Monday 12 June 2017

"పగలే వెన్నెల" కాయించిన సినారె ఇక లేరు!

'నన్ను దోచుకొందువటే' అంటూ ఆరంభించి, 'పగలే వెన్నెల' కాయించి, 'అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం' అని చెప్పిన జ్ఞానపీఠం మన 'సినారె' ఇక లేరు.

ఈ ఉదయం, ఈ విషాద వార్త తెలియగానే నేను పెట్టిన చిన్న ట్వీట్ అది.

సోషల్ మీడియా సంప్రదాయం ప్రకారం, దీన్ని కూడా యధావిధిగా కొందరు మహానుభావులు 'కాపీ పేస్ట్' చేశారు. అది వేరే విషయం. 

అయితే .. మన డైనమిక్ మినిస్టర్ 'కేటీఆర్' గారు నా ట్వీట్‌ను రీట్వీట్ చేయడం విశేషం.

కట్ చేస్తే - 

కవి, సినీ గేయరచయిత, విమర్శకుడు, విశ్వవిద్యాలయ అధ్యాపకుడు, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ఎన్ టి ఆర్ కు అత్యంత సన్నిహితుడు కూడా అయిన సినారె గారి గురించి .. ఆయన జీవితం, జీవనశైలి గురించి .. ఆయనే రాసిన 'కర్పూరవసంతరాయలు' లాంటి ఒక రసాత్మాక కావ్యమే రాయొచ్చు.
 
సినారె గారి కవిత్వం, ఇతర పుస్తకాలు కొన్ని, కనీసం ఒక డజన్ దేశవిదేశీ భాషల్లోకి ఆనువదించబడి ప్రచురితమయ్యాయి.
  
ఆయన చేతులమీదుగా, నాకు తెలిసి, ఎలాంటి అతిశయోక్తి లేకుండా, కొన్ని వేల పుస్తకాలు ఆవిష్కరింపబడ్డాయి. వాటిలో నావి కూడా రెండు పుస్తకాలుండటం నా అదృష్టం.

వారి చేతులమీదుగా శాలువా కప్పించుకొన్న అదృష్టం కూడా నాకు కలిగినందుకు గర్విస్తున్నాను.

అంతే కాదు, ఒక సందర్భంలో, సినారె గారితో కూర్చొని గంటలకొద్దీ కొన్నిరోజులపాటు గడిపిన అద్భుత అనుభవం నేనిప్పటికీ మర్చిపోలేను.
 
తెలుగు సాహితీలోకంలో తెలంగాణ నిలువెత్తు సంతకం సినారె గారికి ముకుళిత హస్తాలతో ఇదే నా నివాళి.