Monday 6 November 2017

మీ 'క్రియేటివ్ డే' ఏ రోజు?

మరిసా గురించి ఆమధ్య చదివాను. ఒక బ్లాగ్ పోస్ట్ కూడా రాశాను.

అమెరికాలోని లాస్ ఏంజిలిస్‌కు చెందిన ఈ మరిసా గురించి ఇప్పుడు మరోసారి ఈ బ్లాగ్‌లో ఎందుకు రాస్తున్నానంటే .. అది నాకోసం.

మా ప్రదీప్ కోసం.

మాలాంటి మరికొందరు క్రియేటివ్ క్రీచర్స్ కోసం.

అసలు మేం ఏం చేస్తున్నామో ఒక్క క్షణం ఆగి, మావైపు మేం చూసుకోవడం కోసం. మాలోకి మేం చూసుకోవడం కోసం!


కట్ టూ మరిసా - 

మరిసా ఒక రచయిత్రి. ఆర్టిస్టు. టెక్స్‌టైల్ డిజైనర్. ఇంకా ఎన్నో కళల్లో ప్రవేశముంది.

మొత్తంగా, మరిసా.. ఒక క్రియేటివ్ వుమన్.

మొదట్లో మామూలుగా అందర్లాగే 9-5 ఉద్యోగం చేస్తుండేది మరిసా. ఇలా జాబ్ చేస్తున్న సమయంలో, తనలోని క్రియేటివిటీని ఏ విధంగానూ బయటకు తెచ్చుకొనే అవకాశం దొరికేదికాదు మరిసాకి.

ఈ రోటీన్ లైఫ్‌స్టైల్ ఇలాగే కొనసాగితే, తనలోని సృజనాత్మకత పూర్తిగా అదృశ్యమయిపోయే ప్రమాదముందన్న విషయాన్ని గ్రహించింది మరిసా.

9-5 జాబ్ ఓకే. బ్రతకాలి కాబట్టి.

కానీ, తనలోని క్రియేటివిటీ విషయమేంటి?

వన్ ఫైన్ మార్నింగ్ మరిసాకి ఓ ఆలోచన వచ్చింది.

దాదాపుగా వారం మధ్యలో వచ్చే గురువారాన్ని (థర్స్‌డే) సంపూర్ణంగా తనలోని క్రియేటివిటీ కోసమే కెటాయించాలని నిర్ణయం తీసుకొంది. ఆ నిర్ణయానికి అనుగుణంగా తన జాబ్‌లోని పనిదినాల్ని, మిగిలిన ఇంటివిషయాల్ని అడ్జస్ట్ చేసుకొంది.


కట్ టూ క్రియేటివ్ థర్స్‌డే -

గురువారం.

ఆ రోజు తను ఏ పని చేసినా అది తనలోని క్రియేటివిటీని ప్రదర్శించేది అయిఉండాలి.

అది ఆర్ట్ కావొచ్చు. రచన కావొచ్చు. టెక్స్‌టైల్ డిజైన్ కావొచ్చు. ఇంకేదయినా కావొచ్చు. వారంలో ఆ ఒక్కరోజు .. ఆ గురువారం మాత్రం పూర్తిగా క్రియేటివిటీనే!

మరిసా జీవితంలో ఆ నిర్ణయం ఒక అందమైన మలుపు ..

అలా తను తీసుకొన్న ఆ ఖచ్చితమైన నిర్ణయం తన జీవన శైలినే మార్చివేసింది.

క్రమంగా తన రొటీన్ 9-5 జాబ్‌ను కూడా వదిలేసింది.

ఇప్పుడంతా మరిసా ఇష్టం.

ప్రతిరోజూ "థర్స్‌డే"నే!

ఒక థర్స్‌డేతో ప్రారంభించిన తన క్రియేటివ్ జర్నీ ఇప్పుడు ఫుల్‌టైమ్ బిజినెస్ అయింది!

కావల్సినంత ఆదాయం. చెప్పలేనంత సంతృప్తి.

ఒక పుస్తకం కూడా రాసింది. 

ఇంకేం కావాలి?

ఇది చదువుతోంటే మీ మైండ్‌లో కూడా ఏవో కొత్త ఆలోచనలు వస్తూ ఉండాలి ఇప్పటికే.

కదూ? 

తన ఈ చిన్ని క్రియేటివ్ జర్నీని ఎప్పటికప్పుడు రికార్డ్ చేయడానికి ఓ వెబ్‌సైట్‌ని కూడా రూపొందించుకొంది మరిసా. ఆ వెబ్‌సైట్ పేరు ఏమయిఉంటుందో వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను.

క్రియేటివ్ థర్స్‌డే! 

1 comment: