Tuesday, 21 November 2017

ఉపన్యాసాలతో కట్టిపడేయటం ఊరికేరాదు!

"అమ్మను కాపాడుకున్నట్లే తెలుగును కాపాడుకోవాలి. తెలుగులో విద్యార్థులకు సామాజిక అవగాహన, నైతిక విలువలు, పెద్దల పట్ల గౌరవం పెంచే పాఠ్యాంశాలను బోధించాలి."

"కేవలం మహాసభలు నిర్వహించడమే కాకుండా, తెలంగాణలో జరిగిన సాహిత్య సృజన ప్రస్ఫుటమయ్యే విధంగా, తెలంగాణ సాహితీ మూర్తుల ప్రతిభా పాటవాలను ప్రపంచానికి చాటి చెప్పేలా, తెలంగాణ భాషకు అద్భుతమైన భవిష్యత్ ఉందనే గట్టి సంకేతాలు పంపే విధంగా, అత్యంత జనరంజకంగా భాగ్యనగరం భాసిల్లేలా .. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ జరగాలి."

"తెలంగాణ ఉద్యమంలో అంతా కలిసి స్వరాష్ట్రం కోసం ఎట్లా పనిచేశారో, తెలుగు మహాసభలను విజయవంతం చేయడం కోసం కూడా అంతే పట్టుదలతో, సమన్వయంతో ముందుకుపోవాలి."

పైన ఉదాహరించిన మాటలను చెప్పింది: ముఖ్యమంత్రి కె సి ఆర్ గారు.

సందర్భం: త్వరలో తెలంగాణలో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై విస్తృతస్థాయి సమావేశం.


కట్ చేస్తే - 

నా చిన్నతనం నుంచి, ఇప్పటివరకు - పి వి నరసిం హారావు గారినుంచి, కిరణ్‌కుమార్ రెడ్డి దాకా - కనీసం ఒక 13 మంది ముఖ్యమంత్రులను చూశాను. వారు ఎలా మట్లాడతారో నేను గమనించాను. 

కేవలం ఒకరిద్దరు తప్ప - వారందరి మాట్లాడే శైలిలో - "అదేదైతే ఉందో", "ఇప్పుడు చూడండీ", "ఇకపోతే", "మీ అందరి కోసరం", "ప్రపంచపటంలో నేనే పెట్టాను" .. వంటి పనికిరాని ఊకదంపుడే ఎక్కువగా ఉంటుంది.

ఈ ఊకదంపుడు తక్కువగా ఉండి, మంచి భాషతో మాట్లాడగలిగిన ఆ ఒకరిద్దరు పాత ముఖ్యమంత్రులెవరో నేనిక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదనే భావిస్తున్నాను.


కట్ బ్యాక్ టూ కె సి ఆర్ -

ఈ బ్లాగ్ పోస్ట్ ప్రారంభంలో, పైన ఇచ్చిన ఆ మూడు పేరాల్లో - భాషలో గానీ, భావ వ్యక్తీకరణలోగానీ ఎక్కడైనా అర్థం కావడంలేదా? ఇంకేదైనా స్పష్టత కావాలనిపిస్తోందా?

అంత అవసరం లేదు. ఆ అవసరం రాదు.

అది .. ఉద్వేగపరిచే ఉద్యమ సభ కావచ్చు. చాణక్యం ప్రదర్శించాల్సిన పక్కా రాజకీయ సమావేశం కావచ్చు. అధికారులతో భేటీ కావచ్చు. ప్రెస్ మీట్ కావచ్చు.

కె సి ఆర్ ప్రత్యేకత అదే.

భాష, భావ వ్యక్తీకరణ.

అది కూడా .. అవసరమైన ప్రతిచోటా ఖచ్చితమైన గణాంకాలతో, ఉదాహరణలతో!

ఈ రెండూ అందరిలో ఉండవు. అందరికీ రావు.

ఈ ప్రత్యేకత కొందరిలోనే ఉంటుంది. ఆ కొందరికి చదివే అలవాటు తప్పక ఉంటుంది.

కె సి ఆర్ గారికి బాగా చదివే అలవాటుంది. ఆ చదివినదానిలో పనికొచ్చే మంచిని ఆచరణలో పెట్టే అలవాటు కూడా ఉంది. 

Wednesday, 15 November 2017

న్యూ-ఏజ్ ఫ్రీడమ్ లైఫ్‌స్టయిల్!

మార్కెట్‌లో ఉన్న అనేక ఆర్థిక ఒడిదొడుకులతో ఎలాటి సంబంధంలేకుండా .. తన పనినీ, తన లైఫ్‌నీ సంపూర్ణ స్వేఛ్ఛతో లీడ్ చేయగలుగుతున్నవాడే సిసలైన మగాడు.

ఇలాంటోన్ని అనొచ్చు ..
"ఆడు మాగాడ్రా బుజ్జీ" అని!

అలాగని చెప్పి, వాడు బాగా బ్లాక్‌మనీ ఉన్నవాడనికాదు నా ఉద్దేశ్యం.

ఫైనాన్షియల్ ఇంటలిజెన్స్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ మస్త్‌గా ఉన్నోడని!

ఫైనాన్షియల్‌గా ఇలాంటి స్థితప్రజ్ఞ దశకు చేరుకోవడం అంత సులభమైన విషయం కాదు. నూటికి 90% మందికి ఇది అస్సలు చేతకాదు. అందులో నేనూ ఒకన్ని అని చెప్పుకోడానికి నేనేం సిగ్గుపడటంలేదు.

కాకపోతే నా విషయంలో ఇది తాత్కాలికం.

మన జీవితంలో చెప్పాపెట్టకుండా సడెన్‌గా వచ్చే చిన్న చిన్న సునామీలకు ఏమాత్రం ఎఫెక్టు కాకుండా, ఈ స్థాయిలో బాగుపడటమే నా దృష్టిలో సిసలైన ఫైనాన్షియల్ ఫ్రీడమా్!

ఆ ఫ్రీడమ్ ఉంటే చాలు. ఏదైనా సాధ్యమే. ఎవరికైనా సాధ్యమే.

ఉన్న ఒక్క జీవితాన్ని హాయిగా, హాప్పీగా గడిపేయవచ్చు.

మరొకరిని ఇబ్బంది పెట్టకుండా, బాధపెట్టకుండా .. 

Monday, 13 November 2017

బి పాజిటివ్!

నిన్నంతా మా ప్రదీప్ అండ్ టీమ్‌తో కలిసి గంటలకొద్దీ చర్చలు.

ఢిల్లీలో ఉన్న నా ఆత్మీయమిత్రుడు, కెమెరామన్ వీరేంద్రలలిత్‌తో కూడా ఫోన్‌లో చర్చలు, ప్రతి ముఖ్యమైన పాయింట్ దగ్గర అతని అభిప్రాయం కూడా ఎప్పటికప్పుడు తీసుకోవడం .. 

చివరి గంట మాత్రం నేనూ, ప్రదీప్ ఇద్దరమే కలిసి ఒక మాల్ బయట మెట్లమీద కూర్చున్నాం.

వందలాదిమంది మా ముందునుంచే మాల్ లోపలికి వెళ్తూ వస్తున్నా, ఏదీ పట్టించుకోకుండా .. ఎంతో ఏకాంతంగా, ప్రశాంతంగా గడిపాం.

ఎన్నో కష్టాలున్నాయి. ఇబ్బందులున్నాయి. సాంకేతిక సమస్యలున్నాయి. చిన్న చిన్న అపోహలు, ఆలోచనా విభేదాలున్నాయి.

కానీ, పూర్తి పాజిటివిటీతో అందరినీ కలుపుకుపోవాల్సిన అవసరముంది.

మా అందరి ఆలోచనావిధానం కూడా అదే.

లైక్‌మైండెడ్‌నెస్.

అన్నిటినీ మించి .. ఆప్షన్స్ ఎన్ని ఉన్నా, ఫండ్స్ విషయం ఇంకా తేలలేదు. అవతలివైపు ఖచ్చితమైన నిర్ణయం ఇంకా జరగలేదు.

అయినాసరే ..

నిన్నంతా మా చర్చ "నమస్తే హైదరాబాద్" గురించే.

నిన్నంతా మా ఆలోచన మాకు అందుబాటులో ఉండే వనరుల్లో "నమస్తే హైదరాబాద్" ఎంత బాగా తీయాలన్నదే.

వేరే ఏ చిన్న నెగెటివ్ థింగ్ గురించి కూడా ఆలోచించే అవకాశం లేనంతగా. వేరే ఏ చిన్న కష్టం గురించి కూడా ఆలోచించి బాధపడే సమయం లేనంతగా.

కానీ .. చిన్నవో పెద్దవో, మాకున్న అన్ని ఇబ్బందులూ ఈ "నమస్తే హైద్రాబాద్" తో సంపూర్ణంగా దూరమైపోతాయన్నది మాత్రం మా గట్టి నమ్మకం.       

మోస్ట్ ప్రొడక్టివ్ డే. 

అంతా పాజిటివిటీ.

అదే క్రియేటివిటీ ..       

Monday, 6 November 2017

మీ 'క్రియేటివ్ డే' ఏ రోజు?

మరిసా గురించి ఆమధ్య చదివాను. ఒక బ్లాగ్ పోస్ట్ కూడా రాశాను.

అమెరికాలోని లాస్ ఏంజిలిస్‌కు చెందిన ఈ మరిసా గురించి ఇప్పుడు మరోసారి ఈ బ్లాగ్‌లో ఎందుకు రాస్తున్నానంటే .. అది నాకోసం.

మా ప్రదీప్ కోసం.

మాలాంటి మరికొందరు క్రియేటివ్ క్రీచర్స్ కోసం.

అసలు మేం ఏం చేస్తున్నామో ఒక్క క్షణం ఆగి, మావైపు మేం చూసుకోవడం కోసం. మాలోకి మేం చూసుకోవడం కోసం!


కట్ టూ మరిసా - 

మరిసా ఒక రచయిత్రి. ఆర్టిస్టు. టెక్స్‌టైల్ డిజైనర్. ఇంకా ఎన్నో కళల్లో ప్రవేశముంది.

మొత్తంగా, మరిసా.. ఒక క్రియేటివ్ వుమన్.

మొదట్లో మామూలుగా అందర్లాగే 9-5 ఉద్యోగం చేస్తుండేది మరిసా. ఇలా జాబ్ చేస్తున్న సమయంలో, తనలోని క్రియేటివిటీని ఏ విధంగానూ బయటకు తెచ్చుకొనే అవకాశం దొరికేదికాదు మరిసాకి.

ఈ రోటీన్ లైఫ్‌స్టైల్ ఇలాగే కొనసాగితే, తనలోని సృజనాత్మకత పూర్తిగా అదృశ్యమయిపోయే ప్రమాదముందన్న విషయాన్ని గ్రహించింది మరిసా.

9-5 జాబ్ ఓకే. బ్రతకాలి కాబట్టి.

కానీ, తనలోని క్రియేటివిటీ విషయమేంటి?

వన్ ఫైన్ మార్నింగ్ మరిసాకి ఓ ఆలోచన వచ్చింది.

దాదాపుగా వారం మధ్యలో వచ్చే గురువారాన్ని (థర్స్‌డే) సంపూర్ణంగా తనలోని క్రియేటివిటీ కోసమే కెటాయించాలని నిర్ణయం తీసుకొంది. ఆ నిర్ణయానికి అనుగుణంగా తన జాబ్‌లోని పనిదినాల్ని, మిగిలిన ఇంటివిషయాల్ని అడ్జస్ట్ చేసుకొంది.


కట్ టూ క్రియేటివ్ థర్స్‌డే -

గురువారం.

ఆ రోజు తను ఏ పని చేసినా అది తనలోని క్రియేటివిటీని ప్రదర్శించేది అయిఉండాలి.

అది ఆర్ట్ కావొచ్చు. రచన కావొచ్చు. టెక్స్‌టైల్ డిజైన్ కావొచ్చు. ఇంకేదయినా కావొచ్చు. వారంలో ఆ ఒక్కరోజు .. ఆ గురువారం మాత్రం పూర్తిగా క్రియేటివిటీనే!

మరిసా జీవితంలో ఆ నిర్ణయం ఒక అందమైన మలుపు ..

అలా తను తీసుకొన్న ఆ ఖచ్చితమైన నిర్ణయం తన జీవన శైలినే మార్చివేసింది.

క్రమంగా తన రొటీన్ 9-5 జాబ్‌ను కూడా వదిలేసింది.

ఇప్పుడంతా మరిసా ఇష్టం.

ప్రతిరోజూ "థర్స్‌డే"నే!

ఒక థర్స్‌డేతో ప్రారంభించిన తన క్రియేటివ్ జర్నీ ఇప్పుడు ఫుల్‌టైమ్ బిజినెస్ అయింది!

కావల్సినంత ఆదాయం. చెప్పలేనంత సంతృప్తి.

ఒక పుస్తకం కూడా రాసింది. 

ఇంకేం కావాలి?

ఇది చదువుతోంటే మీ మైండ్‌లో కూడా ఏవో కొత్త ఆలోచనలు వస్తూ ఉండాలి ఇప్పటికే.

కదూ? 

తన ఈ చిన్ని క్రియేటివ్ జర్నీని ఎప్పటికప్పుడు రికార్డ్ చేయడానికి ఓ వెబ్‌సైట్‌ని కూడా రూపొందించుకొంది మరిసా. ఆ వెబ్‌సైట్ పేరు ఏమయిఉంటుందో వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను.

క్రియేటివ్ థర్స్‌డే! 

Sunday, 5 November 2017

నమస్తే హైదరాబాద్!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, ఒకటి రెండు హిట్ సినిమాలను "తెలంగాణ సినిమాలు" గా ముద్రవేయడానికి చాలామంది ప్రయత్నించారు.

కొందరైతే ఏకంగా అవి తెలంగాణ సినిమాలే అని చెప్పారు.

కానీ అందులో ఏమాత్రం నిజం లేదు.

ఉదాహరణకు, శేఖర్ కమ్ముల "ఫిదా" తీసుకుందాం. అది తెలంగాణ సినిమా కాదు.

తెలంగాణలో తీసిన తెలుగు సినిమా.

అందులో హీరోయిన్ మాత్రం పక్కా తెలంగాణ యాస మాట్లాడుతుంది. ఈ ఒక్క పాయింట్ లేకపోతే ఫిదా సినిమా ఆ రేంజ్‌లో సక్సెస్ సాధించేది కాదు.

ఇక సందీప్‌రెడ్డి "అర్జున్ రెడ్డి" సినిమాను తెలంగాణ సినిమా అని అనడం కూడా కరెక్టు కాదు.

హీరో, డైరెక్టర్ తెలంగాణవాళ్లు. మేకింగ్ పరంగా, కథావస్తువు ట్రీట్‌మెంట్ పరంగా, ఈ మధ్యకాలంలో వచ్చిన తెలుగు సినిమాల్లో నిజంగా అదొక అద్భుతమైన ట్రెండ్‌సెట్టర్.

కానీ, అర్జున్ రెడ్డి కూడా తెలంగాణ సినిమా మాత్రం కాదు.


కట్ టూ "నమస్తే హైదరాబాద్!" - 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, మొట్టమొదటిసారిగా, ఒక తెలంగాణ దర్శకుడు, 100% పక్కా తెలంగాణ ఆత్మతో, తెలంగాణ జీవనశైలితో, తెలంగాణ యువతరం కథతో తీస్తున్న తొలి తెలంగాణ సినిమా - నమస్తే హైద్రాబాద్.

ఇది పొలిటికల్ సినిమా మాత్రం కాదు.

డిసెంబర్‌లో ఓపెనింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో, ఏ కోణంలో చూసినా, చాలా ప్రత్యేకతలున్నాయి. వాటన్నిటి గురించి మరోసారి చెప్తాను.

మళ్లీ మళ్ళీ చెప్తూనే ఉంటాను.

సినిమా ఓపెనింగ్ నుంచి, రిలీజ్ దాకా.

ఒక్కటి మాత్రం నిజం.

ఇప్పటివరకూ డైరెక్టర్‌గా నేను తీసిన రెండు, మూడు సినిమాలు జస్ట్ ఒక రొటీన్ తరహా సినిమాలు. ఆయా సమయాల్లో నాకు వచ్చిన అవకాశాలను, నాకున్న అత్యంత పరిమిత వనరుల్లో, నాకు పెట్టిన పరిమితుల్లో తీసిన చిత్రాలు.  

"నమస్తే హైదరాబాద్" సినిమా అలాంటిది కాదు.

జీరో బడ్జెట్‌తో ప్రారంభించి, ఒక రేంజ్ బడ్జెట్ వరకూ వెళ్ళి తీయబోతున్న సినిమా ఇది.

ఎన్ని ఇబ్బందులున్నా, ఏమైనా .. "నమస్తే హైదరాబాద్" మేకింగ్‌కు సంబంధించిన ప్రతి దశలో, ప్రతి క్షణం, నా టీమ్‌తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ .. క్రియేటివిటీ పరంగా ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా .. ఈ సినిమా చేస్తున్నాను.

ఈ సినిమా ద్వారా - ఫిలిం మేకింగ్‌కు సంబంధించిన అన్ని విషయాల్లోనూ, అన్ని యాంగిల్స్‌లోనూ, నా ప్రతి సృజనాత్మక ఆలోచనను, ప్రతి కోరికను .. ఈ ఒక్క సినిమా ద్వారానే నిజం చేసుకోబోతున్నాను.

ఏ ఒక్కటీ మిగిలిపోకుండా!

అవేమిటి, అలా ఎందుకు .. అన్న విషయాలమీద మరోసారి మాట్లాడుకుందాం. 

Wednesday, 1 November 2017

అసలు ఎందుకురా బై నీ కులం?

