Sunday 31 January 2016

ఏది వ్యక్తిగతం?

"పబ్లిక్‌లోకి వచ్చాక ఎవరి వ్యక్తిగతం కూడా వ్యక్తిగతం కాదు. అంతా పబ్లిక్కే!" .. కొంచెం అటూఇటుగా ఇదే మాటను శ్రీశ్రీ ఎక్కడో అన్నట్టు గుర్తు.

అప్పటి విషయం ఏమోగానీ, సోషల్ మీడియా అనేది మన జీవితంలో ఒక విడదీయరాని భాగమైన ఈ రోజుల్లో మాత్రం పైన చెప్పిన మాట చాలావరకు నిజం. పబ్లిక్‌లోకి వచ్చిన ప్రతి చిన్నా పెద్దా సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, ఇతర వి ఐ పి లకే కాదు .. ఇప్పుడిది అందరికీ వర్తిస్తుంది.

ఫేస్‌బుక్‌లో "అస్సలు వ్యక్తిగతం కాదు" అనుకున్న స్టఫ్ ఏది పోస్ట్ చేసినా - కనీసం అంతర్లీనంగానైనా ఆ పోస్ట్ ఆ వ్యక్తి మనస్తత్వం, ఆలోచనాధోరణినిని కొంతైనా ప్రతిబింబిస్తుంది. ట్వీట్స్, బ్లాగింగ్ విషయంలోనూ అంతే. వ్యక్తిగతం కానిది ఏది రాసినా, రాస్తున్నామనుకున్నా .. అందులో ఎంతో కొంత మన వ్యక్తిత్వం, వ్యక్తిగతం తొంగిచూస్తుంది. తప్పదు.

కట్ టూ నా వ్యక్తిగతం - 

ఫేస్‌బుక్, ట్విట్టర్, బ్లాగ్ .. ఇవన్నీ కలిపి ఒక ఎంటిటీగా నా ప్రయోగశాల. నా మెడిటేషన్ సెంటర్. నా ఏకాంతం. నా ఆత్మశోధన. నా అంతరంగం.

మొత్తంగా - ఒక నేను.

నా జీవితం, జీవనశైలి, నా ఆలోచనలు, నా అంతరంగం, నా సంఘర్షణలు, నా సమస్యలు, నా ఆనందాలూ,నా ఆవేదనలూ అన్నీ వీటిలో అలా రిఫ్లెక్ట్ అవుతుంటాయి. నేను వద్దనుకున్నా.

అలా అవకూడదు అని ఎవరైనా అనుకుంటున్నారంటే, అంతకంటే ఫూలిష్‌నెస్ మరోటి ఉండదు. ఆ ఫూలిష్‌నెస్ నుంచి నేను ఎన్నడో బయటపడ్డాననే అనుకుంటున్నాను. కాకపోతే, అణచిపెట్టుకొంటున్న నా అగ్రెసివ్ ఆలోచనలనెన్నింటినో నిర్భయంగా, డైరెక్ట్‌గా, నా మనసులో అనుకున్నంత ఓపెన్‌గా షేర్ చేసుకొనే సమయం కోసమే ఎదురుచూస్తున్నాను.

ఆ స్వతంత్రాన్ని అతి త్వరలోనే సాధిస్తాను. ఆ నమ్మకం నాకుంది.

Monday 25 January 2016

ఒకే ఒక్కడు!

"ఈ మధ్య ఫేస్‌బుక్ అంతా ఒకే ఒక్క ప్రొడ్యూసర్ తెగ దున్నేస్తున్నారు. ఎవరో చెప్పగలరా?" అని మొన్న సరదాగా నా టైమ్‌లైన్ మీద ఒక పోస్ట్ పెట్టాను. వెంటనే ఆన్సర్ వచ్చేసింది.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ.

కట్ టూ ఫ్లాష్‌బ్యాక్ - 

అది 2006 అని నాకు బాగా గుర్తుంది. ఆరోజు, శాటిలైట్‌రైట్స్ బిజినెస్ చేసే కె వి వి అనే ఒక థర్డ్ పార్టీ వ్యక్తి ఆఫీసు హాల్లో మా మేనేజర్‌తో కలిసి కూర్చునివున్నాన్నేను. అప్పుడా ఆఫీస్ శ్రీనగర్ కాలనీలోని ఒక ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండేది. 

అప్పుడే - చూడ్డానికి చాలా మామూలుగా ఉన్న ఒక వ్యక్తి మేం కూర్చున్న అదే హాల్లోకి ఎంటరయ్యాడు. పక్కనే ఉన్న ఇంకో సోఫాలో కూర్చుని, ఏదో ఫిలిం మేగజైన్ చేతిలోకి తీసుకున్నాడు.

"ఇదిగో ఈయనే .. రామసత్యనారాయణ అంటే! 'శాటిలైట్ సినిమాలు' తీస్తాడు!!" అని అక్కడున్న ఒకరు చిన్నగా నాతో అన్నారు. తర్వాత ఆయన గురించే ఇంకా ఏవేవో నాలుగు మాటలు అదే హాల్లో ఉన్న ఇంకొందరు కూడా మాట్లాడుకున్నారు.

అప్పుడు నేను విన్న ఆ మాటలన్నిటిలోనూ ఒకరకమైన చిన్నచూపు, ఎగతాళి నేను గమనించాను.

అవన్నీ ఆయనకు వినిపిస్తున్నా, అసలేమీ పట్టించుకోకుండా చేతిలో ఉన్న మేగజైన్‌లో సినిమా న్యూస్ చదువుకొంటూ కూర్చున్నారాయన. ఆ దృశ్యం నాకింకా గుర్తుంది.

