Monday 4 December 2017

దట్సాల్ యువరానర్!

ప్రతిపక్షాలకంటే వేరే పనేమీ ఉండదు. ఏ సందు దొరుకుతుందా, ఎట్లా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శిద్దామా, తిడదామా అని ప్రతి నిముషం ఎదురుచూస్తుంటారు.

ఇంకా చెప్పాలంటే .. అంతా కాచుక్కూర్చుంటారు. తెల్లారి లేస్తే కె సి ఆర్ ను ఆరోజు ఎలా కాల్చుకుతిందామా అని. 

ఇది సర్వసహజం.

కారణం కరెక్టయినా, కాకపోయినా .. ఏదో ఓ నెపంతో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, తిట్టడం, విమర్శించడం, సెటైర్లు వెయ్యడం ప్రతిపక్షాల రొటీన్ వ్యవహారం.

రోజూ అదే వాళ్ల డ్యూటీ.

ఈ యాంగిల్లో పాపం .. వాళ్లనేమీ అనడానికి లేదు.

దీనికి జనం ఎప్పుడో అలవాటైపోయారు. ఇదంతా ఎప్పుడూ ఉండే ఒక సన్నాసి వ్యవహారం అనుకొని 'లైట్' తీసుకుంటున్నారు. అసలు పట్టించుకోవడంలేదు. 
   

కట్ చేస్తే - 

ఆర్జీవీలాంటి హల్‌చల్ హాబీయిస్టులుంటారు.

మొన్నటిదాకా ట్విట్టర్. ఇప్పుడు ఫేస్‌బుక్, ఇన్స్‌టాగ్రామ్.

ఈ ప్లాట్‌ఫామ్‌స్ మీద ఏదో ఒకటి వదులుతుండటం ఆర్జీవీ హాబీ. పాజిటివ్‌గానో, నెగెటివ్‌గానో, అర్థం అయ్యీ కాని సెటైర్ల రూపంలోనో.. మొత్తానికి ఏదో ఒకటి అలా వదులుతుండటం ఆయన హాబీ.

ఆర్జీవీ ఫలానా టాపిక్ మీద ఇలా ట్వీట్ పెట్టాడు, అలా పోస్ట్ చేశాడు .. అని అందరూ అనుకొనేలా ఎప్పుడూ ఏదో ఒకదానిమీద ఏదో ఒక 'ఎఫ్ఫెక్ట్' కావాలి ఆయనకు. దీనికోసం ఒక్కోసారి ఒక్కో కరెంట్ టాపిక్‌ను, లేదా ఒక్కో వ్యక్టిని టార్గెట్ చేయడం ఆర్జీవీ అలవాటు.

అది అతని స్టయిల్. ఎప్పటికప్పుడు జనం ఫోకస్ తనవైపు తిప్పుకోడానికి అతను ఉపయోగించే ఒక ప్రొఫెషనల్ టెక్నిక్. 

మొత్తంగా అదో టైపు.

కె సి ఆర్ ను టార్గెట్ చేస్తూ కూడా ఆర్జీవీ చాలాసార్లు సోషల్ మీడియాలో సెటైర్లు వేశాడు, పొగిడాడు, పొగిడినట్టు మాస్క్ వేస్తూ ఎన్నో సెటైరిక్ కామెంట్స్ పెట్టాడు.

అయితే మన జనం దీనికి కూడా బాగా అలవాటైపోయారు.

"వాడిష్టం" అనుకొని పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఒకవేళ పట్టించుకొన్నా, అదంతా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ అన్న పాయింటాఫ్ వ్యూలో సెట్ అయిపోయారు. 

ఇంకా కొంతమంది కులప్రాతిపదికన ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటుంటారు. "గడీల రాజ్యం", "దొరల రాజ్యం" అనీ, "కుటుంబపాలన" అనీ .. అదనీ, ఇదనీ.

దీనికి కూడా బాగా అలవాటయిపోయారు మనవాళ్లు. "వీళ్లింతే" అని.


