఫేస్‌బుక్ టైమ్‌లైన్ మీద, నా బ్లాగులో, ట్విట్టర్‌లో .. నేను ఎప్పుడూ పోస్ట్ చేసే నా రెగ్యులర్ పోస్టులతోపాటు .. నా అభిమాన కేసీఆర్, టీఆరెస్ లకు అనుకూలమైన పోస్టులు కూడా కొల్లలుగా ఉంటాయి.

కేసీఆర్ 'హార్డ్ కోర్ ఫ్యాన్' గా, ఇది పూర్తిగా నాకు నేను వాలంటరీగా చేస్తున్న పని.

ఒక తెలంగాణ బిడ్డగా ఇది నా బాధ్యతగా భావించి, ఉడతా భక్తిగా నేనీ పని చేస్తున్నాను. 

రాజకీయాలు వేరు, స్నేహం వేరు అనుకోగలిగిన నా మిత్రులు ఏపార్టీవారైనా, నా పోస్టులను హాయిగా ఎంజాయ్ చెయ్యొచ్చు. సింపుల్ గా ఇగ్నోర్ కూడా చెయ్యొచ్చు.

ఇది అస్సలు నచ్చని మిత్రులు ఎవ్వరైనా ఉంటే, నన్ను వెంటనే అన్ ఫ్రెండ్ చెయ్యొచ్చు. బ్లాక్ చెయ్యొచ్చు.

అర్థంలేని కామెంట్స్, అసభ్యకరమైన/అభ్యంతరకరమైన కామెంట్స్ కు మాత్రం
నా ఫేస్‌బుక్ టైమ్ లైన్ మీద/బ్లాగులో/ట్విట్టర్‌లో స్థానం లేదు.

అలాంటివాటిని వెంటనే డిలీట్ చేస్తాను. ఆయా వ్యక్తులను బ్లాక్ చేస్తాను. కామెంట్స్ తీవ్రతనుబట్టి, అవసరమైతే, వెంటనే సైబర్ క్రైమ్ సెల్ కు కూడా కంప్లయింట్ వెళ్తుంది.

థాంక్యూ.
బెస్ట్ విషెస్ ...                              

Thursday, 20 September 2018

ఫేస్‌బుక్కా, ట్విట్టరా?

ఫేస్‌బుక్ నిజంగా ఇప్పుడొక ఫిష్ మార్కెట్ అయిపోయింది.

కేవలం అతికొద్ది శాతం మంది మాత్రమే ఈ ఫేస్‌బుక్‌ను ఒక మంచి డిగ్నిటీతో, డీసెన్సీతో ఉపయోగిస్తున్నారు. వారు మాత్రం నన్ను క్షమించాలి. పైన ఫిష్ మార్కెట్ అన్నందుకు. 

ముందే చెప్పినట్టు, మిగిలిందంతా జస్ట్ ఒక ఫిష్ మార్కెట్. లేదా, ఓ సనత్‌నగర్ సండే మార్కెట్. ఒక కల్లు దుకాణం. ఒక లోకల్ బార్. 

ఇదంతా నేను సరదాకి చెప్తున్నాను.

కొటేషన్లు, రాజకీయాలు, సినిమాలు, ఇతర వ్యక్తిగత దృక్పథాలు సరే. ఎవరి ఇష్టం వారిది. 

కానీ, ఫేస్‌బుక్ వాల్ చివరికి ఎలా తయారయ్యిందంటే:

> ఒక డాన్స్ మాస్టర్ తన తల్లి చనిపోతే, ఆ తర్వాతి కార్యక్రమాన్ని ఒక ఈవెంట్‌లాగా .. తన తల్లి శవం బ్యాక్‌డ్రాప్‌లో ఫోటోలకు పోజులిస్తూ దిగాడు. అవన్నీ తన వాల్ మీద పోస్ట్ చేశాడు.

> ఒకతను సూసైడ్ చేసుకొంటూ లైవ్ రికార్డ్ చేసుకున్నాడు. 

> ఇప్పుడు ఏకంగా ప్రతి హత్యను, వాటి సిసి రికార్డింగ్‌లను పోస్ట్ చేస్తున్నారు.   

> పోస్టుల్లో బూతుమాటలకు అసలు లెక్కేలేదు.

ఇట్లా ఇంకో వంద చెప్పుకోవచ్చు. 

ఇవన్నీ నేను ఎంత వద్దనుకొన్నా నా కంటపడుతున్నాయి. 


కట్ టూ నా గొడవ - 

ఫేస్‌బుక్, బ్లాగింగ్, ట్విట్టర్ .. ఈ మూడింటినీ నేనొక "స్ట్రెస్ బస్టర్" టూల్స్‌లాగా భావించి ఉపయోగిస్తాను. అది కూడా రోజుకి కొన్ని నిమిషాలు. మొత్తంగా ఒక గంట కూడా ఎన్నడూ ఉపయోగించలేదు ఎన్నడూ.

పైన చెప్పిన నేనిష్టపడని, నాకు నచ్చని ఒక 101 కారణాలవల్ల ఇప్పుడు నాకు ఫేస్‌బుక్ అనేది ఏ క్షణం వదిలేయాలా అన్న స్థాయికి వచ్చేసింది.

ఆ క్షణం త్వరలోనే రావాలని కోరుకొంటున్నాను.

కానీ, మార్కెటింగ్ పాయింటాఫ్ వ్యూలో ఫేస్‌బుక్ అనేది ఒక మంచి మాస్ సోషల్ మీడియా సాధనం. ఇప్పుడు నేను చేస్తున్న ఒకటి రెండు సినిమా ప్రాజెక్టుల ప్రమోషన్ దృష్ట్యా కొంచెం ఆలోచిస్తున్నాను.

లాజిగ్గా ఆలోచిస్తే ఇది కూడా తప్పే.

అసలు సోషల్ మీడియా జోలికి వెళ్లని పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లు, ఇతర రంగాల సెలబ్రిటీలు ఎందరో ఉన్నారు.

మనకు ఒక హాబీ నచ్చనప్పుడు సింపుల్‌గా దానికి గుడ్‌బై చెప్పడం బెటర్ అనేది నా హంబుల్ ఒపీనియన్.

ట్విట్టర్ ఒక్కటి చాలు. కావాలనుకొంటే తప్ప, కింద కామెంట్స్ చూసే అవసరం కూడా ఉండదు. నా బ్లాగ్ పోస్టుల లింక్‌ను అక్కడ పోస్ట్ చెయ్యొచ్చు. ఫేస్‌బుక్ ద్వారా సాధించగలిగిన ఇతర పాజిటివ్ లక్ష్యాలన్నిటినీ ట్విట్టర్‌తో కూడా సాధించవచ్చు.

ముఖ్యంగా, టైమ్ కూడా ఎక్కువ వృధా కాదు.

సో, ఇప్పటికయితే నా అలోచన ఇది.

దీన్ని ఏ క్షణమైనా నేను ఆచరణలోకి తేవచ్చు.  

Wednesday, 19 September 2018

77 రోజులు

చాలా పెద్ద గ్యాప్ తర్వాత, మళ్లీ నాకత్యంత ప్రియమైన నా 'బ్లాగింగ్' మీద పడ్డాను.

జూన్ 29 నుంచి సెప్టెంబర్ 13 వరకు.

నిజంగా చాలా పెద్ద గ్యాప్.

బహుశా ఇంత పెద్ద గ్యాప్ ఇంతకుముందు నేనెప్పుడూ తీసుకోలేదు.

పనికొచ్చేదో, పనికిరానిదో .. మొత్తానికి ఏదో ఓ చెత్త, ఆ క్షణం నేను రాయాలనుకున్నది వెంటనే ఇక్కడ నా బ్లాగులో రాసేసేవాణ్ణి.

ఇదొక హాబీ. ఒక ఆనందం. ఒక థెరపీ. ఒక మెడిటేషన్.


కట్ టూ ఆ 77 రోజులు - 

అనుకోకుండా ఒక ప్రొఫెషనల్ టూర్.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు.