కట్ చేస్తే - 

అదే 2006 లో, నిర్మాతగా ఆయన 13 సినిమాలు తీసి రిలీజ్ చేశారు.

అది రికార్డ్. గ్రేట్ రికార్డ్!

దాదాపు అంతా స్టార్స్‌తోనే సినిమాలు తీసిన రామసత్యనారాయణ, ఇప్పటివరకు మొత్తం 78 సినిమాలు తీశారు. ఈ మొత్తం 78 సినిమాల్లో కేవలం 4 మాత్రం డబ్బింగ్ సినిమాలు.  ఆయన భీమవరం టాకీస్ బ్యానర్లో ప్రస్తుతం ఇంకో 2 సినిమాలు ప్రొడక్షన్లో ఉన్నాయి. ఏ ఒకటో, రెండో సినిమాల్లో కొంచెం హెచ్చుతగ్గులు తప్ప ఆయనకు అసలు నష్టం అంటే ఏమిటో ఇప్పటివరకూ తెలియదు!

కట్ టూ హిజ్ సక్సెస్ సాగా - 

ఎవరో ఏదో అనుకుంటారని సగం సగం పనులు చేయలేదాయన. తను అనుకున్న విధంగా సినిమా వ్యాపారం చేశారాయన. శాటిలైట్ రైట్స్ ఉన్నప్పుడు అందరూ ఆ రైట్స్‌ను దృష్టిలో పెట్టుకొనే సినిమాలను ప్లాన్ చేశారు. ఆయనా అదే చేశారు.

అయితే, ఎవరి బిజినెస్ స్టైల్ వారిది.

ఇక్కడో గొప్ప విషయం మనమంతా గమనించాలి. శాటిలైట్ రైట్స్ లేని ఈరోజుల్లో కూడా - కేవలం థియేటర్ బిజినెస్‌ను నమ్ముకొని, ఎలాంటి బ్రేక్ లేకుండా, రోజూ తన సినిమాల షూటింగ్ పనిలోనే బిజీగా ఉన్నారు రామసత్యనారాయణ.

దటీజ్ హిజ్ బిజినెస్ స్టైల్!

2004 లో సినీరంగప్రవేశం చేసిన రామసత్యనారాయణ - ప్రారంభంలో ఒక పెద్ద దెబ్బ తిన్నా వెనక్కి తగ్గలేదు. వెనుదిరిగిపోలేదు. "సినిమాతీయడానికి లక్షలు కాదు కావల్సింది, లక్ష్యం" అనుకున్నారు. కేవలం 12 ఏళ్లలో - నిర్మాతగా ఇప్పటివరకూ ఆయన తీసిన మొత్తం 78 సినిమాల్లో హిందీ, ఇంగ్లిష్, తమిళం, భోజ్‌పురి సినిమాలు కూడా ఉన్నాయి.

తన 73, 74 వ సినిమాలకు ఏకంగా జాతీయస్థాయిలో ఒక పారలల్ ఇండస్ట్రీని నడిపిస్తున్న రామ్‌గోపాల్‌వర్మ నే దర్శకునిగా తీసుకోగలిగే స్థాయికి రీచ్ అయ్యారు. ఆయనతో "ఐస్‌క్రీమ్", "ఐస్‌క్రీమ్2" సినిమాలు తీశారు. ఇంకా తీస్తూనే ఉన్నారు.

ఆర్ జి వి తో ఆయన తీస్తున్న "ఎటాక్", "స్పాట్" సినిమాలు ఇంకా ప్రొడక్షన్లో ఉన్నాయి.

కట్ చేస్తే -

ఇప్పుడు టీవీ ప్రోగ్రామ్‌లు, సినిమా ఫంక్షన్లు, ఫిలిం న్యూస్‌లు, ఫేస్‌బుక్ .. ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తున్నారు.

రామసత్యనారాయణ.

మరి .. అప్పుడు 2006 లో, ఆరోజు, ఆయన మీద కామెంట్స్ చేసినవాళ్లంతా ఎక్కడున్నారో నాకు తెలుసు. ఆయన వైభవాన్ని చూస్తూ అక్కడే ఉన్నారు. కేరాఫ్ గణపతి కాంప్లెక్స్. లేదంటే క్రిష్ణానగర్ గల్లీలు!

ఒక సినిమాతీసి రిలీజ్ చేయడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో - ఈ కొత్త సంవత్సరం 2016 లో, ఇప్పటికే, 10 మంది కొత్త దర్శకులతో 10 కొత్త సినిమాలు ఎనౌన్స్ చేశారు. వాటిలో 2 సినిమాలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి.

ఇవి కాకుండా, 4 డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.

ఆల్ ది బెస్ట్ రామసత్యనారాయణ! యూ రియల్లీ రాక్ ..  

Saturday 23 January 2016

మూవీస్కేపింగ్!

స్వాగత్‌గ్రాండ్‌లో సుమారు నాలుగు గంటల చర్చలు!

ఈ మధ్యకాలంలో అంతసేపు, అంత ఆత్మీయంగా, అంత నిర్మాణాత్మకంగా ఎవ్వరితోనూ నేను మీటింగ్స్‌లో కూర్చోలేదు. కానీ, ఇవాళ జరిగిందది.

ఆయనెవరో కాదు ..

నా ఆత్మీయ మిత్రుడు, జాతీయస్థాయిలో నాలుగోస్థానంలో గుర్తించబడిన ప్రముఖ లాండ్‌స్కేప్ డిజైనర్ కె పి రావు.