నాకు అత్యంత దగ్గరి మిత్రుల్లో చాలామంది కులం ఏంటో నాకు ఇప్పటికీ తెలియదు.

వారికి కూడా నా కులం ఏంటో బహుశా తెలిసి ఉండదు.

ఒకే ఒక్క మేధావి మిత్రునితో ఒక సుధీర్ఘ చర్చా సమయంలో తప్ప, ఆ అవసరం నిజంగా మా మధ్య ఎప్పుడూ రాలేదు. 

కులం ప్రాతిపదికన నేనెప్పుడూ ఏదీ చెయ్యలేదు. ఎవ్వరినుంచి ఏదీ ఆశించలేదు. ఆ ప్రాతిపదికన ఎవ్వరికీ దగ్గర కాలేదు.

కానీ ..

బహుశా ఒక సంవత్సరం క్రితం అనుకొంటాను. ఒక మిత్రుడు ఈ విషయంలో నన్ను బాగా కెలికి, బలవంతంగా ఎలాగోలా ఒప్పించి, ఒక 'కుల పార్టీ' కి నేను కదిలేలా చేశాడు.

ఆ మిత్రుడు మాత్రం కులం ప్రాతిపదికనే నాకు దగ్గరయ్యాడని తర్వాత గ్రహించాను. అది పూర్తిగా అతని వ్యక్తిగతం. తప్పో ఒప్పో నేను చెప్పలేను.

కట్ చేస్తే -
సదరు మిత్రుడు చాలా మంచి ఉద్దేశ్యంతోనే నా దగ్గరో ప్రపోజల్ పెట్టాడు.

ఇప్పుడు నేనున్న ఒక ప్రధాన ప్రొఫెషన్‌లో నాకు అత్యంత వేగంగా అవసరమైన ఒకానొక అతి చిన్న సపోర్ట్‌ను తాను కనెక్ట్ చేయగలనన్నాడు.

అది .. కులం ప్రాతిపదికన!

ఆ ఒక్క 'కులం' అనే పదానికి పెద్ద ప్రాముఖ్యం ఇవ్వకుండా, నా తక్షణ ప్రొఫెషనల్ అవసరార్థం ఓకే చెప్పాను.

ఎలాగూ రెసిప్రోకల్‌గా, నేనూ ఏదో ఒకటి వారి సపోర్ట్‌కు మించింది వారికి తప్పక చేస్తానన్నది నాకు తెలుసు. నా మిత్రునికి కూడా తెలుసు.

సో, నా మిత్రుడు ఇంక పూనుకున్నాడు.


కట్ టూ 'కులం కనెక్షన్' - 

ఒక ఫైన్ సాయంత్రం నన్ను ఆ 'కుల పార్టీ'కి తీసుకెళ్లాడు నా మిత్రుడు.

మందు మస్త్‌గా నడుస్తోంది.

అక్కడే నా కులానికే చెందిన ఒక ఉన్నత స్థాయి వ్యక్తిని పరిచయం చేశాడు.

నా అవసరం చెప్పాడు. ఆయనకు నేనేం చేయగలనో చెప్పాడు. ఆయన నాకు ఇవ్వాల్సిన సపోర్ట్ గురించి చెప్పాడు.

ఎక్కడో అంతరాంతరాల్లో ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఆ సంభాషణంతా ఎలాగో భరించాను. ఆ క్షణం ఆయన్నుంచి ఆ సపోర్ట్‌ను నేను నిజంగా ఆశించాను.

ఆయన ఇచ్చుకున్న బిల్డప్ అలాంటిది.

అప్పటి నా అవసరం అలాంటిది.

కట్ చేస్తే -
జస్ట్ నాలుగంటే నాలుగు రోజుల్లో పని పూర్తిచేస్తానని కనీసం నాలుగు సార్లు ప్రామిస్ చేసిన సదరు ఉన్నతస్థాయి వ్యక్తి దాదాపు సంవత్సరమయినా తన మాట నిలుపుకోలేకపోయాడు.

నో ఇష్యూస్.

ఫరవాలేదు.

అర్థం చేసుకోగలిగాను.

కట్ చేస్తే -
ఆతర్వాత కొన్ని నెలలకు, ఇలాగే కులం నేపథ్యంలో ఇంకో వ్యక్తి కూడా నాకు పరిచయమయ్యాడు.

చాలా మంచి కుర్రాడు. చాలా మంచి భవిష్యత్తుంది ఆ కుర్రాడికి. ఆ మంచి భవిష్యత్తుకోసం ఆ కుర్రాడికి కులం అవసరం అస్సలు లేదు. 

ఆ కుర్రాడి దగ్గర కూడా అనుకోకుండా ఒకసారి ఇలాంటి టాపిక్కే వచ్చింది.

కట్ చేస్తే -
ఆ కుర్రాడి ద్వారా ఇంకో 'కుల మిత్రుడు' పరిచయమయ్యాడు. అతను కూడా మామూలుగానే ప్రామిస్‌ల వర్షం కురిపించాడు.

విచిత్రమేంటంటే - ఈ రెండు కేసుల్లోనూ, ఏ ఒక్కరూ, వారి ప్రామిస్‌లను నిలబెట్టుకోలేకపోయారు.

అంతవరకు ఓకే.

కానీ ..

వారి మీద గౌరవంతో వివిధ సందర్భాల్లో నేను పంపిన ఎన్నో నా రొటీన్ విషెస్‌కు, నా మెసేజెస్‌కు రిప్లై ఇవ్వాలన్న మినిమమ్ కర్టెసీని కూడా వారు పాటించలేకపోయారు!

అత్యంత బాధ్యతారాహిత్యమైన వారి ప్రామిస్‌ల కారణంగా నేను నిజంగా లక్షలు నష్టపోయినా, నా పట్ల మినిమమ్ కర్టెసీ కూడా చూపించని ఈ కులం, కులబాంధవులు నిజంగా నాకవసరమా?   

Tuesday, 31 October 2017

కులం ఒక సామాజిక నిజం!

ఈదేశంలో కులం నేపథ్యంలోనే ప్రతీదీ నడుస్తోంది అన్న ఉద్దేశ్యంలో, నాకత్యంత ప్రియమైన విద్యార్థుల్లో ఒకడు, "Guy On The Saidewalk" నవలా రచయిత కూడా అయిన భరత్‌కృష్ణ ఈమాట ఒకసారి నాతో అన్నాడు. 

నిజంగా ఇది నిజమే. 

పరిచయాలు, స్నేహాలు, వ్యాపారాలు, లాబీలు, రౌడీయిజాలు, రాజకీయాలు .. అన్నిటికీ మన దేశంలో కులమే నేపథ్యం.

అలాగని, ప్రతిచోటా ఈ కులం కార్డు పనిచేస్తుందన్న గ్యారంటీ కూడా లేదు.

ఉదాహరణకు, బాగా ఉన్న ఒక కులంవాడు, ఏమీలేని తన కులంవాడిని అసలు పట్టించుకోడు!  

వాస్తవానికి ఈ ప్రపంచంలో ఉన్నవి, ఉండేవి, అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ..  రెండే రెండు కులాలు: 

ఉన్న కులం. లేని కులం.

అయితే డబ్బు! లేదంటే పవర్!!

ఈ రెంటిలో .. ఏదో ఒకటి 'ఉన్న కులం' ఒకటి. ఏదీ 'లేని కులం' ఒకటి.  

మళ్లీ ఈ రెండింటికీ కూడా విడదీయరాని అనుబంధం ఉంటుంది. అది వేరే విషయం.   

ఎవరు ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా, ఇదే నిజం.


కట్ టూ నా అనుభవం - 

నాకేమాత్రం ఇష్టం లేని ఈ కులం నేపథ్యంగా, నేను దారుణంగా నష్టపోయిన ఒకే ఒక్క ఎపిసోడ్ గురించి మరో బ్లాగ్ పోస్టులో రాస్తాను. 

బహుశా రేపే. 

Friday, 20 October 2017

టాలెంట్ ఒక్కటే కాదు .. ఇంక చాలా ఉంది!

హాలీవుడ్‌ను 'ల్యాండ్ ఆఫ్ డ్రీమ్‌స్' అంటారు.

అక్కడికి ఏటా కనీసం 100,000 మందికి తక్కువకాకుండా వస్తారు.

ఆర్టిస్టులూ టెక్నీషియన్లూ.

వాళ్లల్లో కేవలం 1 నుంచి 2 శాతం మందికి మాత్రమే ఏదో ఒక అవకాశం దొరుకుతుంది. మిగిలినవాళ్లంతా కనీసం ఒక సంవత్సరం నుంచి, కొన్ని దశాబ్దాలపాటు నానా కష్టాలు పడి వెనక్కివెళ్ళిపోతారు.

ఇలా వెళ్ళిపోయినవాళ్లంతా అదే హాలీవుడ్‌ను 'ల్యాండ్ ఆఫ్ బ్రోకెన్ డ్రీమ్‌స్' అని తిట్టుకోవడంలో ఆశ్చర్యంలేదు. 


కట్ టూ మన టాలీవుడ్ - 

పైనచెప్పిన లెక్కంతా ప్రపంచంలోని అన్ని సినిమా ఇండస్ట్రీలకు వర్తిస్తుంది.

మన బాలీవుడ్, టాలీవుడ్‌లు కూడా అందుకు మినహాయింపు కాదు.

సినిమా పుట్టినప్పటినుంచి ఇప్పటిదాకా అంతే.

ఇకముందు కూడా అంతే.

ఇక్కడ సక్సెస్ అనేది ఎప్పుడూ కేవలం 2 శాతం లోపే.

ప్రపంచంలోని ఏ సినీ ఇండస్ట్రీలోనయినా, ఏ పీరియడ్‌లోనయినా కేవలం వేళ్లమీద లెక్కించగలిగిన ఒక డజన్ మంది మాత్రమే సక్సెస్‌లో ఉంటారు.

ఆర్టిస్టులూ, టెక్నీషియన్లూ.

మిగిలినవాళ్లంతా ఏదోవిధంగా వెనుదిరగాల్సిందే.

ఈ వాస్తవాన్ని గ్రహించినవాళ్లు జాగ్రత్తపడతారు. భ్రమలో బతికేవాళ్లు మాత్రం అలాగే సినిమాకష్టాలుపడుతూ కొనసాగుతుంటారు. ఈలోగా జీవితం కొవ్వత్తిలా కరిగిపోతుంది.

ఇండస్ట్రీ మంచిదే. కానీ దాని సిస్టమ్ దానిది. ఆ సిస్టమ్‌లో ఇమడగలిగినవాడే ఇక్కడ పనికొస్తాడు.

ఇక్కడ టాలెంట్ ఒక్కటే కాదు పనిచేసేది. దాన్ని మించి పనిచేసేవి చాలా ఉంటాయి.

వాటిల్లో ముఖ్యమైనవి ఒక మూడున్నాయి:

లాబీయింగ్.

మనీ.

మానిప్యులేషన్స్.

పైన చెప్పిన మూడింటిలో కనీసం ఏ రెండింటిలోనయినా ఎక్స్‌పర్ట్ అయినవాడు మాత్రమే ఇక్కడ బతికి బట్టకడతాడు. సక్సెస్ సాధిస్తాడు.      

Tuesday, 17 October 2017

క్రియేటివిటీ అన్‌లిమిటెడ్!

సిల్వర్ స్క్రీన్‌కు నేను పరిచయం చేసిన మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్రతో కలిసి, నేను ప్రారంభించిన కొత్త వెంచరే ఈ 'మాప్రాక్స్ ఇంటర్నేషనల్'.

సినిమాలు సినిమాలే.

ఈ విషయంలో, ఆల్రెడీ 'నమస్తే హైదరాబాద్' ట్రాక్ మీద ఉంది.

నేను ఇంతకుముందు తీసిన సినిమాలతో పోలిస్తే ఇదొక పెద్ద సినిమా. ఈ సినిమా బడ్జెట్, షూటింగ్ డేస్ వగైరా అన్నీ ఎక్కువే. ఈ ప్రొడక్షన్ దాని దారిలో అది అలా నడుస్తూ ఉంటుంది.

మరోవైపు -

ఈవెంట్స్, ప్రమోషన్స్, మ్యూజిక్ వీడియోస్, ఇండిపెండెంట్ ఫిలింస్, ఫిలిం ఆడిషన్ ఈవెంట్స్, షార్ట్ ఫిలింస్, షార్ట్ ఫిలిం ప్రీమియర్స్, బుక్స్ .. ఇలా మరెన్నో క్రియేటివ్ యాక్టివిటీస్‌లో నేనూ, ప్రదీప్ మునిగితేలాలనుకొంటున్నాం.

ఒక క్రమపద్ధతిలో ఆయా సృజనాత్మకరంగాల్లో దేశాల సరిహద్దులు కూడా దాటేయాలనుకొంటున్నాం.

ఒక్క ముక్కలో చెప్పాలంటే - మాప్రాక్స్ ఇంటర్నేషనల్ అనేది - మా ఇద్దరి విషయంలో - హద్దులులేని ఒక సృజనాత్మక తృష్ణ. 

మేం కోరుకొంటున్న సృజనాత్మక స్వేఛ్చకు ఒక రాచబాట.    

Monday, 16 October 2017

బ్యాక్ టు బ్లాగ్!

'బ్యాక్ టు స్కూల్' లాగా, 'బ్యాక్ టు బ్లాగ్' అన్నమాట!

నేననుకొన్న నా కొత్త బ్లాగ్ ప్రారంభించడానికి ఇంకా  సమయం ఉంది.

బహుశా 'నమస్తే హైదరాబాద్' షూటింగ్ పూర్తయిన తర్వాతనుంచి ప్రారంభించవచ్చు.

సో, బ్యాక్ టు మై నగ్నచిత్రం.

ఎట్‌లీస్ట్ ఇంకొన్నాళ్ళు. 


కట్ టూ ది గ్యాప్  - 

సరిగ్గా నాలుగు నెలల ఈ గ్యాప్‌లో చాలా జరిగాయి.

కలలో కూడా ఊహించలేని స్థాయిలో పెద్ద షాకింగ్ జెర్క్ ఇచ్చిన ఒక ఆరోగ్య సమస్య. అదుపు తప్పిన ఆర్థిక సమస్యలు. ఇంటా బయటా, ఒక్క క్షణం గుర్తుతెచ్చుకోడానికి కూడా బాధించే ఎన్నో అనుభవాల గాయాలు. నమ్మించి మోసాలు. నమ్మకద్రోహాలు.

ఇలాంటి ఎంతో నెగెటివిటీ మధ్య అక్కడక్కడా, అప్పుడప్పుడూ, వేళ్లమీద లెక్కించగలిగిన ఏవో కొన్ని అద్భుత అనుభవాలు, జ్ఞాపకాలు. స్నేహ సుగంధాలు, సౌరభాలు.  

జీవితం ఒక ఆట ఆడుకుంది నాతో.

ఇప్పుడు నేను చూపించదల్చుకున్నాను జీవితానికి. అసలు ఆటంటే ఎలా ఉంటుందో.

సరిగా నాలుగు నెలల క్రితం, ఈ 'నగ్నచిత్రం'లో ఇదే నా చివరి బ్లాగ్ పోస్ట్ అంటూ గుడ్‌బై చెప్పాను. ఇప్పుడు మళ్ళీ తిరిగొచ్చాను. కొత్త బ్లాగ్ ప్రారంభించేదాకా ఎప్పట్లా నాకు తోచిన ఏదో ఒక నాన్సెన్స్ ఇక్కడ రాసి పోస్ట్ చేస్తుంటాను.

వ్యక్తిగతంగా నాకు సంబంధించినంతవరకూ - బ్లాగింగ్ అనేది ఒక హాబీ. ఒక మెడిటేషన్. ఒక థెరపీ.

అన్నిటినీ మించి, చాలాసార్లు, నాలోని అంతస్సంఘర్షణకు ఒక ఔట్‌లెట్.   

Saturday, 17 June 2017

యాక్షన్!

ఇంక మాటల్లేవ్!

కమిట్ అయిన ఒకే ఒక్క సినిమా: 'నమస్తే హైదరాబాద్.'

అంతే.

ఒక సినిమా, ఎనిమిది నెలలు.

ఇప్పటికి ఇదొక్కటే లక్ష్యం.

ప్రస్తుతం దీనికి సంబంధించి, వివిధదశల్లో ఉన్న ప్రిప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది మా టీమ్.

నమస్తే హైదరాబాద్, పూర్తిగా మన హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్న ఇన్‌స్పైరింగ్, ట్రెండీ, యూత్ సినిమా.

నాకు, నా టీమ్‌కు ఇదొక ప్రిస్టేజియస్ సినిమా.

ఇంతకుముందటి నా మైక్రోబడ్జెట్ సినిమాలతో పోలిస్తే ఇదొక భారీ సినిమా. కాంప్రమైజ్ కాకుండా, కొంచెం లీజర్‌గా తీయాలనుకుంటున్న సినిమా.

సినిమా కంటెంట్, కాన్వాస్‌ను బట్టి దీన్లో .. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల లోని ఆర్టిస్టులు మాత్రమే కాకుండా .. ముంబై, ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రాంతాలనుంచి కూడా ఆర్టిస్టులు ఉండే అవకాశముంది.

నమస్తే హైదరాబాద్ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బహుశా అక్టోబర్ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాను. షూటింగ్ నవంబర్ నుంచి అనుకుంటున్నాము.

కట్ టూ నగ్నచిత్రం - 

ఇంతకు ముందే చెప్పినట్టు, ఈ నగ్నచిత్రం బ్లాగ్‌లో ఇదే చివరి పోస్టు!

ఈ విషయం చెప్పడానికి కొంచెం బాధగా ఉన్నా, నిర్ణయం నిర్ణయమే. దీన్లో ఎలాంటి మార్పు లేదు. ఉండదు.