కేవలం ఒక 4 రోజుల పని అనుకున్నాను. కాని, అక్కడికి వెళ్ళిన తర్వాత రకరకాల పనుల్లో ఊహించనివిధంగా కనెక్ట్ అవుతూ, అక్షరాలా 77 రోజులు ఉండాల్సి వచ్చింది!

మధ్యలో ఒకటి రెండు సార్లు కొన్ని గంటలకోసం అత్యవసరంగా హైదరాబాద్ వచ్చి వెళ్లినా, ఆ కొద్ది సమయం అసలు లెక్కలోకి రాదు.

1989 నుంచి 1991 వరకు, సరిగ్గా ఒక రెండేళ్లు, గుంటూరులోని మద్దిరాలలో ఉన్న కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థ 'జవహర్ నవోదయ విద్యాలయ'లో నేను పనిచేశాను. ఆ తర్వాత, అక్కడ ఉద్యోగం రిజైన్ చేసి కర్నూలు ఆలిండియా రేడియోలొ చేరాను. తర్వాత, ఆ ఉద్యోగం కూడా రిజైన్ చేసి హైదరాబాద్ వచ్చాను.

అది వేరే విషయం.

చెప్పొచ్చేదేంటంటే, నాకు గుంటూరుతో చాలా సంబంధబాంధవ్యాలున్నాయి. అప్పటి జ్ఞాపకాలు లెక్కలేనన్ని ఉన్నాయి.

అప్పటి నవోదయ విద్యార్థుల్లో చాలా మంది ఇప్పటికీ నాతో టచ్‌లో ఉన్నారు. అప్పటి నా సహోద్యోగుల్లో కూడా కొందరం ఇప్పటికీ కలుస్తుంటాం. 

ఈ నేపథ్యంలో, గుంటూరు అంటే నాకు చాలా ఇష్టం.

అయితే, అప్పటి గుంటూరు వేరు. దాదాపు పాతికేళ్ల తర్వాత ఇప్పటి గుంటూరు వేరు.

ఎక్కడ  చూసినా షోరూములు, జివెల్రీ షాపులు, కిక్కిరిసిన ట్రాఫిక్‌తో డెవలప్‌మెంట్ బాగానే ఉంది. కానీ, ఏదో సంథింగ్ మిస్ అవుతున్నానన్న ఫీలింగ్.

బహుశా, ఆనాటి సహజమైన 'టౌన్ ఫీలింగ్' అనుకుంటాను. అదిప్పుడు లేదు. 

నేను బాగా తిరిగిన అప్పటి గుంటూరే నాకిప్పటికీ ఇష్టం.

గుంటూరులో ఈ 77 రోజుల నా మొత్తం ట్రిప్‌లో నాకు బాగా నచ్చింది ఒక్కటే.

బ్రాడీపేటలో ఉన్న శంకర్‌విలాస్‌లో రవ్వదోశ. 

Thursday, 28 June 2018

పీవీ ఖచ్చితంగా ఇలా మాత్రం చేసేవాడు కాదు!

సరిగ్గా వారం క్రితం ...
హైదరాబాద్, ఆల్విన్ కాలనీ, కుక్కట్‌పల్లిలో ఏటీఎమ్‌లో డబ్బులు తీస్కోడానికి - మెయిన్‌రోడ్ పైన సాయిబాబా కమాన్‌కు కుడివైపు 2, ఎడమవైపు 6, లోపలికి ఇంకో 4 ... మొత్తం 12 ఏటీఎమ్‌లు వర్షంలో తిరిగాను. ఏ ఒక్కదానిలోనూ డబ్బులేదు.

అంతదూరం నేను వెళ్లిన ఒక ముఖ్యమైన పని పూర్తిచేసుకోకుండానే వెనుదిరిగి వచ్చాను.

మళ్ళీ ఇవ్వాళ రాత్రి 8.30 గంటలు, గుంటూరు సిటీ ...

అత్యవసరమైన ఒక పని గురించి నా మిత్రుడు ఒక చిన్న మొత్తం నాకు పంపించాల్సివచ్చింది. నాకు ఎకౌంట్స్ ఉన్న రెండు బ్యాంకులు కూడా వాటి ఏటీఎమ్ సెంటర్స్‌లో అక్కడ డిపాజిట్ మెషీన్స్ కూడా పెట్టాయి.

వాటిని నేను అంతకుముందు చూశాను, వాడాను కూడా.

కానీ, మొత్తం ఒక 6 డిపాజిట్ మెషీన్స్ అస్సలు పనిచేయడం లేదు. లేదా, నిండిపోయాయి.

సమయం జస్ట్ రాత్రి ఎనిమిదిన్నర. ఈరోజు హాలిడే కూడా కాదు.

మరొక దారిలేదు. మరొక ముఖ్యమైన పని మళ్ళీ వాయిదాపడింది.

మన తప్పు ఏం లేకుండానే.

మన డబ్బు మనం అవసరానికి వాడుకోడానికి!

కట్ టూ మోదీ - 

డిమానెటైజేషన్, జీఎస్టీలతో ఆయన మంచే చేశాడో, ఇంకేం చేశాడో ఒక మామూలు పౌరుడిగా నాకంత పెద్ద అవగాహన ఇప్పటికీ రాలేదు.

నాకు అర్థమయ్యింది, నేను అనుభవించింది మాత్రమే నాకు తెలుసు.

గత ఏడాదిన్నర కాలంలో ఇలాంటి కష్టాలు ఎన్నో పడ్డాను నేను. ఇంకా పడుతూనే ఉన్నాను.

మోదీ ఒక్కడే కాడుగా? జాతీయస్థాయిలో ఆయన ఆర్థిక యంత్రాంగం అంతా ఇంకా ఏం చేస్తున్నట్టు? ఇలాంటి గ్రౌండ్ లెవల్ రియాలిటీస్ అన్నీ ఆయనకు అసలు తెలుసా? తెలిస్తే ఆయన ఏం చేస్తున్నట్టు? ఏం చర్యలు తీసుకున్నట్టు? ఇంకా ఎన్నడు ఈ పరిస్థితి మారుతుంది?

ఇది ఎవరి పుణ్యం?
ఎవరి గొప్పతనం?
ఎవరి చేతకానితనం?

పీవీ నరసింహారావు లాంటి వాడు కాని ఇలాంటి సమయంలో ఉంటే ఖచ్చితంగా పరిస్థితి ఇలా ఉండేదికాదు.

అసలిలాంటి సిగ్గుచేటైన పరిస్థితిని ముందు రానిచ్చేవాడేకాదు.

వి మిస్ యూ పీవీ గారూ ...

ఈరోజు మీ జయంతి సందర్భంగా మీకివే నా ఘన నివాళులు.  

Sunday, 24 June 2018

నగ్నచిత్రం ... మరికొన్నాళ్లు!

ఈ బ్లాగ్‌కు ఇక పూర్తిగా గుడ్‌బై చెప్తున్నానని చెప్పేసి, నిర్ణయం మార్చుకొని, తిరిగి మళ్ళీ ఇలా వెనక్కిరావడం ఇది బహుశా మూడోసారి.

దటీజ్ నగ్నచిత్రం!

అయాం ఫుల్లీ ఎడిక్టెడ్ టు బ్లాగింగ్.

నాకు సంబంధించినంతవరకూ - బ్లాగింగ్ అనేది ఒక మెడిటేషన్. ఒక థెరపీ.

చుట్టూ వందమంది ఉన్నా, నేను ఒంటరిగా ఫీలైనప్పుడు, "నేనున్నా నీకోసం" అంటూ నన్ను అక్కున చేర్చుకొనే నా ప్రేయసి.

నా శ్వాస.

నా ఘోష.

కట్ టూ అసలు పాయింట్ -

ప్రస్తుతం నేను చేస్తున్న "నమస్తే హైదరాబాద్" సినిమా పూర్తిచేసి, రిలీజ్ చేసేదాకా ఈ బ్లాగ్ అవసరం కొంతైనా ఉందని నా మిత్రులు, శ్రేయోభిలాషులు, ముఖ్యంగా నా టీమ్ ఉవాచ.