శరద్‌పవార్, జయలలిత, సోనమ్‌కపూర్ మొదలైన వారెందరితోనో పనిచేసిన స్థాయి ఆయనకుంది. ఆయన్ని మరీ ఇబ్బంది పెట్టకుండా ఉండటంకోసం ఇంకా చాలామంది వి ఐ పి లు/సెలబ్రిటీల పేర్లు నేనిక్కడ లిస్ట్ చేయడం లేదు.

అంత "డౌన్ టూ ఎర్త్" వ్యక్తిత్వం ఆయనది.

ఇండియాలోనూ, బయటా - ఎన్నో అత్యున్నతస్థాయి కార్పొరేట్ కంపెనీలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఇతర ఎన్నో సంస్థల అధినేతలెందరో ఆయన అపాయింట్‌మెంట్ కోసం నెలలకొద్దీ వెయిట్ చేస్తుంటారు. ఇది అతిశయోక్తికాదు. వాస్తవం.

నేనక్కడ కూర్చుని ఉండగానే ఫోన్లో ఒక విదేశీ కంపెనీకి తన అపాయింట్‌మెంట్ జూన్‌లో ఇచ్చారు. ఇది జనవరి!

అలాంటి నా మిత్రుడు రావు, నేనూ కలిసి ఒక హోటల్లో కల్సుకొని, ఒక నాలుగు గంటలపాటు చర్చించుకున్నామంటే .. ఎవరైనా ఇట్టే ఊహించవచ్చు .. విషయం ఎంత సెన్సేషనల్‌ది అయ్యుంటుందో!

ఏంటా విషయం?
ఏంటా ప్రాజెక్ట్?
ఎప్పుడు .. ఎక్కడ .. ఎలా?

కొద్దిరోజుల్లోనే ఇవన్నీ మీకు తెలుస్తాయి. అప్పటిదాకా చిన్న సస్పెన్స్.

అంతే.

థాంక్ యూ మై డియర్ ఫ్రెండ్, రావు గారూ!  

తోపుడుబండి కవిత్వోద్యమం!

కొన్ని పనులు చేయాలంటే గట్స్ కావాలి ..

సాదిక్ భాయ్ ఉస్మానియా యూనివర్సిటీలో నాకు సీనియర్. ఒకే హాస్టల్. "ఏ" హాస్టల్లో ఆయన రూం నంబర్ 35 అయితే, నాది 55. అప్పటినుంచీ ఆయనేంటో నాకు బాగా తెలుసు. ఆయనకా గట్స్ ఉన్నాయి.
 

అసలు "తోపుడు బండి" ఏంటి? దానిమీద కవిత్వం అమ్మడం ఏంటి? .. అందరూ అలా అనుకుంటుండగానే తోపుడు బండి రావటం జరిగింది. దానిమీద సిటీ అంతా తిరుగుతూ వేలకొద్దీ పోయెట్రీ పుస్తకాల్ని అమ్మడమూ జరిగింది. మొన్నటి హైద్రాబాద్ బుక్‌ఫెయిర్‌లో స్టాల్ నంబర్ 10 లో ఒక సంచలనం క్రియేట్ చేయడం కూడా జరిగింది. దటీజ్ సాదిక్!!

ఆయన క్రియేట్ చేస్తున్న ఈ మార్కెటింగ్ సంచలనాలను చూస్తే ఆయన్ను - "పి టి బర్నమ్ ఆఫ్ ఇండియా" అనవచ్చేమో!

ఇప్పుడు అదే సాదిక్ భాయ్ 100 రోజుల్లో 1000 కిలోమీటర్ల తోపుడుబండి పాదయాత్ర రేపు ప్రారంభించబోతున్నాడు. ప్రతి పల్లెకూ తోపుడు బండి వెళుతుందిప్పుడు. గ్రంథాలయాలు లేని పల్లెల్లో వాటిని నెలకొల్పుకొంటూ మరీ ఈ యాత్ర జరుగుతుంది. ఇదింకో గొప్ప విశేషం. ఒక రకంగా - మరో గ్రంథాలయోద్యమమన్నమాట!

ఇంత గొప్ప కార్యక్రమానికి ఆరంభం రేపు ఉదయం 10 గంటలకు, ఉప్పల్ రింగు రోడ్డు వద్ద జరుగుతోంది. అందరం వెళదాం. సాదిక్ భాయ్ ని అభినందిద్దాం.

జయహో తోపుడుబండి! జయహో కవిత్వం!!

Wednesday 20 January 2016

క్రియేటివ్ కాసినో!

సినీ ఫీల్డు ఒక అద్భుత మాయాలోకం. ఇక్కడ లేనిది లేదు!

మరో కోణంలో చూస్తే - ఇదొక హెవీ గ్యాంబ్లింగ్ ఫీల్డు. ఈ గ్యాంబ్లింగ్ అనేది ఇక్కడ కేవలం క్రియేటివిటీ, డబ్బుతోనే కాదు, జీవితాలతో కూడా ఉంటుంది.

ఫీల్డులో అంతా బానే ఉన్నట్టుంటుంది. కానీ, నిజంగా ఎప్పుడు బావుంటుందో ఎవరికీ తెలీదు. చూస్తుంటే నెలలూ, సంవత్సరాలూ ఇట్టే గడిచిపోతాయి. ఓ అయిదేళ్ల తర్వాతో, దశాబ్దానికో, ఊహించని విధంగా "ఓవర్‌నైట్" సక్సెస్ వరిస్తుంది.