నేను చెప్పిన నా కొత్త 'డైలీ బ్లాగ్'ను త్వరలోనే ప్రారంభిస్తాను. కాకపోతే, ఎప్పుడు అన్నది డిసైడ్ చెయ్యాల్సింది మాత్రం వేరొకరు!

ప్యూర్‌లీ, అదొక పర్సనల్ స్పిరిచువల్ కనెక్షన్. ఒక సెమీ ఆటోబయోగ్రఫీ. ఒక సెలెక్టివ్ మెమొరీ.

త్వరలోనే నా ఈ కొత్త బ్లాగ్‌ను, 'నగ్నచిత్రం' బ్లాగ్‌కు కనెక్ట్ చేస్తాను. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో కూడా ఈ కొత్త బ్లాగ్ వివరాలు పోస్ట్ చేస్తాను.

కట్ బ్యాక్ టూ మై సోషల్ యాక్టివిటీ - 

ఇకనుంచీ నా ప్రొఫెషనల్ యాక్టివిటీ అంతా సోషల్ మీడియాలోని నా ఫేస్‌బుక్, ఫేస్‌బుక్ పేజి, 'నమస్తే హైదరాబాద్' ఫేస్‌బుక్ పేజి, ట్విట్టర్‌లలో .. నా వీలునుబట్టి, ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటాను.

వీటన్నిట్లో కూడా, నిజానికి ఇకనుంచీ నేను ఎక్కువగా ఉపయోగించేదీ, ఉపయోగించగలిగేదీ ఒక్క ట్విట్టర్‌ను మాత్రమే.

ఫేస్‌బుక్ మీద నా అయిష్టం రోజురోజుకూ పీక్స్ కు వెళ్తోంది. నమస్తే హైద్రాబాద్ సినిమా రిలీజ్ తర్వాత నేను ఫేస్‌బుక్‌ను పూర్తిగా వదిలేస్తున్నాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం. 

తర్వాత నా సోషల్ మీడియా ప్రజెన్స్‌కు ట్విట్టర్ ఒక్కటి చాలు అనుకుంటున్నాను.       

టచ్‌లో ఉందాం.

థాంక్ యూ ఆల్! 

Monday, 12 June 2017

"పగలే వెన్నెల" కాయించిన మన సినారె ఇక లేరు!

'నన్ను దోచుకొందువటే' అంటూ ఆరంభించి, 'పగలే వెన్నెల' కాయించి, 'అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం' అని చెప్పిన జ్ఞానపీఠం మన 'సినారె' ఇక లేరు.

ఈ ఉదయం, ఈ విషాద వార్త తెలియగానే నేను పెట్టిన చిన్న ట్వీట్ అది.


సోషల్ మీడియా సంప్రదాయం ప్రకారం, దీన్ని కూడా యధావిధిగా కొందరు మహానుభావులు 'కాపీ పేస్ట్' చేశారు. అది వేరే విషయం. 

అయితే .. మన డైనమిక్ మినిస్టర్ 'కె టి ఆర్' గారు నా ట్వీట్‌ను రీట్వీట్ చేయడం విశేషం.

కట్ చేస్తే - 

కవి, సినీ గేయరచయిత, విమర్శకుడు, విశ్వవిద్యాలయ అధ్యాపకుడు, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ఎన్ టి ఆర్ కు అత్యంత సన్నిహితుడు కూడా అయిన సినారె గారి గురించి .. ఆయన జీవితం, జీవనశైలి గురించి .. ఆయనే రాసిన 'కర్పూరవసంతరాయలు' లాంటి ఒక రసాత్మాక కావ్యమే రాయొచ్చు.
 

సినారే గారి కవిత్వం, ఇతర పుస్తకాలు కొన్ని,
 కనీసం ఒక డజన్ దేశవిదేశీ భాషల్లోకి ఆనువదించబడి ప్రచురితమయ్యాయి.
  

ఆయన చేతులమీదుగా, నాకు తెలిసి, ఎలాంటి అతిశయోక్తి లేకుండా, కొన్ని వేల పుస్తకాలు ఆవిష్కరింపబడ్డాయి. వాటిలో నావి కూడా రెండు పుస్తకాలుండటం నా అదృష్టం.
 

తెలుగు సాహితీలోకంలో తెలంగాణ నిలువెత్తు సంతకం మన సినారె గారికి ముకుళిత హస్తాలతో ఇదే నా నివాళి. 

Wednesday, 7 June 2017

చదువుకూ సంపాదనకూ సంబంధం లేదు!

చదువుకున్న ప్రతివాడికీ సంస్కారం ఉంటుందన్న గ్యారంటీ ఎవరైనా ఇవ్వగలరా?

ఇవ్వలేరు.

అలాగే, మన చదువులకూ మన సంపాదనకూ అస్సలు సంబంధం ఉండదు.

ఈ నిజాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఎందరో బిలియనేర్లు, మిలియనేర్లు నిరూపించారు.

ప్రపంచంలో 5వ అత్యంత రిచెస్ట్ పర్సన్, తెల్లారిలేస్తే ప్రపంచం మొత్తాన్ని తన ఫేస్‌బుక్ తప్ప మరోటి చూడకుండా ఎడిక్ట్ చేసిన మార్క్ జకెర్‌బర్గ్‌ను కాలేజ్‌లోంచి మధ్యలోనే బయటికి పంపించేశారు.

ప్రపంచంలోనే నంబర్ వన్ రిచెస్ట్ పర్సన్ బిల్ గేట్స్ కేస్ కూడా సేమ్ టూ సేమ్! కాలేజ్ లోంచి మధ్యలోనే గెంటేశారు.  

చైనాలో అందరికంటే రిచెస్ట్ పర్సన్ జాక్ మా హార్వార్డ్‌లో చదవాలనుకొని 10 సార్లు అప్లై చేసినా సీటివ్వలేదు. సీట్ సంగతి పక్కనపెడితే, ప్రతిచోటా, ఆయన అప్లై చేసిన 30 ఉద్యోగాల్లో ఆయనొక్కడికి తప్ప అందరికీ ఉద్యోగాలిచ్చారు!

ఇక్కడ ఇండియాలో, మన ధీరూభాయ్ అంబానీ జీవితం ఈ విషయంలో మనందరికీ తెలిసిన మరో పెద్ద ఉదాహరణ. దేశ రాజకీయాలను అవలీలగా మానిప్యులేట్ చేయగలిగే ఒక అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్నే సృష్టించాడతను!

కట్ టూ  స్పీల్‌బర్గ్ - 

సౌత్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో 'థియేటర్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ కోర్స్' కోసం ఎన్నిసార్లు అప్లై చేసినా మన స్టీవెన్ స్పీల్‌బర్గ్‌కు ఆ యూనివర్సిటీ సీటివ్వలేదు. విధిలేక, చివరకు, యూనివర్సల్ స్టూడియోలో 'జీతం లేని' ఇన్‌టర్న్‌గా ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్‌లో చేరాడు స్పీల్‌బర్గ్. తర్వాతంతా చరిత్రే!

సో, ఇక్కడ మ్యాటర్ చదువు, డిగ్రీలు, మెడల్స్ కావు.

మైండ్‌సెట్.

అదంత ఈజీ కాదు .. 

Sunday, 4 June 2017

త్వరలో నా కొత బ్లాగ్!

ఫేస్‌బుక్ లాగే బ్లాగింగ్ కూడా బోర్ కొట్టే స్థాయికి వచ్చేసింది. కానీ, మిగిలిన సోషల్ మీడియా లాగా బ్లాగింగ్ అనేది ఒక రొటీన్ టైమ్‌వేస్ట్ వ్యవహారం కాదు.

బ్లాగింగ్ ఈజ్ రైటింగ్.

ఒక డిసిప్లిన్. ఒక థెరపీ. ఒక మెడిటేషన్. ఒక ఆనందం.

నా జీవనశైలికి సంబంధించి ఇదొక పాజిటివ్ లైఫ్‌ఫోర్స్. ఒక ఆక్సిజన్.

పాయింట్‌కొస్తే -

కొద్ది రోజుల్లో నా కొత్త ప్రాజెక్టులు ఎనౌన్స్ చెయ్యబోతున్నాను. ఒకసారి వాటి గురించి ఎనౌన్స్ చేశానంటే, ఇక ఆ రోజునుంచే 'నగ్నచిత్రం' కు గుడ్‌బై!

ఈ బ్లాగ్ మాత్రం ఇలాగే ఆన్‌లైన్‌లో ఉంటుంది. దీన్లోని కొన్ని ఎన్నిక చేసిన పోస్టులతో తర్వాత ఒక బుక్ వేసి రిలీజ్ చేస్తాను. అది వేరే విషయం.

ఇప్పుడిక్కడ చర్చిస్తున్న అసలు విషయం .. నా కొత్త బ్లాగ్.

నా రెగ్యులర్ పనులు, రచనలు, సినిమాలు, ఈవెంట్స్, వర్క్‌షాప్స్, వ్యక్తిగతమైన టెన్షన్స్ .. ఇవన్నీ ఎలా ఉన్నా .. వీటితో ఎంత బిజీగా ఉన్నా .. ఒక్కటి మాత్రం తప్పదు.

నా కొత్త బ్లాగ్‌లో ప్రతిరోజూ ఒక పోస్ట్ నేను విధిగా రాసి, పోస్ట్ చెయ్యాలి.

ఎందుకంటే .. అది డెయిలీ బ్లాగ్!

ప్రతిరోజూ అందరూ ఎదురుచూసేలా ఉండే ఒక సీరియల్ లాంటిది.

కానీ, ఫిక్షన్ కాదు.

మరేంటన్నది త్వరలోనే మీకు తెలుస్తుంది. 

Saturday, 3 June 2017

గన్స్ అండ్ థైస్

మొన్న ఆర్టిస్ట్ చలపతిరావు గారి ఇష్యూ గురించి ఓ రెండ్రోజులు నానా హంగామా జరిగింది. చానెల్స్‌లో, బయట సోషల్ మీడియాలో కూడా.

వున్నట్టుండి రామ్‌గోపాల్‌వర్మ తన "గన్స్ అండ్ థైస్" వెబ్ సీరీస్ టీజర్ వదిలాడు.

ఆ టీజర్లో ఉన్న స్థాయిలో న్యూడిటీని మనవాళ్లు ఇంతవరకు ఏ భారతీయ సినిమా లేదా సీరియల్ టీజర్లో చూసి ఉండరు.

చానెల్స్‌కు, మేధావులకు, మహిళా సంఘాలకు కావల్సినంత పని దొరికింది అని చాలా మంది అనుకున్నారు.

బట్ .. అలాగేం జరగలేదు.

జరగదని కూడా నాకు తెలుసు.

అందరూ హాయిగా ఆ టీజర్ చూసేసి గమ్మునున్నారు. జాతీయ స్థాయిలో అన్ని టీవీ చానెళ్లు  వర్మ "గన్స్ అండ్ థైస్" గురించి ఆయనతో బోల్డన్ని ఇంటర్వ్యూలను చేశాయి. ఇంకా చేస్తున్నాయి.

విచిత్రంగా .. ఏ అన్నపూర్ణ సుంకరగానీ, అన్నా వెట్టిక్కాడ్ గానీ సీన్లోకి ఎంటర్ కాలేదు!

అదంతే.

అదొక 'అడల్ట్ కంటెంట్' ఉన్న అంతర్జాతీయ స్థాయి వెబ్ సీరీస్. ఎవ్వరూ ఏమనడానికి లేదు. ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడు అప్‌లోడ్ చేస్తాడా అని ఎదురుచూడ్డం తప్ప!

Friday, 2 June 2017

9 నిమిషాల్లో బ్లాగ్‌పోస్ట్ రాయడం ఎలా?

రెండు తెలుగు సినిమాలు, ఒక ఇంగ్లిష్ సినిమా, ఒక వెబ్ సీరీస్, ఒక ఈవెంట్, ఒక వర్క్‌షాప్, ఒక బుక్ రిలీజ్ మొదలైనవాటి పనులు, ఇతర వ్యక్తిగతమయిన వెరీ సీరియస్ 'టైమ్‌బౌండ్ కమిట్‌మెంట్‌'ల వత్తిడిలో ఇప్పుడు నాకు అస్సలు సమయం ఉండటం లేదు.

సమయం మిగుల్చుకోలేకపోతున్నాను.

ఇప్పుడిదంతా ఫేస్ బుక్కులూ, ట్విట్టర్ల యుగం.

లేటెస్ట్‌గా 'ఇన్స్‌టాగ్రామ్' మీద పడ్డారు.

షార్ట్ కట్ లో రెండు వాక్యాలు, లేదంటే జస్ట్ ఒక బొమ్మ!

అంతకు మించి పోస్ట్ చేసే సమయం ఎవరికీ లేదు. చదివే సమయం, ఓపికా నెట్ యూజర్లకు అసలే లేదు.

అందుకే - ఇకనించీ  ఈ బ్లాగ్ లోని పోస్టులన్నీ సాధ్యమయినంత చిన్నగా రాయాలని డిసైడయ్యాను. మరోవిధంగా చెప్పాలంటే - సినీ ఫీల్డు, క్రియేటివిటీ లకు సంబంధించి
ఈ బ్లాగ్‌లో నేను రాసే అవే నగ్న సత్యాలు ఇప్పుడు కొంచెం చిన్నగా వుంటాయి.

సో, నో వర్రీస్!

మీ సమయం విలువేంటో నాకు తెలుసు.

ఇకనుంచీ ఈ బ్లాగ్‌లో ఏది రాసినా పది నిమిషాల లోపే! ఇప్పుడు మీరు చదువుతున్నది కూడా ..


కట్ చేస్తే - 

ఇప్పటివరకు, ఈ బ్లాగ్ మొత్తంలో అతి పెద్ద బ్లాగ్‌పోస్టు .. నిన్న నేను గురువుగారు దాసరి నారాయణరావు గారి స్మృతిలో రాసిన పోస్టే కావడం విశేషం. 

Wednesday, 31 May 2017

వందనం .. అభివందనం!

నటునిగా వచ్చిన ఒక అతి చిన్న అవకాశం కోసం, చేస్తున్న చిన్న ఉద్యోగం కూడా వదులుకొని, 1960ల్లో చిత్రరంగంలోకి ప్రవేశించారు గురువు గారు దాసరి నారాయణరావు. 

తర్వాత ఊహలు, అంచనాలు తల్లకిందులై .. రచనారంగంలోకి, దర్శకత్వశాఖలోకి సహాయకుడిగా ప్రవేశించారు.

సుమారు 25 చిత్రాలకు "ఘోస్ట్"గా పనిచేశాకగానీ రచయితగా ఆయనకు రావాల్సిన గుర్తింపు రాలేదు.

ఇక, ఆ తర్వాతంతా చరిత్రే!

మొత్తం 151 చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం, 1000 కి పైగా పాటల రచన, 60 చిత్రాల్లో నటన. ప్రొడ్యూసర్‌గా 30 సినిమాలు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, ఉదయం డెయిలీ, శివరంజని సినీవీక్లీల పత్రికాధిపత్యం, ఎడిటర్, ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌లోనూ, ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లోనూ బాధ్యతాయుతమైన పోస్టులు, రాజకీయాలు, కేంద్ర మంత్రి, గిన్నిస్ రికార్డ్, అవార్డులు, రివార్డులు .. ఇంకా ఎన్నో, ఎన్నెన్నో.

నా "సినిమా స్క్రిప్టు రచనాశిల్పం" పుస్తకం ముగింపు పేజీలో ఒక 'సక్సెస్ స్టోరీ'గా గురువుగారి గురించి నేను రాసిన వాక్యాలివి.


కట్ టూ ది లెజెండరీ డైరెక్టర్ -  

గురువు గారి గురించి నేనొక పెద్ద పుస్తకమే రాయగలను. అలాంటిది, ఒక చిన్న బ్లాగ్‌పోస్ట్‌లో అసలేం రాయగలను?

అసాధ్యం.

కానీ, ఆయనకు సంబంధించి నాకు తెలిసిన కొన్ని గొప్ప విషయాల్ని, నేను మర్చిపోలేని కొన్ని జ్ఞాపకాల్ని, నా ఫీలింగ్స్‌నీ .. కేవలం బుల్లెట్ పాయింట్స్ రూపంలో, సాధ్యమైనంత క్లుప్తంగా రాసే ప్రయత్నం చేస్తున్నాను:

> ఒక సంవత్సరంలో 15 సినిమాలు డైరెక్ట్ చేసి రిలీజ్ చేయగలరా? 
అవును. చేయొచ్చు అని 1980 లోనే నిరూపించారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. అంటే నెలకి ఒక సినిమా కంటే ఎక్కువే! అలాగని ఏదో చుట్టచుట్టి అవతపడేసిన సినిమాలు కావవి. వాటిల్లో కనీసం 70% సినిమాలు హిట్లు, సూపర్ హిట్లు, సిల్వర్ జుబ్లీలు. స్వప్న, శ్రీవారి ముచ్చట్లు, సర్కస్ రాముడు, సర్దార్ పాపారాయుడు, సీతారాములు మొదలైనవి ఆ లిస్ట్ లోనివే!

> ఒకే రోజు 4 చోట్ల 4 సినిమాల షూటింగ్ జరుగుతుంటుంది. దర్శకుడు మాత్రం ఒక్కరే. దాసరి గారు! ఎక్కడికక్కడ షాట్స్ ఎలా తీయాలో తన అసిస్టెంట్స్‌కి చెబుతూ, 4 లొకేషన్లకు తిరుగుతూ తీసిన షాట్స్ చూసుకొంటూ అన్నీ మళ్లీ రివ్యూ చేసుకోవడం. అవసరమైతే కరెక్షన్స్ చేసుకోవడం. అద్భుతం ఏంటంటే, అలా తీసిన 4 సినిమాలూ హిట్ సినిమాలే కావడం!