వారి లాజిక్కులు వారికున్నాయి.

నేను కాదనలేని లాజిక్కులవి!

సో, ఎలాగైతేనేం ... నా నిర్ణయం మార్చుకొని వెనక్కిరాక తప్పలేదు.

ఇలా వెనక్కి రావడం - మార్కెటింగ్ అవసరాలకోసం, నా అలవాటు కోసం, నాకోసం - ఏదో ఒకటి రాయడం, రాసుకోవడం నాకు చాలా ఆనందమే. కానీ, ఈ జూన్ చివరినుంచే నేను నా కొత్త బ్లాగ్ ఒకటి కొంచెం భారీ సెన్సేషనల్‌గా ప్రారంభించాలనుకొన్నాను. ఆ ఏర్పాట్లన్నీ పూర్తిచేసుకొన్నాను కూడా.

అయితే, ఇప్పుడా ఆలోచనను కనీసం కొద్దిరోజులయినా వాయిదా వేయక తప్పడంలేదు.

నా కొత్త బ్లాగ్‌ను 4 ఆగస్టు నుంచి ప్రారంభిస్తాను.

అప్పటిదాకా, ఎప్పట్లాగే, ఈ నగ్నచిత్రం ఎంజాయ్ చేస్తుంటాను. విత్ ఆల్ మై లైక్‌మైండెడ్ ...

4 ఆగస్టుకు నేను ప్రారంభించబోతున్న నా కొత్త బ్లాగ్ ఏంటన్నది - దాన్ని లాంచ్ చేయడానికి కొద్దిరోజులముందు చెప్తాను.     

ధ్వన్యనుకరణ సామ్రాట్‌కు అశ్రునివాళి!

19 జూన్ 2018.

చరిత్రలో ఒక అద్భుత అధ్యాయం ముగిసింది.

నా చిన్నతనంలోనే ఆయన లైవ్ ప్రోగ్రాములు ఎన్నో చూశాను.

'మెకన్నాస్ గోల్డ్' సినిమా చూడకముందే అందులోని సన్నివేశాలను ఆయన మిమిక్రీ ద్వారా ఎంజాయ్ చేశాను.

నేను హైస్కూల్లో ఉన్నప్పుడు, రకరకాల సర్టిఫికేట్స్ కోసం, నవీన్ టాకీస్ దగ్గర మెయిన్‌రోడ్‌లో ఉన్న ఆయన ఇంటికి వెళ్ళి, గ్రీన్ ఇంకుతో ఎన్నో సంతకాలు చేయించుకొన్నాను. (అప్పుడాయన ఎమ్మెల్సీ కూడా).

వరంగల్ నుంచి న్యూయార్క్‌లోని 'యునైటెడ్ నేషన్స్' దాకా, ప్రపంచమంతా వేలాది ప్రదర్శనలిచ్చిన ఏకైక విశ్వవిఖ్యాత మిమిక్రీకళాకారుడు, మిమిక్రీ కళకు అంతర్జాతీయస్థాయిని సాధించిపెట్టిన మహోన్నత వ్యక్తి, మనసున్న మనీషి, వరంగల్ ముద్దుబిడ్ద, ధ్వన్యనుకరణ సామ్రాట్, పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారికి అశ్రునివాళి.

^^^
(Wriiten and posted on Facebook, on 19th June 2018.)

Wednesday, 2 May 2018

దస్విదానియా!

ఆగస్టు, 2012 - మే, 2018.  

సుమారు 6 సంవత్సరాల సహచర్యం తర్వాత, నాకెంతో ప్రియమైన నా బ్లాగ్ "నగ్నచిత్రం"కు 
ఈరోజు గుడ్‌బై చెప్తున్నాను. 

దస్విదానియా. సయొనారా. గుడ్‌బై. సెలవు ..  

"మైండ్ చేంజెస్ లైక్ వెదర్" అన్నారు. 

ఇంతకుముందు కూడా రెండు మూడుసార్లు ఇలా గుడ్‌బై చెప్పాలని చాలా గట్టిగా అనుకొన్నాను. కానీ, అంత ఈజీగా ఆ పని చేయలేకపోయాను. 

కొన్ని అలవాట్లు అంత ఈజీగా వదలవు. 

కానీ, ఇప్పుడు మాత్రం ఊరికే అనుకోవడం కాదు. ఈ విషయంలో నిర్ణయం తీసేసుకున్నాను. 

అంతా ఒక్క క్షణంలో జరిగింది.

ఇలా అనుకున్నాను .. వెంటనే ఒక ట్వీట్ పెట్టాను, బ్లాగ్‌కు గుడ్‌బై చెప్తున్నానని!  


ప్రాధాన్యాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్నిటికి నా బ్లాగ్ కూడా ఉపయోగపడొచ్చు. కానీ, ఆ పని ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్స్‌టాగ్రామ్‌ల ద్వారా కూడా నేను చేయగలను.

చెప్పాలంటే ట్విట్టర్ ఒక్కటి చాలు. 


వివిధరంగాల్లో ఉన్న ఎంతోమంది స్టాల్‌వార్ట్స్ ఈ మినీ బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను ఎంతో అద్భుతంగా వాడుతున్నారు.

నేను ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్నా కాబట్టి, నా టీమ్ "తప్పదు, ఫేస్‌బుక్‌ను ఈ సినిమా అయ్యేదాకా కంటిన్యూ చెయ్యాల్సిందే" అని పట్టుబట్టడంవల్ల ... నాకు అత్యంత బోరింగ్‌గా ఉన్నా, బిజినెస్ పాయింటాఫ్ వ్యూలో తప్పనిసరై ప్రస్తుతం ఫేస్‌బుక్‌ను కంటిన్యూ చేస్తున్నాను. 

కొన్ని తప్పవు.    

కట్ టూ 'సెలెక్టివ్ మెమొరీ' - 

ఈ బ్లాగ్‌లోని కొన్ని ఎన్నికచేసిన బ్లాగ్ పోస్టులతో "నగ్నచిత్రం" పేరుతో తీరిగ్గా, ఒక ఏడాది తర్వాత ఒక పుస్తకం తప్పక పబ్లిష్ చేస్తాను. 

అది నా జ్ఞాపకం కోసం. 

దాని పీడీఎఫ్ ఫ్రీగా ఆన్‌లైన్‌లో పెడతాను. వేలాదిమంది నా ప్రియమైన బ్లాగ్ రీడర్స్ కావాలనుకొంటే దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. 

ఇప్పటికే, ఈ బ్లాగ్‌లో రాసిన కొన్ని పోస్టులు, మరికొన్ని ఆర్టికిల్స్ కలెక్షన్‌తో కలిపి కేసీఆర్ గారి మీద ఒక పుస్తకం అతి త్వరలో పబ్లిష్ చేస్తున్నాను. 

ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. :)   

Monday, 30 April 2018

క్రియేటివిటీ వేరు, రాజకీయాలు వేరు!


"సబ్ కా సున్‌నా అప్నా కర్‌నా" అని ఒక సామెత. 

తెలిసీ, అనుభవం ఉండీ, ఈ సామెతను ఆమధ్య అసలు పట్టించుకోలేదు. 

అప్పుడు అందరు చెప్పిందే విన్నాను కానీ, నా మనసు చెప్పింది మాత్రం పక్కన పెట్టాను. 

ఇప్పుడు జ్ఞానోదయమైంది, పూర్తిగా.

కట్ టూ క్రియేటివిటీ - 

క్రియేటివిటీకి హద్దులు లేవు. ఉండకూడదు. ఇది నేను వంద శాతం నమ్ముతాను. పాటిస్తాను.

నా టీమ్‌ను ఒక మూడు భాగాలుగా చేస్తే - అందులో ఒక భాగం తెలంగాణవాళ్లుంటారు. మరొక భాగం ఆంధ్రప్రదేశ్‌వాళ్లుంటారు. ఇంకో భాగం మొత్తం మన దేశంలోని మిగిలిన ప్రాంతాలకు చెందినవాళ్లుంటారు.