రాత్రికి రాత్రే జాతకాలు మారిపోతాయి.

సక్సెస్ వరించని 90 శాతం మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్ల సినీ ప్రయాణం మాత్రం అనుక్షణం మారిపోయే అగమ్యాలవైపు ఇంకా కొనసాగుతూనే ఉంటుంది.

బార్‌లోకెళ్లినవాడు ఏ బీరో తాగాలి తప్ప, కొబ్బరినీళ్లకోసం వెతక్కూడదు. ఇక్కడ తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇక్కడి స్టైల్లోనే తీసుకోవాలి. వ్యక్తిత్వాలూ, వంకాయలూ అంతా బుల్‌షిట్.

సినిమా ఈజ్ సినిమా!

అదొక్కటే లోకం కావాలి. ఆ లోకపు ప్రాథమిక సూత్రాలే నీ జీకే కావాలి. ఆ లోకపు లౌక్యమే నీ శ్వాస కావాలి. అప్పుడే నువ్వు కోరుకున్నవన్నీ అవే కలిసివస్తాయి. నువ్వు అనుకున్నది నిజమయ్యే చాన్స్ నీకు దగ్గరవుతుంది. ఏ ఓవర్‌నైట్‌లోనో అది  నిన్ను వరిస్తుంది.

సినిమా పుట్టినప్పటినుంచి ఇప్పటిదాకా, ఇకముందు కూడా .. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా, ఎక్కడయినా.. ఈ ఫీల్డులో సక్సెస్ రేట్ ఎప్పుడూ 5 శాతం దాటదు. చెప్పాలంటే, ఇంకా తక్కువే!

అవకాశం దొరకడమే ఇక్కడ చాలా కష్టం. అలా దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోడానికి ఎందరో ఎంతో ఖర్చు చేస్తారు. ఖర్చయిపోతారు.

డబ్బొక్కటే కాదు. జీవితం కూడా.

గట్స్.
ప్యాషన్.
నీడ్.
కంపల్షన్.

ఇది తెలిసి ఆడే జూదం.

ఒక క్రియేటివ్ గ్యాంబ్లింగ్. ఒక కల్చరల్ ఫేంటసీ.

ఒక క్రియేటివ్ కాసినో .. 

Saturday 16 January 2016

కొన్ని జ్ఞాపకాలు గమ్మత్తుగా ఉంటాయి ..

నా రెండో చిత్రం "అలా" లోని ఒక సీన్‌లో, హీరోయిన్ టైటానిక్ సినిమాలోని ఒక పాటను దాదాపు పల్లవి దాకా పాడాల్సిఉంటుంది.

షూటింగ్ టైమ్‌లో హీరోయిన్ విదిశ శ్రీవాస్తవ మంచి ఎక్స్‌ప్రెషన్‌తో బాగానే పాడింది. కానీ, సినిమాపరంగా అది సరిపోదు. ఇంకా బాగా, దాదాపు ఒక సింగర్ పాడినంత బాగా ఉండాలి.

కట్ చేస్తే - 

డబ్బింగ్ టైమ్‌లో డెసిషన్ తీసుకొని, మా మ్యూజిక్ డైరెక్టర్ కె పి తో చర్చించాను. అర్జెంటుగా ఒక అప్‌కమింగ్ సింగర్ కావాలి. ఆ సీన్‌లోని ఆ చిన్న టైటానిక్ సాంగ్ బిట్ ను విదిశ లిప్‌కు సింక్ చేస్తూ పాడాలి అని చెప్పాను.

కట్ చేస్తే -

మర్నాడు ఉదయం బాగా ఫెయిర్‌గా ఉన్న ఒక సింగర్ వాళ్ల అమ్మగారితో అనుకుంటాను కలిసి టాలీవుడ్ స్టూడియోకి వచ్చింది. కె పి, ఆ అమ్మాయి రికార్డింగ్ స్టూడియోలో గ్లాస్ కు అవతల ఉంటే, నేను ఇవతల ఇంజినీర్ దగ్గర కూర్చుని ఇద్దరికీ నాకు కావల్సిన విధంగా చెప్తూ ఆ చిన్న టైటానిక్ సాంగ్ బిట్ "Every night in my dreams .. I see you .. I feel you .." పాడించుకున్నాను. పాట చాలా బాగా వచ్చింది.

కట్ చేస్తే -

ఎక్కడో బి ఎన్ రెడ్డి నగర్ నుంచి అనుకుంటాను ఆ కొత్త సింగర్ వచ్చింది. అప్పటికి ఒకటో రెండో చిన్న సినిమాల్లో పాడి ఉంటుంది. కానీ అవి అప్పటికింకా రిలీజ్ కాలేదు. (బహుశా ఇప్పటికి కూడా!)

తన ట్రాన్స్‌పోర్ట్, రెమ్యూనరేషన్ అన్నీ కలిపి ఒక వెయ్యో, రెండు వేలో నేనే ఇచ్చాను. ఒక ఫేసినేటింగ్ స్మైల్‌తో "థాంక్యూ సర్!" చెప్పి వెళ్ళిపోయిందా కొత్త సింగర్.

అది 2006.

ఇప్పుడా సింగర్ వన్ ఆఫ్ ద టాప్ సింగర్స్ ఇన్ టాలీవుడ్.

గీతామాధురి!

Wednesday 13 January 2016

సినిమా స్క్రిప్టు రచనాశిల్పం - 2

సినిమాల్లోకి నేను డైరెక్టుగా ఎంటర్ అవకముందు, కొన్నాళ్లు రైటర్‌గా/ఘోస్ట్ రైటర్‌గా పనిచేశాను.

