Sunday 31 December 2017

థాంక్స్ 2017 !!

నాకు హ్యాపీ న్యూ ఇయర్ వంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు. కానీ, ఇలాంటి సందర్భాల వల్ల ఒక మంచి ఉపయోగం ఉందని మాత్రం గట్టిగా నమ్ముతాను.

గడిచిన సంవత్సరం నేను ఏం చేశాను ... నా జీవితంలో ఏం జరిగింది ... నేనేం సాధించాను ... ఏం చేయాలనుకొని చేయలేకపోయాను ... ఎందుకు చేయలేకపోయాను ... నేను తీసుకొన్న మంచి నిర్ణయాలేంటి ... అతి చెత్త నిర్ణయాలేంటి ... ఇకముందు ఏం చేయాలి, ఏం చేయకూడదు ... అన్న స్వీయ విశ్లేషణ  ఈ న్యూ ఇయర్ పుణ్యమా అని కనీసం కొన్ని నిముషాలపాటైనా నేను చేసుకుంటాను.

ఇదే పనిని మన తెలుగు సంవత్సరాది ఉగాదికి కూడా చేసుకోవచ్చు. అంటే, కేవలం ఒక మూడు నెలల వ్యవధిలో రెండుసార్లు మనల్ని మనం విశ్లేషించుకొనే అవకాశం మనకు దొరుకుతుందన్నమాట!

మంచో, చెడో ... 2017 నాకు చాలా అనుభవాలనిచ్చింది. చాలా నేర్చుకున్నాను. అన్నీ బాగుంటే, అలా నేర్చుకొనే అవకాశం వచ్చేది కాదు.

అందుకే, 2017 కు మెనీ థాంక్స్.


కట్ టూ న్యూ ఇయర్ డెసిషన్స్ - 

న్యూ ఇయర్ డెసిషన్స్ ను నేను అస్సలు నమ్మను.

99 శాతం మంది విషయంలో ఇదంతా ఉట్టి హంబగ్.

విల్ పవర్ ఉన్నవాళ్లకు జనవరి ఒకటో తేదీనే అవసరం లేదు. ఎప్పుడైనా, ఏదైనా మానేయవచ్చు. ఎప్పుడైనా ఏదైనా ప్రారంభించవచ్చు.

నేను మొన్న ఆగస్టు 4 నాడే నా కెరీర్‌కీ, నాజీవితానికి సంబంధించిన ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటికీ ఎప్పటికీ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను.

అంతే.

నేను తీసుకొన్న ఆ గొప్ప నిర్ణయం ఏంటన్నది వచ్చే జూన్ 30 నాడు మాత్రమే నా బ్లాగ్ లో పోస్ట్ చేస్తాను.

ఇవాళ సాయంత్రం నా కొత్త సినిమా 'నమస్తే హైదరాబాద్' కు సంబంధించిన న్యూస్ ఒకటి పోస్ట్ చేయాలనుకొంటున్నాను:

ఓపెనింగ్ జనవరిలో - షూటింగ్ ఫిబ్రవరిలో - సమ్మర్ రిలీజ్!

అంతే.

ఇదొక్కటి మాత్రమే ఇవాళ ఈ న్యూ ఇయర్ ఈవ్ స్పెషల్ ...

Happy New Year 2018
to all my friends and well wishers ...

Friday 29 December 2017

@KTRTRS Rocks !!

Q: మీరు చాలా గర్వపడే విషయం ఏంటి?
A: తెలంగాణ రాష్ట్రం అనే ఒక అసాధ్యమైన కలను
కే సీ ఆర్ గారు సుసాధ్యం చేశారన్న వాస్తవం.

Q: మన ప్రియతమ ముఖ్యమంత్రి కే సీ ఆర్ గారి మీద ఎవరైనా డైరెక్టర్ బయోపిక్ తీస్తా అంటే వారు ఒప్పుకుంటారా?
A: కే సీ ఆర్ గారిని అడగండి. నన్ను కాదు.

Q: 2018 తెలంగాణాకు పండుగ సంవత్సరం. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలవబోతుంది. మీరేం అంటారు సార్?
A: ఖచ్చితంగా. పండుగే.

Q: హైద్రాబాద్‌లో ఐ ఐ ఎమ్ ఏర్పాటుచేసే అవకాశముందా?
A: కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థన పంపాము. రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నాము.

Q: సార్, న్యూ ఇయర్‌కు డి జె పర్మిషన్ కావాలి.
A: నీకో దండం బాబూ!

Q: పరిశుభ్రత, పరికరాల విషయంలో మన గవర్నమెంట్ హాస్పిటల్స్‌ను ప్రయివేట్ హాస్పిటల్స్ స్థాయిలో ఊహించవచ్చా?
A: ఈ విషయంలో ఆల్రెడీ చాలా ప్రోగ్రెస్ ఉంది. ఇంకా ఉంటుంది. 

Q: నేను బెంగుళూరు నుంచి మీ డైహార్డ్ ఫ్యాన్‌ను. మీలాంటి మంత్రి మాకు లేరే అని బాధపడుతుంటాను. తెలంగాణ కోసం మీరు చేస్తున్న పధ్ధతిలో వేరే ఎవ్వరూ కృషి చేయడం నేను ఊహించలేను. నిజంగా మీరు కేంద్రంలో ఉండాల్సినవారు.
A: థాంక్స్.

Q: కాంట్రాక్ట్ లెక్చరర్స్ రెగ్యులరైజేషన్ గురించి ఏమిటి? ఈ విషయంలో ప్రభుత్వం తర్వాత ఏ స్టెప్స్ తీసుకోబోతోంది?
A: నాకు తెల్సినంతవరకూ ఈ ఇష్యూ కోర్టులో ఇరుక్కుపోయి ఉంది. 

Q: 90% ప్రజలు ఇన్‌కమ్ టాక్స్ కట్టరు అనే విషయం మీకు తెలుసు. దీని పరిష్కారానికి మీ ప్లాన్ ఏంటి?
A: మీరు (అరుణ్) జైట్లీని అడగాలి.

Q: కర్నాటక, ఒరిసా రాష్ట్రాల నుంచి నా మిత్రులు మంత్రిగా మీరు చేస్తున్న కృషికి బాగా ఇంప్రెస్ అయ్యారు. అసలు మీరు సెంట్రల్ మినిస్టర్ కావడానికి అన్నివిధాలా అర్హులు అంటున్నారు.
A: నా రాష్ట్రంలోనే నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది.