> ఇలా తన పనిలో ఎక్కువభాగం చూసుకొన్న అప్పటి తన అసోసియేట్ డైరెక్టర్స్‌కు  గురువుగారు "కో-డైరెక్టర్" అన్న టైటిల్ కార్డ్ కొత్తగా క్రియేట్ చేసి మరీ ఇచ్చారు. అదీ తన అసిస్టెంట్స్‌కు దాసరిగారిచ్చిన గౌరవం. ఈ 'కో-డైరెక్టర్' కార్డ్ నేపథ్యం ఇప్పటి కోడైరెక్టర్లలో ఎంతమందికి తెలుసంటారు?

> ఇండస్ట్రీ చరిత్రలో మొట్టమొదటిసారిగా "డైరెక్తర్" పొజిషన్‌కు ఒక స్థాయి, ఒక విలువ, ఒక గౌరవం, ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ తీసుకొచ్చిన ఘనత గురువుగారిదే. అప్పట్లో ఆయన చెన్నై నుంచి ఫ్లైట్‌లో హైద్రాబాద్ వచ్చారంటే చాలు. ఇక్కడ బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో కనీసం ఒక 30 కార్లలో డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, అభిమానుల కాన్వాయ్ ఎప్పుడూ రెడీగా ఉండేదంటే విషయం అర్థం చేసుకోవచ్చు. దటీజ్ డైరెక్టర్ దాసరి!       

> ఒకవైపు తండ్రీకొడుకులు, మరోవైపు తళ్లీ కూతుళ్ళు. కూతురు తండ్రిని ప్రేమిస్తుంది. కొడుకు తల్లిని ప్రేమిస్తాడు. ఇంత అడ్వాన్స్‌డ్ సబ్జెక్టుతో 42 ఏళ్ల క్రితం, 1975 లోనే ఒక సినిమా తీసి సిల్వర్ జుబ్లీ చేశారు గురువుగారు. అదే 'తూర్పు పడమర'. అప్పట్లో బాలు గారు పాడిన .. ది వెరీ సెన్సేషనల్ సాంగ్ 'శివరంజనీ, నవరాగిణీ!'  ఆ సినిమాలోని పాటే.

> ఇక "శివరంజని" సినిమాలో సావిత్రి, షావుకారు జానకి, జయంతి, ఫటాఫట్ జయలక్ష్మి, ప్రభ వంటి హీరోయిన్స్ మధ్య జయసుధను స్టేజి మీద కూర్చోబెట్టి .. అలా కెమెరా ప్యాన్ చేస్తూ .. జయసుధ అభిమానిగా హీరో హరిప్రసాద్‌తో "అభినవ తారవో" అని పాటపాడించటం .. పాట వింటూ హరిప్రసాద్‌ను చూస్తున్న జయసుధ క్లోజ్ కట్స్ కొన్ని .. రియల్లీ .. హాట్సాఫ్ టూ దట్ వన్ ఓపెనింగ్ సీక్వెన్స్ ఆఫ్ ది సాంగ్! 

> 1979 లో బ్లాక్ అండ్ వైట్‌లో గురువుగారు తీసిన "నీడ" సినిమా ఒక సంచలనం. పర్వర్టెడ్ కుర్రాడిగా హీరో కృష్ణ కొడుకు రమేష్ అందులో హీరో. ఆ షూటింగ్ సమయంలో సెట్స్‌కు వచ్చిన మహేశ్‌బాబు వయస్సు నాలుగేళ్ళు! ఆ సినిమాలోనే, ఇంటర్వల్‌కు ముందు కొన్ని నిమిషాలపాటు, తన ఆర్టిస్టుల ఆడిషన్ కూడా చూపించారు గురువుగారు. ఆ ఆడిషన్ ద్వారా సెలెక్ట్ అయి పరిచయమైనవాడే ఇప్పటి ది గ్రేట్ ఆర్ నారాయణమూర్తి!

> 1980లో అక్కినేని జన్మదినం సెప్టెంబర్ 20 నాడు షూటింగ్ ప్రారంభించి, 5 నెలలు కూడా పూర్తవకముందే సినిమా పూర్తిచేసి, 1981 ఫిబ్రవరి 18  అక్కినేని పెళ్లిరోజున గురువుగారు రిలీజ్ చేసిన సంచలన చిత్రం "ప్రేమాభిషేకం". రిలీజైన ప్రతి సెంటర్‌లోనూ 100 రోజులు, 200 రోజులు, 250, 300, 365, చివరికి రికార్డ్ స్థాయిలో 75 వారాల 'డైమండ్ జుబ్లీ' కూడా ఆడిందీ చిత్రం. ఇదంతా పక్కనపెడితే, బెంగుళూరులోని 'మూవీల్యాండ్' థియేటర్లో ఇదే ప్రేమాభిషేకం ఏకంగా 90 వారాలు ఆడటం ఇప్పటికీ బీట్ చేయని రికార్డ్!

>  1982 లో గురువుగారు తీసిన ఒక క్లాసిక్ కళాఖండం "మేఘసందేశం". రమేష్‌నాయుడు అద్భుత సంగీతంలో 11 పాటల మ్యూజికల్! మొత్తం 151 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో, 57 నిమిషాల సౌండ్‌ట్రాక్! అదీ "మ్యూజికల్" అంటే!! ఇందులో కృష్ణశాస్త్రి కవిత్వం ఉంది. జయదేవుని అష్టపదులున్నాయి. పాలగుమ్మి పద్మరాజు పద్యాలున్నాయి. వేటూరి పాటలున్నాయి. ఆశ్చర్యంగా, ఈ సినిమాలో గురువుగారు ఒక్క పాట కూడా రాయలేదు! కారణం మనం ఊహించవచ్చు. ఆయన మొత్తం ఫోకస్ అంతా సినిమాను ఎంత క్లాసిక్ గా తీద్దామన్నదే.  

> నా ఉద్దేశ్యంలో జయసుధలోని సహజనటిని వెలికితీసింది దాసరిగారే. ఒక శివరంజని, ఒక మేఘసందేశం. జయసుధను మర్చిపోకుండా ఉండటానికి ఈ రెండు సినిమాలు చాలు.

> మేఘసందేశం సినిమాకు డి ఓ పి సెల్వరాజ్ అయినప్పటికీ, ఆపరేటివ్ కెమెరామన్‌గా దాదాపు ఆ సినిమాలో చాలా భాగం షూట్ చేసింది మాత్రం గురువుగారే అంటే ఎవరూ నమ్మరు. ఆ సినిమాలోని ప్రతి ఫ్రేమ్ మీద ఆయనకు అంత మమకారం! ఆ సినిమాకు 4 నేషనల్ అవార్డులు, 3 నంది అవార్డులు, 1 ఫిలిమ్‌ఫేర్ అవార్డ్ వచ్చాయంటే ఆశ్చర్యం లేదు.

> గురువుగారి సినిమాలకు "కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం" అన్న టైటిల్ కార్డు చూసి కొంతమంది "అంతా ఉట్టిదే. ఎవరెవరో ఘోస్టులు పని చేస్తే ఆయన టైటిల్ కార్డ్ వేసుకుంటారు" అని కొందరు అంటుంటారు. ఇలా అనే వాళ్లకు నిజం తెలియదని నా ఉద్దేశ్యం. కనీసం పాతిక చిత్రాలకు ఘోస్టుగా పనిచేసిన గురువుగారికి ఒక రైటర్, ఒక టెక్నీషియన్ విలువేంటో అందరికంటే బాగా తెలుసు. ఇది నేను నా వ్యక్తిగతమైన అనుభవంతో, ఆయనతో ఉన్న పరిచయంతో చెప్తున్న నిజం.

> గురువుగారి హాండ్‌రైటింగ్‌తో ఆయనే స్వయంగా రాసుకొన్న స్క్రిప్టులే కనీసం ఒక 500 ఉన్నాయంటే నమ్మగలరా? మామూలుగా అయితే నేనూ నమ్మలేను. కానీ, ఆ స్క్రిప్ట్ ఫైల్స్ అన్నింటినీ బంజారాహిల్స్‌లోని ఆయన ఆఫీస్‌లో రెండ్రోజులపాటు కూర్చొని, ఒక ఆర్డర్‌లో పెట్టి సర్దింది నేనే! ఇవి కాకుండా, ఆయన క్లుప్తంగా రాసుకొన్న స్టోరీలైన్స్, ట్రీట్‌మెంట్స్ కనీసం ఇంకో 500 ఈజీగా ఉంటాయి. ఇందులో 1% కూడా అతిశయోక్తిలేదు.

> కథా చర్చలప్పుడు పరుచూరి బ్రదర్స్, సత్యానంద్, కొమ్మనాపల్లి, ఎమ్మెస్ కోటారెడ్డి, రేలంగి నరసిం హారావు, దుర్గా నాగేశ్వరరావు వంటి ఉద్దండులంతా ఉండేవాళ్లు. కొందరితో వెర్షన్స్ కూడా రాయించుకొనేవాళ్లు. కానీ, చివరికి సెట్స్‌పైకి వచ్చాక సెకన్స్‌లో అప్పటికప్పుడు సీన్ కొత్తగా చెప్పేవారు. అది రికార్డ్ చేసుకొని, రాసుకొని వచ్చేలోపు అక్కడ షాట్ రెడీ! అదీ ఆయన స్టయిల్. కథాచర్చల్లో పాల్గొన్న ప్రతి రచయిత పేరు కూడా టైటిల్ కార్డ్స్‌లో ఉండేది. ఆయనలోనే ఓ గొప్ప క్రియేటివ్ రైటర్ ఉన్నప్పుడు, ఇంక ఘోస్ట్‌ల అవసరం ఏముంది?

> పాటలు కూడా అంతే. అలా ట్యూన్ వింటూ, ఇలా లిరిక్స్ చెప్తుంటారు! అసిస్టెంట్స్ రికార్డ్ చేస్తుంటారు. ఎవరో రాసిన పాటను తన పాటగా వేసుకోవల్సిన అవసరం ఆ స్థాయి దర్శకునికి అవసరమా?

> ఒకరోజు .. తెల్లారితే పాట షూటింగ్ ఉంది. పాట ఇంకా రికార్డ్ అవలేదు. ఆఫీస్‌లోనే రాత్రి 11 అయింది. నన్ను తనతో ఇంటికి రమ్మన్నారు గురువుగారు. కొత్త సొనాటా కార్లో ముందు డ్రయివర్ పక్కన ఆయన కూర్చుంటే, వెనక ఇద్దరు గన్‌మెన్స్ మధ్య టెన్షన్‌తో నేను కూర్చున్నాను.

> ఇంటికెళ్లాక ఆ రాత్రి మేడమ్ పద్మ గారితో చెప్పి నాకు భోజనం పెట్టించారు. అయ్యప్ప దీక్షలో ఉన్న తను స్నానం చేసి, అయ్యప్ప పూజ చేశారు. వచ్చి టేబుల్ దగ్గర కూర్చొని ట్యూన్ వినిపించమన్నారు. ఆ ట్యూన్ వింటూ ఒక పావుగంటలో పాట చెప్పారు. రికార్డ్ చేసి నేను రాసిచ్చాను. అప్పటికప్పుడు ఫోన్ చేసి, నన్ను వందేమాతరం శ్రీనివాస్ స్టూడియోకు పంపారు. అక్కడ శ్రీలేఖతో సహా అందరూ వెయిటింగ్. మరో గంటలో పాట రికార్డింగ్ అయిపోయింది. గురువుగారికి చెప్పాను. మర్నాడు ఉదయం పాట షూటింగ్ అనుకున్న టైమ్‌కు  ప్రారంభమయింది!

> నిజంగా ఘోస్ట్‌లను పెట్టుకొనేవారే అయితే ఆరోజు రాత్రి ఒంటిగంటవరకు ఒక పాట కోసం అంత కష్టపడాల్సిన అవసరం గురువుగారికుందా?

> దాదాపు 50 ఏళ్ల తన సినీజీవితంలో వందలాదిమంది కొత్త ఆర్టిస్టులను, టెక్నీషియన్లను పరిచయం చేసి, వారిని ఇండస్ట్రీలో నిలబెట్టిన క్రెడిట్ ఒక్క గురువుగారికే ఉంది. మోహన్‌బాబు, మురళీమోహన్ హీరోలుగా పాపులర్ అయ్యారంటే ప్రారంభంలో అంతా గురువుగారి ఆశీర్వాదమే. ప్రోత్సాహమే.

 > మరోవైపు .. ఎందరో కొత్త ఆర్టిస్టులతోపాటు .. ఎన్ టి ఆర్, ఏ ఎన్ ఆర్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణం రాజు, జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి స్టార్స్‌కు కూడా అప్పట్లో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన క్రెడిట్ కూడా గురువుగారికే ఉంది.  

> 1972లో, తన తొలి చిత్రం "తాతా మనవడు" లో కమెడియన్ రాజబాబుని హీరోగా, విజయనిర్మల గారిని హీరోయిన్‌గా పెట్టి, ఎస్వీ రంగారావు ప్రధానపాత్రలో 25 వారాల సూపర్ డూపర్ హిట్ ఇవ్వడం ఒక్కటి చాలు దర్శకుడిగా ఆయనేంటో తెల్సుకోడానికి.

> "అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం .. ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం" అని సినారె గారితో పాట రాయించి, అదే తన తొలిచిత్రంలో పెట్టడం ఒక్క గురువుగారికి మాత్రమే చెల్లింది. అప్పటికే తన సినీజీవితం, జీవితం .. గురువుగారికి చాలానే నేర్పించి ఉంటాయని నేననుకొంటున్నాను.
 

కట్ టూ గురువుగారితో నేను - 

> ఇలాంటి 'లెజెండ్' దగ్గర ఒకే ఒక్క సినిమాకు నేను అబ్జర్వర్/అసిస్టెంట్ డైరెక్తర్‌గా పనిచేయగలగడం నా అదృష్టం. ఆ 4 నెలల సమయంలో ఆయన నాపట్ల చూపిన ప్రేమ, అభిమానం నేను ఎన్నటికీ మర్చిపోలేను.

> ఆయన చెప్పిన జోకులు, తెలుగులో ఒక్క అక్షరం స్పెల్లింగ్ కావాలని తప్పుగా రాసినా ఆయన పట్టుకొనే విధానం, తాజ్ బంజారాలో కథా చర్చలు, మధ్యలో ఒక కథకు అమితాబ్ బచ్చన్ గారిని ఒక క్యారెక్టర్‌ కోసం అనుకొని, అప్పటికప్పుడు ఆయనకు కాల్ చేయడం, టైమ్ కాని టైముల్లో, ఆయన సొనాటా కారులో వెనక ఇద్దరు గన్‌మెన్స్ మధ్య టెన్షన్‌తో కూర్చుని ఆయనతోపాటు నేను తిరిగిన ట్రిప్పులు, ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్‌కు ఆయనిచ్చే గౌరవం, అవసరమయినప్పుడు చూపించే ఆ క్షణపు కోపం .. ఇంకా ఎన్నో, ఎన్నెన్నో .. గురువుగారికి సంబంధించి నేను మర్చిపోలేని మంచి  జ్ఞాపకాలు.

> జూబ్లీహిల్స్‌లోని మణిశర్మ 'మహతి' రికార్డింగ్ థియేటర్లో, రికార్డింగ్‌తో ప్రారంభించిన నా తొలి చిత్రం "కల" కోసం నేను ఆహ్వానించగానే గురువుగారు ఎంతో సంతోషంగా వచ్చి, బయట కేవలం పూజదగ్గరే గంటసేపుకి పైగా నిల్చుని, తనే స్వయంగా అన్ని పూజా కార్యక్రమాలు దగ్గరుండి చూడటం, తర్వాత థియేటర్ లోపల రికార్డింగ్ ప్రారంభించడం, ట్యూన్‌లు, ట్రాక్‌లు అన్నీ చాలా ఓపిగ్గా వినడం .. నాకు బెస్ట్ విషెస్ చెప్పడం కూడా .. నేనెన్నటికీ మర్చిపోలేని మరో మధురసృతి.

సర్, మీరు లేరని నేననుకోవడంలేదు. అనుకోలేను.

థాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్ సర్ ..    

Saturday, 27 May 2017

థాంక్ యూ!

విభిన్నమైన కొత్త సినిమాలు, వెబ్ సీరీస్, ఈవెంట్స్, వర్క్‌షాప్స్, బుక్ రిలీజ్ మొదలైన ఎన్నో ప్రాజెక్టులకు సంబంధించిన పనులు ఒకేసారి జరుగుతున్నాయి.

వీటిలో ప్రతి ఒక్కటీ వృత్తిపరంగా ఇప్పుడు నాకు చాలా ముఖ్యమైనది. దేన్నీ అంత ఈజీగా తీసుకోవడం లేదు. ఎన్నోరకాల వత్తిళ్ళు నన్ను చేజ్ చేస్తున్నప్పటికీ ఈ పనుల్ని అశ్రద్ధ చేయటంలేదు.

ఇవి ఒక్కొక్కటి ప్రారంభమౌతుంటే మిగిలిన చిన్న చిన్న వర్రీస్ అన్నీ అవే అదృశ్యమౌతాయి. ఊహించనంత వేగంగా.

ఆ ఫ్రీడం కోసమే ఈ శ్రమంతా.

నా ఈ జర్నీలో నాతోపాటు పయనిస్తున్న నా టీమ్‌కు అభినందనలు.

ఫీల్డులోని అన్‌సర్టేనిటీని, నన్ను అర్థం చేసుకొని, నాకు సహకరిస్తున్న నా మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ అభివందనాలు. 