కట్ టూ మన అసలు పాయింట్ - 

ఇప్పటిదాకా నేను రాసిన టాపిక్కంతా ఒక పనికిరాని రొచ్చు అనుకొంటే .. ఈ రొచ్చులోకి ఈమధ్య కొత్తగా ఒక గాయని-కమ్-యాంకర్-కమ్-డబ్బింగ్ ఆర్టిస్టు ప్రవేశించడం నాకు బాగా ఆశ్చర్యం కలిగించింది.

కారణం .. నేనామెకు పెద్ద ఫ్యాన్‌ని కావడం కావొచ్చు. ఆమె సంపాదించుకొన్న ఒక మంచి పాజిటివ్ ఇమేజ్‌కు ఇది అసలు సెట్ అవ్వని వ్యవహారం అని అనిపించడంవల్ల కావొచ్చు.   

గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొనడానికి ఇవాంకా ట్రంప్ అండ్ టీమ్ హైద్రాబాద్ వస్తున్న సందర్భంగానే మన నగరాన్ని మనం సుందరమయం చేసుకుంటున్నామనీ, అలా చేయడం తప్పనీ .. నానా యాంగిల్స్‌లో విమర్శలున్నాయి.

అది వేరే విషయం.

సుమారు 150 దేశాలనుంచి దాదాపు 1500 మంది ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఈ సదస్సులో పాల్గొనడానికి మన నగరం వస్తున్నారు. అమెరికానుంచి వస్తున్న బృందాన్ని ఆ దేశపు ప్రెసిడెంట్ సలహాదారు, ఆయన కుమార్తె కూడా అయిన ఇవాంకా ట్రంప్ లీడ్ చేస్తోంది. 

ఒక అంతర్జాతీయస్థాయి సదస్సు జరుగుతున్నప్పుడు మన నగరాన్ని శుభ్రంగా, ఆకర్షణీయంగా చేసుకోవడం తప్పా?

అదెవరికోసం?

కె సి ఆర్ కోసమా? కె టి ఆర్ కోసమా?

ప్రపంచం నలుమూలలనుంచి సదస్సుకు వస్తున్న పారిశ్రామికవేత్తలను ఫస్ట్‌సైట్ లోనే మన నగరం ఆకట్టుకొనేలా చేయడంలో తప్పేముంది?

ఈ సదస్సు ద్వారా, ఇందులో పాల్గొన్న పారిశ్రామికవేత్తల ద్వారా, ఆయా ప్రపంచస్థాయి కంపెనీలద్వారా, ఇండస్ట్రీల ద్వారా .. ఎంత ఎక్కువ పెట్టుబడులను ఆకర్షిస్తే అంత మంచిదన్నది కామన్ సెన్స్.

ఇదొక ఓపెన్ సీక్రెట్.

ఓపెన్ బిజినెస్ స్ట్రాటెజీ. 

ఈ ముస్తాబంతా మనవాళ్లు కేవలం ఇవాంకా ట్రంప్ కోసం చేస్తున్నారని ఈ సోకాల్డ్ మేధావులు, క్రిటిక్స్, సెటైరిస్టుల అర్థంలేని ఆలోచన. వీరితోపాటు .. ఆపోజిషన్‌వాళ్లు, ఆర్జీవీలాంటివాళ్లు ఈ రచ్చ, ఈ రొచ్చులో భాగం కాబట్టి, వాళ్లకిది మామూలే కాబట్టి .. ఓకే అనుకుందాం.

"ఇవాంకా మా ఇంటి ముందు నుంచి కూడా వెళ్తే బావుండు" అని సదరు గాయని-కమ్-యాంకర్-కమ్-డబ్బింగ్ ఆర్టిస్టు సెటైర్ వేయడం వ్యక్తిగతంగా నాకైతే నచ్చలేదు. 