అప్పుడు నేను ఆలిండియా రేడియోలో పనిచేస్తుండేవాణ్ణి.

రైటర్‌గా, ఘోస్ట్ రైటర్‌గా కొంతమంది దర్శకులకు, రచయితలకు స్క్రిప్టులు రాసిచ్చిన ఆ అనుభవంతో - తెలుగు ఇండస్ట్రీ నేపథ్యంగా, అప్పట్లో స్క్రిప్ట్ రైటింగ్‌ పైన నేనొక పుస్తకం రాశాను. అదే ఈ సినిమా స్క్రిప్టు రచనాశిల్పం.

"బెస్ట్ బుక్ ఆన్ ఫిలింస్" కేటగిరీలో ఆ పుస్తకం నాకు నంది అవార్డును సంపాదించిపెట్టింది. 5 వేల కాపీలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

మార్కెట్లో డిమాండ్ ఉన్నా - తర్వాత నేను మళ్ళీ ఆ పుస్తకం రీప్రింట్ వెంటనే వేయలేదు. నవోదయ, విశాలాంధ్ర బుక్ హౌస్ వాళ్లు నన్ను చాలా సార్లు దీనిగురించి గుర్తు చేసినా నేనాపని చేయలేదు.

కారణం ఒక్కటే ..

ఆ తర్వాత నేను అనుకోకుండా దర్శకుడినయ్యాను.

దర్శకుడిగా నా మరిన్ని అనుభవాలను, వ్యూస్‌నూ కూడా కలిపి .. నా సినిమా స్క్రిప్టు రచనాశిల్పం పుస్తకాన్ని కొంత "రివైజ్" చేసి మళ్ళీ కొత్తగా పబ్లిష్ చేయలన్నది నా అలోచన.

ఇంతకుముందు పోస్టులోనే చెప్పినట్టు - డైరెక్టర్‌గా 4 సినిమాలు తీసి రిలీజ్ చేసిన తర్వాత కూడా నా అప్పటి ఆలోచన ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.

ఆమధ్య నా మిత్రుడు, ఒక ప్రముఖ సాహితీ మేగజైన్ ఎడిటర్ - "నేను పబ్లిష్ చేస్తా"నని నా వెంటపడి, నాచేత రివైజ్‌డ్ స్క్రిప్ట్ రాయించి, నా దగ్గర్నించి ఈ పుస్తకం రివైజ్‌డ్ మాన్యుస్క్రిప్ట్ తీసుకున్నాడు. కానీ, సంవత్సరం తర్వాత కూడా ఆ పని జరగలేదు. ఇక చేసేదేంలేక నా పుస్తకం మాన్యుస్క్రిప్ట్ అతని దగ్గర్నుంచి వెనక్కి తీసుకున్నాను.

కట్ చేస్తే - 

ఇప్పుడు మళ్లీ నేనే నా పుస్తకం కొత్త రివైజ్‌డ్ ఎడిషన్‌ను పబ్లిష్ చేయడానికి నిర్ణయించుకున్నాను. ప్యాషనేట్ మిత్రులెవరైనా ఈ విషయంలో నాకు ఆర్థికంగా కొంతయినా తోడ్పడగలిగితే సంతోషం. నా ఈమెయిల్‌ mchimmani@gmail.com కు, లేదా నా ఫేస్‌బుక్ ఇన్‌బాక్స్‌కు మీ నంబర్ పంపండి. నేనే మీకు కాల్ చేస్తాను.

అన్నట్టు - ఈ రివైజ్‌డ్ పుస్తకం కొత్త ఎడిషన్‌ను - ఇప్పుడు నేను ప్లాన్ చేస్తున్న నా తాజా సినిమాకు సంబంధించిన ఏదో ఒక ఫంక్షన్‌లో సినీ ప్రముఖుల మధ్య కొంచెం భారీగానే రిలీజ్ చేస్తాను. లేదంటే - ఈ పుస్తకం రిలీజ్ కోసమే ప్రత్యేకంగా సినీ ప్రముఖులతో ఒక ఫంక్షన్ ప్లాన్ చేస్తాను.  

Monday 11 January 2016

సినిమా స్క్రిప్టు రచనాశిల్పం - 1

నేను రాసిన "సినిమా స్క్రిప్టు రచనాశిల్పం" పుస్తకం అప్పట్లో హాట్‌కేక్‌లా 5 వేల కాపీలు అమ్మటం జరిగింది. తర్వాతనే నేను డైరెక్టర్ అయ్యాను. ఆ అనుభవంతో పుస్తకాన్ని రివైజ్ చేసి మళ్లీ ప్రింట్ చేయొచ్చులే అనుకున్నాను. కానీ, నాలుగు సినిమాలు పూర్తయినా ఆ పని చేయలేకపోయాను ఈ రోజువరకూ!

కట్ టూ జిరాక్స్-

నవోదయ, విశాలాంధ్రవాళ్లు ఎన్నిసార్లు అడిగినా నేను మళ్లీ వేయలేకపోయిన నా పుస్తకాన్ని - ఫిలిం నగర్ కాంప్లెక్స్‌లో ఉన్న జిరాక్స్ సెంటర్‌లో బాహాటంగానే జిరాక్స్ కాపీలుగా అమ్మారు. నేనూ ఒక కాపీ కొనుక్కున్నాను .. ఆ విషయం నిజమే అని తెలుసుకోడానికి!