మరీ ఇట్లా గీతగీసినట్టు కాకుండా, కొన్నిసార్లు ఈ రేషియో మారొచ్చు కూడా.

రఫ్‌గా దీన్నే ఇంకో కామన్ రేషియోలో కూడా చెప్పగలను: టీమ్‌లో సగం మంది తెలంగాణవాళ్లుంటే, మిగిలిన సగం మంది మన దేశంలో ఒక్కో ప్రాంతం నుంచి ఉంటారు.

అయితే - ఇదంతా నేనేదో ప్లాన్ ప్రకారం చేస్తున్నది కాదు. అలా ఎవ్వరూ చెయ్యలేరు. కాని, ఇప్పటికే మన ఫిల్మ్ ఇండస్ట్రీలో పాతుకుపోయిన చాలామందిలో మాత్రం అలాంటి ఫీలింగ్ ఉంది. వాళ్ళు చేయొచ్చు. 

బట్, ఆ ‘చాలా మంది’ గురించి నాకు అవసరం లేదు. అది వేరే విషయం.

'లైక్‌మైండెడ్ స్వభావం' ఒక్కటే నా టీమ్‌లో నేను చూసేదీ, నాకు కావల్సిందీ.

కట్ టూ రాజకీయాలు - 

మన తెలంగాణ రాష్ట్ర ఐ టీ మినిస్టర్ కె టి రామారావు (కేటీఆర్) ఫేస్‌బుక్ పేజ్ మీద ఒక సూపర్ కొటేషన్ ఇలా ఉంది:  

"When Politics Decide Your Future, Decide What Your Politics Should Be!" 

తెల్లారిలేస్తే మనకు ఫేస్‌బులో కనిపించే సవాలక్ష పనికిరాని కొటేషన్లలో ఇదొకటి కాదు. 

తప్పనిసరిగా అందరూ పట్టించుకోవల్సిన కొటేషన్. 

బాగా ఆలోచించాల్సిన కొటేషన్. 

ముఖ్యంగా, బాగా చదువుకున్నవాళ్లు మరింత బాగా అలోచించాల్సిన కొటేషన్ ఇది.  

ఎందుకంటే .. నేను ఎక్కడో చూసిన ఒక లెక్క ప్రకారం, రాజకీయాలపట్ల పూర్తి నిరాసక్తంగా ఉండే ఒకే ఒక్క పనికిమాలిన సెగ్మెంట్ ఈ బాగా చదువుకున్నవాళ్లే!

ఈ ఒక్క సెగ్మెంట్ నిరాసక్తతే ఈ రోజు మన దేశాన్ని ఎందుకూ పనికిరానివాళ్లు దశాబ్దాలుగా పాలించడానికి కారణమైంది. దేశం ఎన్నోరకాలుగా వెనకబడటానికి కారణమైంది.

సో, కేటీఆర్ గారికి థాంక్స్ .. 

తెలిసిన కొటేషనే అయినా, దాన్ని అందంగా తన ఫేస్‌బుక్ పేజి మీద పెట్టి, నాలాంటి ఎందరో రాజకీయాల నిజమైన విలువ తెలుసుకొనేట్టు చేసినందుకు .. ఇప్పుడు నేనీ బ్లాగ్ రాయడానికి స్ఫూర్తినిచ్చినందుకు. 

కట్ టూ ‘భరత్ అనే నేను’ -  

కేవలం మూడురోజుల క్రితం మన ఐటి మినిస్టర్ కేటీఆర్ గారు కొరటాల శివ, మహేశ్ బాబు 'భరత్ అనే నేను' సినిమాకు సంబంధించిన ఒక ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

దాని గురించి కేటీఆర్ గారే స్వయంగా, ఆ ప్రోగ్రాం లింక్ ఇస్తూ, తన ఫేస్‌బుక్ పేజ్‌లో, ట్విట్టర్‌లో పోస్ట్ కూడా చేశారు.

దాన్ని నేను కూడా నా ఫేస్‌బుక్ పేజ్‌లో, ట్విట్టర్‌లో షేర్ చేశాను.  

'భరత్ అనే నేను' కోసం ఒక క్లాసిక్ స్థాయిలో చేసిన ఆ ప్రోగ్రాం పేరు 'విజన్ ఫర్ ఏ బెటర్ టుమారో'. 

రాజకీయాలు వేరు, క్రియేటివిటీ వేరు అన్నదాన్ని నిజం చేస్తూ, మంత్రి కేటీఆర్ ఆ ప్రోగ్రాంలో పాల్గొనటమే ఒక విశేషం. 

కాగా .. ఆ ప్రోగ్రాం మొత్తంలో కూడా కేటీఆర్ ప్రజెంటేషన్, ఆయన మాట్లాడిన మాటలే సూపర్ హైలైట్ అనేది చెప్పాల్సిన అవసరంలేని మరో గొప్ప విశేషం. 

దటీజ్ కేటీఆర్!

అయితే .. ఇలాంటి చొరవ, ఇలాంటి తోడ్పాటు మన తెలంగాణ దర్శకుల సినిమాలకు కూడా కేటీఆర్ తప్పక ఇస్తారనీ, అలా ఇవ్వాలనీ నేను ఆకాంక్షిస్తున్నాను.   

కట్ బ్యాక్ టూ అసలు పాయింట్  - 

ఆరు దశాబ్దాలుగా రగిలిన తెలంగాణ ప్రజల మనోవాంఛను నిజం చేసిన వ్యక్తి కేసీఆర్. 

గత 60 ఏళ్ళుగా ఎవ్వరూ సాధించలేనిదాన్ని సాధించి చూపిన ఒక ఉద్యమశక్తి కేసీఆర్. 

ఈ నేపథ్యంలో .. కేసీఆర్‌గారిమీద అభిమానంతో, ఒక చిన్న పుస్తకం రాద్దామనుకొన్నాను. ఒక మ్యూజిక్ వీడియో చేద్దామనుకొన్నాను. ఒక అంతర్జాతీయస్థాయి డాక్యుమెంటరీ చేద్దామనుకున్నాను.  

"సినీఫీల్డులో వున్నావు. ఎందుకు అనవసరంగా? .. వద్దు!" అని చెప్పిన కొందరి 'ఉచిత సలహా' విని, ఆ పనులు అప్పుడు వాయిదా వేసుకున్నాను. 

కానీ అది తప్పు.  

క్రియేటివిటీ వేరు, రాజకీయాలు వేరు. 

ఇంకా చెప్పాలంటే - మొన్నటిదాకా శత్రువులుగా పిచ్చి పిచ్చిగా తిట్టుకున్నవాళ్లే ఇప్పుడు మళ్ళీ మిత్రులుగా కలిసిపోయారు. 

పార్టీలు మారుతున్నారు. పార్టీలకెళ్తున్నారు. పార్టీలు చేసుకుంటున్నారు. 

ఇందులో తప్పేం లేదు. తప్పదు.

రాజకీయ చదరంగం. 

జీవనవైరుధ్యం. 

సో, దేనికి ఏదీ అడ్డంకాదు. అడ్డురాదు. 

దేని దారి దానిదే.

చేయాలనుకున్నది ఒక మంచిపని అయినప్పుడు చేసుకుంటూపోవడమే.  

త్వరలో నేను ప్రారంభించబోయే నా కొత్త సినిమా ఓపెనింగ్ సందర్భంగానో, దానికి ముందో, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద నేను కొత్తగా అనుకున్న ఒక పుస్తకం ప్రచురించి ఆవిష్కరించాలనుకొంటున్నాను.

మన ఐటి మంత్రి కేటీఆర్ కొటేషన్ ఒక్కటే కాకుండా - ఈ నా నిర్ణయానికి పరోక్షంగా కేటలిస్టులుగా పనిచేసినవాళ్లు మరో ఇద్దరు ఆత్మీయులున్నారు.