ప్రజాస్వామ్యంలో నూటికి నూరు శాతం ఆమెకా హక్కుంది. కాని, ఇదంతా ఒక రచ్చ. ఒక యుధ్ధభూమి. ఈ రచ్చ, ఈ యుధ్ధభూమి ఇప్పుడామెకు అవసరమా అన్నదే ఆమె ఫ్యాన్‌గా నా పర్సనల్ ఫీలింగ్.

ఈ ఒక్క సెటైర్‌ను పట్తుకొని వందమంది, వెయ్యిరకాల సెటైర్లు ఆమె మీద వెయ్యడానికి, ఆమెను ఏకెయ్యడానికి సోషల్ మీడియాలో రెడీగా ఉన్నారు. ఉంటారు.

ఈ బ్లాగ్ పోస్టు ప్రారంభంలోనే చెప్పినట్టు - ఒక అలవాటుగా, ఒక డ్యూటీగా ఇలాంటివి చేసేవాళ్లు ఓకే. కాని, అలవాటు లేనివాళ్లు వాళ్ల ఇమేజ్‌కు కుదరని పనిచేసి, అనవసరంగా ఇబ్బంది పడటం ఎందుకన్నదే ఇక్కడ నా హంబుల్ పాయింట్.

ఈ గాయని వేసిన ఈ ఒక్క సెటైర్‌కు నేను పెద్దగా స్పందించేవాణ్ణి కాదు. ఇదంతా కూడా రాసేవాణ్ణి కాదు. కానీ ..

2004 లో అనుకొంటాను ..

ఒక రికార్డింగ్ స్టూడియోలో హీరోయిన్ పాత్రకు డబ్బింగ్ చెప్తూ, ఉన్నట్టుండి మధ్యలో డబ్బింగ్ చెప్పడం ఆపేసి, "కడుపు నొప్పి" అంటూ ఏడుస్తూ కూర్చుంది ది సేమ్ డబ్బింగ్ ఆర్టిస్టు.

నిజంగానే ఆమె కళ్లవెంబడి నీళ్లు!

కొత్త డైరెక్టర్, మొదటి చిత్రం. దెబ్బకు హడలి పోయాడా డైరెక్టర్.

వెంటనే - "డబ్బింగ్ రేపు కంటిన్యూ చేయొచ్చు. ముందు హాస్పిటల్‌కు వెళ్దాం పదండి" అంటే, "ఫర్వాలేదు, ఇట్లా నాకు అప్పుడప్పుడు వస్తుంది కడుపునొప్పి. నేను ఇంటికి వెళ్ళి, టాబ్లెట్స్ వేసుకొని, ఇవాళ రెస్ట్ తీసుకుంటాను" అందామె.

డబ్బింగ్‌కు ప్యాకప్ చెప్పి, అప్పటికప్పుడు నిమిషాల్లో ఆమెను కార్లో ఇంటికి పంపించాడా డైరెక్టర్.


కట్ చేస్తే - 

ఓ గంట తర్వాత అదే కడుపునొప్పి డబ్బింగ్ ఆర్టిస్టు ఒక తెలుగు చానెల్లో యాంకర్‌గా లైవ్ ప్రోగ్రాం చేస్తూ లైవ్‌లీగా కనిపించింది!

తెలంగాణ ప్రభుత్వం మీద సోషల్ మీడియాలో నిన్నటి ఆమె సెటైర్ చూసినప్పుడు నాకు ఈ ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది.

వీళ్లా నీతులు చెప్పేది?

వీళ్లా పని చేస్తున్న ప్రభుత్వాన్ని ఎగతాళి చేసేది?

వీళ్లా కె సి ఆర్ పై సెటైర్లు వేసేది?

మీకున్న స్థాయికి మీ ఇంటిముందు రోడ్డు బాగా లేదన్న విషయాన్ని మంత్రి కె టి ఆర్ కు డైరెక్టుగా ఒక్క ట్వీట్ చేస్తే సరిపోయేది. వెంటనే యాక్షన్ ఉండేది. మీకున్న పాపులారిటీ కూడా మరింత పెరిగేది.