అయితే నేనే ఆ పుస్తక రచయితనని ఆ జిరాక్స్ షాప్ వాళ్లకు తెలీదు. నేనా పుస్తకం రాసిందే చదవటం కోసం కాబట్టి - అలా అమ్మడం నాకు సంతోషంగానే అనిపించింది. కాపీరైట్ చట్టప్రకారం అది నేరమే అయినా!

కట్ టూ ఫిల్మ్ స్కూల్ - 

నా పుస్తకాన్ని దేవదాస్ కనకాల గారి ఫిల్మ్ ఇన్స్‌టిట్యూట్‌లో చేరిన విద్యార్థులకు ఒక కాపీ ఇచ్చేవారట .. విధిగా చదివితీరాలని! థాంక్స్ టూ దేవదాస్ కనకాల గారు ..

కట్ టూ వి ఏ కె - 

సుప్రసిధ్ధ "సకలకళావల్లభులు" వి ఏ కె రంగారావు గారు నా పుస్తకం చదివి నాకు ఉత్తరం రాశారు. 5 కాపీలు తీసుకున్నారు, తనకు తెలిసినవాళ్లకు ఇవ్వడానికి. ఆ తర్వాత మేము చెన్నైలోని వారి ఇంట్లో మూడునాలుగు సార్లు కలిశాము. ఆప్యాయంగా నా చేత "తాతా" అని పిలిపించుకున్నారు. వారింట్లో ఉన్న వేలాది గ్రాంఫోన్ రికార్డులు, పుస్తకాల మధ్య కూర్చుని తాత గారిని నేను ఇంటర్వ్యూ కూడా చేశాను. ఆ క్యాసెట్ నా దగ్గర ఇంకా ఉంది. వారి మీద ఓ పెద్ద ఆర్టికిల్ కూడా రాశాను.    

కట్ టూ ఫినిషింగ్ టచ్ -

స్క్రిప్ట్ రైటింగ్ పైన రాసిన నా ఈ పుస్తకం వచ్చాక - అప్పటిదాకా ఈ అలోచనే రాని పెద్ద సినీ రచయితలు ఇలాంటిదే ఓ పుస్తకం రాసి పబ్లిష్ చేశారు. అదంతగా పాపులర్ అవ్వలేదు. మరికొందరు చవకబారు రైటర్స్ ఈ పుస్తకాన్ని కాపీ కొట్టి కూడా బుక్స్ రాశారు. ఆఖరుకు టైటిల్ కూడా దగ్గర దగ్గరగా ఉండి పాఠకులని మిస్ లీడ్ చేసే రేంజ్‌లో!    

ఈ విశేషాలన్నీ నాకు ఆనందాన్నే ఇచ్చాయి. ఎందుకో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను. 

Sunday 10 January 2016

ఒక్క ఛాన్స్!

ఇది ఇండస్ట్రీలో చాలా పాపులర్ డైలాగ్.

డైలాగ్ ఓకే. కానీ ఛాన్స్ మాత్రం అంత ఈజీ కాదు. అందుకే ఈ డైలాగ్‌కు అంత పాపులారిటీ!

పెద్ద హీరోల, పెద్ద డైరెక్టర్ల, భారీ బ్యానర్ల సినిమాల డిక్షనరీల్లో ఈ "ఒక్క ఛాన్స్" అనే పదం అసలు ఉండదు. వీళ్లు తీసే అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో ఎంత చిన్న పాత్రకైనా సరే కొత్తవాళ్లను తీసుకొనే రిస్క్ తీసుకోరు. అంత అవసరం వాళ్లకు లేదు.

చాలా అరుదుగా, సంవత్సరానికి వేళ్లమీద లెక్కించగలిగిన ఏ ఒకటో రెండో భారీ సినిమాల్లో మాత్రం కొన్ని వెరైటీ క్యారెక్టర్ల కోసం కొత్త ఆర్టిస్టులను పరిచయం చేస్తారు. అలా ఒక్క ఛాన్స్ కొట్టేసినవాడు మాత్రం నిజంగా లక్కీ ఫెలో! భారీ సినిమా, భారీ ప్రమోషన్స్ ఉంటాయి కాబట్టి - సినిమా హిట్టయినా, ఫట్టైనా .. ఆ ఒక్క ఛాన్స్‌తోనే మన కొత్త ఆర్టిస్టు దాదాపు ఎస్టాబ్లిష్ అయిపోతాడు.

చిన్న బడ్జెట్ సినిమాల విషయంలో అలాకాదు. బడ్జెట్‌లు తక్కువగా ఉండటంవల్ల, తప్పనిసరి పరిస్థితుల్లో - కొంతమంది అప్‌కమింగ్ ఆర్టిస్టులతో, కొంతమంది కొత్త ఆర్టిస్టులతో సినిమాలు తీస్తారు.

కొత్త ఆర్టిస్టులు ఎక్కువగా ఛాన్స్ కొట్టేసేది ఈ చిన్న బడ్జెట్ సినిమాల్లో మాత్రమే!

కానీ - వీటికీ ఓ లిమిట్ ఉంటుంది. ఒక సినిమాలో సగటున ఓ 12 మందిని మించి ప్రధాన కేరెక్టర్లు ఉండే అవకాశంలేదు. ఆ 12 మందిలో సగం మంది అప్‌కమింగ్ వాళ్లను తీసుకున్నా, మిగిలిన సగం మందిని కొత్తవాళ్లను తీసుకుంటారు.