Q: మీ కాలేజ్ రోజుల్లో మీకెవరైనా గాళ్‌ఫ్రెండ్స్ ఉన్నారా?
A: ఇప్పుడు నేను మీకు వారి పేర్లు చెప్తా అనుకుంటున్నారా!

Q: ఒకవేళ మీరు ఏపీలో వోటు వేయాలంటే టీడీపీకి వేస్తారా, వైఎస్సార్‌సీపీకా, జనసేనకా?
A: నాకు ఏపీలో వోటు లేదు. 

Q: సమంత గురించి రెండు మాటలు చెప్పండి.
A: మన హ్యాండ్‌లూమ్ అంబాసాడర్. సున్నిత మనస్కురాలు. 

Q: మా ఎల్ బి నగర్ - మియాపూర్ మెట్రో ఎప్పుడు షురూ చేస్తున్నారు?
A: జూన్ 2018. 

Q: మీరు ఎందరికో ఇన్స్‌పిరేషన్. నా మిత్రుడి ఆరోగ్య ఖర్చులకోసం ఆర్థిక సాయం చేశారు మీరు. మీకు పర్సనల్‌గా థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మిమ్మల్ని ఒకసారి హగ్ చేసుకొని, మీతో ఫోటో తీసుకోవాలానుకుంటున్నాను. సాధ్యమా?
A: వెల్‌కమ్ బ్రదర్. మీ ప్రేమకు థాంక్స్.

Q: పవన్‌కళ్యాణ్ రాజకీయాలమీద మీ అభిప్రాయం ఏంటి? దయచేసి చెప్పండి సర్.
A: ప్రజలు నిర్ణయిస్తారు. నేనెవర్ని?

Q: 1 + 1 = ?
A: రాజకీయాల్లో 2 కాదు.

Q: జై తెలంగాణ అని ఒక రిప్లై ఇవ్వండి సార్.
A: జై జై తెలంగాణ!

Q: మినిస్టర్‌గా, అడ్మినిస్ట్రేటర్‌గా, తండ్రిగా, భర్తగా, కొడుకుగా లైఫ్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు?
A: చాలా కష్టతరమైన ఫీట్. కొన్ని వ్యక్తిగత త్యాగాలు తప్పనిసరి.

Q: మీరు ధోనీ నుంచి ఏదైనా ఒక క్వాలిటీ తీసుకోవాలనుకొంటే ఏం తీసుకుంటారు?
A: ఎంత వత్తిడిలోనైనా కామ్‌గా ఉండగలగటం.  

Q: సచిన్ గురించి ఒక్క మాటలో చెప్పండి.
A: లెజెండ్.

Q: కే సీ ఆర్ కాకుండా, మీకు బాగా నచ్చిన ఇంకో పొలిటీషియన్ ఎవరు?
A: బరాక్ ఒబామా.

Q: తెలంగాణలో మరొక డైనమిక్ లీడర్ హరీష్‌రావు గారి గురించి కొన్ని మాటల్లో చెప్పండి.
A: హార్డ్‌వర్కింగ్ & బాగా పట్టుదల ఉన్నవాడు. 

Q: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఒక్క ముక్కలో చెప్పండి.
A: బాహుబలి.

Q: మీరు ఇంట్లో ఎప్పుడైనా వంట చేశారా?
A: యూ ఎస్ లో ఉన్నప్పుడు చేశా.

Q: ఫేవరేట్ ఫుడ్ సర్?
A: ఇండియన్. చైనీస్.

Q: మీ ఫేవరేట్ బుక్?
A: ఫౌంటేన్ హెడ్.

Q: 2017 లో మీ ఫేవరేట్ మూవీ?
A: 140 కేరెక్టర్స్‌లో చెప్పలేనన్ని.

Q: గ్లోబల్ హైదరాబాద్ కోసం తెలంగాణ గవర్నమెంట్ ఏ 5 అంశాలకు ప్రాధాన్యతనిస్తోంది?
A: ఇన్‌ఫ్రాస్‌స్ట్రక్చర్.
శానిటేషన్ - క్లీన్ సిటీ.
లా & ఆర్డర్ - సేఫ్ సిటీ.
పరిశుభ్రమైన గాలి - గ్రీన్ సిటీ.
మంచి ఆరోగ్య సౌకర్యాలు - బస్తీ దవాఖానా. 

Q: టి ఆర్ ఎస్ గవర్నమెంట్ హైదరాబాద్ కేంద్రంగానే అభివృధ్ధికి కృషి చేస్తోందంటున్నారు. మీరేమంటారు?
A: పూర్తిగా తప్పు. అన్ని జిల్లాల్లో ఆల్‌రౌండ్ డెవలప్‌మెంట్‌కు కృషి చేస్తున్నాం.

Q: హైదరాబాద్‌లోని కొన్ని ప్లేసెస్‌లో ఫ్రీ వైఫై అని ప్రామిస్ చేశారు. ఇంకా ఏం లేదు. ఎప్పటికి ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు?
A: 1/3 పూర్తయింది. మిగిలింది జరుగుతోంది.

Q: సార్! ఈవంక... మేము వేసే ట్వీట్స్ కొంచెం చూడండీ!
A: ఈవంక నా ... ఇవాంకా నా?

Q: జి ఇ ఎస్ 2017 లో మాడరేషన్ చేసేటప్పుడు నెర్వస్‌గా ఫీలయ్యారా?
A: అంతకుముందెప్పుడూ ఫీల్ అవ్వనంత నెర్వస్‌గా ఫీలయ్యాను. వాళ్లంతా అంతకు ముందు నేనెప్పుడూ కలవనివాళ్లు. మాడరేషన్ కూడా అంతకునుందు నేనెప్పుడూ చెయ్యలేదు.

Q: నేను ఏపి నుంచి... మీ నాన్న గారు, మీరు తెలంగాణ కోసం చేస్తున్న ఆల్‌రౌండ్ డెవలప్‌మెంట్ చూస్తున్నాం. మీకు 2019 లో భారీ మెజారిటీ తప్పక వస్థుంది.
A: ఎలెక్షన్ల గురించి వర్రీ వద్దు బ్రదర్. ప్రజలు చాలా తెలివైనవాళ్లు. పనిచేసేవాళ్లను ఎన్నుకుంటారు.     

Q: మీరు దేవుడిని నమ్ముతారా? ఒకవేళ నమ్మితే, అలా మీరు దేవుడిని నమ్మేలా చేసిందేమిటి?
A: నేను కర్మను నమ్ముతాను.

Q: డాడ్ అని చెప్పకుండా, సి ఎం కే సీ ఆర్ గారి గురించి ఒక్క మాటలో చెప్పండి.
A: (అత్యంత అనుకూల ఫలితాలను తెచ్చే) టాస్క్ మాస్టర్.


