Wednesday 31 May 2017

వందనం .. అభివందనం!

నటునిగా వచ్చిన ఒక అతి చిన్న అవకాశం కోసం, చేస్తున్న చిన్న ఉద్యోగం కూడా వదులుకొని, 1960ల్లో చిత్రరంగంలోకి ప్రవేశించారు గురువు గారు దాసరి నారాయణరావు. 

తర్వాత ఊహలు, అంచనాలు తల్లకిందులై .. రచనారంగంలోకి, దర్శకత్వశాఖలోకి సహాయకుడిగా ప్రవేశించారు.

సుమారు 25 చిత్రాలకు "ఘోస్ట్"గా పనిచేశాకగానీ రచయితగా ఆయనకు రావాల్సిన గుర్తింపు రాలేదు.

ఇక, ఆ తర్వాతంతా చరిత్రే!

మొత్తం 151 చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం, 1000 కి పైగా పాటల రచన, 60 చిత్రాల్లో నటన. ప్రొడ్యూసర్‌గా 30 సినిమాలు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, ఉదయం డెయిలీ, శివరంజని సినీవీక్లీల పత్రికాధిపత్యం, ఎడిటర్, ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌లోనూ, ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లోనూ బాధ్యతాయుతమైన పోస్టులు, రాజకీయాలు, కేంద్ర మంత్రి, గిన్నిస్ రికార్డ్, అవార్డులు, రివార్డులు .. ఇంకా ఎన్నో, ఎన్నెన్నో.

నా "సినిమా స్క్రిప్టు రచనాశిల్పం" పుస్తకం ముగింపు పేజీలో ఒక 'సక్సెస్ స్టోరీ'గా గురువుగారి గురించి నేను రాసిన వాక్యాలివి.


కట్ టూ ది లెజెండరీ డైరెక్టర్ -  

గురువు గారి గురించి నేనొక పెద్ద పుస్తకమే రాయగలను. అలాంటిది, ఒక చిన్న బ్లాగ్‌పోస్ట్‌లో అసలేం రాయగలను?

అసాధ్యం.

కానీ, ఆయనకు సంబంధించి నాకు తెలిసిన కొన్ని గొప్ప విషయాల్ని, నేను మర్చిపోలేని కొన్ని జ్ఞాపకాల్ని, నా ఫీలింగ్స్‌నీ .. కేవలం బుల్లెట్ పాయింట్స్ రూపంలో, సాధ్యమైనంత క్లుప్తంగా రాసే ప్రయత్నం చేస్తున్నాను:

> ఒక సంవత్సరంలో 15 సినిమాలు డైరెక్ట్ చేసి రిలీజ్ చేయగలరా? 
అవును. చేయొచ్చు అని 1980 లోనే నిరూపించారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. అంటే నెలకి ఒక సినిమా కంటే ఎక్కువే! అలాగని ఏదో చుట్టచుట్టి అవతపడేసిన సినిమాలు కావవి. వాటిల్లో కనీసం 70% సినిమాలు హిట్లు, సూపర్ హిట్లు, సిల్వర్ జుబ్లీలు. స్వప్న, శ్రీవారి ముచ్చట్లు, సర్కస్ రాముడు, సర్దార్ పాపారాయుడు, సీతారాములు మొదలైనవి ఆ లిస్ట్ లోనివే!

> ఒకే రోజు 4 చోట్ల 4 సినిమాల షూటింగ్ జరుగుతుంటుంది. దర్శకుడు మాత్రం ఒక్కరే. దాసరి గారు! ఎక్కడికక్కడ షాట్స్ ఎలా తీయాలో తన అసిస్టెంట్స్‌కి చెబుతూ, 4 లొకేషన్లకు తిరుగుతూ తీసిన షాట్స్ చూసుకొంటూ అన్నీ మళ్లీ రివ్యూ చేసుకోవడం. అవసరమైతే కరెక్షన్స్ చేసుకోవడం. అద్భుతం ఏంటంటే, అలా తీసిన 4 సినిమాలూ హిట్ సినిమాలే కావడం!

> ఇలా తన పనిలో ఎక్కువభాగం చూసుకొన్న అప్పటి తన అసోసియేట్ డైరెక్టర్స్‌కు  గురువుగారు "కో-డైరెక్టర్" అన్న టైటిల్ కార్డ్ కొత్తగా క్రియేట్ చేసి మరీ ఇచ్చారు. అదీ తన అసిస్టెంట్స్‌కు దాసరిగారిచ్చిన గౌరవం. ఈ 'కో-డైరెక్టర్' కార్డ్ నేపథ్యం ఇప్పటి కోడైరెక్టర్లలో ఎంతమందికి తెలుసంటారు?

> ఇండస్ట్రీ చరిత్రలో మొట్టమొదటిసారిగా "డైరెక్తర్" పొజిషన్‌కు ఒక స్థాయి, ఒక విలువ, ఒక గౌరవం, ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ తీసుకొచ్చిన ఘనత గురువుగారిదే. అప్పట్లో ఆయన చెన్నై నుంచి ఫ్లైట్‌లో హైద్రాబాద్ వచ్చారంటే చాలు. ఇక్కడ బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో కనీసం ఒక 30 కార్లలో డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, అభిమానుల కాన్వాయ్ ఎప్పుడూ రెడీగా ఉండేదంటే విషయం అర్థం చేసుకోవచ్చు. దటీజ్ డైరెక్టర్ దాసరి!       

> ఒకవైపు తండ్రీకొడుకులు, మరోవైపు తళ్లీ కూతుళ్ళు. కూతురు తండ్రిని ప్రేమిస్తుంది. కొడుకు తల్లిని ప్రేమిస్తాడు. ఇంత అడ్వాన్స్‌డ్ సబ్జెక్టుతో 42 ఏళ్ల క్రితం, 1975 లోనే ఒక సినిమా తీసి సిల్వర్ జుబ్లీ చేశారు గురువుగారు. అదే 'తూర్పు పడమర'. అప్పట్లో బాలు గారు పాడిన .. ది వెరీ సెన్సేషనల్ సాంగ్ 'శివరంజనీ, నవరాగిణీ!'  ఆ సినిమాలోని పాటే.

> ఇక "శివరంజని" సినిమాలో సావిత్రి, షావుకారు జానకి, జయంతి, ఫటాఫట్ జయలక్ష్మి, ప్రభ వంటి హీరోయిన్స్ మధ్య జయసుధను స్టేజి మీద కూర్చోబెట్టి .. అలా కెమెరా ప్యాన్ చేస్తూ .. జయసుధ అభిమానిగా హీరో హరిప్రసాద్‌తో "అభినవ తారవో" అని పాటపాడించటం .. పాట వింటూ హరిప్రసాద్‌ను చూస్తున్న జయసుధ క్లోజ్ కట్స్ కొన్ని .. రియల్లీ .. హాట్సాఫ్ టూ దట్ వన్ ఓపెనింగ్ సీక్వెన్స్ ఆఫ్ ది సాంగ్! 

> 1979 లో బ్లాక్ అండ్ వైట్‌లో గురువుగారు తీసిన "నీడ" సినిమా ఒక సంచలనం. పర్వర్టెడ్ కుర్రాడిగా హీరో కృష్ణ కొడుకు రమేష్ అందులో హీరో. ఆ షూటింగ్ సమయంలో సెట్స్‌కు వచ్చిన మహేశ్‌బాబు వయస్సు నాలుగేళ్ళు! ఆ సినిమాలోనే, ఇంటర్వల్‌కు ముందు కొన్ని నిమిషాలపాటు, తన ఆర్టిస్టుల ఆడిషన్ కూడా చూపించారు గురువుగారు. ఆ ఆడిషన్ ద్వారా సెలెక్ట్ అయి పరిచయమైనవాడే ఇప్పటి ది గ్రేట్ ఆర్ నారాయణమూర్తి!

> 1980లో అక్కినేని జన్మదినం సెప్టెంబర్ 20 నాడు షూటింగ్ ప్రారంభించి, 5 నెలలు కూడా పూర్తవకముందే సినిమా పూర్తిచేసి, 1981 ఫిబ్రవరి 18  అక్కినేని పెళ్లిరోజున గురువుగారు రిలీజ్ చేసిన సంచలన చిత్రం "ప్రేమాభిషేకం". రిలీజైన ప్రతి సెంటర్‌లోనూ 100 రోజులు, 200 రోజులు, 250, 300, 365, చివరికి రికార్డ్ స్థాయిలో 75 వారాల 'డైమండ్ జుబ్లీ' కూడా ఆడిందీ చిత్రం. ఇదంతా పక్కనపెడితే, బెంగుళూరులోని 'మూవీల్యాండ్' థియేటర్లో ఇదే ప్రేమాభిషేకం ఏకంగా 90 వారాలు ఆడటం ఇప్పటికీ బీట్ చేయని రికార్డ్!

>  1982 లో గురువుగారు తీసిన ఒక క్లాసిక్ కళాఖండం "మేఘసందేశం". రమేష్‌నాయుడు అద్భుత సంగీతంలో 11 పాటల మ్యూజికల్! మొత్తం 151 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో, 57 నిమిషాల సౌండ్‌ట్రాక్! అదీ "మ్యూజికల్" అంటే!! ఇందులో కృష్ణశాస్త్రి కవిత్వం ఉంది. జయదేవుని అష్టపదులున్నాయి. పాలగుమ్మి పద్మరాజు పద్యాలున్నాయి. వేటూరి పాటలున్నాయి. ఆశ్చర్యంగా, ఈ సినిమాలో గురువుగారు ఒక్క పాట కూడా రాయలేదు! కారణం మనం ఊహించవచ్చు. ఆయన మొత్తం ఫోకస్ అంతా సినిమాను ఎంత క్లాసిక్ గా తీద్దామన్నదే.  

> నా ఉద్దేశ్యంలో జయసుధలోని సహజనటిని వెలికితీసింది దాసరిగారే. ఒక శివరంజని, ఒక మేఘసందేశం. జయసుధను మర్చిపోకుండా ఉండటానికి ఈ రెండు సినిమాలు చాలు.

> మేఘసందేశం సినిమాకు డి ఓ పి సెల్వరాజ్ అయినప్పటికీ, ఆపరేటివ్ కెమెరామన్‌గా దాదాపు ఆ సినిమాలో చాలా భాగం షూట్ చేసింది మాత్రం గురువుగారే అంటే ఎవరూ నమ్మరు. ఆ సినిమాలోని ప్రతి ఫ్రేమ్ మీద ఆయనకు అంత మమకారం! ఆ సినిమాకు 4 నేషనల్ అవార్డులు, 3 నంది అవార్డులు, 1 ఫిలిమ్‌ఫేర్ అవార్డ్ వచ్చాయంటే ఆశ్చర్యం లేదు.

> గురువుగారి సినిమాలకు "కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం" అన్న టైటిల్ కార్డు చూసి కొంతమంది "అంతా ఉట్టిదే. ఎవరెవరో ఘోస్టులు పని చేస్తే ఆయన టైటిల్ కార్డ్ వేసుకుంటారు" అని కొందరు అంటుంటారు. ఇలా అనే వాళ్లకు నిజం తెలియదని నా ఉద్దేశ్యం. కనీసం పాతిక చిత్రాలకు ఘోస్టుగా పనిచేసిన గురువుగారికి ఒక రైటర్, ఒక టెక్నీషియన్ విలువేంటో అందరికంటే బాగా తెలుసు. ఇది నేను నా వ్యక్తిగతమైన అనుభవంతో, ఆయనతో ఉన్న పరిచయంతో చెప్తున్న నిజం.

> గురువుగారి హాండ్‌రైటింగ్‌తో ఆయనే స్వయంగా రాసుకొన్న స్క్రిప్టులే కనీసం ఒక 500 ఉన్నాయంటే నమ్మగలరా? మామూలుగా అయితే నేనూ నమ్మలేను. కానీ, ఆ స్క్రిప్ట్ ఫైల్స్ అన్నింటినీ బంజారాహిల్స్‌లోని ఆయన ఆఫీస్‌లో రెండ్రోజులపాటు కూర్చొని, ఒక ఆర్డర్‌లో పెట్టి సర్దింది నేనే! ఇవి కాకుండా, ఆయన క్లుప్తంగా రాసుకొన్న స్టోరీలైన్స్, ట్రీట్‌మెంట్స్ కనీసం ఇంకో 500 ఈజీగా ఉంటాయి. ఇందులో 1% కూడా అతిశయోక్తిలేదు.

> కథా చర్చలప్పుడు పరుచూరి బ్రదర్స్, సత్యానంద్, కొమ్మనాపల్లి, ఎమ్మెస్ కోటారెడ్డి, రేలంగి నరసిం హారావు, దుర్గా నాగేశ్వరరావు వంటి ఉద్దండులంతా ఉండేవాళ్లు. కొందరితో వెర్షన్స్ కూడా రాయించుకొనేవాళ్లు. కానీ, చివరికి సెట్స్‌పైకి వచ్చాక సెకన్స్‌లో అప్పటికప్పుడు సీన్ కొత్తగా చెప్పేవారు. అది రికార్డ్ చేసుకొని, రాసుకొని వచ్చేలోపు అక్కడ షాట్ రెడీ! అదీ ఆయన స్టయిల్. కథాచర్చల్లో పాల్గొన్న ప్రతి రచయిత పేరు కూడా టైటిల్ కార్డ్స్‌లో ఉండేది. ఆయనలోనే ఓ గొప్ప క్రియేటివ్ రైటర్ ఉన్నప్పుడు, ఇంక ఘోస్ట్‌ల అవసరం ఏముంది?

> పాటలు కూడా అంతే. అలా ట్యూన్ వింటూ, ఇలా లిరిక్స్ చెప్తుంటారు! అసిస్టెంట్స్ రికార్డ్ చేస్తుంటారు. ఎవరో రాసిన పాటను తన పాటగా వేసుకోవల్సిన అవసరం ఆ స్థాయి దర్శకునికి అవసరమా?

> ఒకరోజు .. తెల్లారితే పాట షూటింగ్ ఉంది. పాట ఇంకా రికార్డ్ అవలేదు. ఆఫీస్‌లోనే రాత్రి 11 అయింది. నన్ను తనతో ఇంటికి రమ్మన్నారు గురువుగారు. కొత్త సొనాటా కార్లో ముందు డ్రయివర్ పక్కన ఆయన కూర్చుంటే, వెనక ఇద్దరు గన్‌మెన్స్ మధ్య టెన్షన్‌తో నేను కూర్చున్నాను.

> ఇంటికెళ్లాక ఆ రాత్రి మేడమ్ పద్మ గారితో చెప్పి నాకు భోజనం పెట్టించారు. అయ్యప్ప దీక్షలో ఉన్న తను స్నానం చేసి, అయ్యప్ప పూజ చేశారు. వచ్చి టేబుల్ దగ్గర కూర్చొని ట్యూన్ వినిపించమన్నారు. ఆ ట్యూన్ వింటూ ఒక పావుగంటలో పాట చెప్పారు. రికార్డ్ చేసి నేను రాసిచ్చాను. అప్పటికప్పుడు ఫోన్ చేసి, నన్ను వందేమాతరం శ్రీనివాస్ స్టూడియోకు పంపారు. అక్కడ శ్రీలేఖతో సహా అందరూ వెయిటింగ్. మరో గంటలో పాట రికార్డింగ్ అయిపోయింది. గురువుగారికి చెప్పాను. మర్నాడు ఉదయం పాట షూటింగ్ అనుకున్న టైమ్‌కు  ప్రారంభమయింది!

> నిజంగా ఘోస్ట్‌లను పెట్టుకొనేవారే అయితే ఆరోజు రాత్రి ఒంటిగంటవరకు ఒక పాట కోసం అంత కష్టపడాల్సిన అవసరం గురువుగారికుందా?

> దాదాపు 50 ఏళ్ల తన సినీజీవితంలో వందలాదిమంది కొత్త ఆర్టిస్టులను, టెక్నీషియన్లను పరిచయం చేసి, వారిని ఇండస్ట్రీలో నిలబెట్టిన క్రెడిట్ ఒక్క గురువుగారికే ఉంది. మోహన్‌బాబు, మురళీమోహన్ హీరోలుగా పాపులర్ అయ్యారంటే ప్రారంభంలో అంతా గురువుగారి ఆశీర్వాదమే. ప్రోత్సాహమే.

 > మరోవైపు .. ఎందరో కొత్త ఆర్టిస్టులతోపాటు .. ఎన్ టి ఆర్, ఏ ఎన్ ఆర్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణం రాజు, జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి స్టార్స్‌కు కూడా అప్పట్లో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన క్రెడిట్ కూడా గురువుగారికే ఉంది.  

> 1972లో, తన తొలి చిత్రం "తాతా మనవడు" లో కమెడియన్ రాజబాబుని హీరోగా, విజయనిర్మల గారిని హీరోయిన్‌గా పెట్టి, ఎస్వీ రంగారావు ప్రధానపాత్రలో 25 వారాల సూపర్ డూపర్ హిట్ ఇవ్వడం ఒక్కటి చాలు దర్శకుడిగా ఆయనేంటో తెల్సుకోడానికి.

> "అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం .. ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం" అని సినారె గారితో పాట రాయించి, అదే తన తొలిచిత్రంలో పెట్టడం ఒక్క గురువుగారికి మాత్రమే చెల్లింది. అప్పటికే తన సినీజీవితం, జీవితం .. గురువుగారికి చాలానే నేర్పించి ఉంటాయని నేననుకొంటున్నాను.
 

కట్ టూ గురువుగారితో నేను - 

> ఇలాంటి 'లెజెండ్' దగ్గర ఒకే ఒక్క సినిమాకు నేను అబ్జర్వర్/అసిస్టెంట్ డైరెక్తర్‌గా పనిచేయగలగడం నా అదృష్టం. ఆ 4 నెలల సమయంలో ఆయన నాపట్ల చూపిన ప్రేమ, అభిమానం నేను ఎన్నటికీ మర్చిపోలేను.

> ఆయన చెప్పిన జోకులు, తెలుగులో ఒక్క అక్షరం స్పెల్లింగ్ కావాలని తప్పుగా రాసినా ఆయన పట్టుకొనే విధానం, తాజ్ బంజారాలో కథా చర్చలు, మధ్యలో ఒక కథకు అమితాబ్ బచ్చన్ గారిని ఒక క్యారెక్టర్‌ కోసం అనుకొని, అప్పటికప్పుడు ఆయనకు కాల్ చేయడం, టైమ్ కాని టైముల్లో, ఆయన సొనాటా కారులో వెనక ఇద్దరు గన్‌మెన్స్ మధ్య టెన్షన్‌తో కూర్చుని ఆయనతోపాటు నేను తిరిగిన ట్రిప్పులు, ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్‌కు ఆయనిచ్చే గౌరవం, అవసరమయినప్పుడు చూపించే ఆ క్షణపు కోపం .. ఇంకా ఎన్నో, ఎన్నెన్నో .. గురువుగారికి సంబంధించి నేను మర్చిపోలేని మంచి  జ్ఞాపకాలు.

> జూబ్లీహిల్స్‌లోని మణిశర్మ 'మహతి' రికార్డింగ్ థియేటర్లో, రికార్డింగ్‌తో ప్రారంభించిన నా తొలి చిత్రం "కల" కోసం నేను ఆహ్వానించగానే గురువుగారు ఎంతో సంతోషంగా వచ్చి, బయట కేవలం పూజదగ్గరే గంటసేపుకి పైగా నిల్చుని, తనే స్వయంగా అన్ని పూజా కార్యక్రమాలు దగ్గరుండి చూడటం, తర్వాత థియేటర్ లోపల రికార్డింగ్ ప్రారంభించడం, ట్యూన్‌లు, ట్రాక్‌లు అన్నీ చాలా ఓపిగ్గా వినడం .. నాకు బెస్ట్ విషెస్ చెప్పడం కూడా .. నేనెన్నటికీ మర్చిపోలేని మరో మధురసృతి.

సర్, మీరు లేరని నేననుకోవడంలేదు. అనుకోలేను.

థాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్ సర్ ..    

Saturday 27 May 2017

థాంక్ యూ!

విభిన్నమైన కొత్త సినిమాలు, వెబ్ సీరీస్, ఈవెంట్స్, వర్క్‌షాప్స్, బుక్ రిలీజ్ మొదలైన ఎన్నో ప్రాజెక్టులకు సంబంధించిన పనులు ఒకేసారి జరుగుతున్నాయి.

వీటిలో ప్రతి ఒక్కటీ వృత్తిపరంగా ఇప్పుడు నాకు చాలా ముఖ్యమైనది. దేన్నీ అంత ఈజీగా తీసుకోవడం లేదు. ఎన్నోరకాల వత్తిళ్ళు నన్ను చేజ్ చేస్తున్నప్పటికీ ఈ పనుల్ని అశ్రద్ధ చేయటంలేదు.

ఇవి ఒక్కొక్కటి ప్రారంభమౌతుంటే మిగిలిన చిన్న చిన్న వర్రీస్ అన్నీ అవే అదృశ్యమౌతాయి. ఊహించనంత వేగంగా.

ఆ ఫ్రీడం కోసమే ఈ శ్రమంతా.

నా ఈ జర్నీలో నాతోపాటు పయనిస్తున్న నా టీమ్‌కు అభినందనలు.

ఫీల్డులోని అన్‌సర్టేనిటీని, నన్ను అర్థం చేసుకొని, నాకు సహకరిస్తున్న నా మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ అభివందనాలు. 

Friday 26 May 2017

వాట్సాప్ లేకుండా 72 గంటలు!

నిమిషానికి 4 సార్లు 'టింగ్'మనే #WhatsApp కు గుడ్‌బై చెప్పాలని సరిగ్గా మూడురోజుల క్రితం అనుకున్నాను.

డన్!

ఆ రోజే ఆ పని పూర్తిచేసేశాను.

72 గంటలయింది.

భూమి బద్ధలవలేదు. సునామీ రాలేదు.

అసలివన్నీ ఎవరి కోసం?

జీవితంలో ఒక రేంజ్‌లో స్థిరపడి, సరదాగా టైమ్‌పాస్ చేసేంత టైమ్ ఉన్నవారికి. లేదంటే, జీవితం అంటే ఇంకా తెలియని ఎడాలిసెంట్ కాలేజ్ యువతకి, యువతకీ.

మనకంత సీనుందా?

నాకయితే లేదు.

వాట్సాప్‌లో మనం తప్పనిసరిగా అటెండ్ అవాల్సిన ముఖ్యమైన మెసేజ్‌లు రోజుకు రెండో మూడో ఉంటాయి. కానీ, తెల్లారి లేస్తే - గుడ్ మాణింగ్‌లు, రకరకాల గ్రీటింగ్స్, 'తిన్నారా పన్నారా' టైప్ ఇంక్వైరీలు, కొటేషన్స్‌, జోకులు, వీడియో క్లిప్స్ వగైరా రోజుకి కనీసం ఓ రెండొందలొస్తాయి.

ఈ రెండొందల మెసేజ్‌లలో ముఖ్యమైన ఆ రెండు మెసేజ్‌లే మనం మిస్ అయిపోతాం.

అవతల ఆ ముఖ్యమైనవాళ్లకి చెప్పినా నమ్మని రేంజ్‌లో మిస్అండర్‌స్టాండింగ్స్!

అంత అవసరమా?

వీటిని మించిన అతి ముఖ్యమైన, అత్యవసరమైన టైమ్‌బౌండ్ పనులు, బాధ్యతలు, కమిట్‌మెంట్లు మనకు చాలా ఉంటాయి. ఉన్నాయి.

ఫోకస్ అటు పెడదాం. 

Thursday 25 May 2017

"ఓవర్ నైట్ సక్సెస్" అనేది ఒక పచ్చి అబద్ధం!

"ఓవర్ నైట్ సక్సెస్" అనే మాట మనం తరచూ వింటుంటాం.

అంటే రాత్రికి రాత్రే సక్సెస్ సాధించటం అన్న మాట.

అసలు అలాంటిది లేదు.

ఆమధ్య నేను వెళ్లిన ఒక యువ దర్శకుడి ఆఫీస్ లో - పూరి జగన్నాథ్ ఫోటోతో పాటు కొటేషన్ ఒకటి గోడకి అతికించి ఉంది.

“It took 15 years to get overnight success!”  అని.

ఇదే కొటేషన్ను సుమారు పదేళ్ల క్రితం ఓ స్పిరిచువల్ మార్కెటింగ్ గురు Joe Vitale పుస్తకం లో చదివాను.

ఓవర్ నైట్ సక్సెస్ వెనక ఎన్నో కష్టాలు, ఎంతో కృషి ఉంటుంది. అది బయటి వారికి కనిపించదు. వారికి కనిపించేది రెండే రెండు విషయాలు.

సక్సెస్, ఫెయిల్యూర్. 

Wednesday 24 May 2017

మ్యూజిక్ మ్యాజిక్ .. వన్స్ మోర్!

"మా వాడు చదువుకోవట్లేదు. ఉద్యోగం చేయడు. బిజినెస్ చేయలేడు. ఏ పనీ చేతకాదు. ఎందుకూ పనికిరాడు. కొంచెం నీ దగ్గర డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పెట్టుకో!"

బయటివాళ్ల దృష్టిలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అంటే మరీ అంత పనికిరానిదన్నమాట!

ఈ జోక్ నేను స్వయంగా గురువుగారు, దర్శకరత్న దాసరి నారాయణరావు గారి నోట విన్నాను.

ఒక్క డైరెక్షన్ డిపార్ట్‌మెంటే కాదు. టోటల్‌గా సినీఫీల్డులో పనిచేసేవారంతా ఎందుకూ పనికిరానివాళ్లని ఇతర ఫీల్డులవాళ్ల అభిప్రాయం.

"చదువుకోవడం చేతకానివాళ్లంతా సినీఫీల్డంటారు!" అని కూడా అంటారు కొంతమంది.

సరే, ఎవరు ఎలా అనుకున్నా ఏం ఫరవాలేదు. "మ్యాటర్ ఎప్పుడూ ఫీల్డు కాదు. మన మైండ్‌సెట్" అనేది కామన్‌సెన్స్.

అయితే మన ప్యాషన్‌తో అవతలి వాళ్లను ఇబ్బంది పెట్టకూడదు అనేది మరో కామన్ సెన్స్. కానీ, అప్పుడప్పుడూ ఇది మిస్ అవుతుంది. ఫీల్డు అలాంటిది. టోటల్ అన్‌సర్టేనిటీ!