Friday, 26 May 2017

వాట్సాప్ లేకుండా 72 గంటలు!

నిమిషానికి 4 సార్లు 'టింగ్'మనే #WhatsApp కు గుడ్‌బై చెప్పాలని సరిగ్గా మూడురోజుల క్రితం అనుకున్నాను.

డన్!

ఆ రోజే ఆ పని పూర్తిచేసేశాను.

72 గంటలయింది.

భూమి బద్ధలవలేదు. సునామీ రాలేదు.

అసలివన్నీ ఎవరి కోసం?

జీవితంలో ఒక రేంజ్‌లో స్థిరపడి, సరదాగా టైమ్‌పాస్ చేసేంత టైమ్ ఉన్నవారికి. లేదంటే, జీవితం అంటే ఇంకా తెలియని ఎడాలిసెంట్ కాలేజ్ యువతకి, యువతకీ.

మనకంత సీనుందా?

నాకయితే లేదు.

వాట్సాప్‌లో మనం తప్పనిసరిగా అటెండ్ అవాల్సిన ముఖ్యమైన మెసేజ్‌లు రోజుకు రెండో మూడో ఉంటాయి. కానీ, తెల్లారి లేస్తే - గుడ్ మాణింగ్‌లు, రకరకాల గ్రీటింగ్స్, 'తిన్నారా పన్నారా' టైప్ ఇంక్వైరీలు, కొటేషన్స్‌, జోకులు, వీడియో క్లిప్స్ వగైరా రోజుకి కనీసం ఓ రెండొందలొస్తాయి.

ఈ రెండొందల మెసేజ్‌లలో ముఖ్యమైన ఆ రెండు మెసేజ్‌లే మనం మిస్ అయిపోతాం.

అవతల ఆ ముఖ్యమైనవాళ్లకి చెప్పినా నమ్మని రేంజ్‌లో మిస్అండర్‌స్టాండింగ్స్!

అంత అవసరమా?

వీటిని మించిన అతి ముఖ్యమైన, అత్యవసరమైన టైమ్‌బౌండ్ పనులు, బాధ్యతలు, కమిట్‌మెంట్లు మనకు చాలా ఉంటాయి. ఉన్నాయి.

ఫోకస్ అటు పెడదాం. 

Thursday, 25 May 2017

"ఓవర్ నైట్ సక్సెస్" అనేది ఒక పచ్చి అబద్ధం!

"ఓవర్ నైట్ సక్సెస్" అనే మాట మనం తరచూ వింటుంటాం.

అంటే రాత్రికి రాత్రే సక్సెస్ సాధించటం అన్న మాట.

అసలు అలాంటిది లేదు.

ఆమధ్య నేను వెళ్లిన ఒక యువ దర్శకుడి ఆఫీస్ లో - పూరి జగన్నాథ్ ఫోటోతో పాటు కొటేషన్ ఒకటి గోడకి అతికించి ఉంది.

“It took 15 years to get overnight success!”  అని.

ఇదే కొటేషన్ను సుమారు పదేళ్ల క్రితం ఓ స్పిరిచువల్ మార్కెటింగ్ గురు Joe Vitale పుస్తకం లో చదివాను.

ఓవర్ నైట్ సక్సెస్ వెనక ఎన్నో కష్టాలు, ఎంతో కృషి ఉంటుంది. అది బయటి వారికి కనిపించదు. వారికి కనిపించేది రెండే రెండు విషయాలు.

సక్సెస్, ఫెయిల్యూర్. 

Wednesday, 24 May 2017

మ్యూజిక్ మ్యాజిక్ .. వన్స్ మోర్!

"మా వాడు చదువుకోవట్లేదు. ఉద్యోగం చేయడు. బిజినెస్ చేయలేడు. ఏ పనీ చేతకాదు. ఎందుకూ పనికిరాడు. కొంచెం నీ దగ్గర డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పెట్టుకో!"

బయటివాళ్ల దృష్టిలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అంటే మరీ అంత పనికిరానిదన్నమాట!

ఈ జోక్ నేను స్వయంగా గురువుగారు, దర్శకరత్న దాసరి నారాయణరావు గారి నోట విన్నాను.

ఒక్క డైరెక్షన్ డిపార్ట్‌మెంటే కాదు. టోటల్‌గా సినీఫీల్డులో పనిచేసేవారంతా ఎందుకూ పనికిరానివాళ్లని ఇతర ఫీల్డులవాళ్ల అభిప్రాయం.

"చదువుకోవడం చేతకానివాళ్లంతా సినీఫీల్డంటారు!" అని కూడా అంటారు కొంతమంది.

సరే, ఎవరు ఎలా అనుకున్నా ఏం ఫరవాలేదు. "మ్యాటర్ ఎప్పుడూ ఫీల్డు కాదు. మన మైండ్‌సెట్" అనేది కామన్‌సెన్స్.

అయితే మన ప్యాషన్‌తో అవతలి వాళ్లను ఇబ్బంది పెట్టకూడదు అనేది మరో కామన్ సెన్స్. కానీ, అప్పుడప్పుడూ ఇది మిస్ అవుతుంది. ఫీల్డు అలాంటిది. టోటల్ అన్‌సర్టేనిటీ!


కట్ టూ 'మ్యూజిక్ మ్యాజిక్' -

"స్విమ్మింగ్‌పూల్" చిత్రం ద్వారా మ్యూజిక్ డైరెక్టర్‌గా నేను పరిచయం చేసిన ప్రదీప్‌చంద్ర కు మ్యూజిక్ ఒక ప్యాషన్, ప్రాణం కూడా.

ఎం ఏ క్లాసికల్ మ్యూజిక్, ఎం ఏ వెస్టర్న్ మ్యూజిక్ పూర్తిచేశాడు. తర్వాత .. చదవడం చేతకాదు అనుకునేవాళ్లను సంతృప్తిపర్చడం కోసం కంప్యూటర్ సైన్స్ లో ఎం టెక్ చేశాడు. ఎం ఎస్సీ సైకాలజీ కూడా చేశాడు.

నేను హెచ్ ఎం టి, జె ఎన్ వి, ఆలిండియా రేడియో వంటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసినట్టు, ప్రదీప్ కూడా డెల్ లాంటి కంపెనీల్లో పనిచేశాడు. వదిలేశాడు.

ఆ తర్వాతే, ఆ "మంద మెంటాలిటీ" దుకాణం మూసేసి, మళ్ళీ తనకెంతో ప్రియమైన మ్యూజిక్‌ని చేరుకున్నాడు. అక్కున చేర్చుకున్నాడు.  

స్విమ్మింగ్‌పూల్ ఒక రొమాంటిక్ హారర్ సినిమా.

ఈ చిత్రం కోసం ప్రదీప్ చేసిన పాటల్లో ఒక్క మెలొడీ చాలు. తన టాలెంట్ ఏంటో గుర్తించడానికి. చివరి రీల్, చివరి సీన్‌లో అతనిచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలు. అసలు అతనేంటో తెలుసుకోడానికి!

చాలామంది మా సినిమాకు బయటివాళ్లు, లోపలివాళ్లు కూడా చాలా విషయాల్లో చాలా కామెంట్స్ చేశారు. కానీ, ఆ సినిమా పరిమితులు దానికున్నాయి.

ఒక మామూలు సినిమా స్టోరీ సిట్టింగ్స్‌కు అయ్యే ఖర్చుతో ఆ సినిమా పూర్తిచేసి, రిలీజ్ చేశాం. క్వాలిటిదగ్గర ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా.

మా జేబుల్లోంచి కూడా డబ్బులు పెట్టుకొని, అప్పులు చేసి కూడా.  

ప్రదీప్‌లో ఉన్న ప్యాషన్‌ను చూసి - మ్యూజిక్ డైరెక్టర్‌గా అతని తొలి ఆడియో వేడుకను "లైవ్" చేశాను. ఒక రేంజ్‌లో ప్లాటినమ్ జుబ్లీ ఫంక్షన్ కూడా చేశాను.

ఇప్పుడింక ఇద్దరం కలిసి చాలా చెయ్యబోతున్నాం. చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఛాలెంజెస్ ఉన్నాయి. చిన్న స్టార్టప్ ఒక్కటే జరగాల్సి ఉంది. అదీ జరుగుతుంది.      

ప్రదీప్‌ టాలెంట్ విషయానికొస్తే - స్విమ్మింగ్‌పూల్ జస్ట్ ఒక చిన్న ప్రారంభం మాత్రమే. ప్రాక్టికల్ పాయింటాఫ్ వ్యూలో తను నేర్చుకోవాల్సింది, చేయాల్సింది, చేసి తీరాల్సిందీ చాలా ఉంది.

నాకు తెలుసు. ప్రదీప్ అనుకున్నది సాధిస్తాడు.

'బ్లాక్ లేడీ'ని అందుకోవడం అంత ఈజీ కాదు.

కానీ, ఆ రోజు కూడా వస్తుంది ...

Tuesday, 23 May 2017

వాంటెడ్ "న్యూ స్క్రిప్ట్ రైటర్స్‌!"

కొత్త స్క్రిప్ట్ రైటర్స్‌కు వెంటనే అవకాశం!

ఇది ఉద్యోగ అవకాశం కాదు.

సినిమా ఇండస్ట్రీలోకి  మీరు ప్రవేశించడానికి అవకాశం.

అదీ, మీలో ఉన్న టాలెంట్‌నుబట్టి. మీలో ఉన్న ప్యాషన్‌ను బట్టి.


కట్ టూ పాయింట్ - 

టెక్నికల్‌గా ఒక సినిమా స్క్రిప్టును ఎలా రాస్తారో తెలిసిన కొత్త స్క్రిప్ట్ రైటర్స్ కోసం చూస్తున్నాను.

మామూలుగా కథలు రాయడం వేరు. సినిమా కోసం స్క్రిప్ట్ రాయడం వేరు.

ఈ ముఖ్యమైన తేడా తెలిసి ఉండటం చాలా ముఖ్యం. అంతే కాదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమా స్క్రిప్టుని (యాక్షన్ పార్ట్. డైలాగ్ పార్టులతో) ఏ ఫార్మాట్‌లో ఎలా రాస్తారో ఖచ్చితంగా తెలిసి ఉండాలి.

ఒకవేళ అంతర్జాతీయస్థాయిలో అందరూ ఫాలో అయ్యే "ఫైనల్ డ్రాఫ్ట్" సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి స్క్రిప్టుని రాయగల సామర్థ్యం ఉంటే మరీ మంచిది.

ఈ అవకాశం కేవలం కొత్త/యువ స్క్రిప్ట్ రచయితలకు మాత్రమే అన్న విషయం దయచేసి గమనించాలి. ఆల్రెడీ ఇండస్ట్రీలోకి ప్రవేశించినవారికోసం కాదు.

బాగా రాయగల సామర్థ్యం ఉండీ, అవకాశాలు రానివారికి ఇదొక మంచి అవకాశం. కనీసం ఒక నలుగురు రైటర్స్‌ను తీసుకొనే అవకాశం ఉంది.

మీదగ్గరున్న స్టోరీలైన్‌లు నాకు నచ్చితే వాటిని తీసుకుంటాను. లేదంటే - నేనిచ్చిన స్టోరీలైన్ మీద మీరు స్క్రిప్ట్ వర్క్ చేసి మీ వెర్షన్ రాయాల్సి ఉంటుంది.

ఏదయినా - అశ్లీలం లేని ట్రెండీ యూత్ ఎంటర్‌టైనర్ సబ్జక్టులకే ప్రాధాన్యం.

టైటిల్ కార్డు తప్పక ఇస్తాను.

పైన చెప్పిన విధంగా నిజంగా స్క్రిప్ట్ రాయగల సామర్థ్యం ఉండి, ఆసక్తి ఉన్న కొత్త/యువ స్క్రిప్ట్ రైటర్స్‌కి (Male/Female) మాత్రమే ఈ అవకాశం అని మరోసారి మనవి.

Aspiring NEW Script Writers can send their details and mobile number to my Facebook inbox immediately. 

Monday, 22 May 2017

నెట్‌వర్క్ పెంచుకుందాం రా!

మనిషిని "సోషల్ యానిమల్" అన్నాడో తత్వవేత్త.

సంఘంలోని ఇతర వ్యక్తుల ప్రమేయం లేకుండా ఏ ఒక్కడూ ఉన్నత స్థాయికి ఎదగలేడు. కనీసం బ్రతకలేడు.

ఇది ఎవ్వరూ కాదనలేని నిజం.

మనం ఎంచుకున్న ఫీల్డులో ఉన్నత స్థితికి ఎదగడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంఘంలోని ఎంతోమంది సహకారం - లేదా - ప్రమేయం మనకు తప్పనిసరి.

ఈ వ్యక్తులే మన నెట్ వర్క్.

మన నెట్‌వర్క్ ని బట్టే మనం చేసే పనులు, వాటి ఫలితాలు ఉంటాయి. మన నెట్ వర్క్ లో సరయిన వ్యక్తులు లేకుండా ఫలితాలు మాత్రం సరయినవి కావాలంటే కుదరదు.

మనకు పనికి రాని నెగెటివ్ థింకర్స్, మనల్ని వాడుకుని వదిలేసే ముదుర్లు, మన సహాయంతోనే ఎదిగి, మనల్నే వేలెత్తి చూపే మోసగాళ్లు... ఇలాంటి జీవాలు ఏవయినా ఇప్పటికే మన నెట్‌వర్క్ లో ఉంటే మాత్రం వాటిని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది.

ఇలా చెప్పటం చాలా ఈజీ. కానీ, ఈ జీవుల్ని గుర్తించటానికి కొన్ని అనుభవాలు, కొంత టైమ్ తప్పక పడుతుంది. అయినా సరే, తప్పదు.

ఈ విషయంలో ఎలాంటి మొహమాటాలకు పోయినా జీవితాలే అతలాకుతలమైపోతాయంటే అతిశయోక్తికాదు.

అలాంటి అనుభవాలు ఒక్క సినీ ఫీల్డులోనే నేను ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చింది.

మహా కవి శ్రీ శ్రీ అన్నట్టు, "ఇంకానా ఇకపై చెల్లదు!"

ఇంక ఎలాంటి మొహమాటాల్లేవు.

ముఖ్యంగా, ఇప్పుడు నేను ప్రారంభించబోతున్న కొత్త సినిమాలు, వెబ్ సీరీస్, ఈవెంట్స్, వర్క్‌షాప్స్ మొదలైనవి వ్యక్తిగతంగా నాకెంతో ప్రతిష్టాత్మకమైనవి.

ఇంకో విధంగా చెప్పాలంటే ఒక పెద్ద ఛాలెంజ్. ఇంక ఇలాంటి సమయంలో కాంప్రమైజ్, మొహమాటం అనేవి ఎలా సాధ్యం?

వాటికి స్థానం లేదు. ఉండదు.


కట్ టూ మన నెట్‌వర్క్ - 

ఏ చిన్న పనిలోనయినా సరే, ఎంత చిన్న లక్ష్యమయినా సరే, ఎంతో పెద్ద గోల్ అయినా సరే - సక్సెస్ సాధించాలనుకొనే ప్రతి ఒక్కరూ - తమకు ఉపయోగపడే నెట్‌వర్క్ ను నిరంతరం పెంచుకుంటూ ఉండాలి.

ట్విట్టర్, ఫేస్‌బుక్ ఈ విషయం లో చాలా ఉపయోగపడతాయి.

ఇంకెన్నో ఉన్నా కూడా, ఈ రెండే బాగా పాపులర్ అని నా ఉద్దేశ్యం.

ఊరికే లైక్ లకు, కామెంట్లకు మాత్రమే సమయం వృధాచేయకుండా ఈ కోణంలో కూడా ఫేస్‌బుక్ ని ఉపయోగించటం అలవాటు చేసుకోవటం చాలా మంచి అలవాటు అవుతుంది.

ఈ వాస్తవాన్ని మనం ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది అని ప్రత్యేకంగా చెప్పటం అవసరమా?

Thursday, 18 May 2017

అది అబద్ధమైనా సరే, ముందు నాకు నచ్చాలి!

నాకు నచ్చని విషయం, నేను ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ రాయలేని విషయం .. నేనస్సలు ఈ బ్లాగ్‌లో రాయలేను.

అది అబధ్ధమయినా సరే. ముందు నాకు నచ్చాలి. నేను ఇష్టపడాలి.

ఎట్‌లీస్ట్, ఆ క్షణం .. అది నాకు కిక్ ఇవ్వాలి.

ఆ రాతల కోసమే ఈ నగ్నచిత్రం బ్లాగ్.

పైన టైటిల్ ఎట్రాక్షన్ కోసమే ఆ వేరేవాళ్ల 'అబద్ధం' గురించి చెప్పాను తప్ప, అది మనవల్ల కాని పని. 'క్రాష్ కోర్స్' తీసుకున్నా పాస్ కావడం కష్టం.  

నో వే.

సో .. ఏ హిపోక్రసీ లేదు. ఏ ఇన్‌హిబిషన్స్ లేవు. నేను రాయాలనుకున్నది రాస్తాను. నచ్చినవాళ్లు చదువుతారు. నచ్చనివాళ్లు ఒకే ఒక్క క్లిక్‌తో ఇంకో బ్లాగ్‌లోకో సైట్ లోకో వెళ్లిపోతారు. అంతే.


కట్ టూ రైటర్స్ బ్లాక్ - 

ఇప్పుడు నేను వరుసగా చేయడానికి ప్లాన్‌చేసుకున్న రెండు తెలుగు సినిమాలు, ఒక ఇంగ్లిష్ సినిమా, ఒక వెబ్ సీరీస్, ఒక ఈవెంట్, ఒక వర్క్‌షాప్, ఒక బుక్ రిలీజ్ మొదలైనవాటి పనులు, ఇతర వ్యక్తిగతమయిన టైమ్‌బౌండ్ కమిట్‌మెంట్‌ల వత్తిడిలో అస్సలు సమయం లేక, సమయం మిగుల్చుకోలేక .. ఈమధ్య నేను నా బ్లాగ్‌ని దాదాపు పూర్తిగా మర్చిపోయాను.