ఒకరు నా ఫేవరేట్ స్టూడెంట్. మరొకరు నా టీమ్‌లోని చీఫ్ టెక్నీషియన్స్‌లో ఒకరు. 

విచిత్రమేంటంటే .. వీళ్లిద్దరిదీ గుంటూరు! 

Wednesday, 25 April 2018

రమ్యంగా కుటీరాన రంగవల్లు లల్లిందీ ..

"నిదురించే తోటలోకి
పాట ఒకటి వచ్చిందీ

కన్నుల్లో నీరు తుడిచి
కమ్మటి కల ఇచ్చింది

రమ్యంగా కుటీరాన
రంగవల్లు లల్లిందీ
దీనురాలి గూటిలోన
దీపంగా వెలిగిందీ
శూన్యమైన వేణువులో
ఒక స్వరం కలిపి నిలిపిందీ
ఆకు రాలు అడవికి
ఒక ఆమని దయ చేసిందీ

విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినపడీ అంతలో పోయాయి
కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా
నది దోచుకు పోతున్న నావను ఆపండి
రేవు బావురుమంటోందని నావకు చెప్పండి
నావకు చెప్పండి ..."

కట్ టూ గుంటూరు శేషేంద్ర శర్మ -

కవిసేన మానిఫెస్టో రాసిన గుంటూరు శేషేంద్ర శర్మగారే బాపు గారి 'ముత్యాల ముగ్గు'లో ఇంత అద్భుతమైన పాట రాశారు.

ఈ పాటలోని ప్రతివాక్యం ఒక కొత్త ప్రయోగమే. ఒక కొత్త భావమే. 

సుశీల తీయటి గొంతు, మహదేవన్ అద్భుత సంగీతంలో .. ఈ పాటలో వయొలిన్, వీణ, ఫ్లూట్ ఒకదాన్ని మించి ఒకటి 'ఓహ్' అనిపిస్తాయి. 

ఎప్పుడూ పీకలదాకా ఉండే వ్యక్తిగత, వృత్తిగత వత్తిళ్ల రొటీన్ నగరజీవితం మధ్యలో కూడా, మొన్న రాత్రి నుంచి ఈ పాటను కనీసం ఒక అరడజను సార్లు విన్నాను.

నిన్న రాత్రి ఒక పార్టీ మధ్యలో మా మ్యూజిక్ డైరెక్టర్‌తో ఈ పాట గురించి ఒక అరగంట సేపు అలా ట్రాన్స్‌లోకెళ్లి చర్చించాను.   

చాలా ఏళ్ల తర్వాత ఇంత మంచి పాట నేను గుర్తుకు తెచ్చుకోడానికి కారణమైన ఒక బ్లాగ్ కామెంటర్‌కు థాంక్స్ చెప్పకుండా ఎలా ఉండగలను? 

Monday, 16 April 2018

అనామక నీహారికలు

పేరు నీహారిక.

ఫోటో లేదు.

పేరును బట్టి స్థ్రీ అనుకుంటాము. కానీ, అక్కడ తన గురించి 'About Me'లో ఏమీ చెప్పలేదు కాబట్టి అది కూడా ఖచ్చితంగా ఊహించలేము.

ఆడ, మగ కూడా కాకపోవచ్చుగా?!

కట్ టూ అసలు కథ - 

కేసీఆర్ గారి జాతీయస్థాయి రాజకీయ రంగప్రవేశం గురించి కొన్నిరోజుల క్రితం నా బ్లాగ్‌లో ఒక పోస్టు రాశాను. ఆ పోస్టు టాపిక్‌తో ఏ రకంగానూ సంబంధంలేని ఒక అర్థంలేని కామెంట్ పెట్టారొకరు. ఆ మేధావి పేరు నీహారిక.

నిజానికి  ఆ పోస్టు మీద ఎవరైనా కామెంట్ చేయొచ్చు. నిర్మాణాత్మకంగా విమర్శించవచ్చు. ఆ హక్కు అందరికీ ఉంటుంది.

కాకపోతే, ఒక కామెంట్ చేసేముందు తనెవరో బయటికి చెప్పుకోగల సంస్కారం, ధైర్యం ఉండాలి. ఆ రెండూ లేనప్పుడు అమ్మాయి పేరు పెట్టుకొని మరీ ఇలాంటి పనికిమాలిన పనులు చేయొద్దు.

ఆడో మగో .. ఉన్నదో లేదో తెలియదు కానీ, సదరు నీహారిక ఈ పోస్టు చూస్తుందని మాత్రం అనుకొంటున్నాను.

అంతేకాదు. ఈసారి తన పూర్తి ఐడెంటిటీతో, మరింత గొప్ప విమర్శలతో నా బ్లాగ్‌పోస్టులపై తప్పక కామెంట్ చేస్తుందని నమ్ముతున్నాను కూడా.

బెస్ట్ విషెస్ టూ నీహారిక! :) 

Sunday, 15 April 2018

సోషల్ మీడియాను మించిన ప్రమోషన్ ఉందా?

మొన్న జరిగిన "నమస్తే హైదరాబాద్" సినిమా మోషన్ లోగో లాంచ్ ఈవెంట్ నాలో కొన్ని కొత్త ఆలోచనలకు కారణమైంది.

మరోవిధంగా చెప్పాలంటే, అంతకుముందునుంచే నాలో ఉన్న కొన్ని ఆలోచనలకు ఈ ఈవెంట్ గట్టి బలం చేకూర్చింది.

కట్ టూ సినిమా ప్రమోషన్ -

 
నేను టీవీ చూడక, న్యూస్‌పేపర్ చదవక దాదాపు అర్థ దశాబ్దం దాటింది. దీనివల్ల ఇప్పటివరకు నేనేదీ నష్టపోలేదని నాకు ఖచ్చితంగా తెలుసు.

నిజంగా అంత అవసరమైన న్యూస్ గాని, ఇంకేదైనా ముఖ్యమైన సమాచారం గానీ ఉంటే, అది ఏదోవిధంగా సరైన సమయానికి నాకు వెంటనే చేరుతోంది.

క్రెడిట్ గోస్ టూ సోషల్ మీడియా!

నాకున్న పరిమిత నాలెడ్జి ప్రకారం ఇప్పుడెవ్వరూ టీవీ, న్యూస్‌పేపర్‌లను పెద్దగా పట్టించుకోవడం లేదు. అంత టైమ్ ఎవ్వరికీ ఉండటంలేదు.

అంతా అరచేతిలో ఉన్న మొబైల్‌లోనే.

ఆ మొబైల్‌లో ఉన్న సోషల్ మీడియా ప్రపంచంలోనే.

ఇప్పుడు సినిమా ప్రమోషన్ కూడా అంతే.

ఎప్పటినుంచో ఉన్న ఒక పనికిరాని రొటీన్ సంప్రదాయం ప్రకారం .. ఇన్వెస్టర్‌లకు కాన్‌ఫిడెన్స్ ఇవ్వడం కోసం, టీవీ చానెల్స్‌కు సినిమా న్యూస్ కంటెంట్ ఇవ్వటం కోసం తప్పిస్తే .. ఈ రొటీన్ సినిమా ఈవెంట్స్, ఓపెనింగ్స్, ప్రెస్‌మీట్స్, ఎట్సెట్రాలు అసలెందుకూ పనికిరావన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.

ఖర్చు కూడా ఎక్కువే. 

ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఫిలిం మ్యాగజైన్స్ ఎట్సెట్రా ఇచ్చే ప్రచారం కంటే ఎన్నోరెట్లు ఎక్కువ ప్రమోషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రమే సాధ్యం.

హాలీవుడ్ నుంచి, టాలీవుడ్ వరకు .. ఈ మధ్య హిట్టయిన ఏ సినిమానయినా తీసుకోండి. వాటి ప్రమోషన్‌లో ప్రధాన పాత్ర సోషల్ మీడియాదే!

ఖర్చు చాలా తక్కువ.

చివరగా చెప్పొచ్చేదేంటంటే .. సినిమా ప్రమోషన్‌లో భాగంగా కొన్ని తప్పవు అనిపిస్తుంది.