కట్ టూ 'మ్యూజిక్ మ్యాజిక్' -

"స్విమ్మింగ్‌పూల్" చిత్రం ద్వారా మ్యూజిక్ డైరెక్టర్‌గా నేను పరిచయం చేసిన ప్రదీప్‌చంద్ర కు మ్యూజిక్ ఒక ప్యాషన్, ప్రాణం కూడా.

ఎం ఏ క్లాసికల్ మ్యూజిక్, ఎం ఏ వెస్టర్న్ మ్యూజిక్ పూర్తిచేశాడు. తర్వాత .. చదవడం చేతకాదు అనుకునేవాళ్లను సంతృప్తిపర్చడం కోసం కంప్యూటర్ సైన్స్ లో ఎం టెక్ చేశాడు. ఎం ఎస్సీ సైకాలజీ కూడా చేశాడు.

నేను హెచ్ ఎం టి, జె ఎన్ వి, ఆలిండియా రేడియో వంటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసినట్టు, ప్రదీప్ కూడా డెల్ లాంటి కంపెనీల్లో పనిచేశాడు. వదిలేశాడు.

ఆ తర్వాతే, ఆ "మంద మెంటాలిటీ" దుకాణం మూసేసి, మళ్ళీ తనకెంతో ప్రియమైన మ్యూజిక్‌ని చేరుకున్నాడు. అక్కున చేర్చుకున్నాడు.  

స్విమ్మింగ్‌పూల్ ఒక రొమాంటిక్ హారర్ సినిమా.

ఈ చిత్రం కోసం ప్రదీప్ చేసిన పాటల్లో ఒక్క మెలొడీ చాలు. తన టాలెంట్ ఏంటో గుర్తించడానికి. చివరి రీల్, చివరి సీన్‌లో అతనిచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలు. అసలు అతనేంటో తెలుసుకోడానికి!

చాలామంది మా సినిమాకు బయటివాళ్లు, లోపలివాళ్లు కూడా చాలా విషయాల్లో చాలా కామెంట్స్ చేశారు. కానీ, ఆ సినిమా పరిమితులు దానికున్నాయి.

ఒక మామూలు సినిమా స్టోరీ సిట్టింగ్స్‌కు అయ్యే ఖర్చుతో ఆ సినిమా పూర్తిచేసి, రిలీజ్ చేశాం. క్వాలిటిదగ్గర ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా.

మా జేబుల్లోంచి కూడా డబ్బులు పెట్టుకొని, అప్పులు చేసి కూడా.  

ప్రదీప్‌లో ఉన్న ప్యాషన్‌ను చూసి - మ్యూజిక్ డైరెక్టర్‌గా అతని తొలి ఆడియో వేడుకను "లైవ్" చేశాను. ఒక రేంజ్‌లో ప్లాటినమ్ జుబ్లీ ఫంక్షన్ కూడా చేశాను.

ఇప్పుడింక ఇద్దరం కలిసి చాలా చెయ్యబోతున్నాం. చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఛాలెంజెస్ ఉన్నాయి. చిన్న స్టార్టప్ ఒక్కటే జరగాల్సి ఉంది. అదీ జరుగుతుంది.      

ప్రదీప్‌ టాలెంట్ విషయానికొస్తే - స్విమ్మింగ్‌పూల్ జస్ట్ ఒక చిన్న ప్రారంభం మాత్రమే. ప్రాక్టికల్ పాయింటాఫ్ వ్యూలో తను నేర్చుకోవాల్సింది, చేయాల్సింది, చేసి తీరాల్సిందీ చాలా ఉంది.

నాకు తెలుసు. ప్రదీప్ అనుకున్నది సాధిస్తాడు.

'బ్లాక్ లేడీ'ని అందుకోవడం అంత ఈజీ కాదు.

కానీ, ఆ రోజు కూడా వస్తుంది ...

Tuesday 23 May 2017

వాంటెడ్ "న్యూ స్క్రిప్ట్ రైటర్స్‌!"

కొత్త స్క్రిప్ట్ రైటర్స్‌కు వెంటనే అవకాశం!

ఇది ఉద్యోగ అవకాశం కాదు.

సినిమా ఇండస్ట్రీలోకి  మీరు ప్రవేశించడానికి అవకాశం.

అదీ, మీలో ఉన్న టాలెంట్‌నుబట్టి. మీలో ఉన్న ప్యాషన్‌ను బట్టి.


కట్ టూ పాయింట్ - 

టెక్నికల్‌గా ఒక సినిమా స్క్రిప్టును ఎలా రాస్తారో తెలిసిన కొత్త స్క్రిప్ట్ రైటర్స్ కోసం చూస్తున్నాను.

మామూలుగా కథలు రాయడం వేరు. సినిమా కోసం స్క్రిప్ట్ రాయడం వేరు.

ఈ ముఖ్యమైన తేడా తెలిసి ఉండటం చాలా ముఖ్యం. అంతే కాదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమా స్క్రిప్టుని (యాక్షన్ పార్ట్. డైలాగ్ పార్టులతో) ఏ ఫార్మాట్‌లో ఎలా రాస్తారో ఖచ్చితంగా తెలిసి ఉండాలి.

ఒకవేళ అంతర్జాతీయస్థాయిలో అందరూ ఫాలో అయ్యే "ఫైనల్ డ్రాఫ్ట్" సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి స్క్రిప్టుని రాయగల సామర్థ్యం ఉంటే మరీ మంచిది.

ఈ అవకాశం కేవలం కొత్త/యువ స్క్రిప్ట్ రచయితలకు మాత్రమే అన్న విషయం దయచేసి గమనించాలి. ఆల్రెడీ ఇండస్ట్రీలోకి ప్రవేశించినవారికోసం కాదు.

బాగా రాయగల సామర్థ్యం ఉండీ, అవకాశాలు రానివారికి ఇదొక మంచి అవకాశం. కనీసం ఒక నలుగురు రైటర్స్‌ను తీసుకొనే అవకాశం ఉంది.

మీదగ్గరున్న స్టోరీలైన్‌లు నాకు నచ్చితే వాటిని తీసుకుంటాను. లేదంటే - నేనిచ్చిన స్టోరీలైన్ మీద మీరు స్క్రిప్ట్ వర్క్ చేసి మీ వెర్షన్ రాయాల్సి ఉంటుంది.

ఏదయినా - అశ్లీలం లేని ట్రెండీ యూత్ ఎంటర్‌టైనర్ సబ్జక్టులకే ప్రాధాన్యం.

టైటిల్ కార్డు తప్పక ఇస్తాను.