ఈ బ్యాగ్రౌండ్ అంతా తెలియకుండా - ప్రతి కొత్త ఆర్టిస్టూ ఆవేశపడుతుంటాడు/పడుతుంది. ఆ ఒక్క ఛాన్స్ తనకొస్తే తఢాఖా చూపించేవాన్నని/దాన్నని ఆ కొత్త ఆర్టిస్టు అభిప్రాయం.

వాస్తవానికి, ఇలా టాలెంట్ ఉన్న ఎందరో వందల్లో ప్రతిరోజూ సినిమా ఆఫీసులచుట్టూ తిరుగుతుంటారు. కానీ, వారిలో ఏ ఒకరిద్దరినో మాత్రమే అదృష్టం వరిస్తుంది.

అలాగని సెలెక్టుకాని ఆర్టిస్టుల్లో టాలెంట్ లేదని కాదు. ఆయా డైరెక్టర్ల స్క్రిప్టుకు వారు సరిపోలేదని మాత్రమే అనుకోవాలి. ప్రయత్నాలు మళ్ళీ షురూ చేయాలి. అదే ఒక్క ఛాన్స్ కోసం ..

కట్ టూ అమిత్ కుమార్ - 

నేనిప్పటివరకు నా సినిమాల్లో చాలామంది కొత్త ఆర్టిస్టులను, టెక్నీషియన్లను పరిచయం చేశాను. వాళ్లల్లో చాలామంది తర్వాత చాలా సినిమాల్లో మంచి అవకాశాల్ని పొందారు. బాగా పాపులర్ అయ్యారు కూడా.

భారీ సినిమాల్లో కూడా మీరిప్పుడు చూసే ప్రముఖ విలన్ అమిత్ కుమార్ ను నా తొలి చిత్రం "కల"లో నేనే పరిచయం చేశాను.   

Saturday 9 January 2016

ఇదీ లెక్క!

ఆర్టిస్టుగా కానీ, టెక్నీషియన్‌గా కానీ సినీ ఫీల్డులోకి ఎంటర్ కావాలనుకొనేవారు ముందుగా తెల్సుకోవాల్సిన లెక్క ఒకటుంది.

అదేంటంటే -

ఫీల్డులోకి ప్రవేశించాలనుకొని ఫిలిమ్‌నగర్‌కు వచ్చే ప్రతి 1000 మందిలో కేవలం ఒక 10 మందికి మాత్రమే అవకాశం దొరుకుతుంది.

అదీ ఎంతో కష్టంగా!

ఆ పదిమందిలో కూడా - ఏ ఒక్కరికో ఇద్దరికో మాత్రమే క్లిక్ అయ్యే అవకాశం లభిస్తుంది. వాళ్లే ఫీల్డులో కొద్దిరోజులు నిలబడగలుగుతారు. ఎందుకలా అంటే .. దాని లాజిక్కులు దానికున్నాయి.

సంవత్సరానికి ఎన్ని సినిమాలు తీస్తారు?
వాటిలో కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చే సినిమాలు ఎన్నుంటాయి?
ఆ సినిమాల్లో ఎంతమందికని అవకాశం ఇవ్వడం వీలవుతుంది?

ఒక్క టాలీవుడ్‌లోనే కాదు. ఏ వుడ్డులోనయినా ఇదే లెక్క!

ఎవరిలో ఎంత టాలెంట్ ఉందని అనుకున్నా, నిజంగా ఉన్నా .. వాస్తవం మాత్రం ఇదే. ఈ వాస్తవాన్ని ఎదుర్కొనే దమ్మున్నవాళ్లకే సినీఫీల్డు స్వాగతం పలుకుతుంది.

మరి మీలో ఆ దమ్ముందా?!

కట్ టూ సోక్రటీస్ - 

ఈ మహా తత్వవేత్త చెప్పిన ఒక మాట ఈ సందర్భంగా కోట్ చెయ్యాలనిపిస్తోంది:

"నిన్ను నువ్వు తెల్సుకో!" 

Thursday 7 January 2016

కొత్త స్క్రిప్ట్ రైటర్స్ కోసం ..

ప్రధానంగా నేను ముందు రచయితని. నేను నంది అవార్డు తీసుకుంది కూడా రచయితగానే. రచయిత నుంచే దర్శకుడినయ్యాను.

ఒక దర్శకుడిగా ఇప్పటివరకు నేను పనిచేసిన నాలుగు చిత్రాలకు కూడా, నా పూర్తి స్థాయి సామర్ధ్యాన్ని ఉపయోగించి స్క్రిప్టు రాసుకొనే అవకాశం నాకు దొరకలేదు!

ఇందులో ఆశ్చర్యం లేదు. పరిస్థితులు అలాంటివి.

ఇంకా, నిజం చెప్పాలంటే, నా మూడో చిత్రానికి అసలు నేను పేపర్ మీద పెన్ను పెట్టే అవకాశమే  దొరకలేదు. అలాగే, షూటింగ్ కి కొద్దిరోజుల ముందే నాకు యాక్సిడెంట్ కావటం తో - ప్రాజెక్టుకు నష్టం రాకుండా ఉండటం కోసం, ఇంకెవరితోనో సినిమా షూటింగ్ పూర్తిచేయాల్సి వచ్చింది. అయితే - టెక్నికల్ గా దర్శకుడిగా, రచయితగా నా మూడో చిత్రానికి పేరు మాత్రం నాదే ఉంటుంది!

ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని అంతే  - మన ఇష్టాయిష్టాలతో పనిలేకుండా అలా జరిగిపోతుంటాయి.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో - నేనిప్పుడు ఓ కొత్త నిర్ణయం తీసుకొన్నాను. నా తర్వాతి చిత్రానికి బయటి రచయిత కథనే తీసుకోవాలనుకుంటున్నాను.