'రైటర్స్ బ్లాక్' లాగా 'బ్లాగర్స్ బ్లాక్' అన్నమాట!  

ఎప్పుడో ఒకటీ అరా బ్లాగ్ పోస్ట్ తప్ప అసలేమీ రాయలేదీ మధ్య.

ఇది పెద్ద నేరం. నా దృష్టిలో.

రాయగలిగివుండీ, రకరకాల కారణాలను వెతుక్కొంటూ రాయకుండా ఉండటం, అలా ఉండగలగటం .. నిజంగా పెద్ద నేరం.

ఏదో రాసి ఎవర్నో ఉధ్ధరించాలన్నది కాదు ఇక్కడ విషయం. నన్ను నేను ఉధ్ధరించుకోవడంకోసం మాత్రం ఇది నాకు నిజంగా తప్పనిసరి.

రాయడం అనేది నాకు ఒక థెరపీ. ఒక యోగా. ఒక ఆనందం. ఒక కళ. ఒక గిఫ్ట్.

నిజానికి ఇదేమంత గొప్ప విషయం కాదు. అనుకుంటే ఎవరైనా రాయగలరు. కానీ, అందరూ అనుకోరు. అందరివల్లా కాదు.

ఇలాంటి గొప్ప అదృష్టాన్ని వినియోగించుకోకపోవడం నాకు సంబంధించినంతవరకు నిజంగా నేరమే.

ఈ నిజాన్ని నేను పదే పదే రిపీటెడ్‌గా రియలైజ్ అవుతుంటాను.

అదో పెద్ద జోక్ ..

Tuesday, 16 May 2017

ఇక వెబ్ జమానా!

టివీ ఇప్పుడొక అవుట్ డేటెడ్ డబ్బా.

ఎవరో కొందరు మిడిల్ ఏజ్‌డ్ వాళ్లకు, వృధ్ధులకు .. వాళ్ల వాళ్లకిష్టమైన కొన్ని ప్రోగ్రాములు చూసుకోడానికి తప్ప, ఈ డబ్బాను ఎవరూ అసలు వాడ్డం లేదిప్పుడు.

వీళ్ళలో కూడా - మగవాళ్లు ఎక్కువగా పాలిటిక్స్, ఆడాళ్లు ఎక్కువగా కొన్ని సీరియల్స్ తప్ప మరేం చూడ్డంలేదు.

"జబర్దస్త్" లాంటి ఆడల్ట్ కంటెంట్‌ను, ఒకట్రెండు రియాలిటీ షోస్‌ను మాత్రం, వారూ వీరూ అని ఏం లేకుండా, ఒక ప్రత్యేక సెగ్మెంట్ బాగా ఎగబడి చూస్తోంది.

ఇవి పక్కనపెడితే, అసలు టీవీ చూడ్దానికి నిజంగా ఇప్పుడెవ్వరికీ టైమ్ లేదు!

ఆండ్రాయిడ్ మొబైల్ ఫోనొచ్చి, ఇప్పుడు అరచేతిలోనే అందరికీ 'అన్నీ' చూపిస్తోంది.


కట్ టూ వెబ్ -  

పిల్లలు, యూత్, పెద్దలు, వృధ్ధులు ..అనేం లేకుండా, అందరూ ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లకు ఎడిక్టయిపోయారు.

తిండీ,నిద్ర, కుటుంబం లేకపోయినా బ్రతగ్గలరు. కానీ, చేతిలో మొబైల్ లేకుండా బ్రతకడం ఇప్పుడు కష్టంగా ఉంది అందరికీ.

చేతిలో ఉన్న మొబైల్లోనే టీవీ, యూట్యూబ్, సినిమాలు, సైట్స్, ఎట్సెట్రా .. అన్నీ చూడొచ్చు.
ఈ నేపథ్యంలోనే పుట్టాయి వెబ్ షోలు, వెబ్ సీరీస్‌లు ఎట్సెట్రా.

ఇప్పుడివి మొబైల్స్‌లోే బాగా హల్‌చల్ చేస్తున్నాయి.

వీటికి మెయిన్ ప్లాటుఫామ్ అయిన యూ ట్యూబ్ లో కేవలం ఒకట్రెండు రోజుల్లోనే మిలియన్ల వ్యూస్! కొన్నిటికయితే గంటల్లోనే!!

ఇంకేం కావాలి .. వెబ్ ప్రోగ్రామ్ మేకర్స్‌కు, అప్‌లోడ్ చేసే చానెల్స్‌కూ షేరింగ్ బేసిస్‌లో బోల్డంత ఆదాయం!

ఇది జస్ట్ ప్రారంభమే. ఇంక చాలా ఉంది సినిమా .. వెబ్‌లో.

సినిమాలు సినిమాలే. వెబ్ వెబ్బే.

నా రెగ్యులర్ సినిమాలతోపాటు, అతి త్వరలో నేను కూడా ఒక వెబ్ షో, ఒకట్రెండు వెబ్ సీరీస్‌లు ప్లాన్ చేస్తున్నాను, పిచ్చి సీరియస్‌గా.

ప్రదీప్‌చంద్ర, నా 'కోంబో'లో మా వెబ్ జర్నీ అతి త్వరలో ప్రారంభం కాబోతోంది.

ఈ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను మేం కూడా బాగా ఎంజాయ్ చేయాలనుకొటున్నాం.  

ఈ విషయంలో మా హల్ చల్ వేరే .. మేం క్రియేట్ చేయాలనుకొంటున్న సెన్సేషన్ వేరే! 

Friday, 12 May 2017

కొన్నిటికి కారణాలు వెతకడం వృధా!

"Religion is a man made thing" అన్న మాటను నేను బాగా నమ్ముతాను. దేవుడు అన్న కాన్‌సెప్ట్ అందులో భాగమే.

పై వాక్యాన్ని ఎంత బాగా నమ్ముతానో, అంత కంటే బాగా నేను నమ్మే నిజం ఇంకోటి కూడా ఉంది.

అది .. మనకు తెలియని ఏదో ఒక "శక్తి".

ఆ శక్తి లేకుండా మనమంతా లేము. మన చుట్టూ ఉన్న ఈ అద్భుతమైన ప్రకృతీ లేదు.

ఆ శక్తి రూపం మనకు తెలియదు. ఆ శక్తి ఉద్దేశ్యం ఏంటో కూడా మనకు తెలియదు.

ఎవరికి వారు ఏదో ఒక పేరు పెట్టుకొని ఆ శక్తిని నమ్మడంలో తప్పేమీ లేదు. ఇంకొకరిని ఇబ్బంది పెట్టనంతవరకూ నిజంగా అదొక మంచి డిసిప్లిన్.

నేను కన్వీనియెంట్‌గా ఫీలయ్యి, నాకు నచ్చిన ఒక పేరుతో, ఆ శక్తిని నేనూ నమ్ముతున్నాను. అది వేరే విషయం. దాని గురించి మరోసారి వివరంగా రాస్తాను.

ఇదంతా ఎలా ఉన్నా .. శతాబ్దాలుగా చాలా మంది మహామహులైన రచయితలు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, మేధావులమనుకున్నవారి విషయంలో నేను చదివి తెలుసుకొన్న, ఇటీవలికాలంలో వ్యక్తిగతంగా గమనించిన పచ్చి నిజం కూడా ఇంకోటుంది.

అసలు దేవుడు అన్న కాన్‌సెప్ట్‌నే నమ్మకుండా, జీవిత పర్యంతం విశృంఖలంగా గడిపిన ఎందరో చివరికి ఏదో ఒక ఆధ్యాత్మిక ఆశ్రమంలో చేరిపోయారు!

సో, మళ్లీ మనం కొత్తగా ఒక చక్రాన్ని కనిపెట్టాల్సిన అవసరం లేదు. అనుభవం మీద అన్నీ మనకే తెలుస్తాయి.

అందుకే ఈ విషయంలో అనవసరంగా లాజిక్కుల జోలికి పోవడం వృధా.

ఆ సమయాన్ని మరోవిధంగా సద్వినియోగం చేసుకోవడం బెటర్.


కట్ టూ "కాజ్ అండ్ ఎఫెక్ట్" - 

'జీవితం వైరుధ్యాలమయం' అంటారు.

ఇంత చిన్న బ్లాగ్‌లో పైన రాసిన పది వాక్యాల్లోనే ఎన్నో వైరుధ్యాలున్నాయి. అలాంటప్పుడు - మన జీవితంలోని ప్రతి దశలోనూ, ఆయా దశల్లోని మన ఎన్నో ఆలోచనల్లోనూ కొన్నయినా వైరుధ్యాలు తప్పక ఉంటాయి.

వాటిల్లో చాలావాటికి కారణాలుండవు. ఒకవేళ ఉన్నట్టు అనిపించినా, అవి బయటికి కనిపించేవే తప్ప అసలు కారణాలు కాకపోవచ్చు.

అలాంటి ఎన్నో వైరుధ్యాల మధ్య, గత కొన్నేళ్లుగా, నా జీవితం కూడా ఊహకందని కుదుపులతో నడుస్తోంది. లాజిక్కులకందని కల్లోలాలతో కొనసాగుతోంది.

వ్యక్తిగతం, వృత్తిగతం, ఆర్థికం, సాంఘికం, ఆధ్యాత్మికం .. అన్నీ.

ఎందరివల్లో ఎన్నో ఊహించని బాధలు పడ్డాను. కోలుకోలేని ఎదురుదెబ్బలు తిన్నాను. ఫలితంగా, నాకు అతిదగ్గరివాళ్లయిన కొందరు మిత్రులు, బంధువులు ఏదోవిధంగా, ఏదో ఒక స్థాయిలో బాధపడ్డానికి కూడా పరోక్షంగా నేను కారణం అయ్యాను.  

అయినా సరే - ఈ ప్రపంచం "కాజ్ అండ్ ఎఫెక్ట్" సూత్రం మీదే ఎక్కువగా నడుస్తుందని నేను ఇప్పటికీ నమ్ముతాను.

అయితే, ఎన్నోసార్లు నేను వేగంగా గోడకు విసిరికొట్టిన బంతి అంతే వేగంగా వెనక్కి తిరిగిరాలేదు. ఆశ్చర్యంగా ఆ గోడకి బొక్కచేస్తూ బంతి బయటికి వెళ్లిపోయింది!

దీన్ని ఏ లాజిక్ ఒప్పుకుంటుంది?

ఎవరు నమ్ముతారు?

కానీ గత కొన్నేళ్లుగా నా జీవితంలో జరుగుతున్న నిజం మాత్రం ఇదే.

బట్, ఈరోజు నుంచి సీన్ మారబోతోంది. "కాజ్ అండ్ ఎఫెక్ట్" సూత్రం మీద నాకున్న నమ్మకంతోనా, లేదంటే ఆ నమ్మకం నాలో ఏర్పడటానికి కూడా కారణమైన ఆ "శక్తి" తోనా?

నాకు తెలీదు.

సీన్ మాత్రం ఈరోజు నుంచే మారబోతోంది.

పూర్తిగా, పాజిటివ్‌గా ..    

Wednesday, 3 May 2017

ఒక చిన్న సంకల్పం

మా 'స్విమ్మింగ్‌పూల్' సినిమా పోస్ట్ ప్రొడక్షన్  దశలో ఉన్నప్పటినుంచే 'ఇలా కాదు, ఇంకేదో చేయాల'ని చాలా చాలా అనుకున్నాము.

నేనూ, నేను ఇండస్ట్రీకి పరిచయం చేసిన మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్ర కలిసి ఇలా ఆలోచించడానికి అంకురార్పణ జరిగింది యూసుఫ్‌గూడలో ఉన్న ఒక చిన్న రికార్డింగ్ స్టూడియోలో ..

అదీ, స్విమ్మింగ్‌పూల్ ప్రమోషనల్ సాంగ్ రికార్డింగ్ బ్రేక్‌లో చాయ్ తాగుతూ ..

ఆ రికార్డింగ్ స్టూడియోలో, ఆ క్షణం, ఆ రోజు అలా అనుకున్నప్పటినుంచీ ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ఊహించని ట్విస్టులు.

చూస్తుండగానే బహుశా ఒక రెండేళ్లు గడిచింది.


కట్ టూ 18 ఏప్రిల్ 2017 -  

చివరికి మొన్నొకరోజు, కుక్కట్‌పల్లిలోని మంజీరా మాల్ లో కూర్చొని, కోక్ తాగుతూ, ఒక ఖచ్చితమైన నిర్ణయానికొచ్చాము, ఇద్దరమూ.

అది మొన్నటి ఏప్రిల్ 18.

ఇప్పుడింక ఏ ఆలోచనలు, ప్లాన్‌లు, ఎదురుచూడటాలు, చివర్లో ఊహించని ట్విస్టులూ .. ఇవేం లేవు. ఉండవు.

మాదగ్గర ఎలాంటి రిసోర్సెస్ లేవు. వ్యక్తిగతంగా ఇద్దరికీ నానా తలనొప్పులున్నాయి. అయినా సరే .. ముందుకే వెళ్లదల్చుకున్నాం. అలా డిసైడయిపోయాం.

నో వే.

అప్పుడెప్పుడో మేం అనుకొన్న ఆ చిన్న సంకల్పం ఇప్పుడు నిజం కాబోతోంది.

ఒక మహా యజ్ఞంగా ప్రారంభం కాబోతోంది.

మరికొద్దిరోజుల్లోనే ...

Friday, 28 April 2017

దర్శక "బాహుబలి" రాజమౌళి

తెలుగు సినిమాలో ఇప్పటివరకూ ఏ దర్శకుడూ సాహసించని ఒక విజన్.

భారతీయ సినిమాలో ఇప్పటివరకూ ఎవ్వరూ స్పృశించని అనేకానేక మార్కెటింగ్ టెక్నిక్స్.

ఎవ్వరూ ఊహించడానికి కూడా ఇష్టపడని ఒక ధైర్యం.

తను నమ్మిన ప్రాజెక్టు కోసం అర్థ దాశాబ్దం పాటు నిరంతర శ్రమ.

ఒక బాహుబలి.

హాట్సాఫ్ టూ రాజమౌళి ..


కట్ టూ రియాలిటీ - 

పైన చెప్పిన స్థాయిలో ఇదొక తొలి ప్రయత్నం.

అందరూ మెచ్చుకోవాలి. ప్రోత్సహించాలి.

తెలుగు సినిమా మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి, మరెందరో ఫిల్మ్ మేకర్స్ ఈ స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించడానికీ పుష్ చేయాలి.

ఒక సినిమాలో తప్పుల్నే వెదుక్కుంటూ కూర్చుంటే 1000 దొరుకుతాయి.

దానికంటే, ముందు సినిమా అనేది ఒక ఫిక్షన్ అనేది గుర్తుపెట్టుకోవాలి.  ఒక బిగ్ బిజినెస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక జూదం అన్న విషయం కూడా కూడా గుర్తుపెట్టుకోవాలి.

ప్రతి చిన్న అంశాన్ని పట్టుకొని ఈకలు తోకలు పీకడం చాలా ఈజీ. కానీ, అయిదేళ్ళు కష్టపడి అంత భారీ రేంజ్‌లో ఒక బాహుబలిని 2 భాగాలుగా రిలీజ్ చేసి, విజయం సాధించి, కోట్లలో లాభాల్ని కొల్లగొట్టడం మాత్రం అంత ఈజీ కాదు.

అది రాజమౌళి సాధించాడు.

నేనూ ఒక రాయి వేయగలను ..

అసలు టెక్నాలజీ లేని రోజుల్లోనే మన సీనియర్లు మాయాబజార్‌లు, వీరాభిమన్యులు తీసి "ఔరా" అనిపించారు. మరి 100ల కోట్ల బడ్జెట్లు, ఇంత ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో ఖచ్చితంగా బాహుబలిలో చిన్న పొరపాటు కూడా ఉండటానికి వీళ్లేదు. కానీ ఉన్నాయి. రాస్తే అదొక చిన్న లిస్ట్ అవుతుంది. కానీ నేనా పనిచేయను. అది కరెక్ట్ కాదు.

ఎందుకంటే,  సినిమాకు కొన్ని పరిమితులుంటాయి. సినిమాను సినిమాగానే చూడాలి.

ఒక ఫిల్మ్ మేకర్‌గా, ఒక మార్కెటింగ్ జీనియస్‌గా రాజమౌళి సాధించిన ఈ భారీ విజయాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.   

Wednesday, 26 April 2017

శత వసంతాల 'ఓయూ '

ఓయూ అనగానే ఒక ఆనందం. ఒక ఉద్వేగం. ఒక మధురస్మృతుల మాలిక.

ఫ్రేమ్ బై ఫ్రేమ్ .. చక చకా అలా నా కళ్లముందు కదిలిపోతుంటాయి.

ఫోటో తీసుకున్నప్పుడల్లా ఒక కొత్త అందంతో కనిపించే ఆర్ట్స్ కాలేజి. అందులో నేను చదివిన ఎం ఏ, ఎం ఎల్ ఐ ఎస్సీ. సాధించిన రెండు గోల్డ్ మెడల్స్ ..

పార్ట్ టైమ్‌గా అదే ఆర్ట్స్ కాలేజ్‌లో నేను ఎంతో ఇష్టంగా చదివిన మూడేళ్ల రష్యన్ డిప్లొమా. అందులోనూ నేనే యూనివర్సిటీ టాపర్ కావడం ..