కట్ టూ కే టీ ఆర్ ‘లైవ్’ - 

నిన్న రాత్రి 8 గంటలనుంచి, 10 వరకు, ఒక రెండు గంటలపాటు మంత్రి కే టీ ఆర్ ట్విట్టర్ లో లైవ్ లో ఉన్నారు.

వాటిల్లో ఆసక్తికరమైన కొన్ని ప్రశ్నలకు కె టీ ఆర్ ఇఛ్చిన సమాధానాలను ఇలా నా బ్లాగ్‌లో పోస్ట్ చేయాలనిపించింది.

పైవన్నీ ఆ ప్రశ్నజవాబులే!

రాజకీయాల్లో ఒక మంత్రి ఇలా కూడా ఉండొచ్చు .. ఇంత బాగా పనిచేయొచ్చు అని అలవోగ్గా చేతల్లో నిరూపిస్తున్న మంత్రి కే టీ ఆర్ మన తెలంగాణ బిడ్డ కావడం మనం నిజంగా గర్వించాల్సిన విషయం.

కే టీ ఆర్ ఒక ముఖ్యమంత్రి కొడుకు అన్నది ఇక్కడ విషయం కానేకాదు. ఒక వ్యక్తిగా, ఒక డైనమిక్ మంత్రిగా, అతనిలోని అన్ని పార్శ్వాల్లో ఉన్న విశిష్టత, నైపుణ్యం, సింప్లిసిటీ, అతని సంపూర్ణ వ్యక్తిత్వం ... ఇవన్నీ పైనున్న ప్రశ్న జవాబుల్లో మనం గమనించవచ్చు.

మన దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా, ఇప్పటివరకు, ఇంత మల్టీ టాలెంటెడ్ .. ఇంత డైనమిక్ .. ఇంత గో గెటర్ .. ఇంత స్పోర్టివ్ .. ఇంత సోషలైట్ .. ఇంత హ్యూమనిస్ట్ మంత్రిని నేను మాత్రం ఇంతవరకు చూడలేదు.

అయితే, ఇదంతా తండ్రిగా కే సీ ఆర్ గారి పెంపకం అని మెచ్చుకోకుండా ఎలా ఉండగలం?

@KTRTRS, You Rock … 

Thursday 28 December 2017

2018 మరొక రొటీన్ న్యూ ఇయర్ కాదు!

ఇది నిజం.

ఇంకో 3 రోజుల్లో 2017 అయిపోతోంది.

ఇంక దాని గురించి ... ఆ సంవత్సరంలో ఏమనుకున్నాను, ఏం చేశాను, ఏం జరిగింది అన్న ఆలోచన, చర్చ, విశ్లేషణ ఇప్పుడు అనవసరం.

నో ఫ్లాష్‌బ్యాక్.

సింపుల్‌గా, 2017, ఒక ముగిసిన అధ్యాయం.


కట్ టూ 2018 -   

ఇది ఖచ్చితంగా అంతకుముందులా ఒక అతి మామూలు సాదాసీదా సంవత్సరం మాత్రం కాదు. కానివ్వను.

ఈ సంవత్సరానికి సంబంధించి నా ఆలోచనలు, యాక్షన్ ప్లాన్, డెడ్‌లైన్స్ ... అన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి. 

టార్గెట్ బై టార్గెట్ ... అన్నీ అనుకున్నట్టుగా పూర్తిచేస్తాను. వాటి దారి వాటిదే. అవి అలా జరిగిపోతుంటాయి.

వీటిలో అతి ముఖ్యమైనవి మాత్రం రెండే రెండు:

2018 మే నెల దాకా 'నమస్తే హైదరాబాద్' సినిమా.

2018 ప్రారంభం నుంచే పూర్తిస్థాయిలో మ్యాప్‌రాక్స్ ఇంటర్నేషనల్ పనులు.

ఈ రెండింటిమీదే నా పూర్తి ఏకాగ్రత.     

వెరసి, క్లుప్తంగా ఒక్కటే మాట ...
2018, నా ఫ్రీడమ్ ఇయర్.  

Wednesday 27 December 2017

సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజు ...

డిసెంబర్ 27, 2016.

సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజు మధ్యాహ్నం మా అమ్మ ఫోన్‌లో ఆమెతో నేను ఒక పది నిమిషాలపాటు మాట్లాడాను.

అదే మా అమ్మ మాట్లాడిన చివరి కాల్. అదే నేను మా అమ్మతో మాట్లాడిన చివరి కాల్.

వరంగల్లో, అక్కడే ఉన్న మా తమ్ముడు మా అమ్మ ఆరోగ్యం గురించి ఏదో అంటే నేను పట్టించుకోలేదు. మామూలుగా 70 ప్లస్ వయస్సులో వచ్చే ఏదో చిన్న అనారోగ్యం అనుకున్నాను.

కానీ, ఆ తర్వాత ఒక గంటకే నేను ఊహించని కాల్ రానే వచ్చింది.

మా అమ్మ చనిపోయింది.


కట్ టూ 27 డిసెంబర్ 2017 - 

సరిగా ఇప్పుడు ఈ బ్లాగ్ రాస్తున్న ఈ సమయానికి .. సంవత్సరం క్రితం, వరంగల్లో, మా అమ్మకు అంతిమ సంస్కారం చేస్తున్నాం.

అంతా అయిపోయింది.

చూస్తుండగానే, మా అమ్మ లేకుండానే, 365 రోజులు చాలా వేగంగా గడిచిపోయాయి.

ఒక నాలుగు రోజుల్లో 2017 పూర్తికాబోతోంది.

2018 రాబోతోంది.

అన్నీ మామూలుగానే జరిగిపోతున్నాయి.

అమ్మ లేకుండానే ...  

Thursday 21 December 2017

మాతృభాష కోసం మన కేసీఆర్!

అది ఫుట్ బాల్ టోర్నమెంట్ కాదు, క్రికెట్ వరల్డ్ కప్ కాదు.

ప్రపంచ తెలుగు మహాసభలు ...

అయినా, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న మన లాల్ బహదూర్ స్టేడియం కిక్కిరిసిపోయింది!

బాల్ కోసం కాదు, భాష కోసం!

నిస్సందేహంగా నూటికి నూరు శాతం ఈ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే.

42 దేశాల నుంచి, దేశంలోని 19 రాష్ట్రాలనుంచి, వేలాదిమంది ప్రతినిధులు పాల్గొన్న ఈ తెలుగు మహాసభలు నభూతో నభవిష్యతి!