పైన చెప్పిన విధంగా నిజంగా స్క్రిప్ట్ రాయగల సామర్థ్యం ఉండి, ఆసక్తి ఉన్న కొత్త/యువ స్క్రిప్ట్ రైటర్స్‌కి (Male/Female) మాత్రమే ఈ అవకాశం అని మరోసారి మనవి.

Aspiring NEW Script Writers can send their details and mobile number to my Facebook inbox immediately. 

Monday 22 May 2017

నెట్‌వర్క్ పెంచుకుందాం రా!

మనిషిని "సోషల్ యానిమల్" అన్నాడో తత్వవేత్త.

సంఘంలోని ఇతర వ్యక్తుల ప్రమేయం లేకుండా ఏ ఒక్కడూ ఉన్నత స్థాయికి ఎదగలేడు. కనీసం బ్రతకలేడు.

ఇది ఎవ్వరూ కాదనలేని నిజం.

మనం ఎంచుకున్న ఫీల్డులో ఉన్నత స్థితికి ఎదగడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంఘంలోని ఎంతోమంది సహకారం - లేదా - ప్రమేయం మనకు తప్పనిసరి.

ఈ వ్యక్తులే మన నెట్ వర్క్.

మన నెట్‌వర్క్ ని బట్టే మనం చేసే పనులు, వాటి ఫలితాలు ఉంటాయి. మన నెట్ వర్క్ లో సరయిన వ్యక్తులు లేకుండా ఫలితాలు మాత్రం సరయినవి కావాలంటే కుదరదు.

మనకు పనికి రాని నెగెటివ్ థింకర్స్, మనల్ని వాడుకుని వదిలేసే ముదుర్లు, మన సహాయంతోనే ఎదిగి, మనల్నే వేలెత్తి చూపే మోసగాళ్లు... ఇలాంటి జీవాలు ఏవయినా ఇప్పటికే మన నెట్‌వర్క్ లో ఉంటే మాత్రం వాటిని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది.

ఇలా చెప్పటం చాలా ఈజీ. కానీ, ఈ జీవుల్ని గుర్తించటానికి కొన్ని అనుభవాలు, కొంత టైమ్ తప్పక పడుతుంది. అయినా సరే, తప్పదు.

ఈ విషయంలో ఎలాంటి మొహమాటాలకు పోయినా జీవితాలే అతలాకుతలమైపోతాయంటే అతిశయోక్తికాదు.

అలాంటి అనుభవాలు ఒక్క సినీ ఫీల్డులోనే నేను ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చింది.

మహా కవి శ్రీ శ్రీ అన్నట్టు, "ఇంకానా ఇకపై చెల్లదు!"

ఇంక ఎలాంటి మొహమాటాల్లేవు.

ముఖ్యంగా, ఇప్పుడు నేను ప్రారంభించబోతున్న కొత్త సినిమాలు, వెబ్ సీరీస్, ఈవెంట్స్, వర్క్‌షాప్స్ మొదలైనవి వ్యక్తిగతంగా నాకెంతో ప్రతిష్టాత్మకమైనవి.

ఇంకో విధంగా చెప్పాలంటే ఒక పెద్ద ఛాలెంజ్. ఇంక ఇలాంటి సమయంలో కాంప్రమైజ్, మొహమాటం అనేవి ఎలా సాధ్యం?

వాటికి స్థానం లేదు. ఉండదు.


కట్ టూ మన నెట్‌వర్క్ - 

ఏ చిన్న పనిలోనయినా సరే, ఎంత చిన్న లక్ష్యమయినా సరే, ఎంతో పెద్ద గోల్ అయినా సరే - సక్సెస్ సాధించాలనుకొనే ప్రతి ఒక్కరూ - తమకు ఉపయోగపడే నెట్‌వర్క్ ను నిరంతరం పెంచుకుంటూ ఉండాలి.

ట్విట్టర్, ఫేస్‌బుక్ ఈ విషయం లో చాలా ఉపయోగపడతాయి.

ఇంకెన్నో ఉన్నా కూడా, ఈ రెండే బాగా పాపులర్ అని నా ఉద్దేశ్యం.

ఊరికే లైక్ లకు, కామెంట్లకు మాత్రమే సమయం వృధాచేయకుండా ఈ కోణంలో కూడా ఫేస్‌బుక్ ని ఉపయోగించటం అలవాటు చేసుకోవటం చాలా మంచి అలవాటు అవుతుంది.

ఈ వాస్తవాన్ని మనం ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది అని ప్రత్యేకంగా చెప్పటం అవసరమా?

Thursday 18 May 2017

అది అబద్ధమైనా సరే, ముందు నాకు నచ్చాలి!

నాకు నచ్చని విషయం, నేను ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ రాయలేని విషయం .. నేనస్సలు ఈ బ్లాగ్‌లో రాయలేను.

అది అబధ్ధమయినా సరే. ముందు నాకు నచ్చాలి. నేను ఇష్టపడాలి.

ఎట్‌లీస్ట్, ఆ క్షణం .. అది నాకు కిక్ ఇవ్వాలి.

ఆ రాతల కోసమే ఈ నగ్నచిత్రం బ్లాగ్.

పైన టైటిల్ ఎట్రాక్షన్ కోసమే ఆ వేరేవాళ్ల 'అబద్ధం' గురించి చెప్పాను తప్ప, అది మనవల్ల కాని పని. 'క్రాష్ కోర్స్' తీసుకున్నా పాస్ కావడం కష్టం.  

నో వే.

సో .. ఏ హిపోక్రసీ లేదు. ఏ ఇన్‌హిబిషన్స్ లేవు. నేను రాయాలనుకున్నది రాస్తాను. నచ్చినవాళ్లు చదువుతారు. నచ్చనివాళ్లు ఒకే ఒక్క క్లిక్‌తో ఇంకో బ్లాగ్‌లోకో సైట్ లోకో వెళ్లిపోతారు. అంతే.


కట్ టూ రైటర్స్ బ్లాక్ - 

ఇప్పుడు నేను వరుసగా చేయడానికి ప్లాన్‌చేసుకున్న రెండు తెలుగు సినిమాలు, ఒక ఇంగ్లిష్ సినిమా, ఒక వెబ్ సీరీస్, ఒక ఈవెంట్, ఒక వర్క్‌షాప్, ఒక బుక్ రిలీజ్ మొదలైనవాటి పనులు, ఇతర వ్యక్తిగతమయిన టైమ్‌బౌండ్ కమిట్‌మెంట్‌ల వత్తిడిలో అస్సలు సమయం లేక, సమయం మిగుల్చుకోలేక .. ఈమధ్య నేను నా బ్లాగ్‌ని దాదాపు పూర్తిగా మర్చిపోయాను.

'రైటర్స్ బ్లాక్' లాగా 'బ్లాగర్స్ బ్లాక్' అన్నమాట!  