నా మొత్తం టైమంతా డైరెక్షన్, ప్రమోషన్, రిలీజ్, సక్సెస్‌లపైనే పెట్టాలన్నది  నా ఉద్దేశ్యం.

స్క్రిప్ట్ రైటింగ్ పైన పూర్తి అవగాహన ఉండి, అవకాశాలకోసం వేచిచూస్తున్న కొత్త రచయితలు నన్ను ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. చాలావరకు నాతో పని ఆన్‌లైన్ లోనే జరుగుతుంది. ఇదీ నా ఈమెయిల్: mchimmani@gmail.com

కట్ టూ టైటిల్ క్రెడిట్ - 

నేనే చాలామందికి ఘోస్ట్ రైటర్‌గా పని చేశాను. నాకు ఘోస్టులు అవసరం లేదు. రచయిత విలువేంటో నాకు తెలుసు. కాబట్టి - నేను మీ కథ ఒప్పుకున్నట్టైతే టైటిల్ క్రెడిట్ మాత్రం తప్పక ఇస్తాను. 

Wednesday 6 January 2016

ఇండస్ట్రీ చాలా విచిత్రమైంది!

తెలుగు సినిమా ఇండస్త్రీ కి సంబంధించి నా లక్ష్యం చాలా చిన్నది. ఎన్నో చోట్ల, ఎన్నో విషయాల్లో ఎదురులేకుండా ముందుకు సాగిన నేను ఇక్కడ మాత్రం ఒక అతి చిన్న లక్ష్యాన్ని సాధించలేకపోయాను.

ఇట్ ఫీల్స్ రియల్లీ రియల్లీ బ్యాడ్. చాలా సార్లు.

కాని, ఇది ఫెయిల్యూర్ అని నేను అనుకోను. నిజానికి, మన ఫెయిల్యూర్ని నిర్ధారించేది బయటివారు కూడా కాదు. మనమే. మనం స్వయంగా అనుకున్నపుడే అది ఫెయిల్యూర్.

మనం ఒక లక్ష్యం అనుకొంటాం. ఆ లక్ష్యాన్ని చేరుకొనే దిశలో ఎన్నో ఢక్కా మొక్కీలు తినాల్సివస్తుంది. వాటివల్ల మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడం ఇంకా ఆలస్యం అవుతుండవచ్చు. అంత మాత్రాన మనం ఓడిపోయాం అనే ఎందుకు అనుకోవాలి? లక్ష్యాని సాధించే క్రమంలో ఒక్కో స్టేజిలో ఒక్కో ఛాలెంజ్ ను ఎదుర్కొంటూ ముందుకే వెళ్తున్నాం అని ఎందుకు అనుకోకూడదు?

కట్ టూ ఇండస్ట్రీ - 

ఇండస్ట్రీ నిజంగా చాలా విచిత్రమైంది. ఇక్కడ అనుకునేది ఒకటి. జరిగేది మరొకటి. ఇందుకు కారణాలు ఏవైనా కావొచ్చు. ఎవరైనా కావొచ్చు. కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే ఈ 'అన్ సర్టేనిటీ' అనే ఒక్క కారణం వల్ల - ఇక్కడ చాలా మంది చెప్పేది ఒకటి, చేసేది ఒకటిలా కనపడుతుంది.  

వాస్తవాలు వేరు. అవి అందరికీ తెలియవు. అనుభవించినవాళ్లకే తెలుస్తాయి.

లక్ష్యం విషయం ఎలా ఉన్నా .. ఇండస్ట్రీ నేపథ్యంగానే నాకు కొన్ని తక్షణ బాధ్యతలు, అవసరాలున్నాయి. ఆ దిశలో నేను ముందుకే వెళ్తున్నాను.     

Sunday 3 January 2016

ఫేస్‌బుక్‌తో బుక్కైపోతే ఎలా?

ఫేస్‌బుక్‌తో ఉన్నట్టుండి నాకు 2 సమస్యలు కనిపిస్తున్నాయి:

1. ప్రస్తుతం సినీఫీల్డులో ఉన్నాను కాబట్టి ఇష్టం ఉన్నా, లేకపోయినా రోజూ ఓ అరగంటైనా ఫేస్‌బుక్ కు కెటాయించి ఏదో ఓ 'స్టఫ్' పోస్ట్ చేయక తప్పదు నాకు. తప్పనిసరి కూడా.

2. నా పోస్టులను, ఫోటోలను చూసి - "వీడికేం తక్కువ. అంతా బానే ఉంది" అన్న పాయింటాఫ్ వ్యూలో .. సరిగ్గా ఏదైనా చాలా ముఖ్యమైన పనో, మీటింగో ఉన్నప్పుడే .. నేనూహించని విధంగా, ఊహించని మిత్రులు శ్రేయోభిలాషులనుండి పర్సనల్‌గా భారీ రేంజ్‌లో నానా రియాక్షన్స్ వస్తున్నాయి.

ఇదంతా చూసాక ఒకటనిపిస్తోంది ..

సినిమా పనిలో ఉన్నపుడే ఫేస్‌బుక్ యాక్టివేట్ చేసి, మిగిలిన టైమ్‌లో డీయాక్టివేట్ చేస్తే ఎలా ఉంటుందీ అని!?

కట్ చేస్తే - 

రేపు ఏదో ఒక టైమ్‌లో నా ఫేస్‌బుక్ డీయాక్టివేట్ అయిపోవచ్చు!