ఎమ్మేలో నా గురువులు నాయని కృష్ణకుమారి, కులశేఖరరావు, గోపాలకృష్ణారావు, ఎస్వీ రామారావు, కసిరెడ్డి వెంకటరెడ్డి, ఎల్లూరి శివారెడ్డి, సుమతీ నరేంద్ర, గోపి గార్లు ..

టైపిస్ట్ శశికళ, అటెండర్ ఫక్రుద్దిన్ ..

లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్‌లో నా గురువులు ఎ ఎ ఎన్ రాజు, వేణుగోపాల్, లక్ష్మణ్ రావు, జనార్ధన్ రెడ్డి, జగన్ మోహన్, సుదర్శన్‌రావు గార్లు ..

రష్యన్ డిప్లొమాలో నా గురువులు మురుంకర్, కల్పన, ప్రమీలాదేవి గార్లు ..

నా క్లాస్‌మేట్స్, నా ఫ్రెండ్స్ ..

రష్యన్ డిప్లొమాలో తెలుగు మాట్లాడని సిటీ అమ్మాయిలు ..

నేనున్న ఏ హాస్టల్, మంజీరా హాస్టళ్లు ..

ఏ హాస్టల్లో రూమ్ నంబర్ 6, రూమ్ నంబర్ 55 ..

నా ఆత్మీయ మిత్రులు "బిగ్ ఫైవ్", మా యాకూబ్, మా గుడిపాటి, మా సాదిక్ అలీ, మా కాముడు ..

ఏ హాస్టల్ మెస్, పుల్లయ్య, పొద్దున చపాతీలు, ఆమ్‌లెట్, మధ్యహ్నం భోజనంలో అన్ని కూరలతోపాటు చిన్న ప్లేట్‌లో మటన్ ముక్కలు, సండే స్పెషల్, సంవత్సరానికోసారి 'మెస్ డే' రోజు కోడికి కోడి తినడాలు .. చివర్లో స్వీట్ పాన్‌లు ..

క్యాంపస్‌లో మెయిన్ క్యాంటీన్, ఆర్ట్స్ కాలేజ్‌లో చెట్లకింది క్యాంటీన్ ..

రాత్రిళ్లు హాస్టల్ వెనకాల బండలమీద నర్సిమ్మ తడికల క్యాంటీన్‌లో ఆమ్‌లెట్ తిని చాయ్‌లు తాగడం, అర్థరాత్రి దాటేదాకా అవే బండలమీద కూర్చొని సిగరెట్లమీద సిగరెట్లు కాలుస్తూ కవిత్వాలూ, కబుర్లూ, చర్చలూ, కొట్లాటలు, తిట్టుకోడాలు ..

గంటలకొద్దీ కూర్చొని గడిపిన ఆర్ట్స్ కాలేజ్ లాన్స్, మెయిన్ లైబ్రరీ మెట్లు, ల్యాండ్‌స్కేప్ గార్డెన్ చెట్లనీడలు ..

టాగోర్ ఆడిటోరియంలో ఫంక్షన్లు, సినిమాలు ..

ఆడిటోరియం వెళ్లేదారిలో సన్నని గోడపైన సర్కస్ చేస్తూ నడిచిన రాత్రులు ..

క్యాంపస్ గోడ దూకి వెనకే వున్న ఆరాధన థియేటర్లో వారం వారం సినిమాలు, ఈలలు, పెడబొబ్బలు ..

తెరమీద "అచ్చా అచ్చా .. బచ్చా బచ్చా" పాట వస్తున్నప్పుడు రెచ్చిపోయి లేచి ఎగరడాలు ..

టికెట్ దొరకనప్పుడు మేనేజర్ రూమ్‌లోకి వెళ్లి గొడవపడటాలు ..  

స్టుడెంట్ యూనియన్‌ల మీటింగులు, గొడవలు, తలలు పగిలి రక్తాలు కారే కొట్లాటలు, తపంచాలతో కాల్పులు ..        

ఒరిస్సా, వైజాగ్, అరకు, బెంగుళూరు, మైసూరు, ఊటీ, కొలనుపాక .. విహార యాత్రలు ..

కోర్సులు పూర్తయ్యాక, ఒక్కో మిత్రుని వీడ్కోలు అప్పుడు ఆగని కన్నీళ్లతో వెక్కి వెక్కి ఏడ్వటాలు ..  
ఇంకా ఎన్నో .. ఎన్నెన్నో .. అన్నీ .. గుర్తుకొస్తున్నాయి.

ఇన్ని జ్ఞాపకాలనిచ్చిన నా ప్రియమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం శతవసంతాల సంబరాలు ఈరోజు ప్రారంభమవుతున్న సందర్భంగా, ప్రతిష్ఠాత్మక ఓయూతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ నా హార్దిక శుభాకాంక్షలు.

నా గురువులందరికీ శిరసాభివందనాలు ..

Monday, 17 April 2017

గుడ్‌బై, ఫేస్‌బుక్?!

ఫేస్‌బుక్ ఇప్పుడు నిజంగా బోర్ కొడుతోంది నాకు.

ఆ అర్థంలేని పిచ్చి పిచ్చి పొస్టులు, కామెంట్లు, సెల్ఫీలు .. అన్నీ నిజంగా ఇప్పుడు నాకు తెగ బోర్ కొడుతున్నాయి.

ఒక ఎడాలిసెంట్ హైస్కూల్ పిల్లల గ్రూప్, క్లాస్‌రూంలో టీచర్ లేనప్పుడు చేస్తున్న 'ఫిష్ మార్కెట్' గొడవలా అనిపిస్తోంది నాకు.

ఇప్పుడు నేనున్న 101 వత్తిళ్ల మధ్య, ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడితే ఒక ప్రాబ్లమ్, ఫేస్‌బుక్‌లో ఉండీ పోస్టులు పోట్టకపోతే ఒక ప్రాబ్లంలా ఉంది.

రోజుకి ఒక 40 నిమిషాలు కూడా ఇక్కడ గడపకపోయినా, ఫేస్‌బుక్‌కి నేను పూర్తిగా ఎడిక్ట్ అయిపోయానని మావాళ్లు చాలామంది అనుకుంటున్నారు.

ఇదంతా ఎందుకు .. అసలు ఫేస్‌బుక్‌కే గుడ్‌బై చెప్పేస్తే?!


కట్ టూ ట్విట్టర్ -  

ట్విట్టర్ ఒక ఎలైట్ సోషల్ మీడియా.

సోషల్ మీడియాలో ఉనికి కోసం ఇదొక్కటి చాలు నాకు. దీనికి ఫేస్‌బుక్‌ను కనెక్ట్ చేస్తే సరిపోతుంది. నా ట్వీట్స్ అన్నీ ఎఫ్ బి లోనూ కనిపిస్తాయి.

తప్పనిసరి అనుకున్నప్పుడు ఒకటి రెండు పోస్టులు పోస్ట్ చేయడం పెద్ద సమస్య కాదు.

ట్విట్టర్‌లో ముందొక లక్ష ఫాలోయర్స్‌ను సంపాదించుకోడమే కష్టం. తర్వాత అదే 10 లక్షలకు చేరుతుంది.

కొంచెం కష్టమే.

అసాధ్యం మాత్రం కాదు. 

Tuesday, 4 April 2017

సినిమా కష్టాలు ఎవ్వర్నీ వదలవ్!

నాకు తెలిసి సినిమా కష్టాలు పడకుండా పైకివచ్చినవారు లేరు!

ఎంత సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నా సరే, ఎంత డబ్బున్నా సరే, ఎంతో టాలెంట్ ఉండి మరెంతో టాప్ రేంజ్‌లోకి వచ్చినా సరే .. ఏదో ఒక టైమ్‌లో, ఏదో ఒక రూపంలో ఈ సినిమా కష్టాలనేవి ఈ రంగంలో ఉండేవాళ్లను తప్పక ఎటాక్ చేస్తాయి.

ఈ స్టేట్‌మెంట్‌కు ఎలాంటి రిలాక్సేషన్ లేదు. ఉండదు.

ఒక టాప్ రేంజ్ హీరోగా తన సినిమాలతో దేశాన్ని ఉర్రూతలూగించిన ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ నివసించే ఇంటిని బ్యాంక్ వాళ్లు వేలానికి పెట్టే పరిస్థితి వచ్చింది ఒక దశలో.

అప్పటికే సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చి, బాగా సంపాదించి, ఇంకా అదే రేంజ్‌లో సినిమాలు చేస్తున్న సమయంలోనే దర్శకుడు పూరి జగన్నాథ్ సుమారు 85 కోట్లు పోగొట్టుకొని ఆర్థికంగా ఒక్కసారిగా మైనస్‌లోకి వెళ్లిపోయాడు.

భాయ్‌జాన్ బజ్‌రంగ్, బాహుబలి వంటి భారీ హిట్స్‌తో చరిత్ర సృష్టించిన రచయిత విజయేంద్రప్రసాద్, అప్పట్లో చదివించే స్థోమతలేక తన కొడుకు రాజమౌళి చదువుని ఇంటర్‌మీడియట్‌తోనే ఆపేశారు.

ఒక ట్రెండ్ సెట్టర్ సినిమా ఇచ్చి చరిత్ర సృష్టించిన తర్వాత కూడా, ఒక మేవరిక్ దర్శకుడు, ఆయన టీమ్ .. తమ సొంత బేనర్లో మరో సినిమా చేస్తున్న సమయంలో .. లంచ్‌కి డబ్బుల్లేక బండిమీద రేగుపళ్లు కొనుక్కుని తిన్నారంటే నమ్ముతారా?

ఇలా ఎన్నయినా ఉదాహరణలు ఇవ్వగలను.

దీన్నిబట్టి అసలు సక్సెస్‌లు లేనివారి కష్టాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ఎవరైనా చాలా ఈజీగా ఊహించవచ్చు.


కట్ టూ అసలు పాయింట్ - 

సినిమా కష్టాలకు సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవాటితో అస్సలు సంబంధం ఉండదు అని చెప్పడమే ఇక్కడ నా పాయింట్. మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే .. సినిమాల్లోకి ఎంట్రీనే ఉంటుంది. ఎక్జిట్ మన చేతుల్లో ఉండదు.  

సినిమా ఎవ్వర్నీ వదలదు. దీన్లోకి ఎంటరయినవాడు సినిమానీ వదల్లేడు.

దటీజ్ సినిమా. 

Saturday, 1 April 2017

ఒక ఇంగ్లిష్ సినిమా!

"వన్ షాట్ .. టూ ఫిలింస్" అని ఆమధ్య ఒక బ్లాగ్ రాశాను.

అది, ఒక సినిమా బడ్జెట్‌తో ఇంగ్లిష్, తెలుగు భాషల్లో రెండు సినిమాలు చేయడం గురించిన ఒక ఆలోచన.

అయితే, అది అప్పటి ఆలోచన.

వాతావరణం ఎలా మారుతుంటుందో మనిషి మైండ్ కూడా అలా మారుతుంటుందట ఎప్పుడూ. సో, ఇప్పుడు నా ఆలోచనలో కూడా మళ్లీ కొంచెం మార్పు.  


కట్ టూ నా తొలి ఇంగ్లిష్ సినిమా - 

ఒక సినిమా ఒక భాషలో తీయాలనుకొంటే .. ఆ ఒక్క భాషలో తీస్తే చాలు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.

రెండు మూడు భాషల్లో రెండు మూడు వెర్షన్స్ తీసో, డబ్ చేసో ఒకే సారి విడుదల చేయడం అనేది కేవలం మణిరత్నం, శంకర్, ఇప్పుడు రాజమౌళి లాంటి కొందరు హైలీ బ్రాండెడ్ డైరెక్టర్ల సినిమాల విషయంలో మాత్రమే వర్కవుట్ అవుతుంది. ఇతరుల విషయంలో ఇది పూర్తిగా ఒక వృధా ప్రయాస మాత్రమే అవుతుంది.

సో, నేననుకొన్న నా మొదటి ఇంగ్లిష్ సినిమా ఒక్క ఇంగ్లిష్‌లో మాత్రమే తీయడానికి డిసైడ్ అయిపోయాను. ఇది దేశమంతా మల్టిప్లెక్సెస్‌లో మాత్రమే రిలీజ్ అవుతుంది. బయట యూఎస్, యూకె మొదలైన దేశాల్లో కూడా రిలీజ్ అవుతుంది.

ఇలా అనుకొన్న తర్వాత, ఉన్నట్టుండి ఈ సినిమా కాన్వాస్ చాలా పెద్దదైపోయింది. బడ్జెట్ కూడా మేం ముందు అనుకొన్న రేంజ్‌ను దాటిపోయింది.

ముందు జీరో బడ్జెట్‌తో ప్రారంభించినా, కనీసం కోటి రూపాయల బడ్జెట్‌కు గాని కాపీ రాదు!

నేను, నా చీఫ్ టెక్నీషియన్లు వీరేంద్ర లలిత్ (ముంబై), ప్రదీప్‌చంద్ర ఈ విషయంలో ఎంత కష్టమైనా సరే పడటానికి సిధ్ధంగా ఉన్నాము.

ఇదేదో సరదాకు తీస్తున్న మామూలు ఇంగ్లిష్ సినిమా కాదు. సీరియస్‌గా, ఒక సిన్సియర్ ఆలోచనతో తీస్తున్న మెయిన్‌స్ట్రీమ్ కమర్షియల్ సినిమా.

టైటిల్, కొద్ది రోజుల్లో.    

Saturday, 25 March 2017

సినిమా తీయడానికి కావల్సింది డబ్బు ఒక్కటే కాదు!

చాలా ఏళ్ల క్రితం నేనో ఇంటర్వ్యూ చదివాను.

అది తమ్మారెడ్డి భరద్వాజ గారిది.

ఆ ఇంటర్వ్యూలో నేను చదివిన ఒక ఆసక్తికరమైన విషయం నాకిప్పటికీ గుర్తుంది.

"తెల్లవారితే సినిమా ఓపెనింగ్. జేబులో వంద కాగితం మాత్రమే ఉంది!"

నమ్ముతారా?

నమ్మితీరాలి.

అంతకుముందు నేనూ పెద్దగా నమ్మలేదు. అంతా ఉట్టి డ్రామా అనుకున్నాను. కానీ, అది డ్రామా కాదు, 100% నిజం అని ఇప్పుడు నేను నమ్ముతున్నాను.

ఏదిగానీ తనదాకా వస్తేగానీ తెలీదు కదా!


కట్ టూ మన పాయింట్ -   

ప్రొడ్యూసర్, డైరెక్టర్‌గా భరద్వాజ గారు సుమారు 30 సినిమాలు తీశారు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సార్లు ఎన్నో పదవుల్ని చేపట్టారు. ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలా యాక్టివ్‌గా ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఎవరో ఒకరికి ఏదో సహాయం చేస్తూనే ఉంటారు.

ఇంతకూ ఏమయింది? తెల్లవారిందా మరి??

తెల్లవారింది. అన్నీ వాటంతటవే సమకూరాయి. ఆ సినిమా ఓపెనింగ్ కూడా బ్రహ్మాండంగా జరిగింది.

సినిమా పేరు నాకు గుర్తులేదు. బహుశా అది హిట్ కూడా అయ్యే ఉంటుంది.

మరో ఇంటర్వ్యూలో సత్యజిత్ రే ఒక మాటన్నారు. దీన్ని నేను ఇప్పటికే ఫేస్‌బుక్‌లో ఓ మూడునాలుగు సార్లు కోట్ చేశాను.

మొన్నీమధ్యే లేటెస్టుగా దీన్ని కోట్ చేసినప్పుడు .. నా మిత్రురాలు, కె రాఘవేంద్రరావు గారి శిష్యురాలు, కాబోయే డైరెక్టర్ ప్రియదర్శిని ఓ పంచ్ లాంటి కామెంట్ పెట్టారు: "ఆ కొటేషన్ చదివేనండీ ఇక్కడకొచ్చి ఇలా ఇరుక్కుపోయాం!" అని.

ఇంతకూ సత్యజిత్ రే చెప్పింది ఏంటంటే - "సినిమా తీయాలన్న సంకల్పం ముఖ్యం. అదుంటే చాలు. అన్నీ అవే సమకూరతాయి!" అని.

భరద్వాజ గారి సంకల్పమే ఆరోజు వారి సినిమా ఓపెనింగ్ సాఫీగా జరిగేట్టు చేసిందన్నది నా వ్యక్తిగత నమ్మకం.

సినిమాకయినా, జీవితంలో ఇంక దేనికయినా .. అది చిన్న పనైనా, పెద్ద పనైనా .. సంకల్పం అనేది చాలా ముఖ్యం.


కట్ టూ ఫినిషింగ్ టచ్ - 

"భరద్వాజ గారి ఆ సినిమా పేరు .. 'ఊర్మిళ'. మాలాశ్రీ తో చేశారు" అని తర్వాత చందు తులసి గారు గుర్తుచేశారు.

సినిమా తీయడానికి కావల్సింది డబ్బు ఒక్కటే కాదు. గట్స్ కూడా!

అది అందరివల్లా అయ్యే పని కాదు.  

Friday, 24 March 2017

ప్రమోషన్ లేకుండా సినిమా చెయ్యడం అవసరమా?

"మనోహర్ గారూ...రెండే రెండు మాటలు చెబుతా...

మీ పుస్తకం చదివాక....అది సినీ ఔత్సాహికులకు నిఘంటువు అనిపించింది.

రైటర్లు, దర్శకులు, నిర్మాతలు అవుదామని ఆశించేవారికి కచ్చితంగా అదో కరదీపిక...
మీనుంచి ఓ గొప్ప బ్లాక్ బ్లస్టర్ ఆశిస్తున్నాం."

ఆమధ్య నేను రాసిన ఒక బ్లాగ్ పోస్ట్‌కు 'బాలు' అనే ఒక రీడర్ కామెంట్ అది.