ఎప్పుడో ఒకటీ అరా బ్లాగ్ పోస్ట్ తప్ప అసలేమీ రాయలేదీ మధ్య.

ఇది పెద్ద నేరం. నా దృష్టిలో.

రాయగలిగివుండీ, రకరకాల కారణాలను వెతుక్కొంటూ రాయకుండా ఉండటం, అలా ఉండగలగటం .. నిజంగా పెద్ద నేరం.

ఏదో రాసి ఎవర్నో ఉధ్ధరించాలన్నది కాదు ఇక్కడ విషయం. నన్ను నేను ఉధ్ధరించుకోవడంకోసం మాత్రం ఇది నాకు నిజంగా తప్పనిసరి.

రాయడం అనేది నాకు ఒక థెరపీ. ఒక యోగా. ఒక ఆనందం. ఒక కళ. ఒక గిఫ్ట్.

నిజానికి ఇదేమంత గొప్ప విషయం కాదు. అనుకుంటే ఎవరైనా రాయగలరు. కానీ, అందరూ అనుకోరు. అందరివల్లా కాదు.

ఇలాంటి గొప్ప అదృష్టాన్ని వినియోగించుకోకపోవడం నాకు సంబంధించినంతవరకు నిజంగా నేరమే.

ఈ నిజాన్ని నేను పదే పదే రిపీటెడ్‌గా రియలైజ్ అవుతుంటాను.

అదో పెద్ద జోక్ ..

Tuesday 16 May 2017

ఇక వెబ్ జమానా!

టివీ ఇప్పుడొక అవుట్ డేటెడ్ డబ్బా.

ఎవరో కొందరు మిడిల్ ఏజ్‌డ్ వాళ్లకు, వృధ్ధులకు .. వాళ్ల వాళ్లకిష్టమైన కొన్ని ప్రోగ్రాములు చూసుకోడానికి తప్ప, ఈ డబ్బాను ఎవరూ అసలు వాడ్డం లేదిప్పుడు.

వీళ్ళలో కూడా - మగవాళ్లు ఎక్కువగా పాలిటిక్స్, ఆడాళ్లు ఎక్కువగా కొన్ని సీరియల్స్ తప్ప మరేం చూడ్డంలేదు.

"జబర్దస్త్" లాంటి ఆడల్ట్ కంటెంట్‌ను, ఒకట్రెండు రియాలిటీ షోస్‌ను మాత్రం, వారూ వీరూ అని ఏం లేకుండా, ఒక ప్రత్యేక సెగ్మెంట్ బాగా ఎగబడి చూస్తోంది.

ఇవి పక్కనపెడితే, అసలు టీవీ చూడ్దానికి నిజంగా ఇప్పుడెవ్వరికీ టైమ్ లేదు!

ఆండ్రాయిడ్ మొబైల్ ఫోనొచ్చి, ఇప్పుడు అరచేతిలోనే అందరికీ 'అన్నీ' చూపిస్తోంది.


కట్ టూ వెబ్ -  

పిల్లలు, యూత్, పెద్దలు, వృధ్ధులు ..అనేం లేకుండా, అందరూ ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లకు ఎడిక్టయిపోయారు.

తిండీ,నిద్ర, కుటుంబం లేకపోయినా బ్రతగ్గలరు. కానీ, చేతిలో మొబైల్ లేకుండా బ్రతకడం ఇప్పుడు కష్టంగా ఉంది అందరికీ.

చేతిలో ఉన్న మొబైల్లోనే టీవీ, యూట్యూబ్, సినిమాలు, సైట్స్, ఎట్సెట్రా .. అన్నీ చూడొచ్చు.
ఈ నేపథ్యంలోనే పుట్టాయి వెబ్ షోలు, వెబ్ సీరీస్‌లు ఎట్సెట్రా.

ఇప్పుడివి మొబైల్స్‌లోే బాగా హల్‌చల్ చేస్తున్నాయి.

వీటికి మెయిన్ ప్లాటుఫామ్ అయిన యూ ట్యూబ్ లో కేవలం ఒకట్రెండు రోజుల్లోనే మిలియన్ల వ్యూస్! కొన్నిటికయితే గంటల్లోనే!!

ఇంకేం కావాలి .. వెబ్ ప్రోగ్రామ్ మేకర్స్‌కు, అప్‌లోడ్ చేసే చానెల్స్‌కూ షేరింగ్ బేసిస్‌లో బోల్డంత ఆదాయం!

ఇది జస్ట్ ప్రారంభమే. ఇంక చాలా ఉంది సినిమా .. వెబ్‌లో.

సినిమాలు సినిమాలే. వెబ్ వెబ్బే.

నా రెగ్యులర్ సినిమాలతోపాటు, అతి త్వరలో నేను కూడా ఒక వెబ్ షో, ఒకట్రెండు వెబ్ సీరీస్‌లు ప్లాన్ చేస్తున్నాను, పిచ్చి సీరియస్‌గా.

ప్రదీప్‌చంద్ర, నా 'కోంబో'లో మా వెబ్ జర్నీ అతి త్వరలో ప్రారంభం కాబోతోంది.

ఈ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను మేం కూడా బాగా ఎంజాయ్ చేయాలనుకొటున్నాం.  

ఈ విషయంలో మా హల్ చల్ వేరే .. మేం క్రియేట్ చేయాలనుకొంటున్న సెన్సేషన్ వేరే! 

Friday 12 May 2017

కొన్నిటికి కారణాలు వెతకడం వృధా!

"Religion is a man made thing" అన్న మాటను నేను బాగా నమ్ముతాను. దేవుడు అన్న కాన్‌సెప్ట్ అందులో భాగమే.

పై వాక్యాన్ని ఎంత బాగా నమ్ముతానో, అంత కంటే బాగా నేను నమ్మే నిజం ఇంకోటి కూడా ఉంది.

అది .. మనకు తెలియని ఏదో ఒక "శక్తి".

ఆ శక్తి లేకుండా మనమంతా లేము. మన చుట్టూ ఉన్న ఈ అద్భుతమైన ప్రకృతీ లేదు.

ఆ శక్తి రూపం మనకు తెలియదు. ఆ శక్తి ఉద్దేశ్యం ఏంటో కూడా మనకు తెలియదు.

ఎవరికి వారు ఏదో ఒక పేరు పెట్టుకొని ఆ శక్తిని నమ్మడంలో తప్పేమీ లేదు. ఇంకొకరిని ఇబ్బంది పెట్టనంతవరకూ నిజంగా అదొక మంచి డిసిప్లిన్.

నేను కన్వీనియెంట్‌గా ఫీలయ్యి, నాకు నచ్చిన ఒక పేరుతో, ఆ శక్తిని నేనూ నమ్ముతున్నాను. అది వేరే విషయం. దాని గురించి మరోసారి వివరంగా రాస్తాను.