ఇది చదవడానికి, వినడానికి ఒక మామూలు అతిశయోక్తిలా అనిపించవచ్చు. కానీ, ఎంతమాత్రం కాదు.

అయితే, 'నభూతో నభవిష్యతి' అన్న మాట నేనిక్కడ ఉపయోగించడానికి కారణాలు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి రెండు అంశాల గురించి మాత్రమే ఇక్కడ మీతో పంచుకోవాలని ఈ చిన్న బ్లాగ్ పోస్టు రాస్తున్నాను.

ఇంతవరకూ తెలంగాణ ప్రజలు కేసీఆర్ లో ఒక ఉద్యమ నాయకున్ని చూశారు. ఒక అత్యంత సమర్థవంతమైన ముఖ్యమంత్రిని చూశారు. బంగారు తెలంగాణ కోసం అహరహం తపించే ఒక స్వాప్నికుణ్ణి చూశారు. బంగారు తెలంగాణ అనేది కేవలం మాటలే కాదు, చేతల్లో కూడా సాధ్యమే అని ఒక్కొక్కటిగా అద్భుతాలు ఆవిష్కరిస్తున్న ఒక దార్శనికుణ్ణి చూశారు. పరిపాలన అంటే ఎప్పుడూ రాజకీయమే కాదు, మానవీయకోణంలో కూడా ప్రజల సంక్షేమం కోసం  నిర్ణయాలు తీసుకోవచ్చు అని నిరూపించిన ఒక మనవతామూర్తిని చూశారు. తెలంగాణ గడ్డ మునుపెన్నడూ చూడని ఒక రాజకీయ చాణక్యుణ్ణి కూడా చూశారు.

ఇప్పుడు, తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత జరిపిన ఈ  మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభల పుణ్యమా అని, మొట్టమొదటిసారిగా, కేసీఆర్ లో ఒక నిలువెత్తు సాహిత్యమూర్తిని కూడా చూశారు.

ఇది కదా అసలు అద్భుతం!

ఆ భాష, భాష మీద ఆ మమకారం, ఆ వ్యక్తీకరణ ... సాహిత్యం మీద, సాహిత్య చరిత్ర మీద, భాషా చరిత్ర మీద అంత పట్టు ... వందలాది పద్యాలు కంఠతా ఉండటం, ఆ పద్యాల్ని పద్యాల్లా అలవోగ్గా ఆలపించడం ...

ఎప్పుడైనా, ఏ ముఖ్యమంత్రిలోనయినా ఇన్ని అద్భుత పార్శ్వాలు మనం చూశామా?

బహుశా ఇకముందు కూడా మనం చూడం.

నిజమే. మనకిష్టం లేనివి కూడా ఈ సభల్లో కొన్ని జరిగి ఉండవచ్చు. కానీ, వేలాదిమంది పాల్గొనే సభల్లో ప్రతి ఒక్క అంశాన్ని కూడా కేసీఆర్ ఒక్కడే చూసుకోవాలంటే అది నిజంగా అయ్యేపని కాదు.

ఇంత భారీ కార్యక్రమంలో, ఆయా విభాగాలకు నియమించిన ప్రధాన వ్యక్తుల నిర్ణయాల కారణంగా, కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు జరిగే అవకాశం తప్పకుండా ఉంటుంది. అర్థం చేసుకోగలిగితే అది సహజం. తప్పులే పట్టుకోవాలని నిత్యం రంధ్రాన్వేషణ చేసేవారికి మాత్రం అది కోతికి కొబ్బరి చిప్పే.

రాజకీయ అవసరమో, చాణక్యమో .. ఈ సభల్లో మన మనస్సుని చివుక్కుమనిపించే ఒకానొక సినీతారల సన్మాన కార్యక్రమంలో కూడా ఒక పాజిటివ్ కోణాన్ని మనం చూడవచ్చు.

అంతకుముందు తెలంగాణను వ్యతిరేకించినవారిచేత, తెలంగాణను ద్వేషించినవారిచేత, తెలంగాణను యూ టీ చేయాలన్నవారిచేత కూడా .. అదే వేదిక మీదనుంచి .. అదే తెలంగాణను, తెలంగాణ ప్రజలను, తెలంగాణ  ముఖ్యమంత్రిని, తెలంగాణ రచయితలు, కవులను నోరారా పొగిడేలా చేయగలిగిన సత్తా కేవలం కేసీఅర్ దే!

అంతే కాదు. మహాసభల ముగింపు రోజున తన ఉపన్యాసాన్ని కేసీఆర్ ఒక నవ్వుల పద్యంతో ముగించడం విశేషం.

ఇక, సభల ముగింపు సంబురాలు ఏదో అల్లాటప్పాగా జరగలేదు. అద్భుతమైన లేజర్ షో, భారీ టపాసులతో దేదీప్యమానంగా, ఒక అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ ఈవెంట్ ముగింపు వేడుకల్లాగా జరపడం అనేది కేసీఆర్ ఈ మహాసభలకు ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో తెలుపుతుంది. తెలుగు భాష పట్ల ఆయనకున్న మమకారాన్ని తెలుపుతుంది.

హైద్రాబాద్ లో విజయవంతంగా జరిపిన తెలుగు మహాసభల ప్రకంపనలు మన పక్క రాష్ట్రంలో వెంటనే మొదలయ్యాయి. 'భీమవరంలో ఆంధ్ర మహాసభలు' అంటున్నారు అప్పుడే!

పోటీగా చేసినా, ఇంకే ఉద్దేశ్యంతో చేసినా, ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా జరగడం వల్ల తెలుగు భాష మరింత ప్రాధాన్యతను సంతరించుకొంటుంది. మరింతగా విలసిల్లుతుంది.

కనీసం ఈ దిశలో ప్రయత్నాలయినా ఎప్పుడూ కొనసాగుతుంటాయి.

మాతృ భాషకు బ్రహ్మరథం పట్టాలన్న కేసీఆర్ ఆశయ సాఫల్యానికి ఇది ఆరంభం మాత్రమే. ఇక ప్రతియేటా డిసెంబర్ మొదటివారంలో తెలంగాణలో తెలుగు మహాసభలు జరుపుతామని కూడా కేసీఆర్ చెప్పారు.

కట్ టూ సంస్కారదీప్తి - 

తెలుగు మహాసభల ప్రారంభం రోజున జాతీయగీతాలాపన అయినవెంటనే, తొట్టతొలిగా తన ముఖ్యమంత్రి ప్రోటోకాల్ లాంటివన్నీ పక్కనపెట్టి, కేసీఆర్ తన గురువుగారైన మృత్యుంజయశర్మ గారిని వేదికపైన సత్కరించి, సాష్టాంగ ప్రణామం చేయడం ఎవరూ ఊహించని గొప్ప విషయం.

