Tuesday 21 November 2017

ఉపన్యాసాలతో కట్టిపడేయటం ఊరికేరాదు!

"అమ్మను కాపాడుకున్నట్లే తెలుగును కాపాడుకోవాలి. తెలుగులో విద్యార్థులకు సామాజిక అవగాహన, నైతిక విలువలు, పెద్దల పట్ల గౌరవం పెంచే పాఠ్యాంశాలను బోధించాలి."

"కేవలం మహాసభలు నిర్వహించడమే కాకుండా, తెలంగాణలో జరిగిన సాహిత్య సృజన ప్రస్ఫుటమయ్యే విధంగా, తెలంగాణ సాహితీ మూర్తుల ప్రతిభా పాటవాలను ప్రపంచానికి చాటి చెప్పేలా, తెలంగాణ భాషకు అద్భుతమైన భవిష్యత్ ఉందనే గట్టి సంకేతాలు పంపే విధంగా, అత్యంత జనరంజకంగా భాగ్యనగరం భాసిల్లేలా .. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ జరగాలి."

"తెలంగాణ ఉద్యమంలో అంతా కలిసి స్వరాష్ట్రం కోసం ఎట్లా పనిచేశారో, తెలుగు మహాసభలను విజయవంతం చేయడం కోసం కూడా అంతే పట్టుదలతో, సమన్వయంతో ముందుకుపోవాలి."

పైన ఉదాహరించిన మాటలను చెప్పింది: ముఖ్యమంత్రి కె సి ఆర్ గారు.

సందర్భం: త్వరలో తెలంగాణలో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై విస్తృతస్థాయి సమావేశం.


కట్ చేస్తే - 

నా చిన్నతనం నుంచి, ఇప్పటివరకు - పి వి నరసిం హారావు గారినుంచి, కిరణ్‌కుమార్ రెడ్డి దాకా - కనీసం ఒక 13 మంది ముఖ్యమంత్రులను చూశాను. వారు ఎలా మట్లాడతారో నేను గమనించాను. 

కేవలం ఒకరిద్దరు తప్ప - వారందరి మాట్లాడే శైలిలో - "అదేదైతే ఉందో", "ఇప్పుడు చూడండీ", "ఇకపోతే", "మీ అందరి కోసరం", "ప్రపంచపటంలో నేనే పెట్టాను" .. వంటి పనికిరాని ఊకదంపుడే ఎక్కువగా ఉంటుంది.

ఈ ఊకదంపుడు తక్కువగా ఉండి, మంచి భాషతో మాట్లాడగలిగిన ఆ ఒకరిద్దరు పాత ముఖ్యమంత్రులెవరో నేనిక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదనే భావిస్తున్నాను.


కట్ బ్యాక్ టూ కె సి ఆర్ -

ఈ బ్లాగ్ పోస్ట్ ప్రారంభంలో, పైన ఇచ్చిన ఆ మూడు పేరాల్లో - భాషలో గానీ, భావ వ్యక్తీకరణలోగానీ ఎక్కడైనా అర్థం కావడంలేదా? ఇంకేదైనా స్పష్టత కావాలనిపిస్తోందా?

అంత అవసరం లేదు. ఆ అవసరం రాదు.

అది .. ఉద్వేగపరిచే ఉద్యమ సభ కావచ్చు. చాణక్యం ప్రదర్శించాల్సిన పక్కా రాజకీయ సమావేశం కావచ్చు. అధికారులతో భేటీ కావచ్చు. ప్రెస్ మీట్ కావచ్చు.

కె సి ఆర్ ప్రత్యేకత అదే.

భాష, భావ వ్యక్తీకరణ.

అది కూడా .. అవసరమైన ప్రతిచోటా ఖచ్చితమైన గణాంకాలతో, ఉదాహరణలతో!

ఈ రెండూ అందరిలో ఉండవు. అందరికీ రావు.

ఈ ప్రత్యేకత కొందరిలోనే ఉంటుంది. ఆ కొందరికి చదివే అలవాటు తప్పక ఉంటుంది.

కె సి ఆర్ గారికి బాగా చదివే అలవాటుంది. ఆ చదివినదానిలో పనికొచ్చే మంచిని ఆచరణలో పెట్టే అలవాటు కూడా ఉంది. 

1 comment:

  1. Hats off to kcr. He puts across his views succinctly in a lucid manner. Ktr is a greater speaker as well.

    ReplyDelete