ఇదంతా ఎలా ఉన్నా .. శతాబ్దాలుగా చాలా మంది మహామహులైన రచయితలు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, మేధావులమనుకున్నవారి విషయంలో నేను చదివి తెలుసుకొన్న, ఇటీవలికాలంలో వ్యక్తిగతంగా గమనించిన పచ్చి నిజం కూడా ఇంకోటుంది.

అసలు దేవుడు అన్న కాన్‌సెప్ట్‌నే నమ్మకుండా, జీవిత పర్యంతం విశృంఖలంగా గడిపిన ఎందరో చివరికి ఏదో ఒక ఆధ్యాత్మిక ఆశ్రమంలో చేరిపోయారు!

సో, మళ్లీ మనం కొత్తగా ఒక చక్రాన్ని కనిపెట్టాల్సిన అవసరం లేదు. అనుభవం మీద అన్నీ మనకే తెలుస్తాయి.

అందుకే ఈ విషయంలో అనవసరంగా లాజిక్కుల జోలికి పోవడం వృధా.

ఆ సమయాన్ని మరోవిధంగా సద్వినియోగం చేసుకోవడం బెటర్.


కట్ టూ "కాజ్ అండ్ ఎఫెక్ట్" - 

'జీవితం వైరుధ్యాలమయం' అంటారు.

ఇంత చిన్న బ్లాగ్‌లో పైన రాసిన పది వాక్యాల్లోనే ఎన్నో వైరుధ్యాలున్నాయి. అలాంటప్పుడు - మన జీవితంలోని ప్రతి దశలోనూ, ఆయా దశల్లోని మన ఎన్నో ఆలోచనల్లోనూ కొన్నయినా వైరుధ్యాలు తప్పక ఉంటాయి.

వాటిల్లో చాలావాటికి కారణాలుండవు. ఒకవేళ ఉన్నట్టు అనిపించినా, అవి బయటికి కనిపించేవే తప్ప అసలు కారణాలు కాకపోవచ్చు.

అలాంటి ఎన్నో వైరుధ్యాల మధ్య, గత కొన్నేళ్లుగా, నా జీవితం కూడా ఊహకందని కుదుపులతో నడుస్తోంది. లాజిక్కులకందని కల్లోలాలతో కొనసాగుతోంది.

వ్యక్తిగతం, వృత్తిగతం, ఆర్థికం, సాంఘికం, ఆధ్యాత్మికం .. అన్నీ.

ఎందరివల్లో ఎన్నో ఊహించని బాధలు పడ్డాను. కోలుకోలేని ఎదురుదెబ్బలు తిన్నాను. ఫలితంగా, నాకు అతిదగ్గరివాళ్లయిన కొందరు మిత్రులు, బంధువులు ఏదోవిధంగా, ఏదో ఒక స్థాయిలో బాధపడ్డానికి కూడా పరోక్షంగా నేను కారణం అయ్యాను.  

అయినా సరే - ఈ ప్రపంచం "కాజ్ అండ్ ఎఫెక్ట్" సూత్రం మీదే ఎక్కువగా నడుస్తుందని నేను ఇప్పటికీ నమ్ముతాను.

అయితే, ఎన్నోసార్లు నేను వేగంగా గోడకు విసిరికొట్టిన బంతి అంతే వేగంగా వెనక్కి తిరిగిరాలేదు. ఆశ్చర్యంగా ఆ గోడకి బొక్కచేస్తూ బంతి బయటికి వెళ్లిపోయింది!

దీన్ని ఏ లాజిక్ ఒప్పుకుంటుంది?

ఎవరు నమ్ముతారు?

కానీ గత కొన్నేళ్లుగా నా జీవితంలో జరుగుతున్న నిజం మాత్రం ఇదే.

బట్, ఈరోజు నుంచి సీన్ మారబోతోంది. "కాజ్ అండ్ ఎఫెక్ట్" సూత్రం మీద నాకున్న నమ్మకంతోనా, లేదంటే ఆ నమ్మకం నాలో ఏర్పడటానికి కూడా కారణమైన ఆ "శక్తి" తోనా?

నాకు తెలీదు.

సీన్ మాత్రం ఈరోజు నుంచే మారబోతోంది.

పూర్తిగా, పాజిటివ్‌గా ..    

Wednesday 3 May 2017

ఒక చిన్న సంకల్పం

మా 'స్విమ్మింగ్‌పూల్' సినిమా పోస్ట్ ప్రొడక్షన్  దశలో ఉన్నప్పటినుంచే 'ఇలా కాదు, ఇంకేదో చేయాల'ని చాలా చాలా అనుకున్నాము.

నేనూ, నేను ఇండస్ట్రీకి పరిచయం చేసిన మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్ర కలిసి ఇలా ఆలోచించడానికి అంకురార్పణ జరిగింది యూసుఫ్‌గూడలో ఉన్న ఒక చిన్న రికార్డింగ్ స్టూడియోలో ..

అదీ, స్విమ్మింగ్‌పూల్ ప్రమోషనల్ సాంగ్ రికార్డింగ్ బ్రేక్‌లో చాయ్ తాగుతూ ..

ఆ రికార్డింగ్ స్టూడియోలో, ఆ క్షణం, ఆ రోజు అలా అనుకున్నప్పటినుంచీ ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ఊహించని ట్విస్టులు.

చూస్తుండగానే బహుశా ఒక రెండేళ్లు గడిచింది.


కట్ టూ 18 ఏప్రిల్ 2017 -  

చివరికి మొన్నొకరోజు, కుక్కట్‌పల్లిలోని మంజీరా మాల్ లో కూర్చొని, కోక్ తాగుతూ, ఒక ఖచ్చితమైన నిర్ణయానికొచ్చాము, ఇద్దరమూ.

అది మొన్నటి ఏప్రిల్ 18.

ఇప్పుడింక ఏ ఆలోచనలు, ప్లాన్‌లు, ఎదురుచూడటాలు, చివర్లో ఊహించని ట్విస్టులూ .. ఇవేం లేవు. ఉండవు.

మాదగ్గర ఎలాంటి రిసోర్సెస్ లేవు. వ్యక్తిగతంగా ఇద్దరికీ నానా తలనొప్పులున్నాయి. అయినా సరే .. ముందుకే వెళ్లదల్చుకున్నాం. అలా డిసైడయిపోయాం.

నో వే.

అప్పుడెప్పుడో మేం అనుకొన్న ఆ చిన్న సంకల్పం ఇప్పుడు నిజం కాబోతోంది.

ఒక మహా యజ్ఞంగా ప్రారంభం కాబోతోంది.

మరికొద్దిరోజుల్లోనే ...