ఒక వ్యక్తి విజయపరంపర వెనుక అతని కృషి, పట్టుదల, వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకొని నిలబడగలిగే స్థితప్రజ్ఞత వంటివి ఎన్నో తప్పక ఉంటాయి. వీటన్నింటికి తోడు అతని వ్యక్తిత్వం, అతనిలోని అత్యున్నత సంస్కారం కూడా ఈ విషయంలో ప్రధానపాత్ర వహిస్తాయన్న నిజానికి నిలువెత్తు నిదర్శనం మన కేసీఆర్.

Monday 4 December 2017

దట్సాల్ యువరానర్!

ప్రతిపక్షాలకంటే వేరే పనేమీ ఉండదు. ఏ సందు దొరుకుతుందా, ఎట్లా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శిద్దామా, తిడదామా అని ప్రతి నిముషం ఎదురుచూస్తుంటారు.

ఇంకా చెప్పాలంటే .. అంతా కాచుక్కూర్చుంటారు. తెల్లారి లేస్తే కె సి ఆర్ ను ఆరోజు ఎలా కాల్చుకుతిందామా అని. 

ఇది సర్వసహజం.

కారణం కరెక్టయినా, కాకపోయినా .. ఏదో ఓ నెపంతో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, తిట్టడం, విమర్శించడం, సెటైర్లు వెయ్యడం ప్రతిపక్షాల రొటీన్ వ్యవహారం.

రోజూ అదే వాళ్ల డ్యూటీ.

ఈ యాంగిల్లో పాపం .. వాళ్లనేమీ అనడానికి లేదు.

దీనికి జనం ఎప్పుడో అలవాటైపోయారు. ఇదంతా ఎప్పుడూ ఉండే ఒక సన్నాసి వ్యవహారం అనుకొని 'లైట్' తీసుకుంటున్నారు. అసలు పట్టించుకోవడంలేదు. 
   

కట్ చేస్తే - 

ఆర్జీవీలాంటి హల్‌చల్ హాబీయిస్టులుంటారు.

మొన్నటిదాకా ట్విట్టర్. ఇప్పుడు ఫేస్‌బుక్, ఇన్స్‌టాగ్రామ్.

ఈ ప్లాట్‌ఫామ్‌స్ మీద ఏదో ఒకటి వదులుతుండటం ఆర్జీవీ హాబీ. పాజిటివ్‌గానో, నెగెటివ్‌గానో, అర్థం అయ్యీ కాని సెటైర్ల రూపంలోనో.. మొత్తానికి ఏదో ఒకటి అలా వదులుతుండటం ఆయన హాబీ.

ఆర్జీవీ ఫలానా టాపిక్ మీద ఇలా ట్వీట్ పెట్టాడు, అలా పోస్ట్ చేశాడు .. అని అందరూ అనుకొనేలా ఎప్పుడూ ఏదో ఒకదానిమీద ఏదో ఒక 'ఎఫ్ఫెక్ట్' కావాలి ఆయనకు. దీనికోసం ఒక్కోసారి ఒక్కో కరెంట్ టాపిక్‌ను, లేదా ఒక్కో వ్యక్టిని టార్గెట్ చేయడం ఆర్జీవీ అలవాటు.

అది అతని స్టయిల్. ఎప్పటికప్పుడు జనం ఫోకస్ తనవైపు తిప్పుకోడానికి అతను ఉపయోగించే ఒక ప్రొఫెషనల్ టెక్నిక్. 

మొత్తంగా అదో టైపు.

కె సి ఆర్ ను టార్గెట్ చేస్తూ కూడా ఆర్జీవీ చాలాసార్లు సోషల్ మీడియాలో సెటైర్లు వేశాడు, పొగిడాడు, పొగిడినట్టు మాస్క్ వేస్తూ ఎన్నో సెటైరిక్ కామెంట్స్ పెట్టాడు.

అయితే మన జనం దీనికి కూడా బాగా అలవాటైపోయారు.

"వాడిష్టం" అనుకొని పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఒకవేళ పట్టించుకొన్నా, అదంతా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ అన్న పాయింటాఫ్ వ్యూలో సెట్ అయిపోయారు. 

ఇంకా కొంతమంది కులప్రాతిపదికన ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటుంటారు. "గడీల రాజ్యం", "దొరల రాజ్యం" అనీ, "కుటుంబపాలన" అనీ .. అదనీ, ఇదనీ.

దీనికి కూడా బాగా అలవాటయిపోయారు మనవాళ్లు. "వీళ్లింతే" అని.


కట్ టూ మన అసలు పాయింట్ - 

ఇప్పటిదాకా నేను రాసిన టాపిక్కంతా ఒక పనికిరాని రొచ్చు అనుకొంటే .. ఈ రొచ్చులోకి ఈమధ్య కొత్తగా ఒక గాయని-కమ్-యాంకర్-కమ్-డబ్బింగ్ ఆర్టిస్టు ప్రవేశించడం నాకు బాగా ఆశ్చర్యం కలిగించింది.

కారణం .. నేనామెకు పెద్ద ఫ్యాన్‌ని కావడం కావొచ్చు. ఆమె సంపాదించుకొన్న ఒక మంచి పాజిటివ్ ఇమేజ్‌కు ఇది అసలు సెట్ అవ్వని వ్యవహారం అని అనిపించడంవల్ల కావొచ్చు.   

గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొనడానికి ఇవాంకా ట్రంప్ అండ్ టీమ్ హైద్రాబాద్ వస్తున్న సందర్భంగానే మన నగరాన్ని మనం సుందరమయం చేసుకుంటున్నామనీ, అలా చేయడం తప్పనీ .. నానా యాంగిల్స్‌లో విమర్శలున్నాయి.

అది వేరే విషయం.

సుమారు 150 దేశాలనుంచి దాదాపు 1500 మంది ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఈ సదస్సులో పాల్గొనడానికి మన నగరం వస్తున్నారు. అమెరికానుంచి వస్తున్న బృందాన్ని ఆ దేశపు ప్రెసిడెంట్ సలహాదారు, ఆయన కుమార్తె కూడా అయిన ఇవాంకా ట్రంప్ లీడ్ చేస్తోంది. 

ఒక అంతర్జాతీయస్థాయి సదస్సు జరుగుతున్నప్పుడు మన నగరాన్ని శుభ్రంగా, ఆకర్షణీయంగా చేసుకోవడం తప్పా?