అది మన మైండ్‌సెట్.

కానీ, అదే సినిమా ప్రమోషన్ విషయంలో సోషల్ మీడియాను విస్మరించడం మాత్రం ఖచ్చితంగా అతి పెద్ద తప్పవుతుంది. 

Sunday, 1 April 2018

కేసీఆర్ ప్రధానమంత్రి అయితే... 2

కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారో లేదో ఎప్పట్లాగే ఆ కథ తర్వాత మాట్లాడుకుందాం. 

దీనికంటే ముందు, ఒకటి రెండు అతి ముఖ్యమైన విషయాలను మనం గుర్తు చేసుకుందాం.

అలోచిద్దాం.

ఆ తర్వాతే, జాతీయస్థాయి రాజకీయాల్లో కేసీఆర్ గారి రంగప్రవేశం గురించి చర్చిద్దాం.

మనకు బ్రిటిష్‌వాళ్లనుంచి స్వతంత్రం వచ్చి 70 ఏళ్లయింది. ఈ 70 ఏళ్లలో సింహభాగం ఒక్క కాంగ్రెస్ పార్టీనే మన దేశాన్ని పాలించింది. 

నెహ్రూ నుంచి మొదలైంది కథ. 


నెహ్రూ సొంత ప్రయోజనాలు, ఐక్యరాజ్యసమితి స్థాయిలో పేరు కోసం పిచ్చి, పంచశీల వంటి పనికిరాని సొల్లుతో భారత్ అటు చైనాకు కొంత, ఇటు పాకిస్తాన్‌కు కొంత భూభాగం వదులుకొని, చేతులు ముడుచుకు కూర్చోవాల్సి వచ్చింది.

ఈ రెండు దేశాలతో అప్పటినుంచి
 ఆ రావణకాష్టం ఇంకా రగులుతూనే ఉంది.

70 ఏళ్లు దాటినా.  


ఐరన్ లేడీ గా ప్రసిధ్ధిగాంచిన ఇందిరా గాంధీ బ్యాంకులను జాతీయం చేయడం వంటి కొన్ని అత్యంత గొప్ప నిర్ణయాలు తీసుకున్నా, అత్యధిక కాలం 
 దేశాన్ని పాలించినా .. ఎమర్జెన్సీ విధించడం వంటి అతి ఘోరమైన తప్పిదాలు కూడా ఆమె హయాంలో జరిగాయి. 


తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకోసం ఆమె పరోక్ష ప్రోద్భలంతో ఎదిగిన భింద్రన్‌వాలే వల్లనే చివరకు ఆమె దారుణ హత్యకు గురైంది.


ఇదే తరహాలో .. పైపై మెరుగులు, పేరు కోసం తీసుకొన్న అత్యంత తప్పుడు అంతర్జాతీయ పాలసీ నిర్ణయాలవల్ల రాజీవ్ గాంధీ కూడా ఎల్‌టిటిఇ చేతుల్లో ఘోరంగా హతమయ్యారు.

ఇంకో కోణంలో, వాళ్లు అసలు ఏ పార్టీ అన్నది కాదు ఇక్కడ పాయింటు. 


మన దేశ ప్రధానులు ఎంత ఘోరమైన హత్యలకు గురయ్యారు .. అందుకు దారితీసిన రాజకీయ కారణాలేంటి అన్నదే ప్రశ్న.  

1947 నుంచి ఈ రోజువరకు కూడా - కాంగ్రెస్ సృష్టించి, పెంచిపోషిస్తున్న సూడో సెక్యులరిజం కారణంగానే దేశం నానా కంగాళీ అయింది. అర్థంలేని అపోహలు, అభద్రతాభావాలు ప్రజలమధ్య పెరిగిపోయాయి. 


ఈ స్థితే దేశంలో ఇంకా కొనసాగుతోంది.

ఈ స్థితే దేశంలోని అన్నిరంగాల్లో ఒక పెద్ద అభివృధ్ధి నిరోధకమై కూర్చుంది. 


రెండో ప్రపంచయుధ్ధంలో సర్వం కోల్పోయిన దేశాలు, మూడు దశాబ్దాలక్రితం కరువు కాటకాలతో విలవిల్లాడిన దేశాలు, మన దేశంలో ఉన్న అన్నిరకాల వనరులతో పొలిస్తే ఏ విధంగానూ సరితూగని అతి చిన్న చిన్న దేశాలు ఎన్నో మనం చూస్తుండగానే ఈ 70 ఏళ్లలో ప్రపంచ ఆర్థికరంగాన్ని శాసించే స్థాయికి ఎదిగాయి. అభివృధ్ధి చెందిన దేశాలయ్యాయి. ధనిక దేశాలయ్యాయి.  

అత్యధిక జనాభా, అన్నిరకాల వనరులు, అత్యుత్తమ మేధోసంపత్తి ఉన్న మన దేశం మాత్రం 70 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఒక "అభివృధ్ధి చెందుతున్న దేశం" గానే ఉండటం నిజంగా సిగ్గుచేటు. 


దేశానికి స్వతంత్రం వచ్చిననాటి నుంచి అత్యధిక కాలం ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకుల స్వార్థ ప్రయోజనాలు, తాత్కాలిక ప్రయోజనాలకోసం వాళ్లు తీసుకొన్న అత్యంత తప్పుడు నిర్ణయాలు, సృష్టించిన పనికిరాని పాలసీలు .. ఇవే మన దేశం ఇప్పటికీ ఇంకా ఒక అభివృధ్ధిచెందుతున్న దేశంగానే మిగిలిపోవడానికి కారణాలు. 

మినహాయింపు ఒక్కటే ...

అది మన తెలంగాణ బిడ్డ, తెలుగువాడు .. పి వి నరసింహారావు. 


దేశం ఆర్థికస్థితిగతుల్ని మార్చడానికి దేశ ప్రధానిగా అప్పుడు పి వి తీసుకొన్న విప్లవాత్మక నిర్ణయాలవల్లనే కనీసం దేశం ఇప్పుడీ స్థితిలో ఉంది. 


అలాంటి మన పి వి మరణించినప్పుడు ఢిల్లీలో అంత్యక్రియలు లేవు. కనీసం ఆయనకు ఢిల్లీలో సమాధిస్థలం కూడా లేదు. 


ఈ వివక్షను మన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ప్రశ్నించారో లేదో, ప్రశ్నించకపోతే ఎందుకని ప్రశ్నించలేదో, అసలంత దమ్ము వాళ్లకున్నదో లేదో నాకు తెలియదు. 

కట్ టూ కేసీఆర్ - 

"ఈ దేశంలో ఇక ఎప్పుడూ ఇంతే" అని అందరికీ ఒక రొటీన్‌గా అలవాటైపోయిన ఇలాంటి అత్యంత దయనీయ, స్వార్థపూరిత, స్థబ్ద రాజకీయాల్లో ఒక ఖచ్చితమైన గుణాత్మకమైన మార్పు ఇప్పుడు అవసరం. 


ఆ మార్పునే మన ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకురావాలనుకొంటున్నారు. 


ఆ మార్పు కోసమే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకొంటున్నారు. 


అయితే రాష్ట్రం వేరు, దేశం వేరు. 


అంత సులభం కాదు. 


అలాగని అసాధ్యం కూడా కాదు. 


ఆ దిశలో ముందొక అడుగు పడాలి.  


ఆ అడుగు మన కేసీఆర్ వేయడం నిజంగా హర్షణీయం.  

Monday, 19 March 2018

రైటింగ్ .. ఒక థెరపీ!

మనకు బద్దకం ఎక్కువ.

చిన్నా పెద్దా, ఉన్నవీ లేనివీ సమస్యల్ని తలచుకొంటూనే జీవితాల్ని ముగించేస్తాం.