దానికి నా హంబుల్ సమాధానం ఇదీ:

"థాంక్యూ ఫర్ యువర్ కామెంట్స్!
> నేనూ అలానే ఒక బ్లాక్‌బస్టర్ ఇవ్వాలనుకుంటున్నా. కానీ, నా ప్రాజెక్ట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి బడ్జెట్ పరిమితులవల్ల, ఒక్క క్రియేటివిటీ తప్ప మిగిలిన అన్ని పనులు, అన్ని ఏర్పాట్లు నేనే స్వయంగా చూసుకోవాల్సివస్తోంది. ఇంకా చెప్పాలంటే క్రియేటివిటీ 10%, ఇతర అన్ని పనులూ  90% చూసుకోవాల్సి వస్తోంది. అయినప్పటికీ, ఉన్న పరిమితుల్లో నేను చాలా బాగా చేయడానికే ప్రయత్నించాను. చేశాను కూడా.
> అయితే - వచ్చే చిక్కంతా ప్రమోషన్, రిలీజ్ దగ్గరే!
ఇప్పటివరకు నేను చేసిన ఏ సినిమాకు కూడా చివర్లో రిలీజ్ దగ్గరికి వచ్చేటప్పటికి నేను ప్లాన్ చేసినట్టుగా ప్రమోషన్‌గానీ, రిలీజ్ గానీ జరగలేదు. అలా జరిగుంటే పరిస్థితి మరోలా ఉండేది.
> ఇప్పుడు చేస్తున్న నా తర్వాతి చిత్రాలకు ఈ సమస్యలు లేకుండా చూసుకుంటున్నాను. నో కాంప్రమైజ్!" 

Saturday, 18 March 2017

అసలు సినిమా ఇలా ఉంటుంది!

నా మొదటి సినిమాలో ఒక మంచి విలన్‌ను ఫుల్ లెంగ్త్ రోల్‌లో పరిచయం చేశాను.

అతను నిజంగా చాలా మంచి యాక్టర్. చాలా బాగా చేశాడు.

నేననుకున్న కథ ప్రకారం సినిమా చివర్లో కూడా హీరోకంటే ఎక్కువ వెయిటేజ్ ఆ కేరెక్టర్‌కు ఇచ్చాను.

ఇలా చేయడం వల్ల నేను ఆ విలన్ దగ్గర బాగా డబ్బులు తీసుకున్నానని అప్పట్లో ఆ చిత్రంలోని హీరో అనుకోవడం, అనడం కూడా జరిగింది.

హీరో నేనూ గుడ్ ఫ్రెండ్స్. అది వేరే విషయం.


కట్ చేస్తే - 

ఇప్పుడా విలన్ మంచి పొజిషన్‌లో ఉన్నాడు. నేను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నటుడు కాబట్టి నాకు నిజంగానే సంతోషంగా ఉంటుంది. ఆ నటునిపట్ల, అతని నటనపట్ల నా అలోచన మారదు. గౌరవం మారదు.

ఇంతకు మించి నేను ఆలోచించను. వేరే ఆశించను.

మొన్నొక మిత్రుడు చెప్పాడు. ఆ నటుని ఇంటర్వ్యూ ఒక దినపత్రిక ఆదివారం ఎడిషన్లో వచ్చింది. ఎవరెవరి గురించో చెప్పాడు కానీ .. తొలి అవకాశం ఇచ్చి, ఇండస్ట్రీకి  పరిచయం చేసి, అంత పూర్తిస్థాయి విలన్ రోల్ ఇచ్చిన నీ పేరు చెప్పలేదు ఆ నటుడు అని.

నేను నవ్వాను.

ఇదంతా ఉట్టి ట్రాష్. అసలు పట్టించుకోకూడదు.

ఇక్కడ ఎవరు లైమ్‌లైట్‌లో ఉంటే వాళ్లే తోపులు.

అసలు సినిమా అంటేనే ఇది.   

Sunday, 12 March 2017

జీవితం చాలా చిన్నది!

ఫేస్‌బుక్, బ్లాగ్ నుంచి కొద్దిరోజులు పూర్తిగా బ్రేక్ తీసుకుందామనుకుంటున్నాను. కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేవరకు.

ఇలా ట్వీట్ పెట్టడం ఆలస్యం .. మళ్లీ వెంటనే ఇంకో ట్వీట్ పెట్టాను:

"నా ఫేస్‌బుక్, బ్లాగ్‌ల డియాక్టివేషన్ ఈ అర్థరాత్రి నుంచే అమలు!"
నా టీమ్‌కు, నేను అందుబాటులో ఉండాల్సిన ముఖ్యమైనవారికి మాత్రం ఫోన్‌లో అప్పుడప్పుడూ అందుబాటులో ఉంటాను .. అని.

అదీ మ్యాటర్.

ఫేస్‌బుక్ మీద నాకు అంత విరక్తి వచ్చేసింది!

అసలు దానిమీద విరక్తి అనేకంటే, నాకే జ్ఞానోదయమైంది అనుకోడం బెటర్.

ట్విట్టర్‌తో అంత టైమ్ వేస్ట్ కాదు. అదొక్కటి మాత్రం అలా కొనసాగిస్తాను. మీడియాలో ఉన్నంతకాలం అదొక్కటయినా ఉండకపోతే కష్టం.

స్ట్రగుల్ ఫర్ ఎక్జిస్టెన్స్!

పైగా, ఫేస్‌బుక్ లాగా ట్విట్టర్ అంత బోరింగ్ కాదు.

ఒక్క ట్వీట్‌తో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చెయ్యొచ్చు. బాగా తిట్లు కూడా తినొచ్చు.

అది వేరే విషయం.

త్వరలోనే నా ఫేవరేట్ నోకియా 3310 తీసుకొని, వాట్సాప్‌లకు, యాండ్రాయిడ్‌లకు కూడా మెల్లిగా గుడ్ బై చెప్పాలని కోరిక.

ఇవన్నీలేని పాతరోజులే బాగున్నాయి. నిజానికి, అప్పుడే ఇంకా హాప్పీగా ఉన్నాను.

అసలిదంతా ఎందుకు అంటే .. నేను పూర్తిచేయాల్సిన పనులు, బాధ్యతలు చాలా ఉన్నాయి. రోజుకి ఒక 40 నిమిషాలు, గంటయినా సరే .. ఫేస్‌బుక్‌కు కెటాయించలేను.

జీవితం చాలా చిన్నది.

గొప్పది కూడా.

ఇప్పుడు నాకదే ముఖ్యం. 

Saturday, 11 March 2017

ది లేటెస్ట్ బిగ్ బిజినెస్!

సినిమా ఇప్పుడొక బిగ్ బిజినెస్.

ఇందులో ఎలాంటి డౌట్ లేదు.

సరైన మార్కెట్ స్టడీ,  అవగాహనతో ప్లాన్ చేసి సినిమా తీస్తే ఎలాంటి నష్టం ఉండదు. లాభాలు కోట్లలో ఉంటాయి.

అవగాహన లేకుండా వేసే స్టెప్పులు, తీసుకొనే నిర్ణయాలు మాత్రమే ఇక్కడ పనిచేయవు.

అది ఇక్కడనే కాదు. ఏ బిజినెస్‌లోనైనా అంతే.

చిన్న బడ్జెట్ సినిమా అయినా, పెద్ద బడ్జెట్ సినిమా అయినా .. 'మనీ ఫ్లోటింగ్' విషయంలో ఈ ఫీల్డులో ఉండేంత ఫెసిలిటీ, ఫ్లెక్సిబిలిటీ మరే బిజినెస్‌లోనూ ఉండదు.

80 కి పైగా సినిమాలు తీసిన ఒక సెన్సేషనల్ ప్రొడ్యూసర్ మాటల్లో .. ఒక్క ముక్కలో చెప్పాలంటే .. "అసలు సినిమాల్లో ఉన్నంత డబ్బు మరెక్కడా లేదు."

ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ కూడా ఊహించనంత స్థాయిలో పెరిగింది.

కొన్ని లక్షలుమాత్రమే పెట్టి, కొత్తవాళ్లతో తీసే చిన్న సినిమా సుమారు 20 కోట్లు మార్కెట్ చేస్తుంటే, కోట్లు పెట్టి తీస్తున్న పెద్ద స్టార్స్ సినిమాలు 200 నుంచి 1000 కోట్ల మార్కెట్‌ను  ఎప్పుడో దాటేశాయి.

ఏ బాహుబలి లాంటి సినిమానో తప్ప .. ఇదంతా కొన్ని నెలల్లో జరిగే బిజినెస్!

ఇప్పటి సినిమా వ్యాపార వాస్తవం ఇలా ఉంటే -
 
'ఏ వ్యాపారంలో అయినా పెట్టుబడి పెట్టొచ్చు కానీ, సినిమాల్లో మాత్రం పెట్టొద్దు' అని మొన్నటివరకూ సొసైటీలో ఒక గుడ్డి వాదన ఉండేది. ఇదొక 'హెవీ గ్యాంబ్లింగ్' అని వాళ్ల ఉద్దేశ్యం.

కానీ అదంతా అర్థంలేని ఉట్టి బుల్‌షిట్ అన్న నిజాన్ని ఇప్పటి తరం అగ్రెసివ్ బిజినెస్‌మెన్ గుర్తించారు. కాబట్టే, "అబ్బో సినిమాల్లోనా!" అని ఇంతకుముందులా భయపడ్డంలేదెవ్వరూ.

అసలు సినిమాల్లో ఎంత డబ్బుందో కూడా గుర్తించారు.

అందుకే ఇప్పుడు ఎందరో ఎన్ ఆర్ ఐ లు, కార్పొరేట్‌లు, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్, వాళ్లూ వీళ్లూ అని లేకుండా, అందరూ .. ఇటు ఎంట్రీ ఇస్తున్నారు.


కట్ టూ డబ్బు ప్లస్ -

ఫేమ్, డబ్బుతోపాటు, ఇంకే రకంగా తీసుకున్నా .. ఈ ప్రపంచంలో పాలిటిక్స్, క్రికెట్‌తో పోటీపడేది ఏదన్నా ఉందంటే అది సినిమా ఒక్కటే.

పిచ్చి మనీ ఫ్లోటింగ్‌తోపాటు, సినిమా బిజినెస్‌లో ఉండే మరికొన్ని లాభాలు ఏ ఇతర బిజినెస్‌ల్లోనూ లేవు. ఉండవు.

ఇతర అన్ని వ్యాపారాల్లోనూ బాగా డబ్బు సంపాదించొచ్చు. కానీ ..

రాత్రికిరాత్రే ఫేమ్‌నూ, ఒక సెలబ్రిటీ హోదానూ, ప్రపంచవ్యాప్త గుర్తింపునూ తెచ్చుకోవడం మాత్రం ఒక్క సినిమాల్లోనే సాధ్యం.

కనీసం ఒక 40 టీవీ చానెళ్ళూ, అన్నీ కలిపి కనీసం మరో 100 వెబ్‌సైట్స్, ఫిల్మ్ మేగజైన్స్, న్యూస్ పేపర్లు, వెబ్ చానెళ్ళు, సోషల్ మీడియాల్లో మీ పరిచయం-కమ్-ప్రమోషన్ గ్రాఫ్ ఓవర్‌నైట్‌లో మిమ్మల్ని ఒక రేంజ్‌కు తీసుకెళ్తుంది.

ఈ అడ్వాంటేజ్ ప్రపంచంలోని మరే ఇతర బిజినెస్‌లో లేదు. ఉండదు.

దటీజ్ సినిమా. 

Wednesday, 8 March 2017

విమెన్స్ డే గురించి నాకెలా తెలిసింది?

"ఏయ్ మనోహర్, ఏంటి నన్ను విష్ చెయ్యవా? నన్నే కాదు .. క్లాస్‌లో ఉన్న అమాయిలందర్నీ విష్ చెయ్యాలి నువ్వీరోజు!"

నేను క్లాస్‌లోపలికి ఎంటరవుతూనే, మా రష్యన్ డిప్లొమా మేడమ్ కల్పన నన్ను పట్టుకొని ఇంగ్లిష్‌లో అన్నారు. 

సుమారు పాతికేళ్లక్రితం, నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్‌లో మూడేళ్ల రష్యన్ పార్ట్‌టైమ్ డిప్లొమా చదువుతున్నప్పటి సందర్భం అది.

నాకేం అర్థం కాలేదు.

మేడమ్‌ను ఒక్కదాన్నే విష్ చెయ్యడం అంటే తన బర్త్‌డే అనుకోవచ్చు. అమ్మాయిలందర్నీ ఎందుకు విష్ చెయ్యాలో ఎంత ఫాస్ట్‌గా ఆలోచించినా నాకు అస్సలు వెలగలేదు.

అప్పుడు ఇప్పట్లా కంప్యూటర్స్ లేవు. ఇంటర్‌నెట్ లేదు. సంవత్సరంలోని 365 రోజులకు 365 ఏవేవో 'డేస్' ఉన్నాయని సొదపెట్టే గూగుల్, ఫేస్‌బుక్కులు లేవు.

ఇంటర్నేషనల్ విమెన్స్ డే గురించి, దాని వెనకున్న రష్యన్ నేపథ్యం గురించీ ఆరోజు మేడమ్ చెప్పారు. తర్వాత, ఆ డిప్లొమా క్లాస్‌లో ఉన్న ఏకైక బాయ్ స్టుడెంట్‌నైన నాతో తను గ్రీటింగ్స్ చెప్పించుకున్నారు. క్లాస్‌లో ఉన్న ఇంకో డజన్ మంది అమ్మాయిలకు కూడా నాతో గ్రీటింగ్స్ చెప్పించారు.


కట్ టూ కల్పనా మేడమ్ - 

మా రష్యన్ ప్రొఫెసర్ మురుంకర్ అంటే నాకెంత గౌరవమో, కల్పనా మేడమ్ అన్నా నాకంతే గౌరవం, ఇష్టం.

నాకు నాలుగు ముక్కలు ఇంగ్లిష్ రావడానికి, రష్యన్ భాషలో నేను నా పెన్ ఫ్రెండ్స్‌కు వందలకొద్దీ ఉత్తరాలు రాయడానికీ, ఆ కాలంలో టెలిఫోన్ ఎక్స్‌చేంజ్‌కు వెళ్లి ల్యాండ్ ఫోన్ నుంచి ఫ్రీగా రష్యాకు ఫోన్ చేసి అక్కడున్న ఫ్రెండ్స్‌తో రష్యన్‌భాషలో మాట్లాడ్దానికీ, మూడేళ్ల రష్యన్ డిప్లొమాలో నేను యూనివర్సిటీ టాపర్ కావడానికీ, ఎన్నో కథానికలు గట్రా నేరుగా రష్యన్ నుంచి తెలుగులోకి నేను అనువాదం చెయ్యడానికీ, ఇండియా వచ్చిన రష్యన్ సైంటిస్టులకు, ఆర్టిస్టులకు ఇంటర్‌ప్రీటర్‌గా నేను పనిచెయ్యడానికీ, చివరికి అసలు డ్రైవింగ్ అంటేనే తెలియని నేను మొట్టమొదటిసారి ఒక టూవీలర్ ఎక్కి డ్రైవ్ చెయ్యడానికి కూడా ఒక తిరుగులేని కారణం .. ఒక ఊహించని ఇన్స్‌పిరేషన్ .. కల్పనా మేడమ్.

ఇప్పుడు తను ఎక్కడున్నారో నాకు తెలియదు. కనుక్కోవాలి. వీలైతే కలవాలి.

హాపీ విమెన్స్ డే మేడమ్! 

Sunday, 5 March 2017

జస్ట్ ఫర్ ఫన్!

మనలో చాలా మందికి ఫేస్‌బుక్‌లో ఒక 5 వేలమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఇంకో 2 వేలమంది కనీసం ఫాలోయర్స్ ఉంటారు.

నిజంగా మనకేదైనా సమస్య వచ్చినప్పుడు, లేదా అత్యవసరమైన సహాయం ఏదైనా కావల్సివచ్చినప్పుడు .. ఈ వేలాది ఫ్రెండ్స్‌లో నిజంగా ఎంతమంది స్పందిస్తారు?

దీనికి సమాధానం మీ అందరికీ తెలుసు.

కేవలం ఒకరో, ఇద్దరో స్పందించినా గొప్పే. అలా స్పందించినవాళ్లే నిజమైన ఫ్రెండ్స్.  మిగిలినవాళ్లంతా జస్ట్ పేపర్ రిలేషన్స్.

అంతే.

ఈ కోణంలో చూసినప్పుడు ఫేస్‌బుక్ అనేది ఒక ఎంటర్‌టైన్‌మెంట్. ఒక టైమ్‌పాస్. అంతకుమించి ఏం లేదు. ఏం ఆశించకూడదు.


కట్ చేస్తే - 

సోషల్ మీడియా చాలా శక్తివంతమైంది. దీన్ని నిజంగా బాగా ఉపయోగించుకోగలిగితే .. దానికి ఆకాశమే హద్దు.

నేను ఫేస్‌బుక్, ట్విట్టర్, బ్లాగ్ లను ఈ కోణంలోనే చూస్తాను. ఈ కోణంలోనే ఉపయోగిస్తాను. అప్పుడప్పుడూ కొంత చెత్త తప్పదనుకోండి. నిజానికి అదికూడా నా ప్రొఫెషనల్ వర్క్‌లో భాగమే ఒక రకంగా. కానీ అలా కనిపించదు ఏదీ.

ఫేస్‌బుక్ క్రియేటర్ దీంతో ప్రపంచాన్నే కనెక్ట్ చేశాడు. బిలియన్లు సంపాదిస్తున్నాడు. మరి మనమేం చేస్తున్నాం దీంతో?

ఒకసారి ఆలోచించాలి ...