అదెవరికోసం?

కె సి ఆర్ కోసమా? కె టి ఆర్ కోసమా?

ప్రపంచం నలుమూలలనుంచి సదస్సుకు వస్తున్న పారిశ్రామికవేత్తలను ఫస్ట్‌సైట్ లోనే మన నగరం ఆకట్టుకొనేలా చేయడంలో తప్పేముంది?

ఈ సదస్సు ద్వారా, ఇందులో పాల్గొన్న పారిశ్రామికవేత్తల ద్వారా, ఆయా ప్రపంచస్థాయి కంపెనీలద్వారా, ఇండస్ట్రీల ద్వారా .. ఎంత ఎక్కువ పెట్టుబడులను ఆకర్షిస్తే అంత మంచిదన్నది కామన్ సెన్స్.

ఇదొక ఓపెన్ సీక్రెట్.

ఓపెన్ బిజినెస్ స్ట్రాటెజీ. 

ఈ ముస్తాబంతా మనవాళ్లు కేవలం ఇవాంకా ట్రంప్ కోసం చేస్తున్నారని ఈ సోకాల్డ్ మేధావులు, క్రిటిక్స్, సెటైరిస్టుల అర్థంలేని ఆలోచన. వీరితోపాటు .. ఆపోజిషన్‌వాళ్లు, ఆర్జీవీలాంటివాళ్లు ఈ రచ్చ, ఈ రొచ్చులో భాగం కాబట్టి, వాళ్లకిది మామూలే కాబట్టి .. ఓకే అనుకుందాం.

"ఇవాంకా మా ఇంటి ముందు నుంచి కూడా వెళ్తే బావుండు" అని సదరు గాయని-కమ్-యాంకర్-కమ్-డబ్బింగ్ ఆర్టిస్టు సెటైర్ వేయడం వ్యక్తిగతంగా నాకైతే నచ్చలేదు. 

ప్రజాస్వామ్యంలో నూటికి నూరు శాతం ఆమెకా హక్కుంది. కాని, ఇదంతా ఒక రచ్చ. ఒక యుధ్ధభూమి. ఈ రచ్చ, ఈ యుధ్ధభూమి ఇప్పుడామెకు అవసరమా అన్నదే ఆమె ఫ్యాన్‌గా నా పర్సనల్ ఫీలింగ్.

ఈ ఒక్క సెటైర్‌ను పట్తుకొని వందమంది, వెయ్యిరకాల సెటైర్లు ఆమె మీద వెయ్యడానికి, ఆమెను ఏకెయ్యడానికి సోషల్ మీడియాలో రెడీగా ఉన్నారు. ఉంటారు.

ఈ బ్లాగ్ పోస్టు ప్రారంభంలోనే చెప్పినట్టు - ఒక అలవాటుగా, ఒక డ్యూటీగా ఇలాంటివి చేసేవాళ్లు ఓకే. కాని, అలవాటు లేనివాళ్లు వాళ్ల ఇమేజ్‌కు కుదరని పనిచేసి, అనవసరంగా ఇబ్బంది పడటం ఎందుకన్నదే ఇక్కడ నా హంబుల్ పాయింట్.

ఈ గాయని వేసిన ఈ ఒక్క సెటైర్‌కు నేను పెద్దగా స్పందించేవాణ్ణి కాదు. ఇదంతా కూడా రాసేవాణ్ణి కాదు. కానీ ..

2004 లో అనుకొంటాను ..

ఒక రికార్డింగ్ స్టూడియోలో హీరోయిన్ పాత్రకు డబ్బింగ్ చెప్తూ, ఉన్నట్టుండి మధ్యలో డబ్బింగ్ చెప్పడం ఆపేసి, "కడుపు నొప్పి" అంటూ ఏడుస్తూ కూర్చుంది ది సేమ్ డబ్బింగ్ ఆర్టిస్టు.

నిజంగానే ఆమె కళ్లవెంబడి నీళ్లు!

కొత్త డైరెక్టర్, మొదటి చిత్రం. దెబ్బకు హడలి పోయాడా డైరెక్టర్.

వెంటనే - "డబ్బింగ్ రేపు కంటిన్యూ చేయొచ్చు. ముందు హాస్పిటల్‌కు వెళ్దాం పదండి" అంటే, "ఫర్వాలేదు, ఇట్లా నాకు అప్పుడప్పుడు వస్తుంది కడుపునొప్పి. నేను ఇంటికి వెళ్ళి, టాబ్లెట్స్ వేసుకొని, ఇవాళ రెస్ట్ తీసుకుంటాను" అందామె.

డబ్బింగ్‌కు ప్యాకప్ చెప్పి, అప్పటికప్పుడు నిమిషాల్లో ఆమెను కార్లో ఇంటికి పంపించాడా డైరెక్టర్.


కట్ చేస్తే - 

ఓ గంట తర్వాత అదే కడుపునొప్పి డబ్బింగ్ ఆర్టిస్టు ఒక తెలుగు చానెల్లో యాంకర్‌గా లైవ్ ప్రోగ్రాం చేస్తూ లైవ్‌లీగా కనిపించింది!

తెలంగాణ ప్రభుత్వం మీద సోషల్ మీడియాలో నిన్నటి ఆమె సెటైర్ చూసినప్పుడు నాకు ఈ ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది.

వీళ్లా నీతులు చెప్పేది?

వీళ్లా పని చేస్తున్న ప్రభుత్వాన్ని ఎగతాళి చేసేది?

వీళ్లా కె సి ఆర్ పై సెటైర్లు వేసేది?

మీకున్న స్థాయికి మీ ఇంటిముందు రోడ్డు బాగా లేదన్న విషయాన్ని మంత్రి కె టి ఆర్ కు డైరెక్టుగా ఒక్క ట్వీట్ చేస్తే సరిపోయేది. వెంటనే యాక్షన్ ఉండేది. మీకున్న పాపులారిటీ కూడా మరింత పెరిగేది.

ఇదంతా రాసినందుకు కె సి ఆర్ నాకేమీ జీతం ఇవ్వడం లేదు. ప్రభుత్వం నుంచి నేనేమీ ఆశించడం లేదు. అదంతా ఒక భ్రమ.

దశాబ్దాలుగా ఎవ్వరూ సాధించలేని తెలంగాణను కె సి ఆర్ సాధించిపెట్టారు. అహర్నిశలు ఆలోచిస్తూ, శ్రమిస్తూ, అంతకు ముందునుంచీ ఈ ప్రాంతంలో పేరుకుపోయిన, గుట్టలుగా పేర్చిన ఒక్కో సమస్యనూ పరిష్కరించుకొంటూ వస్తున్నారు.