నేను రాసిన ఒక ఆధునిక జర్నలిజం పుస్తకం ఒక యూనివర్సిటీలో పీజీ స్థాయి సిలబస్‌లో "రికమండెడ్ బుక్స్" లిస్టులో ఉంది. సినిమా స్క్రిప్ట్ పైన నేను రాసిన మరో పుస్తకం నంది అవార్డు పొందింది. ఈ రెండూ బెస్ట్ సెల్లర్ బుక్సే. నేను అచ్చు వేసిన రెండు ఎడిషన్లూ టపటపా అయిపోయాయి.

నవోదయ, విశాలాంధ్రవాళ్లు రీప్రింట్ మళ్లీ వేయండి అని ఎన్నోసార్లు చెప్పినా వినలేని బద్దకం!

లేటెస్ట్ డెవెలప్‌మెంట్స్‌ని, నా అనుభవాల్నీ పొందుపరుస్తూ ఈ పుస్తకాల్నిరివైజ్ చేసి పబ్లిష్ చేయాలని నా ఉద్దేశ్యం. కాని ఆ పని ఒక దశాబ్దం గడిచినా నేను చేయలేకపోయాను!

సంవత్సరం క్రితం ఓ పబ్లిషర్ మిత్రుడు నన్ను వేధిస్తోంటే ఇక పడలేక - వారం పాటు అదే పనిమీద కూర్చుని  ఒక పుస్తకం రివైజ్ చేసి రాసిచ్చాను. ఆ పబ్లిషర్ మిత్రుడు ఇస్తానన్న డబ్బులు ఇంతవరకూ ఇవ్వలేదు. పుస్తకాన్నీ పబ్లిష్ చేయలేదు. ఇదొక రకం బద్దకం.

ఈ మధ్య నా అవసరం కోసం మళ్లీ  సినిమాల బిజీలో పడిపోయి ఈ బ్లాగ్‌ని కూడా మర్చిపోయాను.

నాకు సంబంధించినంతవరకూ రైటింగ్ అనేది ఒక థెరపీ.

రాయటం అలవాటు ఉన్నవాళ్లు దాన్ని మర్చిపోతే బ్రతకలేరు. తేడా తెలుస్తుంది. జీవితం ఉట్టి బ్రతుకైపోతుంది.

జీన్ వుల్ఫ్ నుంచి జె కె రౌలింగ్ దాకా - ప్రపంచస్థాయి రచయితలందరూ నానా కష్టాలుపడుతూనే రాశారు. జీవితాన్ని జీవించారు. గౌరవించారు.

రకరకాల కారణాలు నాకు నేనే చెప్పుకొంటూ, రోజుకు కనీసం ఒక్క పేజీ కూడా నేను రాయలేకపోతున్నానంటే నిజంగా ఇప్పుడు నాకే చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది.

ఇంక చాలు.

ఇనఫ్ ఈజ్ ఇనఫ్.

నాకత్యంత ప్రియమైన హాబీ అయిన రైటింగ్‌ని నేనెలా అంత సులభంగా మర్చిపోతాను?

అయామ్ బ్యాక్ ... 

ఇంక కారణాలుండవ్. ఆలస్యాలుండవ్. అనుకున్నది చేసుకుంటూ ముందుకెళ్లడమే.

నేను ఎప్పుడో రాసి, పూర్తిచేసిన 'కేసీఆర్' పుస్తకాన్ని ఇప్పుడు పబ్లిష్ చేస్తున్నాను. 

Sunday, 18 March 2018

ది మ్యాజిక్ ఆఫ్ 'రోజుకో పేజీ!'

రకరకాల షేపుల్లో, రకరకాల పేర్లతో మనం ఇప్పుడు తింటున్న పొటాటో చిప్స్‌కి ఆదిగురువు 1967 లోనే మార్కెట్లోకి వచ్చిన ప్రింగిల్స్.

ఈ చిప్స్ ఇలా ఉండాలని ఊహించిన జక్కన్న లీపా.

కాగా, వీటికి ఆ షేప్‌లు తీసుకురావడానికి ఉపయోగించే మిషన్‌ను రూపొందించిన రామప్ప జీన్ వుల్ఫ్.


ఇక్కడ విషయం చిప్స్ కాదు.

జీన్ వుల్ఫ్ .. ఆయనకు తెలిసిన ఓ అతి పెద్ద రహస్యం ...

కట్ టూ జీన్ వుల్ఫ్ - 

జీన్ వుల్ఫ్ మెకానికల్ ఇంజినీర్. రచయిత కూడా.

జీన్‌కి తెలిసిన రహస్యం .. రోజుకు ఒకే ఒక్క పేజీ రాయడం.

జీన్‌కు ఇప్పుడు 86 సంవత్సరాలు. అంటే సుమారు 31, 400 రోజులు. అందులో సగం రోజులు ఆయన ఒక సాధారణ రచయిత స్థాయి మెచ్యూరిటీకి ఎదగడానికి పట్టాయి అనుకొని తీసేద్దాం.

తనకు తెలిసిన ఈ అతి చిన్న సీక్రెట్‌ను ఉపయోగించి, ఈ 15,700 రోజుల్లో ఆడుతూ పాడుతూ జీన్ రాసిన పుస్తకాల సంఖ్య 50.   

అవును అక్షరాలా 50 పుస్తకాలు!

వీటిలో నవలలున్నాయి. బెస్ట్ సెల్లర్ బుక్స్ ఉన్నాయి. అవార్డ్ పొందిన పుస్తకాలూ ఉన్నాయి.

ఏ రకంగా చూసినా ఇదొక అద్భుతమయిన అచీవ్‌మెంటే.

ఎందుకంటే జీన్ కేవలం రోజుకు ఒక్క పేజీ మాత్రమే రాస్తూ ఇది సాధించాడు! 

Tuesday, 13 March 2018

మన బతుకమ్మకు హాప్పీ బర్త్‌డే!

ఎం పి గా పార్లమెంట్‌లో అది తన తొలి స్పీచ్.

అయినా ..

వెరీ కాన్‌ఫిడెంట్, డిగ్నిఫైడ్ అండ్ డీసెంట్.

ఎలాంటి తడబాటు లేకుండా మంచి ఇంగ్లిష్‌లో దడదడలాడించేశారు. స్పీచ్‌లో అక్కడక్కడా ఓ రెండు మూడుసార్లు హిందీ కూడా తనకు బాగా వచ్చునని చెప్పకనే చెప్పారు.

తెలంగాణ రావడానికి ముఖ్య కారకులైన సమస్త తెలంగాణ ప్రజానీకాన్ని, కె సి ఆర్ గారిని, అటు సోనియా గాంధీని, ఇటు సుష్మా స్వరాజ్‌ను గురించీ ప్రస్తావించారు.

ప్రైమ్ మినిస్టర్‌ను, పార్లమెంట్‌లోని ఇతర పెద్దలనందర్నీ గౌరవిస్తూనే, అదే స్పీచ్‌లో అంటించాల్సిన చురకలన్నీ వరసపెట్టి అంటించారు కూడా: 

ప్రెసిడెంట్ తన స్పీచ్‌లో కొత్తగా ఏర్పడిన 29 వ రాష్ట్రం అయిన తెలంగాణకు కనీసం శుభాకాంక్షలు చెప్పలేదన్నారు.

పోలవరం గురించీ .. ఆర్డినెన్స్ ద్వారా ఏపిలో కలిపిన 7 మండలాల్లోని ఆదివాసీల సంక్షేమం కోసం చెయ్యాల్సిన దానిగురించి కూడా చెప్పారు.

కట్ టూ కష్మీరీ పండిట్స్ - 

మరోసారి అదే పార్లమెంట్‌లో .. తన ఇంకో స్పీచ్‌లో .. కష్మీరీ పండిట్స్ గురించి దడదడలాడించేశారు ఇదే ఎం పి గారు.

నాకు తెలిసి .. ఏపీ, తెలంగాణలకు సంబంధించిన ఎం పి లెవరూ పార్లమెంట్‌లో ఇప్పటివరకూ ఈ అంశం మీద అసలు మాట్లాడి ఉండరు అనుకుంటున్నాను. ఒకవేళ మాట్లాడి ఉన్నా, ఖచ్చితంగా ఇంత లోతుగా సమస్యను అధ్యయనం చేసి ఉండరని నా గట్టి నమ్మకం.