ఇదంతా రాసినందుకు కె సి ఆర్ నాకేమీ జీతం ఇవ్వడం లేదు. ప్రభుత్వం నుంచి నేనేమీ ఆశించడం లేదు. అదంతా ఒక భ్రమ.

దశాబ్దాలుగా ఎవ్వరూ సాధించలేని తెలంగాణను కె సి ఆర్ సాధించిపెట్టారు. అహర్నిశలు ఆలోచిస్తూ, శ్రమిస్తూ, అంతకు ముందునుంచీ ఈ ప్రాంతంలో పేరుకుపోయిన, గుట్టలుగా పేర్చిన ఒక్కో సమస్యనూ పరిష్కరించుకొంటూ వస్తున్నారు.

24 గంటలు కోతల్లేని కరెంటు ఇంతకు ముందు ఉందా?
పొలాలకు అసలు నీళ్లున్నాయా?
చెరువులకు పూడికలెవరైనా తీశారా?
కొత్తగా చెరువులను తవ్వే ఆలోచన ఎవరైనా ఎప్పుడైనా చేశారా?
రైతులకు కూడా 24 గంటలు కరెంటు ఇచ్చిన ప్రభుత్వాన్ని ఇంతకుముందు ఎప్పుడైనా చూశామా?
తెలంగాణలో అంతకుముందు నీళ్లులేక బీడుపడ్డ భూముల్లో ఇవాళ కనిపిస్తున్న పచ్చదనం ఎవరి కష్టం? ఎవరి ఆలోచన? ఎవరి నిబధ్ధత?
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాలను అలోచించిన సి ఎం ఇంతకుముందెవరైనా ఉన్నారా? 
40 వేల కోట్ల సంక్షేమ పథకాలు ఇంతకుముందెప్పుడైనా అసలు విన్నామా?
పకడ్బందీగా ఇంత అత్యుత్తమస్థాయి శాంతి భద్రతలను గతంలో ఎప్పుడైనా చూశామా?
ప్రపంచ తెలుగు మహాసభలకోసం కవులు, రచయితల భారీ ఫ్లెక్సీలు/కటౌట్లు ఎప్పుడైనా చూశామా?
అసలు తెలంగాణలోని అంగుళం అంగుళం గురించి, ఏ కోణంలోనైనా, అంకెలతోసహా చెప్పి, అనర్ఘలంగా వివరించగల సత్తా ఉన్న సి ఎం ను ఇంతకు ముందెప్పుడైనా చూశారా? ..

నెవర్.

తెలంగాణ రాష్ట్రాన్ని వివిధ రంగాల్లో దేశంలోనే 'నంబర్ వన్' రాష్ట్రంగా నిలబెట్టి,  ఇంత బాగా పనిచేస్తున్న ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడం విజ్ఞత.

అది మన బాధ్యత కూడా.

తప్పు ఉన్నా లేకపోయినా .. అయినదానికీ, కానిదానికీ .. తెల్లారి లేస్తే కె సి ఆర్ ను, ప్రభుత్వాన్ని విమర్శించడం, సెటైర్లు వేయడం విజ్ఞత అనిపించుకోదు. అది ఆయా జీవుల్లోని మానసిక అపరిపక్వతను బయటపెడుతుంది.

దట్సాల్ యువరానర్ ...

***
(26 నవంబర్ 2017 నాడు రాసిన బ్లాగ్ ఇది. పోస్ట్ చేయడం ఆలస్యమైంది.)  

1 comment:

  1. మీతో ఏకీభవిస్తున్నాను.
    పండగ అయినా, పెళ్లి అయినా మనం ఇల్లు శుభ్రం చేసుకుంటాం, సున్నాలు, రంగులు వేసుకుంటాం, అనవసరం అనుకున్నవి అన్నీ తీసేయడమో తాత్కాలికంగా వేరే చోట పెట్టటమో చేస్తాం. ఇప్పుడు ప్రభుత్వం చేసింది కూడా అదే కదా... దీనికీ ఇంత విమర్శలు, చర్చలు అవసరామే లేదు.

    ReplyDelete