24 గంటలు కోతల్లేని కరెంటు ఇంతకు ముందు ఉందా?
పొలాలకు అసలు నీళ్లున్నాయా?
చెరువులకు పూడికలెవరైనా తీశారా?
కొత్తగా చెరువులను తవ్వే ఆలోచన ఎవరైనా ఎప్పుడైనా చేశారా?
రైతులకు కూడా 24 గంటలు కరెంటు ఇచ్చిన ప్రభుత్వాన్ని ఇంతకుముందు ఎప్పుడైనా చూశామా?
తెలంగాణలో అంతకుముందు నీళ్లులేక బీడుపడ్డ భూముల్లో ఇవాళ కనిపిస్తున్న పచ్చదనం ఎవరి కష్టం? ఎవరి ఆలోచన? ఎవరి నిబధ్ధత?
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాలను అలోచించిన సి ఎం ఇంతకుముందెవరైనా ఉన్నారా? 
40 వేల కోట్ల సంక్షేమ పథకాలు ఇంతకుముందెప్పుడైనా అసలు విన్నామా?
పకడ్బందీగా ఇంత అత్యుత్తమస్థాయి శాంతి భద్రతలను గతంలో ఎప్పుడైనా చూశామా?
ప్రపంచ తెలుగు మహాసభలకోసం కవులు, రచయితల భారీ ఫ్లెక్సీలు/కటౌట్లు ఎప్పుడైనా చూశామా?
అసలు తెలంగాణలోని అంగుళం అంగుళం గురించి, ఏ కోణంలోనైనా, అంకెలతోసహా చెప్పి, అనర్ఘలంగా వివరించగల సత్తా ఉన్న సి ఎం ను ఇంతకు ముందెప్పుడైనా చూశారా? ..

నెవర్.

తెలంగాణ రాష్ట్రాన్ని వివిధ రంగాల్లో దేశంలోనే 'నంబర్ వన్' రాష్ట్రంగా నిలబెట్టి,  ఇంత బాగా పనిచేస్తున్న ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడం విజ్ఞత.

అది మన బాధ్యత కూడా.

తప్పు ఉన్నా లేకపోయినా .. అయినదానికీ, కానిదానికీ .. తెల్లారి లేస్తే కె సి ఆర్ ను, ప్రభుత్వాన్ని విమర్శించడం, సెటైర్లు వేయడం విజ్ఞత అనిపించుకోదు. అది ఆయా జీవుల్లోని మానసిక అపరిపక్వతను బయటపెడుతుంది.

దట్సాల్ యువరానర్ ...

***
(26 నవంబర్ 2017 నాడు రాసిన బ్లాగ్ ఇది. పోస్ట్ చేయడం ఆలస్యమైంది.)  

Saturday 2 December 2017

కొన్ని ఎప్పుడూ రొటీన్‌గా ఉండకూడదు!

అవును. కొన్ని ఎప్పుడూ రొటీన్‌గా ఉండకూడదు.

ముఖ్యంగా పుస్తకాలూ, పుట్టినరోజులూ.

హైద్రాబాద్‌కు సుమారు 660 కిలోమీటర్లదూరం, నిన్న, ఒక వ్యక్తిగతమైన పనిమీద వచ్చాను.

పనిలో పనిగా, ఇంతదూరం ఎలాగూ వచ్చానుకదా అని, కొన్ని వృత్తిపరమైన లింక్స్ కూడా ప్లాన్ చేసుకొని వచ్చాను. సమయం దొరికితే ఆ పనులు కూడా పూర్తిచేసుకోవచ్చని.

అయితే - ప్రధానంగా ఏ వ్యక్తిగతమైన పనిమీదయితే నేనిక్కడికి వచ్చానో, ఆ పని పూర్తికాలేదు. సోమవారానికి వాయిదా పడింది. ఇక, తప్పనిసరి పరిస్థితి కాబట్టి ఇక్కడే ఆగిపోవాల్సివచ్చింది.

ఒక హోటల్ రూమ్‌లో.

ఒంటరిగా నేను.

ఆదివారం. 

ఈ సిటీలో నాకు బంధువులు, మిత్రులు, అత్యంత ఆత్మీయ మిత్రులు చాలామందే ఉన్నారు. కానీ ముందే సమాచారం లేకుండా, ఈ ఆదివారం పూట అనవసరంగా వాళ్లల్లో ఏ ఒక్కరినీ డిస్టర్బ్ చేయడం నాకిష్టం లేదు.

రోడ్లమీదపడి తిరగడం, టైమ్‌పాస్‌కు సినిమాలకెళ్ళడం వంటివి నావల్ల కాని పని. నేనా దశదాటి దశాబ్దాలయ్యింది.

ఇక మిగిలింది ఏదైనా పుస్తకం చడవడం. లేదంటే, ఏదైనా రాయడం.

ఈ రెండే నాకత్యంత ప్రియమైన విషయాలు.

ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఒంటరిగా ఉండే అవకాశం ఏ కొంచెం దొరికినా - అయితే నావెంట తెచ్చుకున్న పుస్తకం చదువుతాను. లేదంటే, ఏదైనా రాస్తాను.

కానీ, ఇవాళ ఒక ప్రత్యేకమైన రోజు.

మామూలుగా ఎప్పట్లాగే రొటీన్‌గా ఎదో ఒక పుస్తకం చదవడమో, ఎదో ఒకటి రాయడమో కాదు. సంథింగ్ స్పెషల్ .. ఇంకేదైనా ఒక మంచి పని చేయాలనిపించింది.


కట్ టూ 'కె సి ఆర్ బుక్' - 

కె సి ఆర్ కేంద్ర బిందువుగా నేను రాసిన పుస్తకాన్ని అతి త్వరలో .. చెప్పాలంటే .. ఈ డిసెంబర్ లోపే .. ప్రింట్ చేసి, రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాను. ఆ పుస్తకంలో అక్కడక్కడా కొన్ని  మార్పులూ చేర్పులూ చేయాల్సి ఉంది. కొంత భాగం 'ఫైన్ ట్యూనింగ్' కూడా చేయాల్సి ఉంది.

వెంటనే - 'ఫస్ట్ ప్రూఫ్' కోసం ప్రింటవుట్ తీసిన ఆ పుస్తకం తాలూకు కాగితాల కట్టను బ్యాగ్‌లోంచి బయటకు తీశాను.

పూర్తిగా కె సి ఆర్ పుస్తకానికి సంబంధించిన ఒక ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయాను ..