ఈ విషయంలో ఇంత నమ్మకంగా నేను చెప్పగలగడానికి కారణం కూడా ఒకటుంది.

సీనియర్ మోస్ట్ ది గ్రేట్ అద్వానీ గారు లేచి, ఇదే అంశం గురించి తర్వాత మాట్లాడుతూ, అప్పటిదాకా మాట్లాడిన ఈ ఎం పి ని ఒకటికి నాలుగుసార్లు మెచ్చుకున్నారు.

ఇటీవలే పార్లమెంట్‌లో నేషనల్ లెజిస్లేటర్స్ కాన్‌ఫరెన్స్ "ప్లీనరీ సెషన్"కు మాడరేటర్‌గా కూడా అద్భుతంగా వ్యవహరించి  తన సత్తా చాటుకున్నారు.

ఇప్పుడు పార్లమెంట్‌లో ఉన్న ఈ తరం  మహిళా ఎం పి లకు,  రానున్న ఔత్సాహిక మహిళా ఎం పి లకు, మహిళా పొలిటీషియన్‌లకు తను ఒక ఐడల్, ఒక ఐకాన్ ...

దటీజ్  మన  ఎం పి.

ఆ ఎం పి ఎవరో కాదు.

కల్వకుంట్ల కవిత.

తెలంగాణ జాగృతి సారథి.  మన  ముఖ్యమంత్రి కె సి ఆర్ గారి కూతురు.

కట్ టూ మన బంగారు బతుకమ్మ -

ఒకప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్నే నిషేధించారు. తెలాంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మను ఎగతాళి చేశారు. ఆ బతుకమ్మ ఆడే తెలంగాణ ఆడబిడ్డల్ని అవహేళన చేశారు.

అదిప్పుడు చరిత్ర.

తెలంగాణ అవతరణకు ముందు కథ.

తెలంగాణ జాగృతి ఏర్పాటుకు ముందు కథ.

మరిప్పుడో?

ఎక్కడ విన్నా "జై తెలంగాణ!" .. "జై కె సి ఆర్!"

ఎక్కడ చూసినా .. బంతిపూలు, చామంతులు, నందివర్ధనాలు, తంగేడుపూలు, రంగులద్దిన గునుగు పూలు. ఆ పూలతో పేర్చిన బతుకమ్మలు. ఆ బతుమకమ్మలను ఆనందంగా ఆడే ఆడబిడ్డలు.

అది కూడా ఏదో ఆషామాషీగా కాదు. గిన్నిస్ రికార్డు బద్దలయ్యేలా!

అంతేనా .. నో.

ఒక్క తెలంగాణలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలందరిలోనూ అంబరాన్నంటిన ఇదే ఆనందం.

ఒక్క రాజకీయంగానే కాదు. సాంస్కృతికంగా కూడా.

దుబాయ్ నుంచి డెన్మార్క్ దాకా .. 17 రోజులు, 9 దేశాలు. అవిశ్రాంత తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవ సంకల్ప యాత్ర.

ఎక్కడికెళ్లినా తెలంగాణకు జేజేలు, మన బంగారు బతుకమ్మకు హార్దిక ఆహ్వానాలు.

ది రినైజెన్స్ ఆఫ్ బతుకమ్మ ..

మన బతుకమ్మకు మళ్లీ కళ వచ్చింది.

ఈ కళ ఏ స్థాయిలో వచ్చిందంటే .. ఇప్పుడు ప్రతి తెలంగాణ ఆడబిడ్డ గర్వంగా బతుకమ్మను పేర్చుతోంది. ఆడుతోంది. పాడుతోంది. పోటీలుపడి సెల్ఫీలు దిగుతూ ఫేస్‌బుక్ నిండా తన ఆనందాన్ని ఆవిష్కరిస్తోంది.

మొన్నటి బతుకమ్మ పండుగకు ఫేస్‌బుక్ నిండా, బతుకమ్మలతో ఎన్ని లక్షల సెల్ఫీలు పోస్ట్ చేశారో ఒక్కసారి అలా గుర్తుకుతెచ్చుకోండి.

"వావ్!" అని జకెర్‌బర్గే జెర్క్ తినేలా ! 

క్రెడిట్ గోస్ టూ ..

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మన ఎం పి కవిత  గారు.

వారికివే నా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు ...  

Saturday, 10 March 2018

వార్ వన్ సైడే!

రేపు జరగనున్న తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా పోటీచేస్తున్న డైరెక్టర్ ఎన్ శంకర్ గారు, వారి ప్యానెల్ ఖచ్చితంగా గెలవబోతోంది.

నా వైపు నుండి ఇంకో నాలుగు వోట్లయినా ఎక్కువ రావాలని తెలుగు డైరెక్టర్స్ యూనియన్‌లో లైఫ్ మెంబర్‌గా, ఒక బాధ్యతగా, ఈ చిన్న పోస్టు.

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్‌లో దాదాపు ప్రతి క్రాఫ్ట్‌కూ ఒక యూనియన్ ఉంది. వీటిలో దర్శకుల యూనియన్‌దే అత్యున్నత స్థానం. మొన్నటిదాకా ఆ స్థాయి విలువ కూడా వుండేది. అయితే ఈ మధ్యకాలంలో యూనియన్‌లోని కొంతమంది వల్ల నానా అవకతవకలు జరిగాయి. యూనియన్ స్థాయి దిగజారిపోయింది.

జరిగిన ఎన్నో అవకతవకల్లో రెండు ఉదాహరణలు:

> అసలు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయని, ఏ రకంగానూ అర్హతలేని 32 మందికి యూనియన్ ద్వారా చిత్రపురి కాలనీలో 32 ఫ్లాట్స్ ఇప్పించడం.

> డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ఎన్నడూ పనిచేయని సుమారు 200 మంది ఇప్పుడున్న యూనియన్ మెంబర్స్ లిస్ట్‌లో ఉన్నారు! వీరికి రేపు ఎలక్షన్స్‌లో వోట్లు కాడా ఉన్నాయి(ట)!!

ఇవి చాలనుకుంటాను శాంపుల్‌కి ...

కట్ చేస్తే - 

రేపు ప్రెసిడెంట్‌గా గెలవబోతున్న డైరెక్టర్ ఎన్ శంకర్ గారు ఇవ్వాళ ఒక్కటే మాట గట్టిగా చెప్పారు:

"డైరెక్టర్స్ యూనియన్ ద్వారా చిత్రపురి కాలనీలో అక్రమంగా అలాట్ అయిన ఆ 32 ప్లాట్స్ సంగతి తేలుస్తాము. యూనియన్‌లో అర్హులైన మెంబర్స్‌కు వాటిని కెటాయిస్తాము. ఇలాంటి అవకతవకలు ఇంకెన్ని ఉన్నా, దేన్నీ వదిలిపెట్టము!"

ఈ ఒక్క మాట చాలనుకుంటాను. ఎన్ శంకర్ గారి ప్యానెల్‌కు రేపు మనమందరం వోటెయ్యడానికి.

ఆ సత్తా దర్శక మిత్రులు ఎన్ శంకర్ గారికి, వారి ప్యానెల్‌కు ఉంది.

జరిగిన అవకతవకలను సరిదిద్దటం ఒక్కటే కాదు. దర్శకుల కోసం, యూనియన్ మెంబర్స్ కోసం ఇంకెన్నో అభివృద్ధి/సంక్షేమ సంబంధమైన పనులు చేయడానికి, దర్శకుల యూనియన్ కోల్పోయిన వైభవాన్ని పునరుద్ధరించడానికి సిధ్ధంగా ఉన్న మన ఎన్ శంకర్ ప్యానెల్‌కు నాతోటి డైరెక్టర్స్ యూనియన్ మెంబర్స్ అందరూ వోటు వేసి బంపర్ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను.

రేపు సాయంత్రం 4 గంటలకు ఆ శుభవార్త వింటాము కూడా ...