ఇప్పటిదాకా సీరియస్‌గా ఆ ట్రాన్స్‌లోనే పనిచేస్తూ కూర్చున్నాను. రాత్రి పడుకొనేవరకు కూడా ఇంక నాకదే పని.


కట్ చేస్తే - 

కేవలం రానున్న ఒక నెలరోజుల వ్యవధిలో తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మూడు అత్యంత ప్రాముఖ్యం ఉన్న ఈవెంట్స్ జరగనున్నాయి:

ఒకటి .. హైద్రాబాద్‌లో మెట్రో రైల్ ప్రారంభం. రెండోది .. గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (GES2017). మూడోది .. ప్రపంచ తెలుగు మహాసభలు.

ఈ మూడూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కె సి ఆర్ ప్రతిష్టను మరింతగా పెంచేవే. ఇందుకు కె సి ఆర్ అన్ని విధాలా అర్హుడు.

మొన్నటిదాకా అత్యంత దారుణమైన నత్తనడక నడిచిన మెట్రోరైల్ మెడ మీద కత్తి పెట్టినట్టుగా ఇప్పుడొక ఖచ్చితమైన డెడ్‌లైన్ పెట్టారు కె సి ఆర్.

ఈ నెల 28 నాడు, ప్రధాని మోదీతో  హైద్రాబాద్ మెట్రోరైల్ ప్రారంభం చేయిస్తున్నారు కె సి ఆర్.

హైద్రాబాద్ మెట్రోరైల్‌కు కొన్ని ప్రత్యేకతలున్నాయి. మొదటిది: ఈ హైద్రాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యంత భారీదైన పబ్లిక్-ప్రయివేట్ వెంచర్. రెండోది: 35 మంది మహిళా లోకో పైలట్‌లు మన ఈ కొత్త మెట్రోరైల్ ను నడిపిస్తున్నారు.


కట్ చేస్తే -

ఇండియా - అమెరికా కాంబినేషన్‌లో .. సుమారు 150 దేశాలనుంచి, 1500 మంది ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్న "గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ సమ్మిట్", GES 2017, హైదరాబాద్ వేదికగా ఈ 28 నుంచి జరగబోతోంది.

ఈ సదస్సు జరపడానికి దేశంలోని 8 రాష్ట్రాలు పోటీపడ్డాయి. కానీ, ఆ అవకాశం తెలంగాణకే వచ్చింది. అలా రావడానికి కారణం కూడా "కె సి ఆర్ అండ్ టీమ్" సమర్థతే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.

అమెరికా నుంచి ఈ సమ్మిట్‌కు వస్తున్న బ్రుందానికి స్వయంగా ఆ దేశ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, ఆయన కుమార్తె కూడా అయిన ఇవాంకా ట్రంప్ నాయకత్వం వహిస్తుండటం ఒక పెద్ద విశేషం. కాదనలేని ఒక పెద్ద ఆకర్షణ.

ఈ సందర్భంగా, సమ్మిట్ జరిగే ఆ మూడు రోజులూ యావత్ ప్రపంచ దృష్టి, ప్రపంచ మీడియా దృష్టి హైద్రాబాద్ పైనే ఉండబోతోంది.

ఇది కూడా తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యమంత్రి కె సి ఆర్ కు, హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రతిష్టను, గుర్తింపును తెచ్చేదే. ఆ గుర్తింపే రేపు మరిన్ని పెట్టుబడులు, మరింత సులభంగా హైదరాబాద్‌కు రావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

మరిన్ని ఉద్యోగాలు మన యువతకు, మరింత ఆదాయం మన రాష్ట్రానికి.

సహజంగానే, రాష్ట్ర ఐ టి శాఖ మంత్రి కె టి ఆర్ ఈ మొత్తం సమ్మిట్‌ను అత్యంత విజయవంతంగా నడపడంలో కీలకపాత్ర వహిస్తాడనడంలో సందేహంలేదు.

జరగబోయే గ్రౌండ్ రియాలిటీ చెప్పాలంటే - ఇవాంక, కె టి ఆర్ లు ఈ మొత్తం సదస్సుకు కేంద్రబిందువులవుతారు.


కట్ చేస్తే - 

హైదరాబాద్ వేదికగానే, డిసెంబర్‌లో ప్రారంభం కానున్న "ప్రపంచ తెలుగు మహా సభలు" ఈ సారి ఘనంగా, అద్వితీయంగా జరగనున్నాయి.

డబ్బులు మంచినీళ్లలా ఖర్చుపెట్టి, 'ఘనంగా', ఏ ముఖ్యమంత్రయినా ఏ మహాసభలనయినా నిర్వహిస్తాడు. సందేహంలేదు.

కాని, కె సి ఆర్ వేరు. 

పుస్తకాలతో, సాహిత్యంతో నిరంతరం సహచర్యం జరిపే వ్యక్తి కె సి ఆర్.

భాష విలువ తెలిసిన మనిషి కె సి ఆర్.

అన్నిటినీ మించి, మాతృభాషగా తెలుగును ఎలా గౌరవించాలో బాగా తెలిసిన మనీషి కె సి ఆర్.

ఆయన నేతృత్వంలో ప్రపంచ తెలుగు మహాసభలంటే ఏదో రొటీన్ ఆషామాషీ వ్యవహారం కాదని నా నమ్మకం.


కట్ టూ మై స్పెషల్ డే - 

ఇందాక ప్రారంభంలో చెప్పాను. వ్యక్తిగతంగా నాకు ఇవాళ ఒక ముఖ్యమైన రోజు అనీ, చిన్నదో పెద్దదో, ఈ సందర్భంగా ఇవాళ ఏదో ఒక మంచి పని చెయ్యాలనుకున్నాననీ. 

అవును .. ఈ రోజుని నేను వృధా చెయ్యలేదు.

సుమారు 14 ఏళ్లపాటు తన జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసిన ఒక వ్యక్తికి సంబంధించిన చిరుపుస్తకం పైన ఈరోజంతా పనిచేస్తున్నాను.

తెలంగాణ సాధన అనంతరం, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా రూపొందించాలన్న తన ధృఢసంకల్పాన్ని కూడా మరో ఉద్యమంలా గత మూడున్నరేళ్లుగా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న ఒక శక్తి గురించి రాస్తున్నాను.

ఈ రోజు వృధా కాలేదు.

ఈ రోజు నవంబర్ 26, నా పుట్టినరోజు.

***
(ఇది మొన్న నవంబర్ 26 నాడు రాసిన బ్లాగ్ . పోస్ట్ చేయడం ఆలస్యమయింది.)